వరాహ మహా పురాణము
అధ్యాయము - 25
బ్రాహ్మణ ప్రవరా! మహామునీ! అహంకారము నుండి కార్తికేయుడు ఎట్లు జన్మించెను? అడుగు చున్నాను. నా సంశయమును తీర్పుము.
పురుషునకు అవ్యక్తమునకు నడుమ ‘మహత్తు’ అనునది యేర్పడినది. దానినే అహంకార మనియు నందురు.
పురుషుడు విష్ణువు లేదా శివుడు. అవ్యక్తము పద్మముల వంటి కన్నులు లక్ష్మీ దేవి లేక ఉమాదేవి.
వారిరువురి సంయోగము వలన అహంకారము పుట్టెను. అతడే సేనానియగు కుమారస్వామి. రాజా! బుద్ధిశాలీ! ఆతని పుట్టుకను వివరించి చెప్పెదను. వినుము.
అందరకూ మూలము నారాయణ దేవుడు, అతని నుండి బ్రహ్మ పుట్టెను. అతని వలన స్వయంభు వులగు మరీచి మొదలగు బ్రహ్మలు పుట్టిరి. వారే సూర్యాదులకు కారణ మైనవారు.
వారితో మొదలు కొని దేవతలు, రాక్షసులు, గంధర్వులు, మనుష్యులు, పక్షులు, పశువులు, సర్వ భూతములు ఏర్పడెను. దీనినే సృష్టి యందురు.
ఇట్లు సృష్టి క్రమక్రమముగా పెరిగి పోగా గొప్ప బలము గల దేవతలును, దానవులును ఒకరిపై నొకరు విరోధము పెట్టుకొని గెలువ వలయునను కోరికతో పోరాడిరి.
దైత్యుల నాయకులు యుద్దమున మిక్కిలి పొగరు కలవారు, గొప్ప బలము కలవారుయై యుండిరి. అందు మొదటి వాడు హిరణ్య కశిపుడు. మహాబలుడగు హిరణ్యాక్షుడు, విప్రచిత్తి, విచిత్తి, భీమాక్షుడు, క్రౌంచుడు మొదలగు గొప్ప శక్తి కల శూరులు. మహా యుద్దమున ప్రతి దినము నిరంతరము పదునైన బాణములతో దేవ సేనను పరి మార్చు చుండిరి.
ఆ దేవతల ఓటమిని గాంచి బృహస్పతి యిట్లు పలికెను. దేవతలారా! నాయకుడు లేని మీ సేన హీనమై యున్నది.
ఒక్క యింద్రునితో ఈ దేవసేన నంతటిని రక్షింప నలవి కాదు. ఒక సేనానిని వెదకుడు. ఆలసింపకుడు.
బృహస్పతి అట్లు పలుకగా నా దేవత లందఱు లోకముల కెల్లా తాతయగు బ్రహ్మ కడ కరిగి తొందర తనముతో ‘మాకు సేనాపతి నొసగుము’ అని పలికిరి.
అంత నలువ వీరికి నేనేమి చేయుదునా! అని చింతించెను. అంత నతని మదిలో రుద్రుడు మెదలెను.
అంత దేవతలు, గంధర్వులు, ఋషులు, సిద్ధులు, చారణులు, బ్రహ్మను ముందిడుకొని కైలాస పర్వతమున కరిగిరి.
అందు మహాదేవుడు, శివుడు, పశుపతియు నగు ప్రభువును గాంచి వివిధ ములగు స్తోత్రములతో దేవేంద్రుడు మొదలగు దేవత లందఱు స్తుతించిరి.
మేమందరము మహేశ్వరుడు, ముక్కంటి, భూతపతి యగు శంకరుని శరణు గోరిన వారమై మ్రొక్కు చున్నాము. ఉమాపతీ! విశ్వపతీ! దేవపతీ! జగత్పతీ! శంకరా! మమ్ములను నీవే కాపాడుము.
త్రిశూల పాణీ! పురుషోత్తమా! అచ్యుతా! జటల గుంపు చివర నున్న చంద్రుని కాంతితో వెలుగొందు సమస్త జగములు కల దేవరా! నిర్మలా! మూడు లోకములు గర్భమున గల స్వామీ! దైత్యుల వలన మమ్ము రక్షింపుము.
నీవు ఆది దేవుడవు, పురుషోత్త ముడవు, హరివి, భవుడవు, మహేశుడవు, త్రిపురాసురులను రూపు మాపిన వాడవు. విభుడవు, భగుని కన్నులు పెరికిన వాడవు. దితి కొడుకులను చంపిన వాడవు. పురాతనుడవు. వృషభ ధ్వజుడవు. ఉత్తములగు దేవతల కెల్లా ఉత్తముడవు. మమ్ము పాలింపుము.
భూమి మొదలగు తత్త్వము లందు ఆయా గుణముల రూపమున నీవే నెలకొని యున్నావు. విశేషించి ఆకసమున ధ్వని స్వరూపుడవు నీవే. వాయువు నందు శబ్ద స్పర్శములను రెండు లక్షణములతో, అగ్ని యందు శబ్ద స్పర్శ రూపములను మూడు లక్షణములతో, నీటి యందు శబ్ద స్పర్శ రూప రసములను నాల్గు లక్షణములతో, భూమి యందు శబ్ద స్పర్శ రూప రస గంధములను అయిదు గుణములతో నీవే యున్నావు. అట్టి నీవు మమ్ము కాపాడుము.
చెట్టులలో నీవు అగ్ని స్వరూపము కల వాడవు. రాల్లలో నీవు సత్త్వ స్వరూపుడవు. (సత్త్వము – శక్తి) జలములలో విద్యుత్ స్వరూపుడవు, భగవంతుడవు. మహేశ్వరుడవు దైత్యుల గుణములు పట్టి పీడించు చున్న మమ్ము కాపాడుము.
మొదట ఈ సృష్టి ఏమియు లేదు. సూర్యుడు, ఇంద్రుడు, కుబేరుడు, మొదలగు వారి సంగతి చెప్పనేల? తర్కములు మొదలగు వానితో సంబంధము లేక ఉన్న వాడవు.
కపాలములు మాలగా, చంద్ర రేఖ శిరో భూషణముగా, తెల్లని బూది మైపూతగా శ్మశానము గృహముగా, పాములు జందెముగా గల దేవ దేవా! యమునికి యముడైన ఓ స్వామీ! సమర్థమగు బుద్ధితో మమ్ము రక్షింపుము.
నీవు పురుషుడవు, శక్తి స్వరూపిణి యగు ఈ గిరి సుత సర్వాంగములలో అందము గలదియై నీ యందె నిలిచి యున్నది. మూడు లోకములు నీ చేత నున్న త్రిశూల రూపముతో నున్నవి. మూడు కన్నులలో యజ్ఞపు అగ్నులు మూడును కుదురుకొని యున్నవి. (మూడు అగ్నులు – గార్హపత్యము, ఆవహనీయము, దక్షిణము)
అన్ని సముద్రములు, ఏడు కుల పర్వతములు, నదులు నీ జడల స్వరూపముతో అలరారు చున్నవి. తలపై చంద్రుడు జ్ఞాన స్వరూపముతో నిలిచి యున్నాడు. పాడు చూపులు గల జనులు నిన్ను ఇట్లు చూడ జాలరు.
జగముల ఉత్పత్తికి కారణమగు నారాయణుడవు నీవు. అట్లే భవుడు, బ్రహ్మయు నీవే. అట్లే నీవు సత్త్వము మొదలగు గుణముల భేదముతో, గార్హపత్యము మున్నగు అగ్నుల రూపముతో, కృతము మున్నగు యుగముల భేదముతో మూడు విధములుగా నిలిచి యుంటివి.
ఈ దేవ నాయకు లందరు నీ మఱియొక పుట్టుకను గోరుచు సంతోషముతో స్తుతించు చున్నారు. విశ్వేశ్వరా! రుద్రా! భూతిభూషణా! మాకై మరల జన్మింపుము. మమ్ములను రక్షింపుము. నీకు నమస్సులు.
ఇట్లు దేవత లందరు తన్ను స్తుతింపగా పశుపతి, చెదరని మనస్సుతో దేవతలతో ‘పనియేమి? చెప్పుడు. ఆలసింపకుడు’ అని పలికెను.
దేవేశా! దైత్యుల నంత మొందించుటకై మాకు సేనాపతిని ప్రసాదింపుము. బ్రహ్మ మొదలగు దేవతలకు ఇదియే హితము.
దేవతలారా! మీకు సేనాపతి నొసగుదును. చింత మానుడు. సనాతనమగు యోగాదుల భావనకు కూడ అందని తత్వము పుట్ట గలదు.
ఇట్లు పలికి శివుడు దేవతలను పంపి తన దేహమున నెలకొన్న శక్తిని పుత్రుని కొరకై మథించెను.
అట్లు శక్తిని ఊపివైచిన శివుని నుండి అగ్ని సూర్యులతో సమానమగు కాంతి గలవాడగు కుమారుడు జ్ఞానముతో విరాజిల్లు సహజ శక్తితో పుట్టెను.
పెక్కు మన్వంతరములలో దేవా సేనాపతి పుట్టుక పెక్కు రూపములతో ఉండెనట!
రాజా! దేహమున నున్న అహంకార మనునదియే ఒక ప్రయోజనము కొఱకు దేవుడైన సేనాపతి రూపమున అవతరించెను.
ఆతడు అట్లు జనింపగా దేవత లందరితో పాటు బ్రహ్మ దేవదేవుడు, శివుడు అగు పశుపతిని పూజించెను.
దేవత లందరును, ఋషులును, సిద్ధులు, వరముల నొసగి ఆతనిని లాలించిరి. అంత దేవతలతో కుమారుడు నాకు ఆటకై ఒక తోడును కల్పింపుడని పలికెను.
ఆతని మాట విని మహానుభావుడగు మహా దేవుడిట్లు పలికెను నీకు కోడిని అట వస్తువుగా నిత్తును. అట్లే శాఖుడు, విశాఖుడు అనునిద్దరు సేవకుల నొసగుదును. కుమారా! భూత గ్రహములకు నాయకుడు వగుము. దేవతలకు సేనాపతి వగుము.
ఇట్లు పలికి ఆ మహా దేవుడును, దేవత లందరును, ఆనంద పరచు వాక్కులతో స్కందుడగు ఆ సేనాపతిని స్తుతించిరి.
మహేశ్వరుని పుత్రుడా! ఆరు మొగముల దేవరా! స్కంధా! విశ్వేశా! కుక్కుటధ్వజా! అగ్నిపుత్రా! నీవు దేవసేనాని వగుము.
శత్రువులను వణకించిన వాడా! కుమారా! ప్రభూ! స్కంధా! బాల గ్రహముల స్వామీ! శత్రువులను జయించిన వాడా! క్రౌంచ పర్వతమును ఛేదించిన వాడా! కృత్తికల కుమారా! ఆరు మాతృకలకు ముద్దు బిడ్డా! నీకు నమస్సులు.
భూత గ్రహముల ప్రభూ! అగ్ని తనయా! ప్రియదర్శనా! మహా భూతపతి కుమారా! ముక్కంటి స్వామీ! నీకు నమస్సు.
ఇట్లు దేవతలు స్తుతింపగా శివుని కుమారుడు పెరుగ జొచ్చెను. పండ్రెండుగురు సూర్యులతో దీటైన వాడై చూడ నచ్చెరువు గొలుపు చుండెను. ఆతని తేజస్సు మూడు లోకములకు తాపము కలిగించు చుండెను.
ఆ గొప్ప దైవమును దేవతలు కృత్తికల కొడుకనియు, అగ్ని సుతుడనియు, మాతృకల ముద్దు బిడ్డడనియు ఎట్లు పలికిరి?
నేను మొదటి మన్వంతరము నాటి స్వామి పుట్టుకను చెప్పితిని. దేవతలు పరోక్షమును గూడ జూడ గలవారు కనుక ఆ ప్రభువు నిట్లు స్తుతించిరి.
రెండవ జన్మమున కృత్తిక, అగ్ని, సప్త మాతృకలు, పార్వతి అనువారు ఈ గుహుని పుట్టుకకు కారణమైన వారు.
రాజా! నీవు నన్నడిగిన దానికి సంబంధించిన విషయ మంతయు, ఆత్మవిద్య యనెడు అమృతమును, రహస్యమైన దానిని, అహంకారము యొక్క ఉత్పత్తిని, నీకు వివరించి చెప్పితిని.
ఆ స్కందుడు సర్వ పాపములు రూపుమాపు సాక్షాత్తు మహాదేవుడే. బ్రహ్మ ఆతని అభిషేకమునకు షష్ఠి తిథిని నిర్ణయించెను.
పండ్లు మాత్రము భుజించుచు మనసు నదుపులో నుంచుకొని ఈ తిథిని గడపు వాడు పుత్రులు లేని వాడైనను పుత్రులను పొందును ధనము లేనివాడు ధనవంతుడగును. మనసులో ఏది కోరిన అది వానికి లభించును.
కార్తికేయుని ఈ స్తోత్రము పఠించు వాని యింట బాలురకు క్షేమము ఆరోగ్యము కలుగును.
