బ్రహ్మాండ మహా పురాణము
25 - నీలకంఠ నామోత్పత్తి కథనము
సూతుఁడిట్లు చెప్పెను :
జ్యోతిర్గణముల వృత్తాంతమును విని, లోకము యొక్క హితము నందాసక్తుఁడు, మహాబుద్ధిమంతుఁడు, అగు వాయువు సూర్యుఁడాకాశ మధ్యభాగమును చేరినప్పుడు (జపమును) చేయవలసిన మంత్రమును జపించేను. (1) అచ్చట సమాగతులైయున్నవారు, నియతాత్ములు, ఆత్మనిగ్రహులునయిన ఋషులు ప్రాంజలులై నిలువఁబడిరి. (2) సదాగతియైన పాయువు “ఓ నీలకంఠ, నియమాంతమునందు పూజింపం బడునట్టిపోఁడు, ప్రాణులకు జీవన ప్రభువు అయిన నీకు నమస్కారము” అనీ యనెను, ఆ పలుకులు విని, శంసీతప్రతులు, భావితాత్ములు సూర్య సహచారిణులు వాలఖిల్యులని విఖ్యాతులు, ఎనుబదీ యెనిమిదివేల సంఖ్యలైనవారు, ఊర్ధ్వ రేతస్కులు, వాయు పర్లాంబు భోజనులునయిన మునులు వాయువు నిట్లు పృచ్చించిరి. (4,5} శ్రేష్ఠుఁడవయిన వాయుదేవా! పుణ్యము నెఱిగిన వారలలో శ్రేష్ఠుఁడా! నీలకంఠుఁడ’ని యెయ్యది. నీచేతను చెప్పఁబడినదో, ఏది పరమ రహస్యమో, ఎయ్యది పవిత్రులకు కూడ పుణ్యప్రదమో దానిని గూర్చి మేము వినఁగోరుచున్నాము; ఓ సత్తమా! దానిని మాకు వివరింపుము. ఓ ప్రభంజన! తత్సర్వమును నీ యనుగ్రహమున వినుటకు కుతూహల పడుచుంటిమి. ఏ కారణముచేత అంబికాపతియైన ఈశ్వరుని కంఠమునకు నీలత్వము కలిగినది? నీ ముఖ పద్మము నుండి సవిశేషముగా ఓ దేవ! వినఁగోరు చున్నాము. ఓ వాయుదేవా! సర్వవాక్కులును సర్వము నీచే ప్రేరితములయినవి వాగ్విధి యంతయును వర్ణస్థానముపై నాధారపడియున్నది. (స్థానములు - ఉచ్ఛారణాస్థలములు).
జ్ఞాన పూర్వమయిన యుత్సాహము ఓ వాయూ ! నీయందే ప్రవర్తించును. నీవు పవిత్రీకరించిన తరువాత మిగిలిన వర్ణములు వ్యాపారము చేయనారంభించును. (10) నీనుండియే వాక్కులన్నియు నివర్తిల్లును; వర్ణములయునికి యంతయు నీవలననే, నీవులేక దేహవర్ణములు కూడ దుర్లభములు, ఓ అనిల! నీవు సర్వగుఁడవు. వర్ల సద్భావమంతయు నీవలననే. ఓ సమీరణ (ఓ వాయూ !) నీవలె సర్వగుఁడై సర్వతోగతుం డయినవాడు వేడొక్కడులేఁడు. ఓ అనిల! ఈ జీవలోకము అన్నివైపుల నుండి నీకు ప్రత్యక్షము (12) నీవు వాచస్పతియు భగవంతుఁడునగు ఈశ్వరుని నెఱుంగుదువు; ఈశ్వరుఁడే సర్వజన మనోనాయకుఁడు. అందుచే ఏమియాచరించుట మూలమున, కంఠ దేశమునందు రూప విక్రియ (రంగునకు మార్పు) కలిగినదో చెప్పుము. పవిత్రులు, భావితాత్ములునయిన ఋషుల యొక్క యీ పలుకులు విని, సర్వలోక నమస్క తుఁడు, మహాతేజస్వియునగు వాయువు ప్రత్యుత్తర మొసంగెను. (14) “పూర్వము కృతయుగమున ప్రజాపతి మానసపుత్రుఁడు, విప్రుఁడు, వేదార్థ నిర్ణయ తత్పరుఁడు ధర్మాత్ముఁడునగు వశిష్ఠుఁడు కలఁడు. ఆ వశిష్ఠుఁడు మయూర వాహనుఁడగు కార్తికేయుని నడిగెను. కార్తికే యుం డు మహిషాసురుని స్త్రీల కంటి కాటుకను దొంగిలించినవాఁడు. (అనఁగా వారలను విధవలనుగా జేసినవాఁడు అనఁగా మహిషాసురుని చంపినవాఁడు). మహాత్ముఁడు. మహాసేననాముఁడు; మేఘగర్జనములవలే ప్రతిధ్వనిల్లు గంభీర నిస్స్వనుఁడు. పార్వతీదేవి మనస్సున కానందము కూర్చువాఁడు; బాలకుని యొక్క (ఛద్మ) కపటరూపము ధరించినవాఁడు. క్రౌంచ జీవితమును హరించినవాఁడు. గౌరీహృదయనందనుఁడు. “ఓ వర్య! శ్రేష్ఠతముఁడా! శుభ్రమై, శుభాంజనతుల్యమై, మల్లెపూవువలె, చంద్రునివలె ప్రభావంతమై కంఠమునందు కాననగునదియేమి?” ఆ కంఠముననదీ యేల కల్గినది? దానిని భక్తునకు, ఇంద్రియ నిగ్రహునకు, దీప్తిమంతునకు నాకు చెప్పుము. శుభసంయుతము, పవిత్రము, పాపనాశనము, నయిన కథను ఓ మహాభాగ, నా ప్రియము కొఱకు సమగ్రముగ చెప్పుటకు నీవరుఁడవు.
మహాత్ముఁడైన వశిష్ఠుని వాక్యములు విని, దేవరీబలసూదనుఁడు మహాతేజస్వియునైన స్కందుఁడు ప్రత్యుత్తరమిచ్చెను. వక్తలలో శ్రేష్ఠుఁ డవైన ఓ వశీషా, నేను పూర్వము ఉమాదేవి యొక్క తొడపై కూర్చుండి వినిన దానిని, యథాశ్రుతము వినుము, ఇదీ మహాత్ముఁడయిన ఈశ్వరుని యొక్క పార్వతితోడి సంహాదము. ఓ మహాముని ! నీ సంతోషము కొఱకు నేను దానిని చెప్పుచున్నాను. నానావిధ ధాతువులచే చిత్రితము, తరుణ సూర్యకాంతీ సదృశము, కాచిన బంగారు కాంతీ గలిగినది, రమ్యమైనదియునగు కైలాస శిఖరమున మదనుని యంగనాశన మొనర్చిన శివుఁడు సుఖముగా నాసీనుఁడై యుండెను. అపుడు గిరిరాజ పుత్రియైన పార్వతి శివునితో ఇట్లు పలికెను.
కైలాస శిఖర వర్ణనము : రమ్యమైన కైలాస శిఖరము వివిధ ధాతువులచే చిత్రితమైనది. వజ్రమయము. స్పటికమయమునైన సోపానములు కలది. ఆ సోపానములు చిత్రపాదశిలాతలములు. దివ్యమైనది. బంగారు వికారమయినది. సౌనా ద్రుమలతాకీర్ణము. నానావిధ పుష్పములతో ఫలములతో గూడినది. అందు హంసలు, కారండవములు నిండియున్నవి. చక్రవాకములచే నలంకృతము; తుమ్మెదల గీత బాహుళ్యము కలదు. పడునట్టి నీటి ధారల వలన గలిగిన నాదములు కలది; మదించిన క్రౌంచముల యొక్క మయూరముల యొక్క నాదములచే ప్రతిధ్వనించు కందరములు గలది. ఆ కైలాస శిఖరము అప్సరస గణ సంకీర్ణము. కిన్నరులచేనుపశోభితము. జీవంజీవకములను పక్షులు వివిధములయిన ధ్వనులను చేయును. ఆ పక్షుల కూజితములచే వ్యాప్తమయినది. కోకిలస్వనములు బహు ప్రదేశముల మధురముగా వినవచ్చుచున్నవి. అందు సిద్దులు ఊరణలు తరచుగా సంచరించువారు. అందు కామధేనువులు కలవు. పోని ‘అంబా’ స్వరములు స్పుటముగా వ్యాపించియున్నవి. మేఘముల గర్జనలు ప్రతిశబ్దించును. అందు ఇతర ధ్వనులు కూడ కలవు. వినాయకుని భయము వలన కలత నోందీ ఏనుగులా కందరములను విడిచి పోయినవి. వీణ మొదలయిన సంగీత వాద్యముల మధుర ధ్వనులు కలవు. అవి శ్రోత్రేంద్రీయముల కత్యంత మనోహరములుగా నున్నవి.
జన సంఘములు ఊయెలలందు నూగుచున్నారు. ఆ ప్రదేశము బహు వనితా సంఘములచే సేవితము, ధ్వజములకు కట్టిన ఊయెలల యొక్క ఘంటానాదములు ప్రతి ధ్వనిల్లుచున్నవి. (31) అందు ‘వల్లకి’ వేణువులుమొదలగునీత సాధనాదికములు విశేషముగా కలవు. (వల్లకి వీణ); పిల్లనగ్రోవుల నాదము అందు ముప్పది నెమళ్లు క్రేంకారములు చేయుచున్నవేమో యన్నట్లున్నవి. గుహలు మౌఖిక గానముచే, మృదంగ ధ్వనులచే, వాదీత్రముల స్వనములచే నిండియున్నవి. (32) కందరములు క్రీడా వేగ వివాదము యొక్క నిర్దోషములచే పూర్ణమయి యున్నవి. హంసలు, పావురములు బక రాజములచ్చట నిర్భయముగా తిరుగాడుచున్నవి. (33) వివిధములయిన దేహ బంధములచే (వ్యాయామ భంగిమలచే) విఘ్నేశ్వరుండచ్చట విచిత్రముగా క్రీడించుచుండెను. భూతపతి వివిధ రూపములు గల భూతములచే పరివృతుఁడై యుండెను. భూతములు వివిధ విధములు. కొన్ని భూతములకు సింహ ముఖములు, కొన్నింటికి వ్యాఘముఖములు. కొన్ని భయంకర రావములను గల్గించుచున్నవి; కొన్నింటికీ ప్రచండ వేగము కలదు; కొన్నింటికి హరిణముఖములు, మేషముఖములు; ఇతరములు కొన్ని ఏనుగు ముఖములు కలిగినవి. కొన్ని అశ్వముఖములు కలిగియున్నవి. కొన్నింటికి క్రూరమయిన పిల్లిముఖములు, (నక్క ముఖములు). కొన్ని పొట్టి, కొన్ని పొడుగు, కొన్నింటి కడుపుల చాల కృశించి యున్నవి. కొన్నింటికి వ్రేలాడునట్టి కడుపులు, కొన్నింటికిహ్రస్వములు; కోన్ని భూతముల జంఘములు, హ్రస్వములు, కొన్నింటికీ వ్రేలాడు పెద్ద పెదవులు; కొన్నింటికి తాడిచెట్లవంటి జంఘములు; (36) కొన్ని భూతములకు గోకర్ణములు; కొన్నింటికి నొక్కటే చేవి, కొన్నింటికీ పెద్ద కర్ణములు, కొన్నింటికీ చెవులే లేవు. కొన్నింటికనేక పాదములు; కొన్నింటికి పెద్ద పెద్ద పాదములు; కొన్నింటి కోక్కటే పాదము, కొన్నింటికో అసలే పాదములు లేవు; కొన్నింటికి బహునేత్రములు; కొన్నింటికి బృహనేత్రములు, కొన్నింటికొక్కటే నేత్రము; కొన్ని భూతములకు నేత్రములే లేవు; కొన్నింటి కొక్కటే శిరస్సు; కొన్నింటికి మహాశీర్షములు; కొన్నింటికి బహు శీర్షములు కొన్నింటికి తలలే లేవు: కొన్ని భూతముల కొక్కటే జిహ్వ (నాలుక), కొన్నింటికి మహాజిహ్వలు; కొన్నీంటికి బహుజిహ్వలు. కొన్ని భూతములకు జిహ్వలే లేవు. కొన్నింటికి నొక్కటే దంష్ఠ, కొన్నింటికి మహాదంష్టలు; కొన్నింటికి బహుదంష్ట్రాలు, కొన్ని భూతములకు దంష్ట్రలే లేవు. (రమ్యకైలాస శిఖరమిట్లున్నది. అప్పుడు గిరిరాజపుత్రి ఈశ్వరునితో ఇట్లు పలికెను).
భగవాన్ ! భూత భవిష్యత్పభూ ! గోవృషాంకిత శాసన ! ఓ మహాదేవ ! నీ కంఠ సీమనేదియో మేఘసదృశమయి కనంబడుచున్నది. ఓ దేవ ! కాముని శరీరమును నాశనముచేసినట్టివాఁడా! నీ శుభ్రమయిన కంఠమున ప్రకాశించుచున్నట్టిదదీయేమీ? అయ్యది నీలాంబుదచయ తుల్యముగా నున్నది. శుభంకరము అంత యతిశయించిలేదు. (42) ఓ ఈశ్వరా ! ఏమీకారణము? నీ కంఠము నందలి నీలత్వమునకు. హేతువేమి? కుతూహలముగా నున్నది. ఈవిషయ మంతటినీ నాకు సక్రమముగా చెప్పగోరెదను. (వినవలయునని యున్నది) (43) పార్వతీప్రియుఁ డు పార్వతి యొక్క వాక్యములను వినెను, మంగళ సంయుక్త మయిన యా కథను శంకరుఁడు వివరించెను. (44) మహేశ్వరుఁడిట్లు వచించెను. పూర్వము క్షీరసముద్రము దేవాసురలచే అమృతము కొఱకు మధింపఁబడుచుండ మున్ముందుగా భయంకరాగ్ని ప్రభతో ఘోరమయిన విషము ఉత్పన్నమయి వచ్చినది. (45) సుందరమయిన ముఖము కలదానా ! సుర సంఘములు రాక్షస సంఘములు దానిని చూచెను. విషజ్ఞ వదనములయ్యెను. వారందరు బ్రహ్మయొక్క సన్నిధి కరిగిరి. (46) మహాద్యుతి మంతుఁడయిన బ్రహ్మా భీతులయిన సురసంఘములను చూచెను. ఓ మహాపుణ్యులారా ! మీరందరేల భయత్రస్తులు; క్షోభించిన మనస్సు కలవారైతిరి? మీ కోటకు నేను త్రివిధమైన టైశ్వర్యమును సంకల్పించియుంటినీ కదా ! ఓ సుర సత్తములారా ! ఎవ్వరిచే మీశ్వర్యముహ్యవర్తితము. తొలగింపఁబడినది. (48)
మీరో ! త్రిలోకముల కీశ్వరులు. మీరందరు బాధా రహితులరు. ఈ సర్వ ప్రజాసృష్టిలో నా యాజ్ఞనుల్లంఘించు సాహసుఁడు లేఁడు. (49) మీరందరు విమానములలో సంచరింతురు. మీరందరు యధేచ్చగా పోగల స్వచ్ఛందములు. ఆధ్యాత్మికము ఆధిభూతము, ఆధిదైవికముల యందు మీరెల్లప్పుడు సర్వసమర్థులు. ప్రజల సేల్లరను పొరీవారి పూర్వజన్మకర్మవిరోజానుసారముగా ప్రవర్తింపజేయుటలో సమర్థులు. అట్టమీరు, మీరేల సింహముచే బాధింపఁబడిన హరిణములవలే భయోద్విగ్నులైయున్నారు? మీ దుఃఖమేది? మీకు కలిగిన ఆపద యేది? ఎవరివలన యీ భయము కలిగినది? మీరందరు తదత్తాంతము నంతటిని వెంటనే సక్రమముగా చెప్పనరులు (చెప్పుడు). (52) పరమాత్మయేన బ్రహ్మయొక్క వాక్యములు విని, సురలు, దైత్యేంద్రుఁడు, దానవులు ఋషులు ఇట్లు చెప్పిరి. (53) ఓ పితామహ ! క్షీర సముద్రము సురాసురలచే చిలుకం బడుచున్నది. (అంత) భయంకరమైన విషము ప్రాదుర్భవించినది. ఆ విషము పాములవలెనున్నది. తుమ్మెద వలె నున్నది. నల్లని జీమూతమును పోలియున్నది. (54) ఘోరముగా నున్నది. ప్రళయకాలాగ్ని సమప్రభమై వెలుగుచున్నది. అదీ కాలమృత్యువువలె నుద్భూతమయినది, దాని కాంతీయో యుగాంతమందలి సూర్యవర్చస్సువలె నున్నది. (55) మూఁడు లోకములను నాశనముచేయు సూర్యునివలె సర్వత్ర ప్రజ్వరిల్లుచున్నది. సముత్తితమగుచున్నట్టిదై .ప్రళయకాలాగ్ని సమకాంతీ కలిగిన ఆ విషముచే, రక్తము ధవళమునయిన శరీరము గల జనార్దనుఁడు కృష్ణ (నల్లని వర్ణుఁడయ్యెను రక్త గౌరాంగమయిన శరీరము నల్లగానయిన జనార్ధనుని చూచి, మేమందరము భీతావహుమతిమి. నిన్నే శరణుపొందితిమి. (58) భయావహమయిన దేవతల యొక్క రాక్షసుల యొక్క వాక్యములను విని మహాద్యుతిమంతుఁడు లోకపితామహుడు, నగు బ్రహ్మ ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను. ఓ దేవతలారా ! తపోధనులయిన ఋషీశ్వరులారా మీరందరు వినుడు. (59)
మీరు సముద్రమును మథించుచుండగా సముత్పన్నమైనట్టిది కాలానలమను విషము అదీ కాలకూటము. (60) అది పుట్టినంతనే దేవతలు తేజోహీనులయిరి. నేనుగాని, విష్ణువుకాని, దేవతా పుంగవులందరుకాని, ఆ విషము యొక్క తీవ్రత్వమును (వేగమును) భరించుటకు శక్తిమంతులము కాము. ఒక్క శివుఁడు తక్క అని పలికి పద్మగర్భము వంటి కాంతి కలిగిన పద్మయోనియు, అయోనిజుఁడు వేదవేత్తలలో శ్రేషుఁ డునయిన బ్రహ్మ ‘ఓం’కారమును స్మరించెను; అంతటను వ్యాపించియున్న దివ్యజ్యోతిని ధ్యానించి తరువాత స్తోత్రము చేయుటకారంభించేను. (63) ఓ విరూపాక్ష ! నీకు నమస్కారము. (బేసి సంఖ్య కన్నులు కలవాఁడు) దివ్య. చక్షుష్మంతుఁడవయిన నీకు నమస్కారము. మీనాకహస్తుం డవయిన నీకు నమస్కారము. వజ్రహస్త ! నీకు నమస్కారము. త్రిలోకనాథునకు, భూతపతీకి, దేవతలకు శత్రువులయిన వారిని చంపినట్టివానికి, చంద్ర సూర్యాగ్నులకు నేత్రములుగా గలిగిన వానికి నీకు నమస్కారము. బ్రహ్మవు, రుద్రుఁడవు, విష్ణుఁడవు నయిన నీకు నమస్కారము. సాంఖ్యునకు, యోగియైన వానికి, భూత సమూహుఁడవయిన నీకు నమస్కారము. మన్మథుని యంగములను వినాశనము చేసిన వానికి, కాల పృషునకు (కాలము వెనుక భాగమున గలవానికి) నమస్కారము. సురేతసునకు (యోగ్యమయిన వీర్యము కలవానికి) రుద్రునకు, దేవదేవునకు, ఉగ్రుఁడయిన వానికి, కపర్దికి (జటాజూటము కలవానీకి) భయంకరుఁడు (కరాళుఁడు) అయిన శివునికి, శంకరునకు, హరునకు, కపాలికి (పుల్లెలు ధరించువానికి) విరూపునకు, వరదునకు, శివునకు నీకు నమస్కారము. త్రిపురముల నాశనము చేసినవానికి, (దక్ష యజ్ఞఘ్నునకు, మాతృణాం పతయే (దేవమాతృకల యధిపతికి) వృద్ధుఁడైనవానికి (సనాతనునకు) శుద్దునకు, ముక్తునకు, బలునకు, మూఁడు లోకములకు ఏకైక వీరుఁడయినవానీకి, చంద్రునకు, వరుణునకు, అగ్రవ్యక్తియైన వానికి ఉగ్రుఁడైనవానికి విప్రునకు అనేక చక్షువులు కలవానికీ, (70) రజోగుణునకు, సత్వగుణునకు, అవ్యక్తజన్ముడయిన నీకు నమస్కారము. నిత్యుఁడైన వానికి, అనీత్యుఁడైన వానికి, నిత్యానీత్యుండైన వానికి, నమస్కారము. (71)
వ్యక్తుడు, అవ్యక్తుఁడు, వ్యక్తావ్యక్తుఁడయిన శివునకు నమస్కారము. చింత్యుఁడు, అచింత్యుఁడు, చింత్యాచింత్యుఁడైన శివునకు నమస్కారము. జగత్తు యొక్క ఆర్తిని నాశనము చేయునట్టి వానికి, నారాయణ ప్రియునకు, ఉమాప్రియునకు, శర్వునకు, నందియొక్క వక్రముచే చిహ్నితుం డయిన శివునకు నీకు నమస్కారము. పక్షము, మాసము, అర్దమాసము, ఋతువు, సంవత్సరము తానేయయిన శివునకు నమస్కారము. బహురూపుడయిన వానికి, ముంగీత శిరస్కునకు, దండము కలవానికి, వరూధిని (సైన్యము) కలవానికి శివునకు నమస్కారము. కపాలము హస్తమునఁగలవానికి, దిగ్వసనునకు (దిగంబరునకు) శిఖండీకి, ధన్వీకి, రథికి, యమకి (నిగ్రహమున కలవానికి) బ్రహ్మచారికి. నీకు నమస్కారము. (75) ఋగ్యజుస్సామ వేదములయిన వానికి, పురుషునకు, ఈశ్వరునకు, నమస్కారము, ఇట్టి యనేకములయిన చరిత్రములచే, స్తోత్రములచే స్తోత్రము చేయబడు శివునికి నమస్కారము; ఓ పార్వతీ (వరాననా)! ఇట్లు స్తోత్రము చేసి, బ్రహ్మ సాష్టాంగనమస్కృతి చేసెను, (76) ఓ రుద్రా ! నాయొక్క దేవతల యొక్క భక్తి నెలుంగుము, సాక్షాత్కరింప కుంటివీ (అవ్యక్తుఁడవుగానే యుంటివి). నీవు గంగాజలములచే చెదరం గొట్టబడిన కేశములు కలవాఁడవు. నీవు చింతింపఁబడుటకు యోగాతిశయముచే గూడ సూక్ష్ముఁడవు. (77) ఈ విధముగా పూర్వము నేను లోకకర్తయైన బ్రహ్మచే వేదవేదాంగ సంభవములయిన వివిధ స్తోత్రములచే స్తోత్రము చేయంబడితిని.(78) అంత బ్రహ్మతో ముఖ్యమయిన హక్కులతో నేను పల్కితిని. ఓ జగత్పతీ ! గతమునకు, భవిష్యత్తునకు, వర్తమానమునకు నీవధిపతివి. నాతో నీకేమి కార్యము వచ్చినది? ఓ సువ్రతా ! కర్తవ్యమేమో చెప్పుము. ఆ వాక్యము విని అంబుజేక్షణుఁడయిన ద్రహ్మ యిట్లు పలికెను. (80)
భూతభవిష్యవర్తమానములకు ప్రభూ! సర్వమునకు కారణమైనవాఁడా ! ఓ ఈశ్వరా ! పంకజేక్షణ ! వినుము. దేవదానవులచే సముద్రము మథింపఁబడుచుండ, ఓ భగవాన్! ఘోరమైన విషము ప్రాదుర్భూతమైనది. అది మేఘసదృశము; నీలమైన మేఘమువలె నున్నది; ప్రళయకాలాగ్ని ప్రభ కలిగియున్నది. (82) దానిని చూచి మేమందరము భయపడితిమి; ఉద్విగ్న చేతస్కులమయతిమి. ఓ మహాదేవ ! సర్వలోకములకు హిత మాచరించు కోరికతో దానిని కబళింపుము . (తాగుము) నీవు శక్తుండవు. భోక్తవు; ఓ ప్రభూ ! నీవు దేవతలలో శ్రేష్ఠుఁడవు. నీవు తక్క వేటిక్క డు ఓ మహాదేవ ! ఆ విషము యొక్క వేగమును సహింపఁ గలవాఁడే లేడు.. ఇట్లనిన పమేష్టియయిన బ్రహ్మయొక్క పొక్యములు వింటీని, ఓ వరానన ! 'సరే!' యని యంగీకరించితిని. అంత మృత్యుతుల్యమయిన యా విషమును త్రాగుట కారంభించితిని. సుర భయ ప్రదమైనది, మహా ఘోరమయినదియునగు నా విషమును త్రాగినట్టి నా కంఠము వెంటనే, ఓ పరపర్ణిని ! కృష్ణ (నల్ల) వర్ణము నొందినది. (86) నల్ల కలువల. రేకుల వంటిదయి, కంఠమును కపుంగలించుకొన్న సర్పము వలె నున్నట్టిది. సర్పముల రాజగు తక్షకుడు బయలు దేరి, తన నాలుకచే నాకుచున్నట్లున్నది అట్టి విషమును చూచి మహాతేజుఁడు లోకపితామహుడును నగు బ్రహ్మ ఓ మహాదేవ ! ఓ సువ్రత! కంఠముందలి (విషజనితమయిన కంఠనీలత్వముచే) యీ నల్లని రంగుచే నీవు ప్రకాశించుచున్నావు ! అని పలికెను. ఓ పర్వతరాజపుత్రి ! బ్రహ్మ వచస్సులను వినీ, ఘోరమైన విషమును కంఠమున దాల్చీతిని. అందుచే నేను నీలకంఠుఁడనైతిని. సుర సంఘములను, దైత్యులను యక్ష గంధర్వ భూతములను పిశాచోరగ రాక్షసులను చూచి ఓ పర్వతరాజ పుత్రి! ఉగ్ర వేగము గల యాకాలకూట విషమును కంఠమునందు దాల్చితిని, అట్లు కంఠమునందు నీక్షిప్తము చేసి యుంచుకొన్న విషమును చూచి, సురదైత్య సంఘములత్యంత విస్మయము నొందిరి (91).
ఓ మత్తమాతంగ గామీని ! తరువాత దైత్యోరగ రాక్షసులతో సహా సర్వసురగణములు అంజలుల ఘటించి ఇట్లు పలికిరి. (92) ఓఈశ! సీబలమెంత ఆశ్చర్యకరమైనది ! నీ వీర్య పరాక్రమము లెంత యద్భుతములు ! నీ శరీర బలమెంత విస్మయావహమైనది, ఓ దేవదేవ! ఓ మన్మథ దేహనాశన ! నీ ప్రభుత్వమేంతటి అద్భుతమైనది ! నీవే విష్ణుఁడవు; నాల్గు మొగములు గల బ్రహ్మవు నీవే ! నీవే మృత్యుదేవతవు; నీవే వరదుఁ డవు. నీవే సూర్యుఁడవు ! నీవే చంద్రుఁడవు; ఈ చరాచర ప్రపంచము యొక్క స్వరూపమే (వ్యక్తిత్వమే) నీవు. నీవే వహ్నివి; పవనుఁడవు నీవే. నీవే పృథివివి నీవే జలము (95) స్థావర జంగమ వస్తువులతో కూడిన యీ ప్రపంచమునకు నీవే సృష్టికర్తవు. పాలించువాఁడవును నీవే; మరి ప్రపంచ ప్రళయము నీవే. దేవతలు ఈ విధముగా పలికి, సుధను (సోమమును) గ్రహించి, శిరస్సులను వంచి నమస్కరించిరి. విమానముల నధివసించిరి; వాయు జవముతో మహాపర్వతమయిన మేరువును వారందరు చేరిరి. ఈ విధముగా మీక్కిలి గుహ్యమైనది, పవిత్రమయినది, మహా పుణ్యతమమైనదియునగు దానిని నీలకంఠుఁడు వచించెను. ఇయ్యదీ మూఁడు లోకముల యందు విశ్రుతమైనది, సర్వపాప ప్రణాశన మయినదీకథ స్వయముగా బ్రహ్మచే చెప్పబడినది... (97) బ్రహ్మచే నుద్గీతము, పరమశుభము నయిన దీని నెవఁడు ప్రతినిత్యము మననము చేయునో ఆతనికీ కలుగు విపులమయిన మహత్పలమును చెప్పుచున్నాను. (98) ఓ వరాననో ! సుందరమైన శ్రేణులు (పిరుందులు) కలదానా! విషముతో నేదియైనను సంబంధము (సంస్పర్శ) కలిగిన స్థావర జంగమములకు చెందిన వెంటనే నశించును. (100)
ఇయ్యది ఘోరమైన యశుభమును శమింపఁజేయును దుఃస్వప్నమును (తత్పలితమును తొలగించును. స్త్రీల యందు వల్లభత్వమును పొండును; రాజసభయందు వల్లభత్వమును పొందును. (101) వివాదము నందంతఁడు వీజయమును పొందును. యుద్ధమునందట్లే విజయమొందును. ప్రయాణములందతఁడు శుభములందును; రాజసభయందు గౌరవము నొందును. గృహములందు నిత్య సంపద నొందును. (102) ఓ సుందరీ! అట్టి వానికి గలుగు శరీర లాభములఁ జెప్పెదను. అతఁడు హరీశ్మశ్రుఁడగును. నీలకంఠుఁ డగును; ఆతని శిరోజములందముగా చంద్రునిచే నలంకరింపఁబడియుండును. మూఁడు కన్నులవాడగును; త్రిశూలపాణియగును; వృషభ యాన్యుడగును; పినాకమును ధరించును, శ్రీమంతు డు నందితుల భాగ్యవంతుఁడగును; నందితుల్య పరాక్రమవంతుఁడగును. నా యాజ్ఞ నంది సపాద్యఖిల లోకములనతఁడు సంచరించును, వాయువునకు ఆకాశమునందువలె ఆతనిగతీకి విఘాతముండదు. (105) నాతో సమానమైన బలవంతుఁడగుచు, ఎట్టి ఉపద్రవముల నొందక యుండును. ఓ సౌందర్యవతీ ! నా భక్తులయిన మానవులెవ్వరీకథను విందురో, వారి స్థితీ ఇహలోకమునందు పరలోకమునందెట్లుండునో చెప్పెదను. బ్రాహ్మణుఁడు వేద విద్యావంతుఁడగును. క్షత్రియుఁడు భూమిని పొందును. (107) వైశ్యుఁడు లాభము పొందును. - శూద్రుఁడు సుఖమును పొందును. రోగి వ్యాధివలన వీడువంబడును, బంధనము నుండి బంధితుఁడు విడివడును (విముక్తుఁడగును). (108) గర్భిణీ స్త్రీ పుత్రుని గనును, అవివాహితయైన కన్య యోగ్యుఁడైన పతిని పొందును. ఇహము నందు పరమందు (ఇప్పుడు ఇక ముందు) నష్టద్రవ్యులు ధనమును పొందుదురు. (109) వందవేల యుత్తమ గోవులను దానము చేసిన నెట్టి ఫలితమో అట్టి ఫలమును ఈ కథను వినిన మానవుడు పొందును. ఒక శ్లోకపాదమును గాని, అర్ధశ్లోకమును గానీ, శ్లోకార్థమును గాని యెవ్వఁడు ధారణ చేయునో యతఁడు రుద్రలోకము నందును.
అధవా, ఏ మానవుఁడు మద్దతాంతరాత్మతో శ్రద్ధతో దేవబ్రాహ్మణసన్నిధిలో ఈ గ్రంథమును సర్వమును భక్తితో చదువునో ఆ మర్త్యుఁడు రుద్రలోకమును పొందును. ఓ దేవి ! ఎవ్వఁడు భక్తితో దీనిని చదువునో, చదీవించునో ఆ మర్త్యుఁడు రుద్రలోకమునకు పోవును. ఇంతకంటే నుత్తమమైన స్తోత్రము పూర్వము లేదు; ఇక ముందు కలుగదు. ఎచ్చట ఏ గృహమున నీ స్తవరాజముండునో, యక్షులుగాని, పిశాచములుగానీ, భూతములుగాని, విఘ్నకారకులుకాని విఘ్నము నాపాదింపలేరు. ఓ పద్మముల వంటి నేత్రములు కలదానా ! సంతుష్టుఁడనై అఘముల సముదాయమును నాశనము చేయునట్టిది, పుణ్యఫలములతో గూడియున్నది, చతురాననుఁడయిన బ్రహ్మచే స్వయముగా చెప్పబడినదియునగు నీ స్తవము యొక్క మాహాత్మ్యమును నీకు నివేదించితీనీ. పుణ్యఫలాదులతో కూడిన యీ కథను తనదేవికి చెప్పి ఉమాసహితుం డై వృషభవాహన మధిరోహించి, కుమారస్వామీయందు ప్రియుఁడు, చంద్రచూడుడు నగు శివుడు కైలాసగుహకు బయలుదేరి వెళ్లాను. పాపహరమయిన కథను ప్రజాపతివలన వింటిని. అయ్యది నీకు నాచే చెప్పఁబడినది. సలక్షణముగా నీకథ నంతటినీ అధ్యయనము చేసి ద్విజోత్తముఁడు బ్రహ్మ ఆదిత్యపదమునకుం బోవును.
ఇదీ వాయుప్రోక్తమయిన బ్రహ్మాండ పురాణమందలి పూర్వభాగములోని ద్వితీయానుషంగపాదమున నీలకంఠ నామోత్పత్తి కథనమను ఇరువదియైదవ అధ్యాయము.
Summary of chapter 25 of the Brahmānda Mahā Purana is as follows:
Through a deeply moving narrative, this chapter recounts the supreme sacrifice of lord Śiva during the churning of the cosmic ocean, where he compassionately drank the deadly poison to save the universe. It lovingly explains how this merciful act left a blue mark on his holy throat, earning him the revered name Nīlakaṇṭha. The devoted heart overflows with tears of love and gratitude, worshipping the great lord whose infinite compassion and selflessness preserve the cosmic order.