8 - ఋషివంశము - అత్రి -వశిష్ఠుఁడు

సూతుఁడు చెప్పెను :

మహాత్ముఁడైన కశ్యపమహర్షి చరాచరమగు సమస్త సృష్టిని కల్గించి ప్రతిష్టించిన తరువాత, వారలలో ముఖ్యులను ఆధిపత్యముల యందభిషేకించి తరువాత వారీవారి రాజ్యములను క్రమముగా నాదేశింప మొదలిడెను. బ్రాహ్మణులకు, లతలకు గ్రహములతో సహా నక్షత్రములకు, యజ్ఞములకు తపస్సులకు, సోముని రాజుగా కశ్యపుండభిషేకించెను. సర్వాంగిరసుల యొక్క ఆధిపత్యము బృహస్పతి కొసంగెను. ఆతఁడు భృగువులకు అధిపతిగా రాజ్యము నందు శుక్రునభిషేకించెను. (4) ఆదిత్యులకు విష్ణువును, వసువులకు పావకుని, ప్రజాపతులకు, దక్షుని, వాసవుని మరుత్తులకు ఆతఁడధిపతులనుగాఁ జేసెను. (5) దీతీ యొక్క ఆనంద వర్ధనుఁడయిన (దితినందనుని) ప్రహ్లాదుని దైత్యులకును,నారాయణునీ సాధ్యులకును, వృషధ్వజుని రుద్రులకును రాజుగా జేసెను. అతఁడు విప్రచిత్తినీ దానవులకు రాజు కమ్మని ఆదేశించెను. నీటిని పాలించుటకు వరుణుని, వైశ్రవణుని రాజులకు రాజుగా ఆతఁడు చేసెను. రాక్షసులకు, యక్షులకు ధనమునకు వైశ్రవణునే రాజు చేసెను. వివస్వంతుని కుమారుఁడయిన యముని పితరుల రాజ్యము నందభిషకేకించెను, (8) సర్వభూతములకు, పిశాచములకు శూలపాణియైన గిరీశుని, శైలములకు హిమవంతుని, నదులకెల్లను సాగరుని, గంధర్వులకు చిత్రరథుని అశ్వములకెల్లను ఉచ్చైశ్రవమును రాజుగా నభిషేకించెను. మృగములకు శార్దూలమును, మూపురములు కల జంతువుల కెల్లను అబోతును (గోవృషభమును) ఆకాశమున నేగురు వానియందు శ్రేష్ఠమయిన గరుడుని సర్వపక్షులకును అధిపతిగా జేసెను. కశ్యపుడు, మనోజ్ఞములయిన గంధములకు మరుత్తులకు, అశరీరులయిన భూతములకు సమకాలబలులకు బలవంతుఁడయిన వాయువు నధిపతిని చేసెను. (12) దంష్టలు (కోరలుగల) గల సర్వజంతువులకు శేషుని, వాసుకినీ, పన్నగులకు నేలమీద ప్రాకునట్టి అఖిల సరీసృపములకు సర్పములకు పన్నగములకు, తక్షకుని రాజుగా చేసెను. ఆదిత్యులలో నొకఁడయిన పర్జన్యునీ, సాగరములకు, నదులకు, మేఘములకు సామాన్య వర్షములకు రాజుగా కశ్యపుఁడభీషేకించెను. సమస్తాపురోగణములకు కామదేవుని ప్రభువుగా నొనర్చెను. ఋతువులకు, మాసములకు, ఆర్తవములకు (ఋతుసంబంధములకు) పక్షములకు, విపక్షములకు, ముహూర్తములకు, పర్వములకు, కాలములకు, కాష్ఠ ప్రమాణాదులకు, అయనములకు గ్రహగణితములకు, యోగములకు అధిపతిగా సంవత్సరమును కశ్యపుఁడు చేసెను. కాల, కాష్ట్రములు, కాల ప్రమాణములు, నక్షత్రమునకు సంబంధించినది యోగము.

 ప్రజాపతియయిన విరజసుని కుమారుఁడు, సర్వవిశ్రుతుఁడు, నయిన సుధనుని పూర్వ దిగ్భాగమునకు రాజుగా చేసెను. కర్దమ ప్రజాపతి కుమారుఁడయిన శంఖపాదునీ దక్షిణ దిగ్భాగమున కధిపతిగా ప్రతిష్టించెను. (18) అట్లే మహాత్ముఁడు, అచ్యుతుఁడు, రజసుని కుమారుఁడును నయిన కేతుమంతుని పశ్చిమ దిగ్భగమునకు అధిపతిగా (నతఁడు) అభిషేకించెను. పర్జన్య ప్రజాపతి యొక్క కుమారుఁడు దుర్గరుండు నైన హిరణ్యరోముని ఉత్తర దిగ్భాగమున నభిషేకించేను. వివస్వతుని కుమారుఁడయిన మనువును మానవుల కందరికి నధిపతిగా కశ్యపుఁడభిషేకించేను. (21) సప్త ద్వీపములతో, సర్వ పత్తనములతో గూడిన యీ పృథివి సర్వస్వము, వారందరిచే, తమ తమ ప్రదేశములయందు పరిమితమై ఇప్పటికిని ధర్మముగా పరిపాలింపఁబడుచున్నది. (22) వారంతకు పూర్వము స్వాయంభువ మన్వంతరమున బ్రహ్మచే ప్రతిష్టింపం బడిరి. మనువులైనవారే రాజులుగా అభిషేకింపబడిరి. మన్వంతరము లేగినవి. ఆ రాజులు పరిపాలించినారు. గతించినారు. ఇల్లే ఇంకొక మన్వంతరమురాగా ఇతరులు పట్టాభిషిక్తులగుదురు. మన్వంతరములు గడచినవి కానీండు, జరుగనున్నవికానిండు, ఆ మన్వంతరప్రభువులు ప్రభువులుగా నిర్ధారింపఁబడిరి. వారిలో శ్రేష్ఠుఁడయిన పృథువు, రాజసూయాధ్వరము నందు వేదదృష్ట విధి ననుసరించి అభిషిక్తుఁడయ్యెను. ఆ పృథువు రాజాధిరాజు. ప్రతాపవంతుఁడు. (26) ప్రజా సంతతి కోణంకు పుత్రుల నుత్పాదించి, మహాపవిత్రుఁడు, ప్రజాధిపతీ, ఈశ్వరుఁడునయిన కశ్యపుఁడు స్వగోత్రాభివృద్ధిని వాంఛించి గొప్ప తపమాచరించెను. (27) గోత్రవృద్ధికరులగు పుత్రులు నాకు కలుగుదురుగాక అనీ యాలోచించి, ధ్యానమాచరించు మహాత్ముడయిన కశ్యపమహర్షికి బ్రాహ్మణాంశకలితులు ఇద్దరు కుమారులు ప్రాదుర్భవించిరి. వారు మహాశక్తిమంతులు. వారిద్దరు వత్సారుఁడు, అసితుఁడు. వారిద్దరు బ్రహ్మవాదులు. (29) వత్సారునకు నీధ్రువుడు జన్మించెను. సుమహాయశస్వియయిన రేభ్యుం డును నతనికి కలిగేను. నిధ్రువుని కుమారుఁడయిన రేభ్యుని రైభ్యునిగా నెఱుంగుము. చ్యవనునికి సుకన్యయందు సుమేధ కలిగెను. ఆమెయే నిధ్రువుని పత్నీ. కుండపాయులకు తల్లీ. (కుండపాయులు ఒక విధమయిన యతులు). దేవలుఁడు మహా యశస్వి, ఆతఁడు ఏకపర్ణయందు అసీత కుమారుఁడుగా జన్మించెను. ఆతఁడు శాండిల్యులలో శ్రేష్ఠుఁడు. అతఁడు బ్రహ్మిష్టుడు. (32)

నీధ్రువులు, శాండిలులు, రైభ్యులు - వీరు కశ్యపుని మూడు శాఖలు. (కశ్యపుని వలనఁ గలిగిన మూఁడు శాఖలు). వజ్రమును విదల్చు ఇంద్రుఁడు మొదలయిన దేవతలు కాశ్యపుని సంతానములోని వారే. (33) మనువు యొక్క చతుర్యుగముల యొక్క 11 ఆవృత్తులు జరిగిన తరువాత ద్వాపరయుగము జరుగుచుండగా, మన్వంతరముల యధిపతి గతించెను. నరిష్యంతుఁడు మరుత్తుని కుమారుఁడు. ఆతని కుమారుం డు దముఁడు. అతని కుమారుఁడు రాజ్య వర్థనకుఁడు. ఆ రాజ్య వర్ధనకుని కుమారులు సుధృతి, నరుడు, కేవలుఁడును ! కేవలుని కుమారులు బంధుమంతుఁడు, వేగవంతుఁడు, బుధుఁడు వేగవంతుని కొడుకు (?) ఆతని కుమారుఁడు (బుధస్య) తృణబిందువను రాజు, (56) ఆతఁడు తృతీయ త్రేతాయుగము యొక్క ఆరంభమున రాజయ్యను, ఆలంబుషా గర్బ జాతయయిన “ఇలవిల” ఆతని కూతురు. పులస్త్య వంశవర్థనుడయిన విశ్రవుఁడు (విశ్రవాః) ఆమెకు 'ఇలవిల'కు జన్మించెను. బృహత్కీర్తిమంతుఁడయిన బృహస్పతి దేవాచార్యునిగా కీర్తింపఁబడెను. విశ్రవుఁడు - బృహస్పతి కూతురయిన దేవవర్ణినీ, మాల్యవంతుని కైకసి కూతులయిన పుష్పోత్కటను, వాకను, పెండ్లాడెను (కైకసి మాలినీ కూతురు) వీరి వలనఁగ లిగిన సంతానమును వినుఁడు. (39) దేవవర్ణినీ జ్యేష్ఠకుమారుఁడయిన వైశ్రవణుని కనెను. (40) వైశ్రవణుఁడు దివ్యమైన విధి యుక్తుఁడు, ఆర్ష సంబంధ శ్రుతిమంతుఁడు. రూపముచేత రాక్షసుఁడు, బలముచే ఆసురుఁడు; ఆతనికి మూఁడు పాదములు; సుమహాకాయము; స్థూలమైన శీరము; పెద్ద గెడ్డము; వంకర తిరిగిన ఎనిమిది దంతములు, పచ్చని మీసములు, (శంఖముల వంటి) (నిక్కపొడుచుకొని యున్న శంకువుల వంటి కర్ణములు; వర్ణమున లోహిత వర్ణుఁడు : ఆతని ముంజేతులు, చేతులు పొట్టివి; పింగళ వర్ణుఁడు; మిక్కిలి భయంకరుఁడు; వైవర్త జ్ఞానసంపన్నుఁడు. ప్రపంచ మిథ్యా స్వరూప జ్ఞానము), పుట్టుక నుండి ఆతఁడు విజ్ఞాన వంతుఁడు. (43) ఆతని చూచి, యతని తండ్రి “ఇతఁడు కుభేరుండు” అనెను. (కుబేరుడన కుత్సితమయిన శరీరము కలవాఁడు). 'కు' అను అక్షరము అసహ్యకరమయిన దానిని ప్రకటించుట కుపయోగింపఁబడును. శరీరమునకు 'భేరి మనునది పర్యాయపదము. కుబేరుఁడు - కుత్సీత శరీరము వలన అందుచే ఈ నామముచే నతఁడు చిహ్నతుఁడు. ఈతఁడు విశ్రవసుని అపత్యమగుటచే, విశ్రవస సాదృశ్యముచే ఆతఁడు వైశ్రవణుఁడను నామమును వహించును. ఋద్ధి వలన కుబేరుడు ప్రసిద్ధుఁడయిన 'నలకూబరునీ” కనేను. (46) కైకసి రావణుని, కుంభకర్ణుని, కుమార్తెను శూర్పుణఖను కనెను. ఆమె సంతానములలో విభీషణుఁడు నాలుగవవాడు. రావణుఁడు,శంకుకర్ణుఁడు, దశగ్రీవుఁడు; పింగళవర్ణుఁడు, ఎఱ్ఱనీ తలవెంట్రుకలు కలవాఁడు. నాలుగు పాదములు, ఇరువది భుజములు, మహాకాయము, మహాబలుఁడు, మంచి కాటుకఁబోలినవాఁడు; దంష్టలు కలవాఁడు, ఆతని కంఠము లోహిత వర్ణము, రాక్షస సంబంధమయిన ఆకారము, బలము, రూపము, శక్తి కలవాఁడు. తన భౌతిక బలముచే యక్ష రాక్షసులను జయించినవాఁడు. సహజముగా దారుణుఁడు, రావణుఁడు; క్రూరుఁడు, శత్రువులను పలాయనము చేయించగలవాఁడు.

 పూర్వజన్మయందు రావణుఁడు హిరణ్యకశిపుఁడు. ఆ రావణుఁడు (రాక్షసుఁడు) 13 చతుర్యుగముల కాలము రాజుగా పాలీంచెను. ఆతని రాజ్యకాలము మానవ సంవత్సరములలో గుణించినచో అయ్యది ఏబది ఆరు మిలియనుల ఒక వంద అరువది వేలయేండ్లగును. ఆతఁడు బ్రాహ్మణులకు దేవతలకు భయంకర నిద్రా రహిత రాత్రులను కల్పించెను. ఇరువది నాలుగవ త్రేతాయుగమున రావణుని యొక్క తపస్సు క్షీణించుట వలన దాశరధియైన రామునితో పోరి సగణముగా క్షీణించెను. నాశనము పొందెను. మహోదరుఁడు, ప్రహస్తురడు, మహాపార్వుం డు, ఖరుఁడు - వీరు పుష్పోత్కట యొక్క కుమారులు. ఆమెకు కుంభీనస యనెడు కూతురు కూడ కలదు. త్రిశీర దూషణుఁడు, రాక్షసుఁడయిన విద్యుత్ జిహ్వుఁడు 'వాక యొక్క బిడ్డలుగా జ్ఞప్తి యందుంచుకొనవలెను. ఆమె కొక కూతురు కూడ కలదు. ఆమె పేరు అనుపాతీక. ఈ పదిమంది రాక్షసులు పౌలస్త్యుని వంశీయులు. వారందరు క్రూరకర్ములు. పుట్టిన దాది దారుణ క్రీయాచణులు. వారందరు దేవతలకు అజయ్యులు. - వారందరు శూరులు వరములు పొందనివారు: పుత్రులతో పౌత్రులతో కూడి యున్నవారు. పులస్త్యుని యొక్క వంశీయుఁడయిన ‘ఐడవీడు' డనువాడు సర్వ పింగళుఁడు. (ఎడమ పార్వమున పింగళ వర్ణము కలవాఁడు). యక్షుల కెల్లరకు, పులస్త్యుని వంశీయులయిన రాక్షసులెల్లరకు రాజు అయ్యెను. అగస్త్యుని యొక్క విశ్వామిత్రుని యొక్క సంబంధించిన క్రూరులయ్యు వేదాధ్యయనమును, తపస్సును, పవిత్ర కర్మలను జరుపు బ్రహ్మ రాక్షసులకును రాజు. ఇతరులైన మూఁడు వర్గముల రాక్షసులు యజుర్వేద క్రియ లాచరించువారు. వారు యాతుధానులు, బ్రహ్మ ధానులు, వార్డులు (?). వారు దివాచరులు, రాక్షసుల వలే వారు రాత్రించరులు కారు. వారు నాలుగు వర్గములు. ఆవర్గ చతుష్టయమును బుద్ధిమంతులు జ్ఞాపక ముంచుకొందురు. (61) వారు నిశాచరులు - వారు పౌలస్త్యులు, నైఋతులు, ఆగస్త్యులు, కౌశికులును. ఈ విధముగా వారు ఏడు జాతుల రాక్షసులని తెలియవలయును. వారి యొక్క రూపములను, సహజ సిద్ధ స్వభావములను, వివరించెదను. (63) వారు గుండ్రని నేత్రములు కలవారు; పింగళ వర్ణులు; మహాకాయులు; మహోదరులు; ఎనిమిది దంష్ఠలు కలవారు; శంకుకర్ణులు; పైకి నిగడ పొడుచుకొన్న శీర్ష రోమములు కలవారు; కర్ణములు లేనివారు; పచ్చని ముఖములు కలవారు; ముంజ (దర్భ) గడ్డివలె నుండి, ధూమ్ర వర్ణము కలిగిన శిరోజములు కలవారు; స్థూల. శీర్షములు కలవారు; అయ్యవి తెల్లని వెల్లును వెదజల్లును. హ్రస్వములయిన తొడలు ముంజేతులు కలవారు; రాగి రంగు మొగములు కలవారు; వ్రేలాడు జిహ్వలు, పెదవులు కలవారు; వ్రేలాడు కనుబొమలవారు; మొద్దు ముక్కులవారు; మహాఘోరమైన కంఠ స్వరము కలవారు; నీలాంగులు; లోహిత గ్రీవులు, గంభీరములయిన నేత్రముల వారు, విభీషణాకృతులు, వారి కాలిపిక్కలు వికృతములు, పైకి వంపు తిరిగినట్టివి, ముక్కులు స్థూలములు తుంగములును. రాతివలె దృఢములయిన శరీరములు కలవారు, పుట్టినప్పటి నుండి వారు క్రూరులు, దారుణులు సాధారణముగా వారు క్లిష్టకర్ములు. (67)

            వారు కుండలములు, అంగదములు మొదలయిన ఆభరణముల దాల్చినవారు. శీరమున ఉషీషముల ధరించువారు. విచిత్రాభరణులు, చిత్రములయిన పూలమాలలను, గంధానులేపములను వహించెడివారు. (68) వారు వండిన అన్నమును తినువారు; మాంసమును, అందును మానవ మాంసమును మెసవువారు. ఈ విధముగా రాక్షసులతోడి సాధర్యము పొందిన వ్యక్తులుగా పెద్దలు స్మరింతురు. వారు బలమున అసమానులు, బుద్ధియందు, యుద్దము నందు, మాయా కార్యాలయందు సాటి లేనివారు, సర్వ మృగములు, అన్నీ విధములయిన క్రూర దంష్ట్రాలు కలిగిన వ్యాఘములు, భూతములు, సర్పములు, పిశాచములు, కిన్నరులు, సరీసృపములు, లేళ్లు, ఏనుగులు, కోతులు, కింపురుషులు, మాయులు (ఒక విధమైన కోతి)- అన్నియును పులహుని యొక్క సంతానము క్రోధావశాన్వయమునకు చెందిన యీ సృష్టిని గూర్చి యింతకుం బూర్వము చెప్పబడినది. వైవస్వత మన్వంతరమున క్రతువు అనపత్యముగా స్మరింపఁబడెను. (72) ఆతనికి బిడ్డలు కానీ భార్యలు కాని లేరు. ఆతఁడు తన యింద్రియతేజమును నిగ్రహించుకోని, సంక్షిప్తము చేసికొని యుండెను. మూడవ ప్రజాపతియైన అత్రియొక్క వంశమును గూర్చి చెప్పెదను. అత్రికి పది మంది భార్యలు. వారందకత్తెలు. సత్పతివ్రతలు. వారు భద్రాశ్వునకు ఘృతాచియైన దేవతాపురసయందు కలిగిరి. వారు భద్ర, శూద్ర, మద్ర, శలభ, మలద, బల, హల - ఈ యేడుగురు ముఖ్యులు. ఇతరులు గోచపల, తామరస, రత్నకూట-లు; వీరును అట్టివారే. వారన్న ఇష్టపడుదురు వారి వంశమును అవిచ్చిన్నము చేసిన వానీ పేరు ప్రభాకరుఁడు. ఆ ప్రభాకరుఁడు మద్ర యందు, యశస్వియైన సోముడను పుత్రుని కనెను, సూర్యుఁడు స్వర్భానుఁడైన రాహువుచే కొట్టబడి క్రిందకు దివి నుండీ పడుచుండ, లోకము లన్నియు తమో మయము లగుచుండ, అత్రియొక్క కాంతీయే ఆ చీకటిని తొలగించినది. (ప్రవర్తిల్లనీయలేదు). (ఆతఁడే అత్రి). దివాకరుండు నేలకు పడుచుండ ఆతఁడే (అత్రి) “స్వస్తితే” నీకు శుభమగుగాక అని చెప్పెను. ఆ బ్రహ్మర్షి యొక్క ఆశీర్వచనముచే, ఆకాశము నుండి సూర్యుఁడు నేలకు పడిపోలేదు. మహా తపస్వియైన అత్రి శ్రేష్టములయిన అత్రి గోత్రములను ప్రచోదించెను, ఆతఁడే యజ్ఞాచరణముల యందు సురల యొక్క మరణమును నివారించేను. ఆతఁడే ఆ పదిమంది అప్సరసలయందు తనతో తుల్యులయిన పుత్రులను కనెను. (80) సుమహాతపస్సుచే అత్రి ప్రభువు, ఆ పది మంది కుమారులను కనెను. వారందరు 'స్వస్యాతేయులు'గా ప్రసిద్ధులు. ఆ మహరులు వేదపారగులు. చారలలో ఇద్దరు ప్రసిద్ధ యశస్వులు. వారు బ్రహ్మిష్ఠులు, మహౌజసులు. దత్తుఁడు పెద్దవాఁడు. దుర్వాసుడు చిన్నపొఁడు. అందరిలో చిన్నది యొక అబల. ఆమె బ్రహ్మవాదిని. ఈ సందర్భములో పురాణములందు ప్రసిద్ధులైనవారీశ్లోకమునుదాహరింతురు.

            “పురాణజులిట్లు చెప్పుదురు. మహాత్ముఁడు, శాంతాత్ముఁడు, అకల్మషుఁడు అయిన దత్తాత్రేయుడు విష్ణువు యొక్క అవతారము. విష్ణువు యొక్క తనువు” అని. అత్రి అన్వయ సంజాతులలో నలుగురు చాల ప్రసిద్ధులు - (1) శ్యావాశ్వుఁడు, (2) ముద్దలుఁడు, (3) వాగ్భూతకుఁడు (4) గవిష్ఠిరుడు. (85) ఈ నలుగురు అత్రి యొక్క పక్షమునకు చెందిన మహాశక్తి మంతులుగా స్మరింపఁబడుచున్నారు - వారు కాశ్యపుండు, నారదుఁడు, పర్వతుడు మరియు అరుంధతి. నారదుఁడు అరుంధతిని వసిషునకొసంగెను. ఆనలుగురు అరుంధతి వలన మానవ జన్మ నొందిరని యెఱుంగుము. దక్షుని శాపము వలన నారదుఁడు ఊర్థ్వరేతస్కుఁడు, మహాతేజుఁడు అయ్యెను. పూర్వము దేవతలకు రాక్షసులకు జరిగిన యుద్ధమునందు, తారకుని యొక్కదుష్టత్వముచే ప్రపంచ మంతయును అనావృష్టిచే ఆహతమయ్యెను. ప్రపంచ మంతయును వ్యగ్రమయ్యెను. ఉద్రిక్త స్టీలో నుండెను. దేవతలు కూడా క్లేశపడిరి. ధీమంతుఁడయిన వసిష్ణుఁడు తన తపస్సుచే అనేకములయిన ఫలములను మూలికలను ఔషధములను కారుణ్యముచే ప్రవర్తింపఁజేసి, ప్రజలను జీవింపఁజేసెను. (89) వసిష్ఠుఁడు ఆరుంధుతీ వలన శక్తియను పుత్రుని కనెను, శక్తి అదృశ్యంతివలన తన యంగము నుండి పరాశరుని పుట్టించెను. (91) కాలి' యందు పరాశరుని వలన మహాత్ముఁడయిన కృష్ణద్వైపాయను డుద్భవించెను. ద్వైపాయనునివలన అరణియందు గుణాన్వితుఁడయిన శుకుని కనెను. (92) పీవరీ యందు ఈ యారుగురు శుకుని పుత్రులు పుట్టిరి. వారు - భూరిశ్రపుఁడు, ప్రభువు, శంభుఁడు, కృష్ణుఁడు, గౌరుఁడు. ఆరవది కన్య ఆమెపేరు కీర్తిమతీ, ఆమె యోగ శక్తులకు జనని యోగమాత. ఆమే ధృతవ్రత. అన్ని పవిత్ర వ్రతముల నాచరించెను. ఆమె “అణుహు'ని యొక్క పత్ని. బ్రహ్మదత్తుని యొక్క జనని. ఈ క్రింద చెప్పఁబడు ఎనమండ్రును పరాశరునియొక్క వంశ జులు - శ్వేతులు, కృష్ణులు, పౌరులు, శ్యామ ధూములు, చండులు, ఊష్మదులు, దారికులు, నీలులు (నీలా?) (95) మహాత్ముఁడయిన పరాశరుని యొక్క అష్ణ పక్షములు చెప్పఁబడినవి. ఇక ఇంద్ర ప్రమతీ యొక్క సంతానమును గూర్చి యెఱుంగుఁడు. (96) కపింజలీ యైన ఘృతాచి యందు 'కుణి' అను కుమారుఁడు పుట్టెను. ఆతనినే ఇంద్ర ప్రమతి యందురు. (97) పృథుని యొక్క కుమార్తె యందు పుత్రుడు, అతనికి వస్తువుపుట్టెను, అతని కుమారుడు ఉపమన్యువు, ఆతని నుండీ ఔపమన్యువులు కలిగిరి. మిశ్రా వరుణుల నుండి పుట్టినవారు కుండినేయులుగా పరిశ్రుతులు. ఏకాగ్గేయులు ఇతరులు వాసిష్ఠులుగా ప్రఖ్యాతులు. ఈ విధముగా ఏకాదశ పక్షములుగా (వర్గములుగా) వాసిష్ఠులుసంస్కృతులు. ఈ విధముగా బ్రహ్మయొక్క ప్రసిద్ధులయిన మానసిక పుత్రులు చెప్పఁబడిరి. వారందరు భ్రాతలు. మహాభాగులు. వంశప్రతిష్ఠితులు, వారీ దేవర్షిగణసంకులమైన, మూడు లోకములను రక్షించుచున్నారు.

వారీ పుత్రులు, పౌత్రులు వందలు వేలుగా నున్నారు. సూర్యకిరణములు ప్రపంచమును వ్యాపించియున్న విధమున వారు మూఁడు లోకములను వ్యాపించి యుండిరి.

ఇది వాయుప్రోక్తమయిన బ్రహ్మాండ మహాపురాణమున మధ్యభాగమున తృతీయమైన ఉపోద్ఘాతపాదమున ఋషివంశవర్ణనమను అష్టమో ధ్యాయము.