వరాహ మహా పురాణము
అధ్యాయము - 26
ఓ బ్రాహ్మణోత్తమా! వెలుగునకు ఆకార మేర్పడుట యెట్లు? నీకు నమస్కరింతును. నాయీ సంశయమును తీర్పుము.
జ్ఞానమను శక్తి గల సనాతనమగు ఆత్మ ఒక్కటియే మొదట ఉండెడిది. అది రెండవ దానిని కోరునప్పటికి తనలో నున్న వెలుగు వెలువడియెను.
అదియే గొప్ప వెలుగు గల సూర్యుడు. ఆతని వెలుగులు ఒక దానితో నొకటి బాగుగా కలిసి పోయి ఈ మూడు లోకములను ప్రకాశింప జేయు చున్నవి.
ఆతని యందు ఒక్క మారుగా సురలు, సిద్ధులు, అన్ని విధములైన దేవ గణములు, మహర్షులతో పాటు పుట్టిరి. అందు వలననే ఆతడు ‘సూర్యు’ డాయెను. (సూర్యుడనగా పుట్టుటకు కారణ మైనవాడు)
బాగుగా కదలాడిన ఆతని తేజస్సు నుండి వేరుగా ఒక శరీర మేర్పడెను. వేదవాదులు ఆ శరీరము గల వానిని రవి యని కీర్తించిరి.
ఆతడు ఆకాశమున ఉదయించుచు లోకము లన్నింటిని ప్రకాశింప జేసెను. కావున ఆతనికి భాస్కరుడను పేరు కలిగెను. ఆ ప్రకాశమే అధిక మగుట వలన ప్రభాకరుడనియు నందురు.
పగటిని దివస మందురు. దానిని చేయువాడు కనుక దివాకరుడు. జగమున కంతటికిని మొదటి వాడు కావున ఆదిత్యుడను పేరేర్పడెను.
ఈతని తేజస్సు చేతనే పండ్రెండుగురు ఆదిత్యులు విడిగా పుట్టిరి. ఆ అందరకు ప్రధానునిగా ఎల్లవేళల ఈతనినే చెప్పుదురు.
జగము నంతటిని వ్యాపించు చున్న ఆ పరమేశ్వరుని గాంచి ఆతని లోనే యున్న దేవత లందరు వెలుపలికి వచ్చి యిట్లు స్తుతించిరి.
దేవా! ఈ సమస్త జగత్తునకు నీవే కారణమవు. విశ్వమంతట తిరుగుచు ప్రళయమున నాశనము చేయు చున్నావు. ప్రభూ! శాంతింపుము. కర్మసాక్షీ! దేవ లోకములను మాడ్చి వేయకుము.
లోకము లన్నింటిని తపింప జేయు తేజమును, యజ్ఞముల ప్రవృత్తి కొరకు నీవు వ్యాప్తి చేయు చున్నావు. తీక్షణము దివ్యము నైన నీ చక్రమును కాలమను పేరుతో వ్యవహరింతురు. అది చీకట్లను పారద్రోలును.
నీవు ప్రభాకరుడవు, రవివి. ఆది దేవుడవు. ఈ చరాచరమైన సమస్తమునకు ఆత్మవు. తాతవు. వరుణుడు, యముడు నీవే. గడచినది గడుప నున్నదియు నీవే అని సిద్ధులు పల్కుదురు.
సురలోకము పూజ లందుకొను దేవా! నీవు చీకట్లను చీల్చి వేయుము. శాంతింపుము. పితృ దేవతలు నిన్ను కొని యాడుదురు. నీవు వేదాంతము చేత తెలియ దగిన వాడవు. యజ్ఞములలో నిన్నే అర్చింతురు. నీవు విష్ణుడవు.
ఓ సురనాథా! శంభూ, మమ్ము చక్కగా పాలింపుము అని వారు భక్తితో స్తుతించిరి.
ఇట్లు దేవతలు స్తుతింపగా ఆతడు సౌమ్యమైన రూపమును దాల్చెను. గొప్ప కాంతి గలవాడై వెను వెంటనే దేవతలకు గాన వచ్చెను.
దేవతలకు తాపము కలిగించుట, మరల చల్ల బడుట అను నిదియంతయు సప్తమి నాడు జరిగెను. సూర్యుడా దినముననే భూమండలముపై ఆకృతిని పొందెను.
ఈ తిథిని, సూర్యుని భక్తితో ఉపాసించు పురుషునకు భాస్కరుడు ఇష్ట ఫలము ననుగ్రహించును.
రాజా! ప్రాత కాలపు నాటి సూర్యుని కథను నీకు వివరించితిని. మొదటి మన్వంతరమున నిది జరిగెను. ఇప్పుడు మాతృ దేవత లను గూర్చి చెప్పెదను. వినుము.
