34 - భార్గవ చరితము

సగరుఁడిట్లనెను.

ఓ బ్రహ్మపుత్ర ! మహాభాగ ! అనామయమైన (భద్రకరమైన) యీ కవచమును నా కొలకనుగ్రహించి నా యందు దయఁజూపితివి. నేను ఔర్వునిచే అనుగ్రహింపఁబడితిని. ఏలయన - ఆతని యనుగ్రహము వలననే నేను కృతాస్రుడనయితిని. ఓ వీభూ ! ఇప్పుడు నేను నీకు కృపా పాత్రుఁడనయితిని. భార్గవేంద్రుఁడయిన రామునిచే రాజయిన కార్తవీర్యుండేట్లు చంపఁబడెనో సవిస్తరముగా చెప్పఁగోరెదను. ఆ రోజు దత్తుని యొక్క రాముని యొక్క శివునియొక్క కృపా పాత్రుఁడు. ఓ గురూ ! వారిరువురు వీరులును యుద్ధమునకెట్లు సంఘటిల్లిరి.

వసిష్ఠుఁడిట్లు సమాధానమిచ్చెను.

ఓరాజా ! వీరుఁడయిన కార్తవీర్యుని యొక్క మహాత్ముఁడయిన రాముని యొక్క పాప నాశనమయిన చరితమును వివరించెదను వినుము. (5) ఆ భార్గవ రాముఁడు కవచమును, శివ గురుని ముఖము నుండి సాక్షాన్మంత్రమును పొంది, అత్యంత భక్తితో గూడికొనీ సాధన మాచరించెను. రాముఁడు పుష్కర తీర్థమునందు, వంద సంవత్సరములు, కటిక నేలపై శయనించి, త్రిషవణ స్నాన సంధ్యా పరాయణుఁడై శ్రద్ధాళుఁడై వసించెను. ప్రతిదినము అకృతవ్రణుఁడు రామునకు కాననము నుండి సమిధలను కుశలను, పుష్పములను ఇతర ద్రవ్యములను తీసికొనివచ్చి సమర్పించెడివాఁడు, మతిమంతులలో శ్రేష్ఠుఁడయిన రాముఁడు, సతతము ధ్యాన సంయుక్తుఁడై కల్మష నాశనుఁడయిన శ్రీకృష్ణుని ఆరాధించెను. (9). నిత్యము ధ్యాన నిష్ఠతో కృష్ణు నర్చించు రామునకు వంద సంవత్సరములు గడచిపోయెను. ఓ రాజా ! ఒకనాఁడు మహాను భావుఁడయిన రాముఁడు స్నానార్థమరిగెను. పుష్కరమధ్యమున ఆతఁడొక ఆశ్చర్యకరమైన యుత్తమ విషయమును చూచెను. ఒక మగలేడి ఆడలేడితో గూడికొని పరువెత్తుకొని యచ్చటికి వచ్చెను. వేటకాడు వానిన వెంటాడుచు ఎండకు మాడుచు అతిపీడితుఁడై యచ్చటికే వచ్చాను. ఆతఁడు దేహ పీడితుండు. జలపాన సముత్సకుఁడు. రాముఁడు చూచుచుండగనే సరోవర తటమున కాతడరుదెంచెను. తరువాత (వెనుకనే) భయ చకిత నేత్రములతో ఆడలేడియు వచ్చెను. ఆ మృగీమృగములు రెండును శంకాపూర్ణ మనస్సులతో జలమును త్రాగెను. అంతలో బాణ పాటియు ధనుర్ధరుఁడునునై వ్యాధుఁడు కూడవచ్చెను. అందు సంవిష్ణుఁడైయున్న భార్గవనందనుఁడయిన రాముని ఆతఁడు చూచెను.

వచ్చి, వ్యాధుఁడు అకృతవ్రణునితో రాముని చూచెను. దూరకృతేక్షణుఁడై ఆతఁడల్లే నిలబడిపోయెను. భృగు నందనుఁడయిన రాముని దర్శనమున శంకీత మనస్కుడై ఆతడిట్లా లోచించెను. ఈ రాముఁడు మహావీరుఁడు. దుష్టుల కంతకారకుఁడు, ఆతడు చూచుచుండ నీమృగములనేట్లు చంపగలను. అను ఆలోచనతో కూడికోని వ్యాధుఁడు, ఓ రాజ సత్తమ ! రాముని వలన సంత్రస్తమానసుఁడై యందే యుండిపోయెను. (18) భయపడుచు నీరు త్రాగుచున్న ఆ మృగద్వయమును రాముఁడు చూచేను. మేధావియైన రాముఁడు “ఇక్కడ భయకారణమేమయి యుండునని” ఆలోచించెను. ఇచ్చటేచ్చటను పులిగాండ్రింపులు లేవు. కిరాతుఁడు వెంటాడి వచ్చి యుండెనేమో యన్న, కిరాతుఁడును కన్పింపడే ! మతి ఏ యితర కారణమున ఆ మృగములు భయచకితేక్షణములై శంకితములై యున్నవి లేక, సహజముగా మృగజాతి చకితేక్షణములు కలది కదా ! అందుచే జలపాన సమయమునఁ గూడ భయచకిత నేత్రములు కలిగినవి. (21) ఆ రెండు భయ చకితములగుట కిచ్చట కారణము లేదే ! అవి అలసినవి భయాతురములు, శరీరమంతయు చెమ్మటలు పోసినవి.  శరీరావయవములు కంపించుచున్నవే.” ఈ విధముగా నాలోచించి మతి మంతుఁడయిన రాముఁడు శిష్యునితో సంయుతుఁడై పుష్కర మధ్యమున, అమృగములు రెండు నందేయుండగా నుండిపోయెను. (23) ఆ రెండును నీటిని త్రాగినవి. చెట్టునీడ కుంజేరినవి. ఆ మృగద్వయము రాముని చూచుచునే సంతోషమున అన్యోన్యము సంభాషణమున కారంభించెను.

మృగి (ఆడలేడి) ఇట్లనెను.

ఓ ప్రియ (ఓ నాయక) మనమిందే రాముడున్నంత సేపు ఉందము. ఆ వీరుని సాన్నిధ్యమున మనకెటి భయములేదు. (కలుగదు). ఒకవేళ కిరాతుఁడు వచ్చినచో మనలను చంప తలచినచో ముని, యతనిని చూచినంత మాత్రమున నతఁడు భస్మీభూతుఁడు కాగలఁడు. రామదర్శనమున సంతుష్టయైన ఆడలేడి యిట్లు పలుకగా, మృగము రామునిచూచి తానుగూడ హర్షము నొంది తన ప్రియతో ఓ ప్రియా ! పూజ్యురాలా నీవనినట్లే ! సుమహాత్ముఁడయిన రాముని ప్రభావ మెఱుంగుదును. రాముని ప్రక్కకనంబడుచున్న యీ శిష్యుడు, అకృత ప్రణుండు కూడ వ్యాఘ్ర భయాతురుఁడై పూర్వము రామునిచే రక్షింపఁబడెను. (29)

ఓ ప్రియా ! ఈ రాముఁడు జమదగ్నికి కనిష్ఠ కుమారుఁడు. తన తండ్రి కార్తవీర్యునిచే తిరస్కరింపఁబడఁజూచి, క్రుద్ధుఁడై సర్వ నృప ఘాతిని యగు ప్రతిజ్ఞ నాతఁడు చేసెను. ఆ ప్రతిజ్ఞను పూర్తి చేయనెంచి యతఁడు పూర్వము బ్రహ్మలోకమున కరిగెను. (31) ఆ బ్రహ్మ యీతనిని శివలోకమునకు కరుగుమని పంపెను. ఆతని ఆజ్ఞను శిరసావహించి యాతఁడు శివసన్నిధి కరిగెను. తన తండ్రి యొక్క యావదత్తాంతమును తన విషయము సర్వమును పునకు విన్నవించెను. దయాళుఁడయిన మహాదేవుడు భృగు నందనుని గౌరవించేను. కృష్ణ మంత్రమును, అభేద్యమయిన కవచమును, తన పాశుపతాస్త్రమును, ఇతరములయిన అస్త్ర సముదాయమును ఆతని కొసంగెను, సంతోషముతో ఆదరముగా శస్త్రముల నొసంగెను.ఆ రాముఁడు ఓ ప్రియురాలా ! మంత్ర సాధన తత్పరుఁడయి యిచ్చటకు వచ్చెను. ధీమంతుఁడయిన యాతం డు నిత్యమును కృష్ణ కవచమును జపించును, ఆ మహాత్మునికీమంత్ర జపముతో నూరు సంవత్సరము లేగెను. కాని ఆ మంత్ర మింకను పూర్తిగా సాధింపఁబడలేదు. దానికొక కారణమున్నది. భక్తి శ్రీవిధము. ఆ మూఁడు విధముల భక్తి 1. ఉత్తమ భక్తి, 2. మధ్యమభక్తి, 3. కనిష్ఠభక్తి. శివుని యొక్క నారదునియొక్క మహాత్ముఁడైన శుకుని యొక్క రాజర్షియైన అంబరీషుని యొక్క రంతి దేవుని యొక్క హనుమంతుని యొక్క బలియొక్క విభీషణుని యొక్క మహాత్ముఁడయిన ప్రహ్లాదుని యొక్క గోపికల యొక్క ఉద్దవుని యొక్క భక్తి ఉత్తమము. వసిషాది మునీశ్వరుల యొక్క మన్వాదుల యొక్క భక్తియు ఓ శుభేక్షణా! మధ్యమభక్తి. ఇంక ఇతర ప్రాకృత జనుల యొక్క భక్తి కనిష్ఠమయినది. రామునకీ మధ్యమా భక్తి గలదు. ఆతఁడు నిత్యము యమ నియమాది పరాయణుఁడయినను, గోపీనాథుని సేవించినను, ఇంకను సిద్ధిని పొందలేదు.

 వసిష్ఠుడిట్లనియెను.

ఈ విధముగా చెప్పఁబడినను మృగి సంతుష్టమనస్సుతో “ప్రేమదాయకమయిన భక్తి లక్షణములను చెప్పుమని మృగము నడిగెను.

మృగము ఇట్లు పలికెను.

ఓ ప్రియురాలా ! వినుము. జ్ఞానము పుణ్యముచే పుట్టును. భార్గవ దర్శనము వలన ఆ పుణ్యమిప్పుడు కలిగినది. భార్గవుఁడు పుణ్యాత్ముఁడు, కృష్ణభక్తుఁడు, జితేంద్రియుఁడు, నిత్యము గురుశిశ్రూషాపరాయణుఁడు నీత్యనైమిత్తకాదిక్రియాదరణము కలవాడు. అందుచే ఆ మహానుభావుని దర్శనముకారణముగా నిప్పుడా జ్ఞానము నాకు కలిగినది. త్రిలోకములందు నివసించు, జంతువుల యొక్క శుభాశుభ నిదర్శకము అయిన జ్ఞానము మహాత్ముఁడయిన ఈ రామునీ దర్శనము వలన నిప్పుడు విదితమైనది. (47) పుణ్యదము, పాపఘ్నమునునయిన చరిత్రమును వినువారలకు ఏదేది జరుగునో యది జ్ఞానగోచరమగును. ఉత్తమ భక్తియని యేది చెప్పఁబడినదో అయ్యదీ లేక, యంత్ర సహిత మయిన కవచము అనేకలక్షల యేండ్లకయినను సిద్ధింపదు.

ఈ భార్గవ రాముఁడు అగస్త్యర్షిఅనుగ్రహమును పొందఁగలిగినచో, ఉత్తమ భక్తిదమయినది, ఉత్తమ స్తోత్రమయినదియునగు శ్రీకృష్ణ ప్రేమా మృతమనునది తెలిసికొని, ఆతఁడు మంత్రము యొక్క కవచముయొక్క సిద్ధిని పొందును. ఆ అగస్త్యర్షి తెలియఁబడిన తత్త్వార్థము (యదార్థవృత్తము) కలవాఁడు దయాకరుఁడు, అభయప్రదుఁడు, రామునికి ముదావహమైన తత్త్వజ్ఞానము నుపదేశించును, కృష్ణ ప్రేమా మృతమను స్తోత్రము నందు శ్రీకృష్ణ చరిత్ర యంతయు నామములతో గ్రంథిలమయినది, తచ్చరిత్రమును మహామతి రాముఁడు అగస్త్యర్షి వలన తెలిసికొనును. తరువాత ప్రసిద్ధ కవచుఁడై రాజయిన హైహయాధిపతిని సపుత్రామాత్యముగను, సుహృద్బలవాహనయుతునిగను చంపును. ఓ ప్రియా ! ఈ భూమీని ఇరువదియొక్క మారు రాజరహితముగఁజేయును.

వసిష్ఠుఁడిట్లనెను.

మృగమీ విధముగా చెప్పి విరమించెను. ఆతఁడు తాను మృగమగుటకు కారణము నాతఁడెఱింగెను.

ఇది వాయుప్రోక్తమయిన మహాపురాణమయిన బ్రహ్మాండపురాణమున మధ్యభాగమున తృతీయ ఉపోద్ఘాతపాదమున భార్గవచరితమున ముప్పది నాలుగవ అధ్యాయము.