భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము
98. సప్తమీ కల్పమున అపరాజితా వర్ణనము
తా॥ బ్రహ్మదేవుడిట్లు చెప్పెను. “భాద్రపద మాసమునందలి శుక్లపక్ష సప్తమీ తిథి అపరాజిత యను పేరుతో ప్రసిద్ధమైనది. అది మహా పాపములను నశింపజేయగలది. చతుర్థినాడేక భుక్తము, పంచమినాడు నక్తము, షష్ఠినాడు ఉపవాసము, సప్తమీనాడు పారణయు నీ విధియందు చెప్పబడినది. ఇందు కూడ నాలుగు పారణలు పండితులచే చెప్పబడినవి. గన్నేరు.. పువ్వులు, రక్తచందనము. గుగ్గులధూపము, బెల్లపు భక్ష్యములు నైవేద్యము పూజార్థము చెప్పబడినవి. భాద్రపదాది మాసములందీ విధానము నిర్దేశింపబడినది. తెల్ల గన్నేరుపూలు, శ్వేతచందనము, ఆజ్యధూపము, పాయసనైవేద్యము. మార్గశీరాది మాసములందు సూర్యపూజకై వినియోగింపవలెనని విధానము నిర్దిష్టమైనది. పిమ్మట అగి సెపూలు, కుంకుమ విలేపనము, అందుగుమ్రాకు వలన బుట్టిన ధూపము శాల్యన్ననైవేద్యము ఫాలునాది మాసములందు సూర్యపూజకు వినియోగింపవలెను. ఎఱ్ఱఁగలువలు, అగురుతోగూడిన చందనము, అనంత ధూపము, ఖండశర్కరతోజేయబడిన అపూపములు. ఇవి సూర్య పూజార్థము పయోగింపవలెను. శ్రీ ఖండము, (గనుపులతో గూడినది), అగురు, యావనము, ముస్తలు, శర్కర, సౌవర్చలము. వీని మిశ్రమము 'అనంత' మను ధూపముగా చెప్పబడును. జ్యేష్ఠాది మాసములందు నీ విధానముగ ప్రతాచరణము చేయనగునని బుద్దిమంతులు చెప్పుదురు.
తా॥ సూర్యదేవుని ప్రార్థింపవలసిన నామములను, ప్రాశనము చేయదగిన వస్తువులను గూర్చి వినుము. “సుధాంశుడు, అర్యముడు, సవిత, త్రిపురాంతకుడు. ప్రీతుడగుగాక” అని అన్ని పారణములందును సూర్యదేవుని కీర్తింపవలెను. ఆవు మూత్రము, నేయి, పేడ, పాలు, పెరుగుల మిశ్రమమగు పంచగవ్యమును ప్రాశన చేయవలెను. ఈ విధానమున నీ సప్తమీ వ్రతము నాచరించువాడు ఎప్పుడును యుద్దమునందు శత్రువులచే ఓడింపబడక జయమందును. శత్రువులను జయించి ధర్మార్థ కామములను పొందుననుటలో సందేహము లేదు. ఇట్లు త్రివర్గములను పొంది సూర్యలోక ప్రాప్తినందును. అన్ని మాసములందు యథాశక్తిగ, గంథపుష్పోపహారములతో, పురాణ శ్రవణములతో. అశ్వదానముతోను బ్రాహ్మణ భోజన సంతర్పణలతోను, సూర్య ప్రియుడైన పౌరాణి కుని సమ్మానముతోను సూర్యభగవానుని పూజింపవలేను. భాస్కరదేవునకు వివిధ రత్నములతో నలంకరింపబడిన ధ్వజములను సమర్పింపవలేను. పూనికతో నిట్లు సప్తమీవ్రతము నాచరించువాడు శత్రువునోడించి సూర్య లోకమునకుఁబోవును. స్వర్ణ ధ్వజ పతాకములతో, శ్వేతాశ్వములతో శోభించు వాహనము పై పయనించి వరుణ ప్రభుడై వరుణ దేవునిఁజేరి యాతని యనుచరుడగును.
శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మపర్వమున సప్తమీ కల్పమునందు అపరాజితా వర్ణనమను తొంబది యెనిమిదవ అధ్యాయము సమాప్తము.
