భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము
16. ప్రతిపత్కల్ప వర్ణనము
తా ॥ సుమంతుముని ఇట్లనెను : బ్రహ్మదేవుడు స్త్రీ లక్షణములను, వారి ప్రవర్తన విధానములను గుఱించి ఇట్లు సాకల్యముగ వివరించి తన స్థానమునకు వెడలిపోయెను. ఋషులు కూడా బ్రహ్మచెప్పిన ఆ విషయములన్నింటిని సాంతముగ విని తమ తమ ఆశ్రమములకు పోయిరి. రాజా! 'ఇట్లు లక్షణ సంపన్నయగు భార్యను పొందిన పిదప గృహస్థుడేమి చేయవలెనో అతని కర్తవ్యము లేవియో నేను చెప్పెదను. తెలిసికొనుడు. వైవాహికాగ్నియందే గృహ్యకర్మ యధావిధిగా చేయవలెను. పంచయజ్ఞములను, వానికి కావలసిన పాకములను గృహియైన వాడెప్పుడును చేయచుండవలెను. జోలు, సన్నికల్లు, పొయ్యి, నీళ్ళ కడవ, పొరక (చీపురు) అను నీయైదు ప్రాణిహింసకములైన వస్తువులుపయోగించుచుండుట వలన గృహస్థునకు స్వర్గప్రాప్తి కలుగదు. వీనినన్నింటిని ఉపయోగించుట వలన కలుగు దోషమును పరిహరించి పారిశుద్ధ్యమును సంతరించుట కొఱకై గృహస్థులకు క్రమముగా ఐదంశములకు ఉద్దేశింపబడిన మహాయజ్ఞములు బుద్దిమంతులచేత నిర్ణయింపబడినవి. వేదాధ్యయనము (అధ్యాపనము కూడా) చేయుట; ఇది బ్రహ్మయజ్ఞము. పితృదేవతలకు తర్పణము చేయుట పితృయజ్ఞము. దేవతలకు హోమము చేయుట దేవ యజ్ఞము. భూతములకు బలియిచ్చుట భూతయజ్ఞము. ఇక అతిథులను పూజించుట మనుష్య యజ్ఞము. ఈ పంచ మహాయజ్ఞములను నిత్యము శక్తి కొలదిగ ఏ గృహస్థు నిర్లక్యము చేయక, చేయుచుండునో అతడు ఇంటిలో నివసించుచుకూడ సూనాదోషములతో లిపుడు కాడు. పైన పేర్కొనబడిన ఐదుదేవతలను, అతిథులను, పితరులను, భృత్యులను ఉద్దేశించి త్యాగము చేయక, వారిని తృప్తిపరుపక ఉండువాడు, శ్వాసించుచుకూడ మృతిచెందిన వానితో సమానుడు. శతానీకుడిట్లనెను. “ఎవని యింటిలో అగ్ని ఉండదో (ఔపాసనము) అట్టివాడు మృతుడనుటకు ఎట్టి సందేహము లేదు. అతడు బ్రాహ్మణోత్తముడైనను దేవతాద్యర్చనకు అర్హతలేని వాడగును. ఔపాసనము లేని బ్రాహ్మణుని శమము కొఱకు దేవతలేట్లు ప్రీతులగుదురో తెలిసికొనవలెనని నాకు మిక్కిలి కుతూహలముగ నున్నది.
తా ॥ సుమంతుముని ఇట్లనెను. “రాజేంద్రా ! చక్కని ప్రశ్న వేసితివి. ఔపాసనము చేయని బ్రాహ్మణులకు శ్రేయ మనబడునదెట్లు కలుగునో చెప్పెదను వినుము, రాజా! వ్రతములు, ఉపవాసములు, వివిధములైన దానములు మొదలగు నియమములను పద్ధతుల ఉపవాసములచేత దేవతలు ప్రీతులగుదురు. శతానీకుడిట్లు ప్రశ్నించేను. “భగవాన్! ఆ తిథులను, ఆ తిథులలోని విధులను, తినవలసిన ఆహారము, ఉపవసించవలసిన విధానములను గృహ్యధర్మములను నాకు తెలియజెప్పుడు. ఓ ద్విజోత్తమా! దేనిచేత మేము పాప సమూహములనుండి విముక్తులమగుదుమో మి అనుగ్రహముచే దేనివలన సంసారబంధము నుండి విడుదల పొందుదుమో అది అంతయు జగచ్చైయము కొఱకు వినిపింపుడు”. దానికి సుమంతుముని ఇట్లు సమాధానము చెప్పెను. “తిథులను గుప్తముగా ఆశ్రయించియున్న కర్మములను గుఱించి వివరించుచున్నాను వినుము. వానీని వినినంత మాత్రముననే పాపములు నశించిపోవును. ఉపవసించిన ఫలములుకూడ దక్కును. పాడ్యమినాడు పాలు త్రాగవలెను. విదియ నాడు ఉప్పులేకుండ భుజింపవలెను. తదియనాడు నువ్వుల అన్నము తినవలెను. చవితినాడు పాల ఆహారము నారగింపవలెను. పంచమినాడు ఫలములు, షష్ఠినాడు శాకములు, సప్తమి నాడు మారేడు. అష్టమినాడు పిండి పదార్థములు, నవమినాడు అగ్నితో పక్వముకాని పదార్థములు, దశమి ఏకాదశి నాడు నేతి వస్తువులు, ద్వాదశి దినమున పాయసము, త్రయోదశినాడు గో మూత్రము, చతుర్దశినాడు యవాన్నము. పూర్ణిమనాడు కుశోదకము, అమావాస్య దినమున హవిష్యాన్నమును భుజింపవలెను. ఇది ఆయా తిథులననుసరించి ఆయా ఆహారముల విధానము. ఈ విధానమును ఒక పక్షము వఱకు ఎవడనుసరించునో. వాడు అశ్వమేధ యాగ ఫలమును పదింతలుగా పొంది, స్వర్గ ప్రాప్తినంది అచట మన్వంతరముల వఱకు నివసించును.
తా ॥ అప్సరస స్త్రీలు, గంధర్వులు సమీపమున గానము చేయుచుండగా ఒక సంవత్సరము వఱకు అతడు అశ్వమేధ ఫలమును పదింతలుగా అనుభవించును. స్వర్గమునందు అతడట్లు గంధర్వాప్సరసల గానములతో వేయి మహాయుగముల వఱకు నివసించును. అట్లు ఎనిమిది మాసములుపవసించి పారణ చేసెనేని రాజసూయాశ్వమేధయాగముల వేయి రెట్ల ఫలమును పొందును. స్వర్గమునందు పదునాలుగు మన్వంతరముల వఱకు నివసించును. రాజా! ఆశ్వయుజ శుద్ధ నవమి, మాఘ మాస సప్తమి, వైశాఖమాస తృతీయ, కార్తీక పూర్ణిమలయందు నీయమముతో ఈ తిథి వ్రతములను స్వీకరించినవాడు బ్రహ్మచారియైనను, గృహస్థుడైనను, వాన ప్రస్తుడైనను, స్త్రీయైనను, పురుషుడైనను, శూద్రుడైనను పరిశుద్దమనస్కుడై దీర్ఘాయువును పొంది సూర్యలోకమునందును. ఎవరిచేత పూర్వ జన్మలలో ఈ విధితో ఈ తిథులయందు ఉపవాస దీక్ష చేయబడినదో, తపస్వులకును, బ్రాహ్మణులకును వివిధ ప్రకారములైన దానములీయబడినవో వారికి. మూడు రాత్రులు ఉపవాసము చేసిన వారికి, తీర్థ యాత్రలు చేసినవారికి, తపమాచరించినవారికి, ఎల్లప్పుడును తల్లిదండ్రుల సేవ చేసిన వారికిని, స్వర్గవాస భోగవాసన నుండి ఇహ లోకమునకు వచ్చినవారికి, ఫల నిష్పత్తి చిహ్నములు మనుష్యలోకమునందు కూడా ప్రత్యక్షముగా కనబడుచున్నవి. గజములు, అశ్వములు మొదలగు ప్రయాణవాహనములు, ధనము, రత్నములు, బంగారము, బంగారు కంకణములు, అంగదములు, కంఠాభరణములు, మొలనూళ్లు, యజ్ఞోపవీతములు, చెవులకు ధరించు భూషణములు, కిరీటములు, శ్రేష్టమగు వస్త్రములు, అందమైన స్త్రీలు, విలువైన మైపూతలు, సౌందర్యము, సద్గుణము, దీర్ఘాయువు మొదలగు ఫలములు ఉపవాసరతులకు దానశీలురకు కలుగును. ఇట్టి పుణ్యపురుషులకు ఆధి వ్యాధులుండవు. నృత్య గీత వాద్య మంగళ పాఠ శబ్దములతో తెలిసికొనదగినవారు నేడు కూడా ఈ లోకమున కనబడుచున్నారు. అట్లు ఉపవసించియున్న వారును కన్పట్టుచున్నారు. ఆ విధముగనే దానము చేయనివారు, పుణ్యమాచరింపని వారును ప్రత్యక్షముగా కనబడుచునే యున్నారు. నేడు కనబడు మానవులలో గ్రుడ్డివారు, కుష్టువ్యాధి పీడితులు, చెవిటివారు, బుద్ధిలేనివారు, మూగవారు, అంగ వికలురు, వ్యాధి పీడితులు, దారిద్ర్యముచే బాధపడువారు, ఉపసర్గ రోగ బాధితులు, రోగముల వలన చనిపోవువారు నేడు కూడ కనబడుచున్నారు.
తా॥ శతానీకుడిట్లనెను. బ్రాహ్మణోత్తమా! తిథులను గుఱించి సాకల్యముగా చేప్పితిరి. ఇప్పుడు మఱల నాకు. తిథుల రహస్యమును, దేవతల విచేష్టితమును, వారికిష్టమైన భోజ్య పదార్థములను, నియమములను గుఱించి. సవిస్తరముగా చేప్పుడు. దానిచేనేను పవిత్రుడనగుదును. యాగ ఫలములెట్లు లభింపగలవో కూడా సెలవిండు”. దానికి సుమంతుడిట్లు బదులు పలికెను "తిధుల రహస్యము, ఆయా తిథులలో తీసికొనవలసిన ఆహారము, దాని ఫలము, ఎంత వఱకు ఏది నియమమో, ముఖ్యముగా స్త్రీల కేయే నియమములు కలవో. ఈ రహస్యమంతయు నీకు చెప్పెదము. తెలిసికొనుము. ఇంతకు పూర్వమి విషయములనెవ్వరికిని ఏ ఆప్తునికిని చెప్పియుండలేదు. ఏ దేవతకు ఏ తిధియో, ఏ దేవతకేది వ్రతమో, దేవతల రహస్యములు, నియమములు అన్నియు నేనిప్పుడు చెప్పెదను. మహాబాహూ! అవి యన్నియును చెప్పెదను వినుము, మొదట తిథిని గూర్చిన సృష్టిని గుఱించి సంక్షేపముగా నుడివెదను. మొట్ట మొదట ఇది సృష్టి అంతయు చెప్పుటకు, చూచుటకును అలవికాని తమస్సుగా నుండెను. పిదప బ్రహ్మ ఏతెంచి తనతోనే ఈ జగద్రూపమైన తనను రచించుకొనెను.
తా ॥ సృష్టి రూపమైన తత్వమే ఈ ఆత్మ (బ్రహ్మ, ఇతడు అండమధ్యమునుండి ప్రకటమయ్యెను. ప్రభువైన పరమాత్మ తనతోడనే తన ఈ అండమును మొదట సృష్టింప. దీన వెల్వడు నారాయణుడను వేద ప్రసిద్ధుడగు బ్రహ్మ జగద్రచనకు పూనుకొనెను. ఆ అండకపాలముల నుండి ఆకాశము, భూమి నిర్మించెను. దిక్కులు, ఉప దిక్కులు, దేవతలు, రాక్షసులు, పూర్వము పేర్కొనబడిన ఈ తిథి మొదలగువానిని తానే ఆజగత్ర్పభువు సృష్టించెను. తిథులన్నింటిలోనను శ్రేష్ఠమని బ్రహ్మ పేర్కొనుట చేతను, అన్నిటికన్నా ముందు దానిని ప్రతిపాదించుటచేతను మొదటి తిథి ప్రతిపత్తని చెప్పబడెను. ఈ పదము నాధారముగా గొనియే తక్కిన తిథులన్నియు ఆయా పేర్లతో కీర్తింపబడెను. దీని యందలి శ్రేష్ఠమైన ఉపవాస విధిని గుఱించి నీకు చెప్పబోవుచున్నాను. విధానము నెఱుంగువాడు కార్తీక పూర్ణిమ, మాఘసప్తమి, వైశాఖ శుక్ల తృతీయ దినములందు నియమ పూర్వకముగా ఉపవాస విధిని ప్రారంభింపవలెను. లేక ఏతిథియందు నియమ గ్రహణము చేయదలచి భక్తితో నుద్యుక్తుడగునో ఆ తిధియందలి నియమ విధానములను తెలిసికొనుము. రాజా! ప్రతిపత్తు నుండియే ఉపవాసదీక్ష గ్రహింపదలచినచో చతుర్దశినాడు భోజనము చేసిన పిదప ఉపవాస సంకల్పమును చేయవలెను. అమావాస్యనాడు భోజనము చేయకూడదు. త్రికాలములయందు స్నానము చేయవలెను. పవిత్రుడై వ్యాహృతిత్రయపూర్వకముగా గాయత్రీ మంత్రజపము చేయవలెను. ఉదయముననే గంధ పుష్పాదులచేత బ్రాహ్మణోత్తములను పూజించి యథాశక్తిగా వారికి క్షీర నివేదనము చేయవలెను. పిదప "బ్రహ్మ నాయెడ ప్రసన్నుడగుగాక' అని అనుకొనవలెను.
తా ॥ అప్పుడు తాను ఆవుపాలను గ్రోలవలెను. రాజా! అన్ని తిధులయందును ఉపవాస నియమము ఇట్లే కనబడుచున్నది. ఇట్లు ఒక సంవత్సరము పూర్తియయిన పిమ్మట వ్రతము సమాప్తమగును. రాజా! ఇక ఈ వ్రతము పూర్తిచేసిన కలుగు ఫలమును తెలిసికొనుము. పాపముక్తుడై, పరిశుద్ధమైన ఆత్మగలవాడై, దివ్య దేహముగలవాడైన మానవునకు బ్రహ్మదేవుడు సంతుష్టుడై ఒక తేజో మయమైన విమానమును ఇచ్చును. అది కిన్నరులు, అప్సరసలతోకూడి, నిరాటంకముగ పయనింపగల దివ్య విమానము. అచట స్వర్గమునందు దేవతలలో దేవతవలే సుదీర్ఘకాలము సుఖించి ఆ పిదప ఈ లోకమునకు వచ్చి పది పర్యాయములు బ్రాహ్మణ జన్మములను పొందును. తేజస్వియై, వేద వేదాంగ విద్యలనార్జించి, దీర్ఘాయుష్మంతుడై, భోగములనుభవించువాడై, ధనికుడై, దాతయై ఇతడు కృతయుగమున జన్మించును. రాజేంద్రా! విశ్వామిత్రుడు బ్రాహ్మణత్వమును పొందగోరి దీర్ఘకాలము తపస్సు చేసెను. అది దేవతల సంతాపమునకు మాత్రము కారణమయ్యెను. అతడు బ్రాహ్మణత్వమును పొందకుండెను కాని అనేక విధములైన విఘ్నములను మాత్రమే పొందెను. అప్పుడు నియమవ్రతుడై తిధులలో శ్రేష్ఠమైనది, బ్రహ్మకు ప్రియమైనదిగా తెలిసి పాడ్యమినాడు ఉపవాస వ్రతమును ప్రారంభించెను. అప్పుడు బుద్ధిమంతుడైన విశ్వామిత్రునకు బ్రహ్మదేవుడు ఇహమునందలి అదే దేహమున దుర్లభమైన బ్రాహ్మణత్వము నిచ్చెను. ఇది తిథులలో శ్రేష్ఠమైనది. ఉత్తమమైనది. దీనియందు వ్రతమాచరించు క్షత్రియుడైనను, వైశ్యుడైనను, శూద్రుడైనను బ్రాహ్మణత్వమునందుదురు. ఇడ్లీ తిథి (వ్రతము) కోరికలనిచ్చునది. బ్రహ్మకు ప్రియమైనది. రహస్యమైనది. దీని గూర్చి ఎవరును ఎవరితోను చెప్పియుండలేదు. నేను నీకు చెప్పితిని. హైహయులు, తాలజంఘులు, తురుష్కులు, యవనులు, శకులు వీరిలో ఈ ఉపవాస వ్రతము నాచరించినవారు కోరిన బ్రాహ్మణత్వమును పొందగలిగిరి. ఇట్లు ఇది శ్రేష్ఠమైనది. పుణ్య ప్రదమైనది. శివంకరమైనది. పాపములను హరించునది. దీనిని పఠించినను, ఉపాసించినను, దీని గొప్పతనమును శ్రద్దగా వినినను. ఐశ్వర్య సమృద్ధిని, సర్వవస్తు పౌష్కల్యమును, కీర్తిని, సుఖమును పొంది ఆ పిదప స్వర్గమునకు పోవుదురు.
శ్రీ భవిష్య మహా పురాణమునందలి బ్రహ్మపర్వమున ప్రతిపత్కల్ప వర్ణనమను పదునాఱవ అధ్యాయము సమాప్తము.
