20 - కిరిచక్రరథదేవతాప్రకాశనం

ఓ ప్రాజ్ఞ! ఆగస్త్యా! కిరిచక్రరథశ్రేష్ఠము యొక్క యైదవ పర్వమునాశ్రయించిన దేవతలను వినుము. వారి నామములను విన్న వారికి జయములభించును-1. దాని మొదటి పర్వము బిందువను పేరుగలది. అక్కడికి దండనాయిక చేరును. ఆమె యచట జగముయొక్క ఉద్దండకంటకసమూహమును నశింపచజేయునది-2. అనేక విధములైన జ్వాలలతో జయశ్రీని వర్తింపజేయుచుండును-3. దండమువలె పొడవైన తన పందిమూతి దెబ్బకు ఉద్ధతదానవులు తుత్తునియలైరి. ఆమె కోరలు చంద్రవంకవలె ప్రకాశించుచున్నవి. దాని వలన రాత్రి తెల్లతెల్లనగుచున్నదీ-4. వర్షాకాల మేఘ సమూహమువలె నల్లనైన మైతీగ (శరీరలత) గలది. ఆమె కిరీ చక్రరథ శ్రేష్టము నెల్లప్పుడు నలంకరించుచుండును. ఆమె వరాహముఖము గలది. విశ్వమును జుట్టియున్న కదంబ వృక్షముల నామె తన పుత్రులనుగా జేసికోన్నది-5. ఆ కీచక్రరథపు చక్రమధ్యమున రెండవ పర్వమునాశ్రయించినవారు - జృంభిని, మోహిని, స్తంభిని - ఈ మువ్వురే. వికసించిన దానిమ్మపూవువలె సెల్లనైనవారు. సర్వరాక్షసులను మర్ధించుపొరు-6. ప్రకాశించుచున్న రత్నములు గల కంకణముల ధరించిన చివురాకువంటి చేతులచేవారు రోకలిని నాగలిని, మణిగణములు పొదిగిన పాన పాత్రమును ధరించినవారు-7. మిక్కిలి వాడియై క్రూరములైన కన్నులు గలవారు, ఆ నేత్ర జ్వాలలచే రాక్షస సైనికులను దహించుచున్నట్లున్న వారై యాసూకరాననను (వరాహముఖిని) నిత్యము సేవించుచున్నారు-8. ఇక కిరిచక్రరథశ్రేష్ఠము యొక్క మూడవ పర్వము నాశ్రయించినవారు. అంధీనీ మొదలగు నైదుగురు స్త్రీ దేవులు వారు దేవీయంత్రమున నివాసమేర్పరచికొనినవారు-9. కఠోరములైన పెద్ద పెద్ద నవ్వులతో ముల్లోకములను భేదించుచున్నారు. కల్పాన్నీ జ్వాలలవలే ఆడ వేషముతో మిశ్రితలు-10. భండాసురుని సర్వ సైన్యముల రక్తస్రావములను నాకగోరిన వారై యట్లునాకుచున్న నాలుకలతో సుజ్జ్వలలైనవారు-11. వీరు ఉద్దండ పరాక్రమముగల దండనాథను ఎల్లప్పుడు సేవింతురు. ఇక, కిరిచక్రరథశ్రేష్ఠము యొక్క నాలుగవ పర్వమునాశ్రయించినవారు-12. పంచమిని అష్టమీ వదిలిన బ్రహ్మాదులు. ఆరుగురే స్త్రీ దేవులు. వారు షట్చక్రములమండుచున్న జ్వాలలుగల శరీరములుగల వారు-13. గొప్ప పరాక్రమ సమూహముతో దానవులను ద్రాగుచున్నట్లున్నవారు. వారు దండనాథ యొక్క యాదేశముచే ఆ ప్రదేశమునుపాసించుచున్నారు-14. ఆ పర్వము యొక్క క్రిందనే, తొందరగా ఆ స్థానమునగలిసినవారు - యక్షిణి, శంఖిని, లాకిని, హాకిని-15. శాకిని, డానికి, వీరందరి మైక్య స్వరూపిణియైన యేడవదియైన హాకిని - అనువీరందరు భయంకరమైన బాహు పరాక్రమము గలవారు-16. వారు భూతములను (ప్రాణులను) త్రాగుచున్నవారివలె భూమినే త్రాగుచున్నవారి వలెను, విరోధులయొక్క చర్మమును రక్తమును, మాంసమును, మేదస్సును, ఎముకలను-17. మజ్జను, శుక్రమును త్రాగుచున్న వారై వికటమైన ముఖములుగలవారు, నిష్ఠురములైన సింహనాదములతో దశదిక్కుల నింపుచున్నవారు-18. వీరు ధాతునాథలు అనీ యనబడిరి. అణీ మాద్యష్టసిద్ధులనీచచ్చువారు. వీరు దుష్టదైత్యుల యొక్క మోహనమున మారణమున, స్తంభనమున, తాడనమున-19. భక్షణమున, ఆమూలముగ కత్తరించుటలోను పండితలు, భక్తితో నొప్పినవారి సమస్తాపదలను ఖండించినవారు-20, ఈ ధాతునాథలనబడినవారు సర్వధాతువులలో నుందురు. అత్యున్నతములైన యలల వరుసలతో నాకాశమునంటీన యేడు సముద్రములను గూడ-21 అర క్షణములో ద్రావుటకుత్పన్నమైన బహు సాహసముగలవారు, శకటాకార దంతములు గలవారు. భయంకరములైన కండ్లు గలవారు. -22. స్వస్వామినికి ద్రోహము చేయువారిని, తమ సమయ (నియమ)మునకు ద్రోహమాచరించువారిని, వైదికులకు ద్రోహమాచరించి ద్రోహులైనవారినీ, వీరులకు వైరులైన వారినీ-23. యజ్ఞములకు ద్రోహమాచరించువారిని - ఇట్టే రాక్షసులను దీనుటలో సమర్థులు. వీరందరు. వరాహముఖియైన దండ నాయికను నిత్యము సేవింతురు-24. ఆ పర్వముయొక్క రెండవ ప్రక్కన దివ్య మందిరమున క్రోధినీ, స్తంభినీ, అనునిద్దరు ప్రసిద్ధ దేవతలుందురు-25. వారు చామరములను వీచుచుందురు. కావున వారి తీవలవంటి చేతులలోని కంకణములు కదులుచుండును. దేవ ద్వేషులైన రాక్షసుల సైన్యము యొక్క రక్తమును మధువును ద్రోవుటచే మహోద్దతలగుదురు-26. ఎల్లప్పుడు త్రిప్పుచున్న కండ్లు గలవారు. ఎల్లప్పుడు పెద్దగా నవ్విన ముఖముగలవారు. ఇక కిరిచక్రాశ్రీతమైన రథ శ్రేష్ఠము యొక్క-27. యిరుపక్కలను నివాసమేర్పరచుకున్నవి రెండుత్తమాయుధములు. అని నాగలి, రోకలియును. ఇవి దేవతా రూపముల వహించినవి-28. తమ కిరీటమున తమ యాయుధరూపములను ధరించినవీ, ఇవి జగమును ద్వేషించు రాక్షసుల జంపునవనీ దేవతలచే తలపబడినవి-29. ఈ రెండాయుధములచే లలితా దండనాయిక యుద్దమున విషంగుడను రాక్షసుని ఖండపంగలదు.-30. ఆ పర్వమునందున్న దండ నాథ యొక్క ముందటి ప్రాంతమునన్నుడై మిక్కిలి భయంకరమైనది సింహము, అది తన నాదములచే నొకాశమును ధ్వనింపజేయుచున్నది-31. దానీ కోరలకటకట ధ్వనులచే దీజ్ముఖములు చెవుడు బారుచున్నది. అది చందోచ్చండమని ప్రసిద్ధి జెందినవాడు, నాలుగు చేతులు మూడుకన్నులు గలవాడు-32, శూలము, ఖడ్గము, ప్రేతము, పాశము - వీనిని నాలుగు చేతులలో ధరించినవాడు, మిక్కిలి ప్రదీప్తమైన యాకారముగలవాడు. ఈతడు వరాహముఖియైన దేవిని జూచుచునే సేవించును-33. ఇక కిరిచక్ర రథ శ్రేష్ఠము యొక్కయావ పర్వమును ఆశ్రయించినవారు వార్తాలి మొదలగువారు ఎనమండుగురు. అష్టదిక్కులలో ప్రసిద్ధలు-34. వారు ఎనిమిది పర్వతములు పడినంతటి ధ్వనులు గలవారు, ఎనిమిది నాగములతో ప్రకాశించిన యలంకారములు గలవారు. నష్టముగాని బలము తేజమును గలవారు-35. గొప్పవై విశాలములైన బాహుదండముల వేడిలో హోమము జేయబడిన కోట్ల కొలది రాక్షసులు గలవారు - ఇట్టి స్త్రీ దేవులు లలితా దండనాథను రాత్రింబవళ్లు సేవింతురు-36. ఓ యగస్త్యా! వారిపేరులు ప్రసిద్ధమైనవి. వినుము. వార్తాలి, వారాహి, ఆమె వరాహ ముఖియైన పర-37. స్తంభినీ - అనువీరు శత్రువులను క్షోభింపజేయుటలోను, స్తంభింపజేయుటలోను, ఉచ్చాటనము చేయించుటలోను సమర్థలు-38. వారు పర్వము యొక్క యెడమ భాగమున నుందురు. దండనాథయధిష్టించు మహిషము దుమ్ము బట్టినయాకారముగలదీ-39. రెండు కొమ్ములందు సగము క్రోశము వెడల్పుగలది. ఒక క్రోశము ఆకారముగలది. ఆ మహిష రోమముల నుండి బుట్టినవారు ఖడ్గములవలె కరీనులై వాడియైనవారు. ఆ మహిషము వీరితో జుట్టబడినది.-40 యమదండమువలె నున్నతమై భయంకరమై తోకయొక్క కాండముతో భయంకరముగా నున్నది. నల్లని కాటుకపర్వతమువలెనున్నది. వికటమై ఉన్నతమైరుష్టములైన భావములకు స్థానమైనదీ-41. మహానీల పర్వతశ్రేష్ఠమువలె గరిష్టమైనమూపురపు ప్రదేశముగలది. దాని మిక్కిలి వేడి నీట్టూర్పుల ప్రసారములచే సముద్రములు కంపించినవి-42. ఘర్షర ధ్వనిచే యముని దున్నపోతును వెక్కిరించుచున్నది. పుష్కలావర్తమను మేఘమును. గిట్టలచే చెల్లాచెదరు చేసినదీ-43. దానీ పర్వము యొక్క క్రిందనే చీవ్రస్థానములందు నీవాసములు ఏర్పరచుకొన్నవారు అనేక భేదములుగల ఇంద్రాదులు ఎనిమిది దిక్కుల దేవతలు-44. వీరు లలిత కార్యసిద్ధిని నివేదించుటకు వచ్చిరి. ఇంద్రుడు అటువది నాలుగు కోట్ల యప్సరసలు -45. సిద్ధాగ్ని, సాధ్యాగ్ని, విశ్వేదేవతలు. విశ్వకర్మయైన మయుడు, బలోన్నతులైన మాతృదేవతలు-46. రుద్రులు, పరిచారులు, రుద్రులు పిశాచకులు, అనేక రాక్షసనాథులు - ఆరచుచున్నారు-47. అచట మిత్రులు, నిత్యము గానవి శారదులైన గంధర్వులు. వారికి ముందుగా బోవు విశ్వావసువు మొదలైనపోరు-48. అట్లే తక్కిన సేవకగణములు, వరుణుడు, వాసవుడు, తక్కినవారు, విద్యాధరులు కిన్నరులు, మారుతేశ్వరుడును-49. అట్లే చిత్రరథుడు, రథకారకకారకులు, తుంబురుడు, నారదుడు, యక్షుడు, సోముడు, యక్షేశ్వరుడు-50. అట్లే దేవతలతో గూడిన భగవంతుడు కమలాపతియునైన గోవిందుడు (విష్ణువు) జగచ్చక్రమునుడినువాడును శూలముతో భయంకరుడునైన ఈశానుడు, బ్రహ్మ వైద్య విశారదులైన అశ్వినీ పుత్రులు, భగవంతుడైన ధన్వంతరియు, అట్లే తక్కిన గణనాయకులును-52. గండ స్థలభాగమున ప్రసరించు మద స్రావములతో తృప్తి చెందింపబడిన తుమ్మెదలుగల నాగరాజులును, అనంతుడు, వాసుకి, తక్షుడు, కర్కోటుడు, పద్ముడు, మహా పద్ముడు, శంఖపాలుడు, గలీకుడు, సువలుడు - వీరు నాగకోటులతో నావరింపబడిన నాగేశ్వరులును-54. ఈ విధములైన బహు దేవతలు అచట మేలుకొనియుందురు. తూర్పు మొదలుకొని చుట్టును నివాస మేర్పరచుకొన్నవారు-55. ఆ చక్రమునందే దేవతలు చక్రాకారముగానున్నారు. ఆ దేవదిక్కుల నాశ్రయించియే వారి యధిష్ఠాతృదేవతలుందురు-56. జృంభిణి, స్తంభిని, మోహిని - అనుమువ్వురేవారు. ప్రకాశించు కిరి చక్రము యొక్క ప్రాంతమున-57. క్షేత్ర పాలుడు వరాహముఖియైన యీశ్వరుని నిత్యము సేవించుచు ప్రకాశించును. ఆతడు కపాలమును గదను ధరించును, ఊర్వ కేశుడు మహాకాయుడు పాతాలతలము నందలి బిరుదవలే నల్లగా నుండును-58. అట్టహాసమను మహావజ్రములతో బ్రహ్మాండమండలమునే చీల్చి వేయును. తన డమరుక ధ్వనులతో ఆకాశ గుహా మధ్యమును పగులగొట్టును. -59. పూత్కారీ త్రిపురాయుక్తమైన నాగ పాశమును చేత ధరించును-60, ఈ విధముగా నుండి క్షేత్రపాలుడు వరాహములీశ్వరిని నిత్యముసేవించుచు బ్రకాశించును-60. ఆతనీ యొక్క సమీపముననే యామె వాహనమైన కేసరి (సీంహము) యున్నది. దానినెక్కి లలిత భండాసురుని వధింపగోరి బయలుదేరినది-61. దేవేశియొక్క సింహవాహన లక్షణము పూర్వమే చెప్పబడినది. ఇక యీ చక్రరథపర్వము యొక్క క్రిందనే వేయి దేవతలు వరాహములీశ్వరిని సేవించువారుగా జెప్పబడిరి. వారీకాంతులు దండనాథకాంతికి సమానములు-62. దండినికి సమానముగా సమస్త భూషణములను ఆయుధములను బాగుగా ధరించినారు. శమింపజేయదగినవారు. వరాహముఖులు, చంద్రరేఖను తలపైనలంకారముగా ధరించినవారు-63. మాటిమాటికి చేతిలో నాగలిని రోకలినీ ట్రిప్పువారు. లలితాద్రోహుల యొక్కయు శ్యామాద్రోహుల యొక్కయు, స్వామినీ ద్రోహుల యొక్కయు-64. పొంగి పొరలు రక్త ధారలచేత కపాలకమును నింపుచున్నవారు, నిజభక్త ద్రోహుల యొక్క ప్రేగుల మాలలను సొమ్ముగా ధరించువారు-65. తమ మాటల సమయము నాక్షేపించువారి తలల మాలలను అఖండముగా రక్తముల గ్రక్కుచుండగా సిదపై ధరించువారు-66-67. ఓ యగస్త్యా దండినీ యొక్కయు వారీ యొక్కయు నామములను సహస్ర నామాధ్యాయమున జెప్పెదను. మరలట జెప్పను-68. (ఈ వాక్యముతో లలితా సహస్రనామాధ్యాయము ఈ యుపాఖ్యానమందేయున్నదని తెలియును. కాని ప్రస్తుత మదియందు లేమికి కారణము పరిశోధింపదగినది) తరువాత, ఆ వరాహముఖీ. దేవతల యొక్క సమీపముగా వాహనమైన కృష్ణ సారంగము (దుప్పి) దండినీ యొక్క యదుపులోనున్నది-69. కొమ్మునందు పావుకోశము పొడవైనదీ, ముఖమునందు అర పావు క్రోశము పొడవైనది. పాదములు కోశము పొడవైనవి. ఎప్పుడును తోకయెత్తుకోనీ యుండునదీ-70. కడుపుపైన తెల్లని ఛాయ కలది. గొప్ప హుంకారము గలది. వాయు వాహనమైన హరిణము (లేడి) యొక్క పరాక్రమమును ఎక్కిరించుచుండును-71. ఆ పర్వము యొక్క ప్రదేశముననే యా వాహన శ్రేష్టమున్నది. కిరిచక్రరథశ్రేష్టము యొక్క ఆ పర్వమునందే - దేవతా రూపము వహించిన మదరాసింధువున్నది-72. ఆమె కెంపు పర్వతమువలె ఎల్లనైన మాంసపిండమును చేత ధరించినది. కన్నుల ద్రిప్పుచున్నది. బంగారు కమలముల మాలను ధరించినది. ఎఱ్ఱని కమలమును ధరించిన మదశక్తిచే బాగుగా కౌగిలించుకొనబడినదీ-74. భండాసురుడు యుద్దమునకు వచ్చినప్పుడెల్ల యుద్ధముచే చెమర్చిన శక్తులు వాని రక్తమును ద్రావుటకు దాహముగలవారగుదురు-75. అపుడు వెంట వెంటనే సురాసింధువు తన ననేక విధముగా జల్లుచు, రణమున దేవతల దుఃఖమును శీఘ్రముగా బోగొట్టును-76. ఓ మునీ! అది కూడ నొక యద్భుతముగా గలదు. యద్దములో నేను చెప్పబోవు దానిని ఆనందముతో వినెదవు-77. ఆ చక్ర రథము యొక్క పర్వముననే క్రిందను మీదను నివాసమేర్పరచుకోన్నవారు పాతుకాదులు పదుగురు చెప్పబడిరీ-78. భైరవ శ్రేష్ఠులు గొప్ప వారుగా ప్రసిద్దులు. విపులమైన పరాక్రమముగలవారు. పైకి మండుచున్న పదివేల తేజములచే పగలు ప్రకాశింపజేసిన కిరణములు (సూర్యులు) గలవారు-79. కల్పాంత కాలమున దండిని యొక్క యాజ్ఞచే విశ్వమును నశింపజేయువారు. మిక్కిలి తీవ్రమైన స్వభావము గలవారు. పండ్లతో కరచి కొన్న పెదవులు గలవారు-80. త్రిశూలాగ్రములచే మహామేఘమండలములను తుత్తునియలు చేయువారు. హేతుకుడు, త్రిపురారి, మూడవవాడు అగ్ని భైరవుడు-81. యమజిహ్వుడు, ఏకపాదుడు, కాలుడు కరాలుడును, భీమరూపుడు హాటకేశుడు, అచలనాముడు-82. ఈ పదుగురు ప్రసిద్ధులు. దశ కోటి భటులతోనున్నవారు. వీరు ఆకిరిచక్రరథము యొక్క పర్వ భాగముననే యుందురు-83. ఈ విధముగా దండనాథ యొక్క కిరిచక్రరథము యొక్క దేవతలు జృంభణి మొదలు అచలేంద్రాంతంలు చెప్పబడిరి. వారు త్రిలోకపావనలు-84. అచటనున్న దేవతో సమూహముల చేత అచటి యుద్ధమున రాక్షసులు జంపబడనున్నారు. రక్తవరములు త్రాగబడబోనున్నవి-85, ఈ విధముగా పర్వస్థ దేవతాగణముచే ననేక రక్షణలు గలిగిన కిరిచక్రమును (కిరీ చక్రరథమును) దండనాయిక నడిపించెను-86. చక్రరాజరథమున్న చోట గేయ చక్రరథముండును. గేయ చక్ర రథమున్న చోట కిరీ చక్రరథ శ్రేష్ఠముండును-87. అచట నీ రథ త్రయము కదులుచున్న మూడు లోకములవలెనున్నది. అపుడు శక్తి సేనా సహస్రము యొక్క యంతస్సులో శుభము చరించెను-88. అది మేరు -మందర - వింధ్య పర్వతముల సమూహమువలెనయ్యెను. శక్తుల యొక్క సైన్యమండలములలో గొప్ప ధ్వని సంభవించెను. ఆ రథ చక్రములచే చీల్చబడినదై భూమి కంపించేను-89. లలితాచక్రరాజమను రథ శ్రేష్ఠమునకు ఉద్దండపాశముల గ్రహించుటలో పండితులు. ఆలుగురు సారథులుగా చెప్పబడిరి-90. గేయ చక్ర రథమున్నచోట కిరీ చక్ర రథ శ్రేష్టముండును. ఈ విధముగా మొదట - దేవి, తరువాత (త్రిపుర భైరవి-91. సంహార భైరవుడు, రక్త యోగీని వల్లభుడు, సారసుడు (ఐదవవాడు) చాముండయు-92. వీరిలో దేవతలు ఆరుగురు రథ సారథులనబడిరి, గేయ చక్ర రథేంద్రమునకు హసంతిక సారథి-93. కిరి చక్ర రథేంద్రమునకు స్తంభిని సారథి. ఓ యగస్త్యా లలిత యొక్క రథ శ్రేష్ఠము పది యోజనముల యెత్తైనది -94. గీతి చక్ర రథ శ్రేష్ఠము ఏడు యోజనములయెత్తైనది. కిరి చక్ర రథ శ్రేష్ఠము  ఆణు యోజనముల యెత్తైనది-95. గొప్పనైన ముత్యముల గొడుగు పది యోజనముల విశాలమైనది. లలితేశానీరథము మాత్రమే యచటనున్నది. అదీయే శక్తి సామ్రాజ్యమునకు పరిసూచకము అనబడినది. సామాన్యమైన గొడుగు రెండు రథములకు గూడ గలదు-97. ఇక, ఆ లలితేశ్వరి సర్వశక్తుల మహేశ్వరి, మహా సామ్రాజ్య పదవినధిష్టించిన పరమేశ్వరి-98. భండాసురుని వినాశమును గోరినదై రణమునకు తరలెను. అప్పుడు దిక్కులన్నియు ధ్వనించుచున్నవి. భూమియంతయు కంపించుచున్నది. -99. సమస్త భూతములు క్షోభజెందుచున్నవి. లలితేశానీ దండయాత్రకు బయలుదేరగనే దేవదుందుభులు మ్రోగినవి. పుష్ప వరములు గురిసినవి-100. విశ్వావసు మొదలగు గంధర్వులు, దేషగాయకులైన తుంబురుడు నారదుడును, సాక్షాత్తు సరస్వతీయు-101. సారవంతమైన గీతులతో జయమంగల పద్యములను పఠించుచున్నారు. సంతోషము వికసించిన ముఖములు గలవారై మొలచిన పులకాంకురములే భూషణములుగా గలవారై మాటిమాటికి “జయజయ” అని యాలలితా పరమేశ్వరిని స్తోత్రము జేయుచుండిరీ-102. సంతోషము నిండి మదోన్మత్తలై యడుగడుగన నాట్యముల జేయుచుండిరి. వసిష్ణాది సప్తర్వులు ఋగ్యజు స్సామమంత్రములతోను-103. ఆధర్వణ మంత్రములతోను లలితా విజయ శ్రీని వర్దిల్ల జేయుచుండిరి. వారు హవిస్సుచే పావనియైన మహావహ్నిశీఖను వర్ధిల్ల జేసినట్లే మహాశీర్వాదములతో లలితా పరమేశ్వరిని వర్థిల్ల జేయుచుండిరీ-104. పారిచే స్తుతింపబడుచు, లలితో దేవి రథోత్తమమున విరాజిల్లుచున్నదై-105. భండాసురుని జయించుటకు ఉద్దండ సైనికులతోసహ బయలుదేరినది-106.

ఇది శ్రీబ్రహ్మాండ మహా పురాణమున ఉత్తర భాగమున లలితోపాఖ్యానమున కిరిచక్రరథదేవతాప్రకాశనమను నిరువదియ వయధ్యాయము.