వరాహ మహా పురాణము
అధ్యాయము - 138
సౌకరక తీర్థము నందలి ఈ పుణ్యమును, గుణ స్తుతిని, మాహాత్మ్యమును, జాతుల మార్పును విని కమల పత్రాక్షి, సర్వ ధర్మముల నెరిగిన వారిలో మిన్న అయిన భూదేవి పరమ ఆశ్చర్యమును పొంది, ఆనంద మందిన అంతరంగముతో మరల ఆ దేవుని ట్లడిగెను.
ఆహా! ఏమీ నీ సౌకరక క్షేత్రము నందలి ఈ తీర్థ మహిమ! కోరక మరణించిన దానికిని మనుష్యత్వము సిద్ధించినది.
దేవా! సౌకరము నందు జరిగిన మరియొక వింత ఏదైన నున్న నాకు తెలుపుము. నాకు విను వేడుక మిక్కుటముగా నున్నది.
అచట నేల అలికిన దాని పుణ్య విశేష మెట్టిది? ఆవు పేడ ఫలమేమి? నీటి నొసగినచో కలుగు పుణ్యమెటు వంటిది?
దేవ! నీ భక్తుడు నిండారు సంతోషము గల మనస్సుతో అచటి నేలను ఊడ్చినచో దాని పుణ్యమెట్టి దగును?
అచట పాడినచో, వాద్యములు మ్రోయించినచో, నృత్యము చేసినచో, జాగరణము చేసినచో కలుగు ఫలమెట్టిది?
పుష్పమును భక్తితో ఒసగినచో అనేక పుష్పముల మాలలను కానుకగా ఇచ్చినచో, అట్టివా రేగతి పొందుదురు?
ఈ పరమ రహస్యము నెరుగు కోరిక నా హృదయమున నున్నది. భక్తుల సుఖము కొరకై దీనిని నీవు చెప్ప వలయును.
అంత భూదేవి పలుకు విని సర్వదేవ మయుడగు హరి ధర్మకామ అయిన వసుంధరతో తీయగా నిట్లు పలికెను.
సుందరి! నన్ను నీవడిగిన దానికి ఉన్నదున్నట్లు, బదులు చెప్పెదను. ఆ పుణ్య మెట్టిదో, అది రహస్య మైనను, సుఖమును కలిగించునది, కనుక అంతయు నీకు తెలిపెదను.
ఆ సౌకరక క్షేత్రమున శరత్కాలమున కాటుక పిట్ట యొకటి పురుగులను పక్షులను తినుటకు పట్టుకొను చుండెను.
ఆహార దోషము చేత అజీర్ణముతో బాధ పడినదై గిలిగిల లాడి స్పృహ తప్పి అది చని పోవుటకు నిశ్చయించెను. అజీర్ణ దోషము చేత చనిపోయెను.
ఆ పిట్టను చూచి అచట ఆడు కొనుటకు వెళ్ళిన బాలకులు, ఆటలు ముగిసిన పిదప దానిని పట్టుకొని యిష్టము వచ్చినట్లు కదలింప సాగిరి.
అంత నా బాలురు దాని రెక్కలను తీసికొన దలచిన వారై, నాది నాది అని పలుకుచు వారిలో వారు కలహమాడ జొచ్చిరి.
అంత ఒక బాలుడు ఆ పక్షిని పట్టుకొని ఇది మీది కాదనుచు గంగ నీటిలో దానిని విసరి వైచెను.
నేను నీకు మునుపు వివరించి చెప్పన ఆదిత్య తీర్థము నందు గంగ నీటిలో పడి అది నీటితో తడసిన రెక్కలు కలదాయెను.
వసుంధరా! అంత ఆ పక్షి పెక్కు యజ్ఞము లాచరిలంచు వైశ్యుని యింట, ధన రత్నములు నిండుగా గల చోట, రూప వంతుడు, గుణ వంతుడు, పవిత్రుడు, విశుద్ధుడు నగు నా భక్తుడై జన్మించెను.
అతడు పుట్టిన పండ్రెండేండ్లు గడచిన పిమ్మట ఒకనాడు ఆతడు తలిదండ్రలతో ఇట్లు పలికెను.
అతడు మనసు కుదుట పరచుకొని, నా ప్రియము నెరిగిన వారైనచో నా హృదయమున నున్న దానిని చెప్పెదను. నాకొక వరము నొసగ వలయును.
నన్ను అమ్మగాని, నాన్నగాని ఎన్నటికి వారింప రాదు. గురువుపై ఒట్టువేసి చెప్పు చున్నాను. అది మీరు అంగీకరించి నట్లే భావింతును.
కొడుకు పలుకు విని ఆ దంపతు లిద్దరు, కమలముల వంటి కన్నులు గల ఆ బాలునితో మేలైన పలుకునిట్లు పలికిరి.
తండ్రీ! నీ మనసున నున్నదేదో, నీవేమి చెప్పుదువో దాని నంతటిని చేయుదుము. ఇందు సంశయము లేదు.
చక్కని పాలిచ్చెడు ఇరువది వేల గోవులు మనకు కలవు. ఎచట ఏది నీకిష్ట మగునో అచట దానిని దానమిమ్ము. నీకడ్డు చెప్పము.
నాయనా! మరియొక మాట చెప్పదము. మామాటలు వినుము. మనము వైశ్యులము. వర్తకము మన వృత్తి. అది ఏమగును? నీ వెనుక బడి ఆడుకొనెడి మిత్రులు పెరిగిపోవు చున్నారు.
కనుక తగు విధముగా మిత్రులకు ధన మొసగుము. ధనములను, ధాన్యములను, రత్నములను ఇమ్ము. నీకు అడ్డు లేదు.
చక్కని అంద చందములు గల మన కులపు కన్నెలు కలరు. వారిని తీసికొని వచ్చెదము. క్రమముగా పెండ్లి యాడుము.
లేక నీవు కోరుదువేని వైశ్యులు చేసెడు యజ్ఞములను శాస్త్ర పూర్వకముగా చేసి దేవతలను పూజింపుము.
ఎనిమిది వందల నిండు బలము గల ఎద్దులు గల నాగళ్ళు మనకు గలవు. వ్యవసాయము వైశ్య కర్మము కనుక వానిని గొని సేద్యము చేయ గోరుదువా?
ఎందరు నీతో మాటాడుదురో అందరు అతిథులకు అన్న మిడుదువా? భోజనముతో తృప్తి పడిన బ్రాహ్మణులకు దనము లిచ్చి తృప్తి పరుతువా? నీ యిష్టము ననుసరించి అది. అంతయు నీవు చేయ వచ్చను.
ధర్మమును చక్కగా వినియున్న ఆ బాలకుడు తలిదండ్రుల మాటలు విని వారిరువురి చరణములు పట్టుకొని మరల ఇట్లు పలికెను.
గోదానమున నాకు పని లేదు. మిత్రములను గూర్చి నేను భావించుట లేదు. కన్యల పొందులో నాకు కోరిక లేదు. యజ్ఞ ఫలము నందు ఆశ లేదు.
వాణిజ్యమును నేను కొరను. వ్యవసాయము, గోరక్ష నాకు పట్టవు. అతిథు లందరిని మెప్పించుట నా హృదయమున ఉన్న విషయము కాదు.
నాదైన పరమ రహస్య మొక్కటియే. దాని యందే నా కోరిక తిరుగాడు చున్నది. శ్రీ నారాయణ క్షేత్రమైన సౌకరకమునకు పోవుటయే నా భావన.
నా అర్చన యందు పరమానురాగము గల ఆ కుమారుని మాట విని అతి దీనముగా ఆ దంపతులు విలసింప దొడగిరి.
కొడుకా! నీవు పుట్టి పండ్రెండేండ్లే అయినది. ఇప్పుడే నీవు నారాయణుని ఆశ్రయమునకు పోవు చింత చేసితివి. ఇదియేమి?
నీకు మేలగుగాక! ఆ వయస్సు వచ్చి నప్పుడు తప్పక దానిని గూర్చి ఆలోచింప వచ్చును. ఇప్పటి నుండియే నీ వెనుక భిక్షా పాత్రను గొని మమ్ములను పరుగెత్త మందువా?
సౌకరమున కరుగు బావన ఇది ఏమి నాయానా! నీకొసగిన గొప్ప శక్తిగల ఔషదము మొదలగు వాని ఫలమైన మేము గాంచము కదా!
చక్కగా అన్నము తినువేళ అతిక్రమించు చుండగా హఠాత్తుగా నారాయణ క్షేత్రమునకు పోవు బుద్ధి నీకు పుట్టినది. ఇది ఏమి?
ఈనాటికిని రాత్రింబవళ్ళు నా చన్నులు చేపుచున్నవి. బిడ్డా! అట్టి నీ స్పర్శను రూపు మాపెడు ఆలోచనను నీవేల చేయు చున్నావు?
రాత్రివేళ నిద్రించి పాన్పున పొరలాడుచు ‘అమ్మా’ అని పలుకు చుందువు. అట్టి నీ విట్లేల చింతించితివి?
చిన్ని నాయనా! నీవాటలాడు కొనుచుండగా నీ రూపమున కచ్చెరువడు స్త్రీలును, పురుషులను నిన్ను తాకు చుందురు.
బాలకా! ఎప్పుడైన నీ యెడల చిరాకు కలిగినను, నిన్ను నొప్పించెడు మాట ఇంత వరకు పలుకము. ఎవరి దోషము వలన నీవు వెళ్లి పోవుటకు చింతించితివి?
ఇల్లు వాకిండ్లలో ఏ దోషము లేదు గదా! ఇంటిలోని వారెవ్వరు నీ యెడల పరుషముగా పలుకరు కదా!
ఎప్పుడైన నీపై కోపము వచ్చి చేత నొక కర్ర పట్టుకొనియు నిన్ను కొట్టుటకు నాకు మనసు వచ్చెడిది కాదు. నీ యందలి అనురాగము నన్ను ఉక్కిరి బిక్కిరి చేసెడిది.
అంత తల్లి మాట విని ఆ వైశ్యకుల నందనుడు తల్లితో మెల్లగా ఇట్లు పలికెను.
అమ్మా! నీ కడుపున పడుకొని నీ అంగములలో నిలిచి యుంటిని. నీ ఒడిలో ఆడు కొంటిని.
చక్కగా పొగారెడు నీ స్తనముల యందు నేను పాలు త్రావితిని. దుమ్ము కొట్టుకొన్న ఒడలితో నీ ఒడిలో నేను పొరలాడితిని.
అమ్మా! ఏడువకుము. పుత్ర దుఃఖమును విడిచి పెట్టుము. కొడుకు కోరికను తీర్పుము. నన్ను గూర్చి దుఃఖ పడ వలదు.
మనుజులు వచ్చు చున్నారు. పోవు చున్నారు. వచ్చిరి. కొందరు వత్తురు. ఇప్పుడు కన్పట్టు చున్నారు. మరల నశింతురు. తిరిగి ఎన్నటికిని కానరారు.
ఎక్కడ నుండి పుట్టితిని? ఏమి సంబంధము? నీవును తల్లివి. ఆయన తండ్రి. ఈ యోనిలో ఈ ఘోర సంసార సాగరములో పడితిని.
వేల కొలది తల్లిదండ్రులు, వందల కొలది భార్యలు కొడుకులు. ప్రతి జన్మము నందును ఇట్టి బంధములు గలుగుచునే యున్నవి. వారెక్కడివారో, మేమెవరి వారమో!
అమ్మా! ఈ విచారమును పోంది నీవు దుఃఖింప రాదు.
ఇది విని తండ్రియు తల్లియు ఆశ్చర్యముతో మరల ఇట్లు పలికిరి. ఆయ్యో! ఏదో పెద్ద రహస్యము. నాయానా! చెప్పుము.
ఈ మాట విని ఆ వైశ్య కుల బలకుడు తల్లి దండ్రులతో మరల నిట్లనెను.
మీరు గట్టి నిర్ణయముతో ఈ రహస్యమును వినగోరుదు రేని సౌకరక క్షేత్రమున కరిగి అచట నన్నడుగుడు.
ఈ అమ్మ నన్ను కడుపున పెట్టుకొని కనినట్టిది. తండ్రితో పాటు మనము సౌకర క్షేత్రమున కరుగుదము.
అచట కరిగి నా గొప్ప శక్తి గల గుట్టును తెలియ జేసెదను. సూర్య తీర్థమును చేరుకొని, నాయనా! నీ వడిగిన దానిని చెప్పెదను.
ఆ దంపతులు అట్లే అని కొడుకుతో పలికి సౌకరక క్షేత్రమునకు పోవుటకై సంకల్పించిరి.
నాయానా! నీవు ఈ నెల మొదటి పక్షమున కృత కృత్యుడవు కాగలవు. అని వలసిన వస్తు సామగ్రితో వారు సౌకరక క్షేత్రమునకు పయనమైరి.
అంత ఆ పద్మ పత్రముల వంటి కన్నులు గల ఆ భీర ప్రభువు (వైశ్యుడు) ముందుగా వడివడిగా ఇరువది వేల గోవులను తరలించెను.
ఆ గోవులు ముందుగా తగు ద్రవ్యములతో కూడినవై బయలు దేరినవి. ఇంటనున్న వస్తువు సమస్తము నారాయణునికి సమర్పిత మైనది.
అంత మాఘ మాస శుక్ల పక్షమున త్రయోదశి నాడు తమ వారికి, చుట్టములకు పోయి వత్తుమని చెప్పిరి.
స్నానము చేసి, శౌచకార్యములు ముగించు కొని నారాయణునికి ప్రీతి యగు నట్లుగా దోషములు లేని ముహూర్తమున బయలు దేరిరి.
అంత పెద్ద కాలమునకు నాయందు చెదరని భక్తి కలవారు వైశాఖ ద్వాదశి నాడు నా క్షేత్రమును చేరుకొనిరి.
గంగ యందు స్నానముచే సిరి. శుభ్రమైన వస్త్రములను తాల్చిరి. ఇరువది వేల గోవులను నాకు సమర్పించిరి.
అచట భాంగురసుడను నా భక్తుడు విధి పూర్వకముగా ఆ గోవులను నా కొరకై గ్రహించెను.
గొప్ప వెలగల యిరువది గోవులను శుభమైనవి, పవిత్రము లైనవి. ఎక్కువ పాలిచ్చునవి యగు వానిని నా నుండి గ్రహించి ఆతడు దాన మొసగెను.
ప్రతి దినము ధనములను, రత్నములను దాన మిచ్చు చుండెను. ఇట్లు కుమారునితో, భార్యతో, తన వారితో ఆ వైశ్యుడు ఆనందముగా కాలము గడపు చుండెను.
ఇట్లచట అతడు నివసించు చుండగా వర్షా కాలము వచ్చెను. అన్ని పంటలను పెంపొందించు వర్షముల చనుదెంచెను.
కడిమి చెట్లు, కుటజములు, అర్జునకములు విరియ బూచినవి. ప్రియుల దగ్గర లేని స్త్రీలు కుమిలి పోసాగిరి.
మేఘములు మెరుపులతో బెగ్గురు పక్షులనెడి అలంకారములతో ఉరిమిరిమి కుండ పోతగా కురిసినవి.
నెమళ్ల క్రేంకాములతో, బెగ్గురు పక్షుల కలకలా రావములతో కడిమి మొదలగు పూల చెట్ల సూవాసనలతో ఆ తావు నిండి పోయెను.
నెమిళ్లకు సుఖము కలిగించు నవియును, భర్తల ఎడబాటు కల వనితలకు దుఃఖము కలిగించు నవియును అగు చక్కని గాలులుల వీచు చున్నవి.
మేఘముల దుందుభి నాదములతో కాలము గడచు చున్నది. పిదప శరత్కాలము వచ్చినది. అగస్త్య మహర్షి ఉదయించెను.
చెరువు లన్నియు ప్రసన్నము లైనవి. తామరలతో కలువలతో కలకల లాడు చున్నవి. పద్మముల వనములు కన్ను లకింపుగా చక్కగా పూచి యున్నవి.
తెల్లని పద్మముల చల్ల దనములను, కర్పూర పుటనటుల సువాసనను కలుపుకొని కామి జనులకు ప్రియములైన సుఖ కరములగు మెల్లని వాయువులు వీచు చున్నవి.
ఇట్లు శరత్కాలము నడచు చుండగా కార్తీక మాస శుక్లపక్ష ఏకాదశి నాడు ఆ దంపతులు స్నానములు చేసి తెల్లని పట్టు పుట్టముల ధరించి కుమారునితో ఇట్లు పలికిరి.
పుత్రా! ఇచట ఆరు నెలలుంటిమి. రేపు ద్వాదశి. మమ్ములను ఇంత వరకు నిలువరించిన ఆ రహస్యమును మాకేల చెప్ప కున్నావు?
తల్లిదండ్రుల మాట నాలకించి ధర్మమున నిష్ఠగల ఆ కుమారుడు, మరణమునకు నిశ్చయము చేసికొని మెల్లగా వారి కిట్లనెను.
నాయనా! నీవు పలికినదది అట్టిదే. రేవు ఉదయమున నీకు నా పరమ రహస్యమును చెప్పుదును.
తండ్రీ! ఇదిగో ఈ కార్తీక ద్వాదశి ప్రభువగు నారాయణునకు ప్రియమైనది. మంగళ కరము, విచిత్రము నయినది. విష్ణు భక్తులకు సుఖము కూర్చునది.
సంతోషముతో కూడిన హృదయముతో ఈ కార్తిక ద్వాదశి నాడు దానము లొసగు వాడు యోగుల కులమున దీక్ష కలవారు, విష్ణు భక్తులలో వృద్ధి పొందిన వారు అగుదురు.
ఆ దానము మహిమ చేత విష్ణు భక్తులు ఘోరము, విస్తారము అయిన సంసారమును దాటుదురు. ఇట్లు మాటాడు కొను చుండగా వారికి ఆ రాత్రి కడచి తెల్లవారెను.
సంధ్యా కాలము కడచి సూర్య మండలము ఉదయింపగా ఆ బాలుడు శుచియై పట్టు వస్త్రమును తాల్చెను.
దేవునకు తలతో ప్రణమిల్లి ప్రదక్షిణ మాచరించి తల్లితండ్రుల పాదములకు నమస్కరించి వారితో ఇట్లు పలికెను.
తండ్రీ! మనమీ సౌకరక క్షేత్రమునకు ఏల వచ్చితిమి? అని నీవడుగు దానికి సమాధానము వినుము.
నేను కాటుక పిట్టను. తిర్యగ్జాతికి చెందిన పక్షిని. పురుగులను తింటిని. అజీర్ణముతో మిక్కిలి బాధ నొందితిని.
అదే దోషము చేత నేను మెదలుటకు చాలని వాడ నైతిని. అట్లు విలవిల లాడుచున్న నన్ను బాలకులు పట్టుకొని ఆడుకొన జొచ్చిరి.
ఒకని చేతి నుండి మరియొకని చేతికి విసరి వైచుచు, కేరింతలు కొట్టుచు, దీనిని నీవు చూచితివి, కాదు నేను చూచితిని అనని వారిలో వారు కలహించిరి.
అంత ఒక బాలుడు తరుగువోని నీటిలో గిరికీలు కొట్టుచు, నీదికాదు, అనుచు ఆదిత్య తీర్థమును చేరుకొని తీవ్రమగు క్రోధమును పూని గంగ నీటిలో నన్ను విసరి వైచెను.
గొప్ప శక్తి కల ఆసూర్య తీర్థమున నేను కోరు కొనకయే ప్రాణములను విడిచితిని. అమ్మా! నీ కొడుకనై పుట్టితిని.
ఇప్పుడా కాలము నడుచు చున్నది. ఇదిగో ద్వాదశి కోరుకనకయే మరణించిన నాకు పదుమూడేండ్లు నిండినవి.
నాయనా! ఇచ్చటికి వచ్చుటలో రహస్యమగు దీనిని నీకు చెప్పితిని. నేను నా పని చేసికొందును. నీవు ఇంటి కేగుము. నీకు నమస్కారము.
అంత నతని తల్లి దండ్రులు కొడుకుతో మరల నిట్లనిరి. నాయనా! విష్ణువు చెప్పిన కర్మములు నీవు చేసెడి వేవి కలవో మేమును శాస్త్ర మార్గము ననుసరించి వానిని చేసేదము. దాని వలన మాకు సంసార బంధము వదలి పోవును.
వారును పెద్ద కాలము నా ఆరాధన యందు శ్రద్ధ కలవారై విపులముగా పూజల నాచరించి పిదప మరణించిరి.
నా క్షేత్రము ప్రభావము వలనను, వారి కర్మ పరిపాకము వలనను సంసార బంధము నన్నింటిని త్రెంచుకొని వారు శ్వేత ద్వీపమున కరిగిరి.
వారి యింటి నుండి వచ్చిన పరిచారకులును చక్కని పూజా కర్మములను ఎవరికి తోచిన విధముగా వారా చరించిరి.
అట్లు నా పూజల యందు శ్రద్దగల వారందరు సంసార బంధము నుండి ముక్తి పొంది క్షేత్ర ప్రభావము చేత సకలైశ్వర్యములతో కూడిన వారై, వ్యాధులు, రోగములు లేనివారై శ్వేత ద్వీపమును చేరుకొనిరి.
అందందరు యోగులే. అందరు కలువల కమ్మని వాసనలు కలవారే. నా అనుగ్రహము వలన అందరు క్షేమమును, ఆనందమును పొందువారే.
దేవీ! ఇది గొప్ప శక్తి గల మహాఖ్యానము. నీకు చెప్పితిని. సౌకరక క్షేత్రమున జరిగిన మరియొక విషయమును కూడ నీకు చెప్పెదను.
సౌకరక క్షేత్రము మహాభాగ్య మిట్టిది. పశువులు పక్షులు కూడ దీనిని పొంది శ్వేత ద్వీపమున కరుగు చున్నారు.
ఉషః కాలమున నిద్రలేచి దీనిని పఠించు మానవుడు తన కులమున ముందు పది తరముల వారిని, తరువాత పది తరముల వారిని తరింప జేయును.
మూర్ఖుల నడుమ, పాపిష్ఠుల దగ్గర, శాస్త్రములను నిందించు వారి సమీపమున. నీచులుండు చోట దీనిని చదువ రాదు. ఇంట ఒంటరిగా నుండి దీనిని పఠింప వలయును.
భగవద్భక్తులు, శాస్త్ర గుణములతో కూడిన వారు. విశుధ్దుల, వినయ వంతులు నగువారి నడుమ దీనిని పఠింప వలయును. ఇది సమస్తమగు సంసార దోషములను పోగొట్టును.
