భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము

Table of Contents

128. సప్తమీ కల్పమున సాంబస్తవ వర్ణనము

తా॥ సుమంతుముని యిట్లనెను. “రాజా! రోగమువలనను, తపః క్లేశమువలను కృశించిపోయి యున్న దేహముగల సాంబుడు సహస్రాంశుడైన దివాకరుని సహస్రనామములతో స్తుతించేను-1. సూర్య భగవానుడు, ఖేదముతో నుండిన సాంబునిఁజూచి, అతనికి స్వప్నమున సాక్షాత్కరించి తిరిగి యిట్లనెను-2. 'సాంబా! మహా బాహూ! జాంబవతీ నందనా! వినుము, సహస్ర నామస్తవము ఇక చాలును. నేను చెప్పబోవునట్టి శుభప్రదమైన స్తోత్రమును పఠింపుము.-3. రహస్యములు, మంగళకరములు, పవిత్రములునైన నా నామములను నీకు వినిపించెదను. శ్రద్ధగా వినుము-4. "వైకర్తనుడు, వివస్వంతుడు, మార్తాండుడు, భాస్కరుడు, రవి, లోక ప్రకాశకుడు, శ్రీమంతుడు, లోక చక్షువు, గ్రహేశ్వరుడు-5. లోకసాక్షి, త్రిలోకేశుడు, కర్త, హర్త, తమిస్రహుడు, తపనుడు తాపనుడు, శుచి, సప్తాశ్వవాహనుడు -6 గభస్తిహస్తుడు, బ్రహ్మ, సర్వదేవ నమస్కృతుడు', అని యిరువది యొక్క నామములుగల యీ స్తోత్రము నాకు మిక్కిలి ప్రీతికరమైనది-7. ఇది శరీరమున కారోగ్యమునొసగునది. ధనమును వృద్ధి నొందించునది. యశస్కరమైనది. ముల్లోకములందిది స్తవరాజముగ ప్రఖ్యాతి వడసినది-8. ఉదయాస్తమయ సంధ్యలందెవడీ స్తవ రాజమును నాకు నమస్కరించుచు పఠించునో వాడు సర్వపాపములనుండి విముక్తుడగును-9. నా సమక్షమున నొక పర్యాయము జపించినచో మనో వాక్కాయములకు సంబంధించిన పాపము లేవి యైనను పటాపంచలైపోవును-10. ఈ మంత్ర జపమే హోమము, సంధ్యోపాసనము, పూజా మంత్రము, అర్ఘ్య మంత్రము, ధూప మంత్రము కూడనై యున్నది -11. అన్నము నివేదించునపుడు, స్నానము చేయించునపుడు, నమస్కరించునపుడు, ప్రదక్షిణమాచరించునపుడును వినియోగింపదగిన మంత్రమిది. అందుచే నిది సర్వపాపహరము. శుభంకరము. పూజ్య భావమున నాదరింపఁదగిన మహా మంత్రమది”-12. ఇట్లు నుడివి జగత్పతియైన సూర్య భగవానుడు సాంబునకాదరముతో వీడ్కోలిచ్చి యచటనే యంతర్షితుడయ్యెను-13. సాంబుడు కూడ సప్తాశ్వ వాహనుడైన సూర్య దేవునిఇదే స్తవరాజముతో స్తుతించి తన రోగము నుండి విముక్తుడై, సంతోష సౌభాగ్యముల నొందెను.

శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మ పర్వమున సప్తమీ కల్పమునందు సాంబ స్తవర్ణనమను నూట యిరువది యెనిమిదవ అధ్యాయము సమాప్తము.