భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము

Table of Contents

58. సప్తమి కల్పమున రథయాత్రా వర్ణనము

తా॥ బ్రహ్మదేవుడిట్లనెను “అమిత తేజస్వియైన భాస్కరదేవుని రథయాత్రను భక్తి శ్రద్ధలతో నీ విధానముగ చేయువాడైనను చేయించువాడైనను. నూఱువేల లక్షల కోట్ల సంవత్సరములు సూర్యలోకమున వెలుగొందును. అతని వంశమున దరిద్రుడు గాని, వ్యధితుడు గాని ఉండరు. సూర్యదేవుని అభ్యంజనమునకై ఘృతమునిచ్చువాడు, వర్ణతిలకమిచ్చువాడు స్వర్గమునకుఁ బోవును. అభిషేకము కొఱకు పుణ్యతీరోదకముగాని, గంగాజలముగాని తెచ్చియిచ్చువాడు. పూజకొఱకు మూడు వర్ణముల వస్తువులిచ్చువాడు ఇహలోకమున సకల భోగములనుభవించి వరుణలోకమునకుఁబోవును. ఎఱ్ఱని హవిష్యాన్నము, గూడాన్నమునిచ్చువాడు దీప్తిమంతుడై మిక్కిలి శ్రేష్ఠమగు సూర్యలోకమునకుఁబోవును. సూర్యదేవునకు స్నానము చేయించి  పూజించువాడు ప్రజాపతి లోకమునకుఁబోవును. సూర్యభగవానుని, రథమధిరోహింపజేయువాడు, రథమార్గమును శుభ్రము చేయువాడు దీప్తిమంతుడై సూర్యలోకమునకు బోవుననుటలో సందేహములేదు. రథము పయనించు మార్గమున నెత్తుపల్లములు లేకుండునట్లు సమముచేయువాడు వాయుదేవుని పరాక్రమముగలవాడై వాయులోకమునకుబోవును. సూర్యరథమార్గమును సమప్రదేశముగ చేయువాడు పుణ్యప్రదమైన వాయులోకమునకు చేరును. సందేహము లేదు.

తా॥ సూర్య రథమార్గమును పూలమాలలతోను, తోరణములతోను శోభాయమానముగ నలంకరించువాడు పుణ్యలోకమునకు బోవును యాత్రామార్గమున శంఖ తూర్యాది నినాదములు, నృత్యగీతాది ప్రేక్షణీయ కార్యక్రమములేర్పాటు చేయువాడు పరమస్థానమైన సూర్యలోకమునకుఁజేరును. సూర్యరథయాత్రతో గూడి నాట్యములు చేయుచు, పాటలుపాడుచు, పూజచేయుచు భక్తితో మహోత్సవము చేయువాడు పరమపదమునందును. రథగతుడైన సూర్యదేవుని సన్నిధిలో జాగరణ చేయువాడు పుణ్యవంతుడై, సుఖజీవనుడై బహువత్సరములు ఆనందముగ నుండును. సూర్యభగవానునకు భక్తులైన భృత్యులను, సేవకులను సమకూర్చువాడు ఇహలోక భోగములన్నింటిని అనుభవించి సూర్యలోకమును పొందును. సూర్యుడు రథారూఢుడై తీరుగునప్పుడు-ముఖ్యముగా ముందునకు పయనించునప్పుడు ఆతని దర్శనము, చేసికొనుట విశేషమైనది. దుర్లభమైనది. భక్తవత్సలుడైన భాస్కరుడు ఉత్తరాభిముఖుడై, లేక దక్షిణాభిముఖుడై పయనించుచున్నప్పుడు దర్శించువాడు ధన్యుడు. సంవత్సరము గడిచిన పిదప సూర్యరథయాత్ర ప్రారంభింపవలసిన దినమున (నేదేని కారణముచే) ప్రారంభింపబడక యుండినచో. శ్రేయస్సును కోరువాడు పన్నెండవ సంవత్సరమున మాత్రమే తిరిగి రథయాత్ర చేయుటకుపక్రమింపవలెను. ఇంద్రధ్వజుని ఉత్సవమునను ఇట్లు విఘ్నము కలిగినచో పన్నెండు సంవత్సరములకే తిరిగి చేయవలెను. పన్నెండువత్సరములు కానిదే మధ్యలో రథయాత్రచేయకూడదు. యాత్రాభంగము చేసిన వారికే ఈ నియమము వర్తించును. అటుల భంగము చేసినవారు మందేహ రాక్షసులనబడుదురనుటలో సందియము లేదు. ధర్మధ్వజుని రథయాత్ర సాగించువారు. ఇంద్రాది దేవతలుగా గుర్తింపబడుదురు. వారు పరమపదమును పొందుదురు. యత్రావిధిని గుఱించి మఱల వివరముగా నీకు చెప్పెదను.

తా॥ దానిని వినుటచే సర్వపాపముల నుండి విముక్తి కలుగును. సందేహములేదు. మాఘమాసమున, రథము పైన, దేవగణములతో కూడిన సూర్యభగవానుని మనస్సుతో స్థాపించవలెను. స్థాపించినట్లు మనస్సున భావింపవలెను. భూమ్యాకాశముల మధ్య సూర్యుడట్లు ప్రతిష్ఠింపబడగా. ఆకాశమును సంజ్ఞాదేవిగను, భూమీని నిక్షుభాదేవి (ఛాయ)గాను భావింపవలెను. (ఆ విధముగ నిరువురు భార్యల మధ్య సూర్యమూర్తి యథా పూర్వముగ ప్రతిష్ఠించినట్లగును) సూర్యునకు తన యిరువురు భార్యలగు సంజ్ఞాచ్ఛాయలతోనెట్లు సాన్నిధ్యముండునో దిండి, పింగలాదులగు పారిపార్శ్వికుల ఉపస్థితి కూడ రథయాత్రలోనటుల ముఖ్యకార్యమైయుండును. ఇతర రథదేవతలందఱిని వారి వారి స్థానములయందుండినట్లు మనస్సున భావింపవలెను. దిక్పాలురను, లోకపాలురను కూడ మనస్సున భావన చేయవలెను. ఈ సూర్యదేవుడు వేదమయుడు. సర్వదేవమయుడు. సూర్యమండలము కిరణమయము. ఛందస్సులు ముఖమని చెప్పబడినది. గాయత్రి, త్రిష్ణుప్, జగతీ, అనుష్టుప్. పంక్తి, బృహతీ, ఉష్టిక్, అనీ ఏడు ఛందస్సులు. సూర్యభగవానుని -ముఖభాగము. ఆ విధముగ దేవమయత్వ, ఛందోమయత్వకల్పన చేత. సూర్యుడు లోకపూజితుడగును. రథము కదలుటకు ముందు బ్రహ్మవాదులు దానిని లాగుటకుపక్రమింపవలెను.

తా॥  ఉపవసించి యుండినవారు, యోగులు, వేదశాస్త్ర పారంగతులు రథమును మొదట లాగవలెను. శూద్రుడు సూర్యరథముపై నెక్కకూడదు. సూర్యరధారోహనణము చేసిన శూద్రుడధోగతి పాలగును. ఈ చెప్పబడిన కారణము వలన మనుష్యులకెప్పుడును శాంతి కలుగును. సూర్యభగవానుడు దేవతలందఱికీని నాయకుడు. దేవాలయ ప్రాంతములందే రథములను నిలిపియుంచ వలెను. మొదట సూర్యుని ధూప దీప నైవేద్యములతో పూజించి, అటు పైన పరివార దేవతలను, దిక్పాలురను పూజింపవలెను. పూజలందీన దేవతలు పూజించిన వారిని ధన ధాన్యాదులనిచ్చి యనుగ్రహింతురు. మొదట సూర్యదేవుని పూజింపక, ఇతర దేవతలను పూజించినచో వారాపూజలను స్వీకరింపరు. రథయాత్రాకాలము సంప్రాప్తించినప్పుడు సూర్యనారాయణుని యానదీక్షితమైన స్వరూపమును భక్తితో దర్శించువారు పాపరహితులగుదురు. పూర్ణిమ, అమావాస్య, షష్టి, సప్తమి తిథులలో సూర్యదర్శనము పుణ్యప్రదమైనదిగ చెప్పబడినది. ముఖ్యముగా ఆషాఢ, కార్తిక, మాఘమాసములందలి యీ తిథులు పుణ్యతమములని పేర్కొనబడినవి. ఈ తిథులలో సూర్యోపాసన మహాభాగ్యముగను, పుణ్యప్రదముగను శాస్త్రములు కీర్తించినవి. కార్తిక మాసమునం దిట్టి తిథి 'మహాకార్తికి'యని విశ్లేషించి చెప్పబడినది. ఇట్టి తిథులు యాత్రాకాలమున తటస్థించెనేని మణీంత ప్రత్యేకతను సంతరించుకొనును. ఈ సమయములందు సూర్యదర్శనము మహాపుణ్యము, సర్వపాపహరమునగును. ఉపవాసపరుడై ఇట్టివేళలలో నియమవ్రతుడై. భక్తి యుక్తుడై సూర్యార్చన చేయువాడు పరమగతిని పొందును. ఈ దేవదేవుడు యజ్ఞపురుషుడు. లోకమునను గ్రహించుట కొఱకు. ప్రతిమారూపమున నుండి కరుణాళువై భక్తుల పూజలు స్వీకరించుచుండును. స్నానము వలన, దానము వలన, జపము వలన, హోమము వలన, నిరంతరము దేవతా కార్యములందు నిమగ్నుడైయుండుట వలన. పెరిగిన మీసములు, గడ్డములు వపనము చేయించుకొనుట వలన మనుష్యుడు దీక్షితుడగుచున్నాడు. సూర్యదేవుని భక్తులు గడ్డములు మాసములు తలవెంట్రుకలు ముండనము చేయించుకొనవలయును.

తా॥ సూర్యక్రతువునందిట్లు శుచిర్భూతుడై మనుష్యుడు దీక్షితుడగును నాలుగు వర్ణములవారికిని సూర్యభగవానుని యుపాసనము మోక్షప్రదము. అటులుపాసించువారు నిత్యదీక్షితులు. సూర్యవ్రతమాచరించుచుండువారు మహ్మాత్ములు. వారు పరమగతిని పొందుదురు. ఈ విథముగ సూర్యరథయాత్రను గూర్చినీకు చేప్పితిని. దీనిని వినుటచే, చెప్పుటచే, చెప్పించుటచే సర్వరోగములు నశించిపోవును. శాస్త్రమునననుసరించి సూర్యప్రతాచరణము భక్తితో నొనర్చువాడు సూర్యలోకమునకుఁబోవును. శుభప్రదమైన రథసప్తమిని గూర్చి సమగ్రముగఁజేప్పితిని. ఇంకను నీ సప్తమి గుళించి విశేషములు చెప్పెదను. వినుము.

శతార్ధ సాహస్ర సంహితయగు శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మపర్వమున, రథసప్తమి కల్పమున రథయాత్రా వర్ణనమను ఏబది యెనిమిదవ అధ్యాయము సమాప్తము.