18 - లలితాపరమేశ్వరీ సేనాజయయాత్రా నామ అష్టాదశోఽధ్యాయః

ఆ తరువాత లలితా పరమేశ్వరి సంగ్రామమునుద్దేశించి బయలు దేరెను. అపుడామైయిట్లుండెను. ఆమె రాజనాయిక (రాజులందరికిని నాయిక)-సర్వులును ఆశ్రయించినది. ఆమెయంకుశము జల్వించుచున్నది, ఆమె ధరించిన పాశము నాగుబామువలె భయంకరముగానున్నది. చేతికంకణములు మధురముగా ధ్వనించునట్లు చేలకు విల్లును ధరించినది. ప్రదీప్తములైన యైదు పుష్పబాణములను ధరించినది. ఈ విధముగా యుద్రోన్ముఖమైన మన్మథరూపము దాల్చినది-1. ఉదయించుచున్నవేయి సూర్యుల కంటెను మించిన యెల్లని కాంతిని తన శరీరమునుండి ప్రవహింపజేయుచున్నది. కోటి సూర్యప్రభాభాసురయన్నమాట. ఆమె దీక్కులకు విరజిమ్ము ముఖకాంతులతో ఆకాశమండలమంతయు చంద్రమయముగా సృజించుచున్నట్లున్నదీ-2. ఆమె పదియో జనముల విశాలమై, ముల్లోకముల నావరించునాయన్నట్లున్నదై, ముత్యములతో నిండినదై, చంద్రమండలమునకు చెలికాడుగానున్నదైన గుండ్రని తెల్లగొడుగుతో బ్రకాశించుచున్నది-3. మణికాంతులతో శోభిల్లుచు. నూతన చంద్రకాంతిల హరులమొలకలవంటి నాలుగు చామరములచే విజయ మొదలగు పరిచారికా గణములతో వీవబడుచున్నది-4. శక్తుల ఏక సామ్రాజ్య పదవిని సూచించున్నది. కావుననే నూర్లకొలది సామ్రాజ్య చిహ్నములచే నామె సైన్యదేశములలంకరింపబడినవి. దేవతా స్త్రీలు తమ సంగీత వాద్యరచనలతో సోమవైభవమును స్తుతించుచున్నారు దానిచే సొమె ప్రకాశమింకను విశదమైనది-5. ఆమె రూపము వాక్కులకందనిది. అంతియగాక బుద్ధికిని సైతమందనిది. ఇట్టిదని భావింపనలవికానిది. సాటిలేనిది-6. ముల్లోకములు నిండిన శక్తి సామ్రాజ్యముయొక్య యభిమానమును స్పృశించుచున్నది. నెత్తిన చేతులు జోడించి దూరమునుండియు దగ్గర నుండియును నేనుముందు సేవింతును అను భావముతో దేవతలచే సేవింపబడు చున్నది-7. బ్రహ్మ ఈశ్వరుడు, విష్ణువు, ఇంద్రుడు మొదలగు దేవశ్రేష్ఠుల ముఖములు స్తోత్రముల వర్షించుచున్నవి, వారిని లలిత కటాక్షించుచున్నది. పైకి ప్రజ్వలించునైదు పుష్పబాణములనుండి బయలు వెడలిన కాంతులచే జ్యోతిర్మయమైన ముల్లోకములను వెంటనే (పడకుండగా) ధరించుచున్నది-8. మెరుపుతీవల వంటి యప్సరసల గణములామెపై జయమంగలలాజ వర్షముల గురిపించుచున్నారు.మనోహరమైన కాంతులు గలిగి, సంగ్రామ వేషరచనలలో మనోహరలై-9. ప్రదీప్తములైన యాయుధములకాంతులచే సూర్యుని గూడ తిరస్కరించువారైన కామేశ్వరి మొదలగు శక్తులు నిత్యము పాదములచెంత సేవించుచున్నారు. శ్రీ చక్రములు మంగళ చక్రములు తిలకముగానుండి, నూరుయోజనముల మిక్కిలీయెత్తే ధ్వజ (పతాక)ములతో మేఘ సమూహములనే వ్రాయుచుండియు-10. తీవ్రములైన అభిరావణ సుశక్తి పరంపరలతో గూడిన రథమును యుద్ధకర్మలో నడపుచున్నది. పైకెత్తిన కపిల వర్ణకాంతిగలయంకుశపు కాంతితో జుట్టబడినదై యుద్ధమున మనోహరకాంతితో బ్రకాశించినది-11. ఆమె యిరువదియైదు నామములు ప్రపంచ పాపములనన్నింటిని ఉపశమింపజేయగలవు. అట్టి యిరువదియైదు నామరత్నములచే మరుద్దేవతలు స్తుతించుచుండగా లలితాదేవి సంగ్రామమునుద్దేశించి కదలెను -12. అగస్త్యుడనెను ఓ హయగ్రీవ! మహాబుద్ధిగలవాడా! లలితో పరమేశాని యొక్క పంచవింశతినామములతో మాకు శ్రవణానందము కలుగజేయము-13. హయగ్రీవుడనేను- సింహాసనా, శ్రీలలితా, మహారాజ్జీ, పరాంకుశా, చాపినీ, త్రిపురా, మహాత్రిపురసుందరీ-14. సుందరీ, చక్రనాథా, సామ్రాజ్ఞి, చక్రిణీ, చక్రేశ్వరీ, మహాదేవీ, కామేశీ, పరమేశ్వరీ-15. కామరాజప్రియా, కామకోటిగా, చక్రవర్తినీ, మహావిద్యా, శీవా, అనంగవల్లభా, సర్వపాటలా-16, కులనాథా, ఆమ్నాయనాథా, సర్వామ్నాయనివాసినీ, శృంగారనాయికా-అనునీ పంచవింశతినామములతో మహాభాగమైన లలితాపరమేశ్వరినిస్తుతించువారు సౌభాగ్యమును అష్టసిద్దులను, మహాయశమును బొందుదురు-18, ఈ విధముగ మహాభయంకర సరంభముగల మహాసైన్యబలమును కదిలింపజేయుచు, లలితాంబిక భండాసురుని పై మిక్కలి కోపించి కదలెను. (బయలు దేరెను)-19.

ఇది శ్రీ బ్రహ్మాండమహాపురాణమున నుత్తర భాగమున హయగ్రీవాగస్య సంవాదమున లలితోపాఖ్యానమున లలితాపరమేశ్వరీసేనాజయయాత్ర యను పదునెనిమిదవ యధ్యాయము.