5 - లలితోపాఖ్యానము ప్రారంభము – అగస్త్య యాత్రా జనార్దనావిర్భావము

నాలుగు భుజములు, చంద్ర కళాభూషణము, ఉన్నత కుచములు, కుంకుమరాగ శోణిమ (ఎరుపుదనము) గలిగి పుండ్రేక్షువు (శ్రేష్టమైన చెరకుగడ) పాశము, అంకుశము, పుష్పబాణము - ఇవి నాలుగు హస్తములందుగల. ఓ జగత్తునకు ఏకైక మాతయైన లలితాంబా! నీకు నమస్కారము-1. అది శివుని వామాంగమున సుందరమైన వస్తువు. దానివల్లనే విద్వాంసుల మూడవది యావిష్కరించినది. ఆ మూడవదే పరమమైన తేజము-2. అగస్త్యుడను దేవర్షి కలడు. ఆతడు వేదవేదాంగపారగుడు, సర్వసిద్ధాన్తసారముల దెలిసినవాడు,  బ్రహ్మానందరసమే యాత్మగా గలవాడు-3.

ఆతడు మహాద్భుతములకు కారణములైన తీర్థములు, స్థానములు. (దేవస్థానములు), శైలములు, అరణ్యములు, నదులు మొదలగువానిని, సమస్త దేశములను సంచరించేను -4. అయా ప్రదేశములలోని ప్రాణులు అజ్ఞానాంధకారమున జుట్టబడినవారు. శిశ్నోదర (మైథున-భోజనములందు) పరాయణులు. ఇట్టివారీని చూచి యగస్త్యుడు. వారిని గూర్చి చింతపసాగెను-5. ఆ విధముగా చింతించుచు నీభూమిని సంచరించు నగస్త్యునకు కాంచీపురము ఘటించినది. ఆ కాంచీ నగరము మహాపుణ్యమైన యుత్తమ నగరము-6. అట శుద్దాత్ముడై యగస్త్యుడు వారణ శైలేంద్రమును (ఏనుగువంటి, పర్వత శ్రేష్ఠమును) ఏకామ్ర వృక్ష స్థలముననున్న శివుని (ఏకామేశ్వరుని) కలిదోషముల నశింపజేయు కామాక్షీదేవిని పూజించెను-7.

లోక కారణుడును, దయార్ధుడును, మహాధీశాలియును, మాటిమాటికి ధ్యానించువాడును, అయిన యగస్త్యుని యొక్క తపస్సుచే జనార్దనుడైన విష్ణువు సంతసించెను-8. హయగ్రీవాకారము వహించి అమితమైన తేజముతో యగస్త్యుని యెదుట సాక్షాత్కరించెను. ఆ హయగ్రీవాకారము కన్నులయెదుట మూర్తీభవించిన కేవలం చిన్నయ రూపము, శంఖము, చక్రము, అక్షవలయము. . (జపమాల) . పుస్తకము-వీనిని ధరించుటచే నుజ్జ్వలమైన (ఉన్నతముగా ప్రకాశించిన) నాలుగు బాహువులు గలది. తన దేహమునుండి బుట్టిన కాంతితో జగమునంతయు నింపుచున్నది-10. ఆ హయగ్రీవుని జూచి యానంద భరితుడై మాటిమాటికి నమస్కరించి వినయ వినమ్రుడై యాజగత్పతిని స్తుతించెను -11, ఆ తరువాత జగన్నాథుడు - నీ తపమునకు సంతసించితిని. వరమును గోరుకొనుము. నీకు క్షేమము గలుగును. అనియనేసు-12 ఈ విధముగా నడుగబడి. యాముని సత్తముడు ఈ విధముగాననెను. ఓ భగవంతుడా! నీవు సంతసించినచో, ఈ పామర ప్రజలందరు ఏయుపాయమున ముక్తులగుదురో, దీనిని మాకు జెప్పుము - అని మునిచే నడుగబడిన దేవదేవుడైన జనార్దనుడు ఇట్లనెను -14. ఈ ప్రశ్నమునే పూర్వము శివుడడిగెను. ఆ తరువాత నీ ప్రశ్నమునే బ్రహ్మయడిగెను. తరువాత దుర్వాసుడడిగెను. ఆ తరువాత నీ వడిగితివి-16.

సర్వప్రాణులకు గురుభూతులై మహాత్ములైన మీచేత నాయుపదేశము లోకములందు ప్రసిద్ధిగాంచుగాత. ఇది నా వరము-17. నేను భూతములకాదని, భూతములకాదికర్తను, నేను స్వయముగా ప్రభువును సృష్టిస్థితి లయలకును అన్నింటికీని కారకుడను-18. త్రిమూర్తి (స్వరూపుడను)నీ, సత్త్వరజస్తమో గుణముల కతీతుడను. నిర్గుణుడను, గుణములకాశ్రయమైన వానినీ-19 స్వేచ్ఛగా విహరించువానిని, భూతములకాత్మను, ప్రధాన- పురుషాత్మకుడను ఓబ్రహ్మస్వరూపుడవైన అగస్త్యమునికి ఇటువంటి శ్రీజగద్రూపధారినైన నా యొక్క రూపము ప్రధానము- పురుషుడు అని రెండు విధములయ్యెను. నా ప్రధాన మను రూపము సర్వలోక గుణాత్మకము-21 తక్కిన గుణాతీతమైన రూపము పరమునకంటెను పరతరమైనది. మహత్తైనది. ఈ విధముగా రెంటి యొక్క స్వరూపములను దెలిసి ఈ రెంటిని వదిలిపెట్టును-22. చిరకాల తపస్సుల చేత, యమ నీయముల చేతను, త్యాగముల చేతను, దుష్కర్మలు నశించిన తరువాత ముక్తి తొందరగనే లభించును-23. ఏ రూపము ఏగుణముతో గూడియున్నదో అదీ గుణీయొక్క యొక్యముతో లభించును. తక్కినది సమస్త జగద్రూపము కర్మభోగము యొక్క పరాక్రమము (ఫలితము)-24 అదీ కర్మలనంటియుండును. అది కర్మల పదిలీనను (సదసత్కర్మల - వదిలినను) ఈ వరకు జేసిన సద సత్కర్మల ఫలితము లభించుచునే యుండును. ఓ తాపస! ఎవ్వరికైనను ఆ రెంటిని (సదసత్కర్మ ఫలములను) వదలుట దుస్తరము-25. సదసత్కర్మ గోచరమైన ఫలము వీడనిదీ, సులభముగా బొందునది-26. సద సద్గుణములాత్మస్థములై వీడవు, తత్పలితములనవశ్యమనుభవింపచేయును. ఆత్మైక్యముగా గలిగిన సర్వసిద్ధులనొసంగును-27. బ్రహ్మక్షత్రియులకన్న తక్కువై పాపిష్టులైన నరులకు గూడ ఏరూపమును ధ్యానించినంత మాత్రమున దుష్కృతము గూడ సుకృతముగా మారునో అది పరాశక్తి రూపము-28. విధి విధానముతోగానీ, వీధి విధానములవదలిగానీ పరాశక్తి నర్చించిన వారు సంసారులు సంసారులుగారు, నిశ్చయముగా వారు ముక్తులే. సంశయము లేదు -29, శివుడు గూడ నామెను ధ్యానయోగ బలముతో సమారాధించి సర్వసిద్దులకీశ్వరుడై యర్ధనారీశ్వరుడయ్యెను-30. ఆ పరాశక్తి ధ్యానవైభవమున బ్రహ్మ మొదలగు దేవతలు సీదులైరి. కావున సమస్తలోకులకు త్రిపురాశక్త్యారాధనము లేక యెక్కడనైనను ఒక్కమారుగా భోగా పవర్గములు భోగమోక్షములు లేవు. కావున పరాశక్తి మనస్కుడవై, పరాశక్తి గత ప్రాణుడవై, పరాశక్తిని యజించు (పూజించు) వాడవై, కోరికలన్నింటిని నామె. యందే. నిలిపినవాడవై-32 పరాశక్త్యాత్మలో సమస్త కర్మలజేయుచు ముక్తిని బొందగలవు. మునిశ్రేష్ఠ నీ తపమునకు సంతసించి అందరి హితమును గోరి యిరహస్యము జెప్పబడినది. దేవతలు మునులు, సిద్ధులు, మానుషులు, ఇతరులును నీముఖ కమలము నుండి యీ పరాశక్తి. రహస్యమును బొంది పరాత్పరమైన . సిద్ధిని బొందుదురుగాక-34

విష్ణు రూపుడైన హయగ్రీవుడు చెప్పిన పై వాక్యములను వినీ నమస్కరించి యగస్త్యముని ఆ మధుసూదనునితో నిట్లనెను-35. ఓ భగవన్! నీవు పూర్వము జెప్పినది యెట్టి రూపము? ఎట్టి విహారములు గలది? ఎట్టి ప్రభావము గలది? - ఇది యంతయు మాకుజెప్పుము-36. హయగ్రీవుడనేను: - ఓ దేవర్షివైన అగస్త్యమునీ! ఈ హయగ్రీవరూపము సాయంశరూపమైన నా వేరొక రూపము. కావున నీవు వినదలచినదంతయు జెప్పగలది. అని జగన్నాథుడైన మహా విష్ణువు తపోధనుడైన హయగ్రీవుని నాదేశించి యగస్త్యముని యెదుటనే యంతర్ధానమొందెను-38. తరువాత ఆశ్చర్యము జెంది యగస్త్యుడు పులకిత గాత్రుడయ్యెను. హయగ్రీవ మునీతో స్వాశ్రమమును జేరెను-39.

ఇది బ్రహ్మాండ మహాపురాణమున నుత్తర భాగమున హయగ్రీవాగస్త్య సంవాద రూపమైన లలితోపాఖ్యానము అగస్తయాత్రా జనార్ధనావిర్భావమును అను పంచమాధ్యాయము -5