భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము
43. షష్ఠి కల్పమున వర్ణవ్యవస్థా వర్ణనము
తా॥ బ్రహ్మదేవుడిట్లనెను. “ఇక తరువాతి విషయమేమి కలదు? వేదమంత్ర పరిజ్ఞాతలైన మీరు దేని సంస్కారమున విశేషముగలదని యంగీకరింతురు? అని మిమ్మడుగవలసియున్నది. మలమున కీటకములవలే, శుక్లణీతముల నుండి పుట్టిన, సహజ మాలిన్యముతో కూడిన దేహమునకా సంస్కార విశేషమునంగీకరింతురు?. ని షేకము మొదలుకొని శ్మశానము వఱకుగల నియమ విస్తరములైన సంస్కారముల చేత మాత్రమే మనుష్యున కాధిక్యమేర్పడునని కొందఱంగీకరింతురు. అట్టి నియమ రహితులగువారి అభిప్రాయ పక్షమును గూఢమనో వాక్కాయములతో పరిశుద్ధములైన సుచేష్టతములచే దూషించుచున్నాను. వేదమునందు చెప్పబడిన సంస్కారములన్నింటితోను సంపన్నులైన బ్రాహ్మణజాతివారు, వివిధ వృత్తులలో నున్న శూద్రులను మించిపోవుదురు. తీవ్ర కర్మలు చేయువాడు, కర్మలే చేయనివాడు-బ్రహ్మహత్య చేయువాడు, గురుతల్పగామి, చోరుడు. గోహత్య చేయువాడు, మద్యమును సేవించువాడు, పరస్త్రీలతో సాంగత్యము చేయువాడు,. అసత్యవాది, మదోన్మత్తుడు నాస్తికుడు, వేదమును నిందించువాడు, గ్రామ పురోహితుడు, హంతకుడు, బహుదోషములు చేయువాడు, కూడనిది పొందువాడు,. నిషిద్ధమైన పనులు చేయువాడు, దొంగ, ద్రిమ్మది (భిక్షార్థమై తిరుగువాడు) గర్వితుడు, జూదరి (మోసగాడు), నటుడు, కుత్సితుడు, పాపములు చేయువాడు, అన్నింటిని (అభక్ష్యములను) తినువాడు, అన్నింటి అమ్మువాడు,. వాజ్మనః కాయములతో చేయు పాపముల వలన హతులగు బ్రాహ్మణాధములు నూఱు యజ్ఞములను చేసినను శుద్ధిని పొందజాలరు -9. శూద్రులకు ఏ యనిష్టములు స్వాభావికముగ కలుగునో అవియే బ్రాహ్మణులకు కూడా నిరాటంకములగు చున్నవి కదా!.
తా॥ అందువలన మంత్రము, అగ్నిహోత్రము, యజ్ఞవేదికయందు పశువును వధించుట బ్రాహ్మణత్వమున కారణములుకావు. శూద్రులచే గూడనిటి క్రియలు సాధ్యములే. కర్మపాశబద్ధులై నశించువారు, సంసారమనెడునగ్నిలో దహింపబడుచు, విలవిలలాడు మనస్సుగలవారు. సుఖామృతమును గ్రోలుకొఱకు తపించుచు, దీనులై జనన మరణములనెడు పరారణ్యమున సంచరించుచుందురు. వారెప్పుడును మోక్షమును పొందజాలరు. ఆహారేతస్సులందు పుట్టిన నాలుగు వర్ణముల మానవాధములలో అన్నివిధముల స్వధర్మముననుష్ఠించుటయందును; అనుష్టింపకపోవుట యందును బుట్టిన నాలుగు వర్ణముల మానవాధములలో నన్ని విధముల అన్నధర్మముల చేత సంకరత్వమే-కన్పట్టుచున్నది. శూద్రులు, బ్రాహ్మణులు, ఇతరులును పుట్టుక విషయమున నొకరితో నొకరు భేదింపరు. ధర్మములన్నియు సమానముగ నుండుటవలన, సంస్కారాదులు నిరర్థకమగును.స్వధర్మము ననుష్ఠించుట యందును, అనుష్టింపకపోవుటయందును, వియోగమునందును మరణమునందును సేవింపకూడనివి సేవించుటయందును శూద్రులు విప్రులు మున్నగువారందఱును సమానమైన వార. బుద్ది, శక్తి, స్వభావము, ధర్మములు, పుట్టుట, ధనము కర్తవ్యములు, పుణ్యపాపములు, మెల్లమెల్లగా నన్ని శరీరములను పొందుట. బంధనములు, ఆటంకములు, వివిధములైన యాతనలు, ఉపాయములు, పీడనములు శిక్షలు, శిక్షలేని పనులు, విషాదములు, విలాపములు. ప్రీతికరములైన సాత్విక ధర్మములు, వింతవింతల రాజధర్మములు, తాపము, మోహమును కలిగించు తామసగుణములు, వీనితో మల మఱల భాదపడుట. కఫము, వాతము, పిత్తము మున్నగువాని భయంకర పరిణామములు, ఒకప్పుడు వృత్తి, ఒకప్పుడు వృత్తిరాహిత్యము, సత్యము, అసత్యము, హితము, అహితము-ఇవి యన్నింటిచేత సమానులే.
తా॥ అలంకారములనుపయోగించి చేసెడు మన్మధ చేష్టలచేత, ధనము లాభించునాశయముతో ననేక జీవ సమూహములను హింసించుటల చేతను. ఈడేరుయత్నములు గల వివిధములైన కోరికలచేతను, తన్ను, తనవారిని ప్రేమించుట, ఇతరులను ద్వేషించుట, సంపాదించిన ద్రవ్యమును రక్షించుట మున్నగవాని చేతను. మిక్కిలి క్రొవ్వుపట్టుట, క్షోభనందుట, తుమ్ముట, లేమి కలుగుట, ఓర్పుకలిగియుండుట, వ్యాధిసోకుట, మొదలగువాని చేతను, తీవ్రమగు వేదనననుభవించుట, వెరవుకనొనుట, కొండెకాని తనము, రిక్తత, శాంతి మొదలగువాని చేతను. దుష్ట కార్యాచరణములచేతను, పొంచియున్న ప్రమాదములచేతను అందఱు సమానులే. ప్రాణిహింసకులు, పాపాత్ములు, అసత్యములు మాట్లాడువారు. సాధువుల నిందచేయువారు, దొంగలు, నిర్దయులు, పరస్త్రీ సాంగత్యము చేయువారు, నీచమైన పనులు చేయువారు, పిశాచమువలెనన్నింటిని భక్షించువారు. దుష్టకులమున జన్మించినవారు, దురాచారులు, రాజులనాశ్రయించి జీవించువారు, ఇతరుల ను పీడించువారు, కర్మహీనులు, దుష్టబుద్దిగల ధనవంతులు. అన్ని వర్ణములలోను కలరు. అడవిలో నివసించుచు జింకలను వేటాడి చం పెడు బోయలవలె కొండెకాండ్రు, దుష్టులనేకులు ఇతరులను హింసించుచు పొట్టపోసికొందురు. కొందఱు వేద ధర్మము నధ్యయనము చేసియు, ప్రాణిహింస, పరదూషణ, కపటవర్తనములతో తమ ధనములను పెంపుచేసికొందురు. వీరు వేదములను అమ్ముకొని జీవించు నధములు. కపటులు, ఈర్ష్యాళువులు, పిసినారులు, మూర్ఖులు, గర్వితులు, వంచకులు, పరాన్నభుక్కులు, క్రూరులు,నీచులు, కలహప్రియులు. వదరుబోతులు, అంకుటాండ్రతో నుండువారు, “బాడుగల వారితో తిరుగువారు, ఆకతాయులు, పనివాండ్రయాద్దత్యముచేత క్రుద్ధులగువారు. ద్రిమ్మరులు, బాడుగపనులు చేయువారు, పై పైపొగడ్తలు చేయువారు, అమ్మగూడనీ వానిని అమ్మువారు, తినగూడని వానిని తినువారు. శూద్ర కర్మలలోనుండువారు, తపస్సులేనివారు-వీరందఱు ఏ వర్ణమువారైనను మానవాధములే. అధ్యాపము, వర్తకము, కృషి, సేవ మొదలగు స్వయోగ్యములగు వృత్తుల వలన దూషితులై, అన్యమార్గముల మూలమున ధనధాన్యాది సంపదలను సమకూర్యుకొనువారు. క్రోధము మొదలగు నాంతర దోషములను, దుష్టములైన కోరికలను విడిచి పెట్టనివారు, సదాచార సంపన్నుల తలలు పట్టి (సేవలు చేసి) శ్రేష్ఠులగుచున్నారు.
తా॥ బ్రాహ్మణులు స్వీకరింపదగని వస్త్రములను తీసికొందురు. హేయమైన వానిని విడిచి పెట్టరు. అట్టివారీ భూమిపై గురువులెట్లగుదురు? కఱ్ఱలుపట్టుకొనువారు, దిండరములు వాయించువారు, సంకరులు (విదూషకులు), కోపగొండులు, అధమమైన పనులు చేయువారు, దుర్వాదములు చేయువారు, మృగములను, పశువులను సింహముహింసించినట్లు హింసించుచుందురు. తపస్సు తప్ప ఏమియులేని మునిని చూచి గొప్పవానిగ గౌరవించియు ఆమీద అవమానించిపోవుదురు. ఆత్మశత్రువులైన అట్టి హీనులను తిరస్కరింపవలేను. కావున సంసారమునందుండెడు జీవులు చిత్తమునందలి రాగద్వేషాది క్లేశములతో కళంకితులై యుందురు, చెడునడవడి, చెడ్డమనస్సు మొదలగువానిచేతను, సమానమైన స్వభావబద్ధత వలనను. బ్రాహ్మణుడు, కామాతురయైన శూద్రస్త్రీని మైథునమును గూర్చి ప్రేరేపించును. ఆమె అతనితో క్రీడించి, మన్మధ బాధను పశమింపజేసికొని గర్భము ధరించును. కామాతురలైన స్త్రీల కొఱకే కామము. రతి విషయమున శూద్ర స్త్రీలు బ్రాహ్మణ్యమునందు ప్రీతిగలిగియుందురు. ఈ బ్రాహ్మణులును ఆ స్త్రీలయందు సుఖమును పొందుదురు. కాని వృషభములు, గుఱ్ఱములు, ఒంటేలు, ఏనుగులు, సుఖమును కోరియుండియు, తమకంటే వేరైన జాతి జంతువులతో రమింపవు-గర్భమును చేయవు.
తా॥ గోవృషభముల సంగమమునందే కామము పుష్టినొందును. గుఱ్ఱములు ఆడగుఱ్ఱములయందే చక్కగా రతి సలుపును. ఆడఒంటే మగ ఒంటేతోడనే హాయిగా రమించును. ఆడయేనుగు మగ ఏనుగును 'పతిగా' పొందియే సుఖము పొందును. పశువు, స్త్రీతో మైథునము చేసినను ఆమెకు గర్భము చేయజాలదు. సుఖము కొణకు ఖడ్గము వలె వెనుకకు వంగియన్న స్త్రీకి మనుష్యుడు కూడ గర్భము కలిగింపలేడు. మనుష్య స్త్రీ పశువు చేత సంపర్కము చేసినను గర్భము ధరింపదు. ఇట్టి విజాతి మైధునములు అసమంజసములు. బ్రాహ్మణ శూద్రులమధ్య భేదమును సమయింపగల స్పష్టమైన విభాగము స్త్రీ పురుషుల మైధున విషయముగ నేదియులేదు. ఈ భేదమనునది వేదాధ్యయనమను నేపము చేత, లేక ఆయక్రియలచేతను ఏర్పడదు. అనేకములగు భౌతిక వస్తువుల కలయిక చేత నేర్పడునది గావున ఏ ప్రత్యేకతయులేనిది, స్థల కాలములకు కట్టుబడి యుండునది. దహించు కొనిపోయేడు స్వభావము గలది, ఆంతరమున జీవుడుగలది వీనియందు అపరిశుభ్రములై, ఒకే విధముగ నుండని రాగము, ద్వేషము మొదలగు దోషముల చేత పీడింబడును. విషయభోగములనెడీ మహాసముద్రమున కుమ్మరి వాని చక్రము వలె నిరంతరము తిరుగు చుండుమనస్సు గలది, భయంకరములగు దు:ఖములతో నాక్రమింపబడినది, అనాత్మ వస్తువులతో చేరియుండునదియు. జననము, మరణము, ముసలితనము, దుఃఖము, అవాంఛిత సన్నివేశములనెడి అగ్నితో దహింపబడునదియు, దుర్బలమగునదియునైన శరీరమునందు, దానినాశ్రయించియుండు నవస్థలయందును ఎట్టి విశేషము భావింపబడదు కదా! అందువలన మనుష్యులలోని యీ భేదము ఒక ఒడఁబాటు బలమున కల్పింపబడినది. బ్రాహ్మణ్యమనునది బ్రాహ్మణాశ్రయమువలన కలుగుచున్నది. అటుల 'పావిత్ర్యము' (బ్రాహ్మణస్త్రీ) పూజింపబడుచున్నది. భర్తను వదిలి పెట్టి జారిణియైన స్త్రీ సంగమేచ్చచేత, చుంబనాదికా ప్రేక్షచేతను విటుని వద్దకు బోవును. పనివాండ్రు-లేక శృంగార నాయకుని అనుచరులతో గూడ మన్మధ క్రియలు సాగించును. కొందఱు బ్రాహ్మణ్యమునుండి పతనమై మహాపాపములను చేయుదురు. కాబట్టి జాతి విభాగమనునది అసత్యకల్పనమే.
శతార్ధ సాహస్ర సంహితయగు శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మపర్వమున షష్టీకల్పమునందు వర్ణవ్యవస్థావర్ణనమను నలుబది మూడవ అధ్యాయము సమాప్తము.
