వరాహ మహా పురాణము

Table of Contents

అధ్యాయము - 22

 

 

అట్లు పరమేశ్వరుడగు రుద్రుడా కైలాస గిరి యందు నివసించు చుండగా ఒకప్పుడు గౌరీ దేవి తండ్రి పగ మదిలో మెదలగా రుద్రునిపై కోపించెను.

 

 

ఈతడు మునుపు దక్షున కపకార మొనర్చెను. అతని యజ్ఞమును పాడు చేసెను. కావున నేను మరియొక దేహమును తాల్తును.

 

 

తపస్సుతో అతని నారాధించి మరల అతని గృహమును జేరు కొందును. అట్లు గాక బంధువు లందఱు నశించిన నా తండ్రి కడ కెట్లరుగుదును.

 

 

భవుని యిల్లాలు, దక్షుని కూతురు అగు ఆ సుందరి యిట్లు తలపోసి తపస్సునకై హిమవంతమను మహా పర్వతమున కరిగెను.

 

 

అంత పెద్ద కాలమునకు దేహమును కృశింప జేసి, తన శరీరాగ్నితో దానిని కాల్చి వైచి యాయమ కొండ కూతురాయెను.

 

 

ఆ దొడ్డ వనిత ఉమయను పేరు తాల్చి, ‘కృష్ణ’ యనియు వ్యవహారము గలిగి మిక్కిలి చక్కనైన రూపము తాల్చి హిమవంతుని గృహమున ఉదయించెను.

 

 

ఆ త్రిలోచనుడే నాకు భర్త కావలయు నని పరమేశ్వరునే తలచుచు గొప్ప తనమున నిలిచి యాయమ తపము చేసెను.

 

 

హిమవత్పర్వతమున అట్లు తన్ను గూర్చి ఘోర తపము చేయు చున్న, ఆమె ఆశ్రమమునకు మహేశ్వరుడు ముదుసలి, అవయవముల పట్టు సడలిన వాడు, అడు గడుగునకు తొట్రు పడుచున్న వాడు నగు బ్రాహ్మణుని రూపము తాల్చి వచ్చెను.

 

 

ఆ విప్ర వరుడు అతి కష్టమున ఆమె దరికి వచ్చి మంచిదానా! బాపడను, ఆకలి వేయు చున్నది. నాకు తినుట కేదైన పెట్టుము, అని అడిగెను.

 

 

అతడిట్లు పలుకగా శైలకన్య ఉమ ఆ బ్రాహ్మణునితో ‘ఓయీ! విప్ర నీకు తినుటకు పండ్లు మొదలగునవి యిత్తును. వేగము స్నానము చేయుము. నీ యిచ్చ వచ్చినట్లు అన్నము తినుము’ అని పలికెను.

 

 

అట్లు ఆమె పలుకగా ఆ విప్రుడు ఆ ఆశ్రమమునకు ప్రక్క నున్న మహా నదియగు గంగకు స్నానము చేయ గోరి యరిగెను. స్నానము చేయుటకై దిగెను.

 

 

బ్రాహ్మణ వేషము తాల్చిన రుద్రుడు స్నానము చేయు చుండగా నొక భయంకరమగు మొసలి మాయ వలన నేర్పడెను. అప్పుడా విప్రుని ఆ చెడ్డ మొసలి పట్టు కొనెను.

 

 

మిక్కిలి బలము గల ఆ మొసలికి పట్టు పడిన ఆ ముదుసలి తన్ను తాను మరియొక విషముగా ఆమెకు కన్పట్ట జేయుచు నిట్లు పలికెను.

 

 

‘బాలా! చచ్చితిని. పరుగున వచ్చి నన్ను ఈ క్రూర మృగము బారి నుండి లాగికొని పొమ్ము. ఏదో కీడు మూడక ముందే నన్ను రక్షింప వలయును.’

 

 

అతడట్లు పలుకగా పార్వతి యిట్లు తల పోసేను. తండ్రియని హిమవంతుని మగడని శంకరుని తాక జాలుదును. తపస్సు చేత పవిత్రత నొందిన నేను ఇప్పుడీ బ్రాహ్మణుని ఎట్లు తాక జాలుదును?

 

 

ఇప్పుడు నీటిలో మొసలికి చిక్కిన ఈతనిని ఈ వలకు లాగ కుందునేని నాకు బ్రహ్మ హత్య చుట్టుకొను ననుటలో సందియము లేదు.

 

 

ఇతరమైన తప్పిదము అధర్మమును పోగొట్టు కొన వచ్చును. బ్రహ్మ హత్యా దోషము మాత్రము అట్లు పోగొట్టు కొనరానిది. అని తలచి ఆమె వడిగా నరిగెను.

 

 

అట్లామె వడివడిగా నరిగి ఆ పాఱుని చేతితో పట్టుకొని నీటి నుండి లాగెను. ఇంతలో తన తపస్సునకు లక్ష్యమైన ఆ రుద్రుడే ఆమె చేతికి చిక్కెను.

 

 

అతనిని చూచినంత ఆ దేవి మిక్కిలి సిగ్గు పడెను. పూర్వము తన్ను వదలిన విషయమున తల పోయుచు ఆ సుందరి సిగ్గుతో ఒక్క పలుకేని పలుక కుండెను.

 

 

అట్లు పలుక కున్న ఆ గౌరిని గాంచి రుద్రుడు మెల్లగా నవ్వుచు ఇట్లు పలికెను. ఓ కాంతా!

నన్ను చేపట్టితివి. ఇప్పుడు ఎట్లు వదల గలవు?

 

 

నా పాణి గ్రహణమును నీవు వ్యర్థము చేసినచో నేను బ్రహ్మ పుత్రికను ఆహారము కొఱకు వేడు కొందును.

 

 

‘ఇది పరిహాసము కాదు’ అని పలుకగా అతని యందు అనన్య భావము గల ఆ దేవి సిగ్గు పడుచు చిరునగవుతో ఇట్లు పలికెను.

 

 

దేవదేవా! త్రిలోకేశా! ఈ ప్రయత్న మంతయు నిన్ను పొందుటకే. పూర్వ జన్మములలో నేనారాధించిన దేవుడవు, మహేశ్వరుడవు, భర్తవు నీవే.

 

 

ఇప్పుడును ఆ మహేశ్వర దేవుడవగు నీవే నాకు పతివి. మరియొకడు కాజాలడు. కానీ నన్నిచ్చుటకు ప్రభువు మా నాయన కలడు. నేనాతని కడ కరుగుదును. అతని యనుమతి గొని నన్ను నీవు పాణి గ్రహణము చేయ నగును.

 

 

ఇట్లు పలికి ఆ దేవి తండ్రి కడ కరిగి చేతులు దోయిలించి హిమవంతునితో నిట్లు పలికెను.

 

 

ఇప్పటికి వెనుకటి నా పుట్టువున దక్షుని యజ్ఞమును నాశన మొనర్చిన శంకరుడు నా భర్త. నేనతనినే సర్వ గతులలో భావన చేయుచు తపస్సుతో మనసున ధ్యానించు చున్న దానను.

 

 

విశ్వపతి యగు శంకరుడు బ్రాహ్మణుడై భోజనము కొఱకు నా తపో వనమున కరుదెంచి అన్న మడిగెను. నేను స్నానము చేసి రమ్మనగా గంగ కరిగెను.

 

 

అందీ శంకరుడు పెద్ద దేహము, బాపని ఆకారము గలవాడై మొసలికి చిక్కి అయ్యో! కాపాడు! అని అరచెను.

 

 

నాయనా! బ్రహ్మ హత్యకు భయపడి నేనాతనిని చేతితో పట్టు కొంటిని. పట్టుకొని నంత మాత్రమున ఆ శంకరుడు తన నిజ దేహమును చూపెను.

 

 

అంతనా దేవుడు అట్లు చేయి పట్టిన నన్ను ‘దేవీ! తపోధనా! నీవేమియు విచారింపకుము’ అని పలికెను.

 

 

మహాత్ముడగు ఆ శంకరు డట్లు పలుకగా నేను అతని అనుమతిని నిన్నడుగా వచ్చితిని. ఇప్పుడు తగిన కార్యమును నీవు వేగము చేయ దగును.

 

 

అంత పర్వత రాజు ఆ మాట విని పరమ ఆనందముతో ఆ సమయమున విప్పారిన మోము గల ధన్యయగు తన బిడ్డతో ఇట్లు పలికెను.

 

 

బిడ్డా! లోకమున నేను ధన్యుడను. ఏలనన రుద్రుడు తానై నాకల్లుడు కానున్నాడు. సంతానము గల దేవులందరిలో నేను, నీ వలన సర్వ శ్రేష్ఠుడ నయితిని.

 

 

‘నేను వచ్చు నంత వరకు ఒక్క క్షణము నిలువుము’ అని పలికి కొండల రేడగు హిమవంతుడు బ్రహ్మ దేవుని కడకు కరిగెను.

 

 

అచట సర్వ దేవతలకు పితామహుడు, మహాత్ముడు నగు బ్రహ్మ దేవుని గాంచి పర్వత రాజు ప్రణమిల్లి యిట్లు పలికెను.

 

 

దేవా! నా బిడ్డ ఉమను రుద్రున కొసగెదను. నీవవు అనుమతించినచో ఆ పని చేయుదును. నాకానతిమ్ము.

 

 

అంత దేవతలకు, లోకములకు పితా మహుడగు ఆ బ్రహ్మ ఆనందమంది ‘వెళ్ళు, రుద్రునకు నీ కన్య నిమ్ము’ అని పలికెను.

 

 

అంత హిమ వంతుడు వడివడిగా తన యింటి కరుదెంచి వేగమే దేవతలను, ఋషులను, సిద్ధ సంఘములను అహ్వానించెను.

 

 

తుంబురుని, నారదుని, హాహా హూహూవును, కిన్నరులను, అసురులను, రక్కసులను పిలిపించెను.

 

 

పర్వతములు, నదులు, చిరు కొండలు, ఓషదులు, రాలకుప్పలు, ఈ అన్నియు ప్రాణుల ఆకారములు ధరించి హిమవంతుని బిడ్డకు శంకరునితో జరుగు వివాహమును జూడ వచ్చెను.

 

 

అందు భూమియే పెండ్లి అరుగు, ఏడు సముద్రములే కలషములు, సూర్య చంద్రులే దీపములు, నదులే జలము లాయెను.

 

 

ఇట్లు పెండ్లి వస్తువుల నన్నింటిని సమకూర్చు కొని పర్వత రాజు మందర పర్వతమును రుద్రుని కడ పంపెను.

 

 

మందరుడు వచ్చి చెప్పగా శంకరుడు శీఘ్రముగా హిమవంతుని కడకు వచ్చెను. యథా విధిగా పరమేశ్వరుడు ఉమా దేవిని పాణి గ్రహణము గావించెను.

 

 

ఆ వేడుక యందు పర్వత నారదు లిద్దరు పాటలు పాడిరి. సిద్ధులు నాట్య మాడిరి. మంచి వృక్షములు పెక్కు పూవులను చల్లెను. దేవ కాంతలు పెద్దగ నృత్యములు చేసిరి.

 

 

మంగళ జలములు ప్రవహించిన ఆ పెండ్లి యందు, లోకేశుడగు బ్రహ్మ చక్కని స్థితి కలవాడై ‘బిడ్డా! లోకమున నీ మగడు తక్కిన పురుషు లందరిలో గొప్పవాడు. నీవు స్త్రీ లందరి కంటె మిన్న యైన దానవు’ అని రుద్రునితో కూడిన ఉమా దేవిని ప్రశంసించి తన పురమున కరిగెను.

 

 

పర్వత రాజు హిమవంతుడు అల్లుని గొప్పగా మన్నించి సాగ నంపెను. అట్లే దేవతలను, దైత్యులను, వేరు వేరు ఋషులను ఆయా పర్వతములను వివిధములగు వస్తువులతో, ఆభరణములతో, వస్త్రములతో మేలు రకపు భోజనములతో సత్కరించి పంపెను.

 

 

ఇట్లు చక్కని మోము గల తన బిడ్డను దేవ శ్రేష్ఠుడగు శివున కర్పించి మహాత్ముడు, పర్వత రాజు అగు హిమవంతుడు శోకము, పాపము లేనివాడై పరిశుద్ధుడై బ్రహ్మ లోకమున జరిగిన యజ్ఞము నందు వలె ప్రకాశించెను.

 

 

రాజ శేఖరా! దేవ దానవులు కూడా ఎరుగని గౌరీ పుట్టుకను గూర్చి నీకు చెప్పితిని. అట్లే మూడు జన్మములలో స్వయంభువు, దక్షుడు, పర్వత రాజు అను వారికి ఆమె పుట్టిన సంగతియు, వివాహమును నీకు వర్ణించితిని.

 

 

ఇట్లామె గౌరియను పేరున కారణ జన్మముగా ఆకారము ధరించి పుట్టిన విషయ మంతయు తపస్సుతో పండిన బుద్ధి విశేషము గల మహర్షి తన్నడిగిన ప్రజా పాలునకు చెప్పెను.

 

 

ఆ మహర్షి చెప్పిన గౌరీ పుట్టుక, వివాహముల కథ నీకు ఉన్నదున్నట్లు చెప్పితిని.

 

 

పార్వతీ దేవికి, సంబధించిన ఈ వృత్తాంత మంతయు తదియ నాడు జరిగినది. కావున ఆ తదియ నాడు స్త్రీ పురుషులు ఉప్పు తినుట మాన వలయును. స్త్రీ ఆ తిథి నాడు ఉపవాసమున్నచో సౌభాగ్యము పొందును.

 

 

దరిద్రురాలగు స్త్రీ గాని, దరిద్రుడగు పురుషుడు గాని ఈ కథ విని తదియ నాడు ఉప్పు తినుట మానినచో వారి అన్ని కోరికలు తీరును. సౌభాగ్యమును కలుగును. ద్రవ్య సంపదలు, ఆరోగ్యము, కాంతి, పుష్టి ఎల్లవేళల పొందుదురు.