వరాహ మహా పురాణము

Table of Contents

అధ్యాయము - 103

 

 

రాజా! మధు ధేనువును గూర్చి చక్కగా చెప్పెదను. ఇది సర్వ పాతకములను నశింప జేయునది. అలికిన నేలపై లేడి చర్మము దుర్భాసనము నుంచి పదునారు నిండు కడవల తేనెతో ఆవును చేయ వలయును, అందు నాలుగవ భాగముతో దూడను కల్పింప వలయును.

 

బంగారముతో ముఖము, అగురు చందనములతో కొమ్ములు, రాగితో తోక, పట్టు వస్త్రములతో గంగడోలు, చెరకు గడలతో పాదములు, తెల్లని కంబళితో కప్పిన గంగడోలు, బెల్లముతో ముఖము, చెక్కెరతో నాలుక, పూవులతో పెదవులు, పండ్లతో దంతములు, దర్భలతో రోమములు, వెండితో గిట్టలు, కొలతకు సరి పడునట్లు ఆవును తీర్ప వలయును. ఏడు విధములగు ధాన్యములను ఉంచ వలయును.

 

నాలుగు దిక్కు లందును నాలుగు నూవుల పాత్రలు ఉంచ వలయును. రెండు వస్త్రములు పైవి కప్ప వలయును. గంటలు, ఆభరణములతో అలంకరింప వలయును. కంచుతో చేసిన పాలు పితుకు పాత్రను ఏర్పరిచి, గంధ పుష్పములతో సువాసన కూర్పు వలయును.

 

ఆయనము, విషువము, పుణ్య తిథి, వ్యతీపాతము, దినక్షయము, (పగటి భాగము తక్కువగా నున్న దినము) సంక్రాంతి, గ్రహణము అను దినములలో కానీ, బుద్ధి పుట్టినప్పుడు కాని ద్రవ్యము, బ్రాహ్మణుడు లభించుటను చూచుకొని ఈ దానము చేయ వలయును.

 

దరిద్రుడు, శ్రోత్రియుడు, ఆహితాగ్ని, ఆర్యావర్తమున పుట్టిన వాడు (వింధ్య హిమవత్పర్వతముల నడిమి దేశమును ఆర్యావర్త మందురు.) వేద వేదాంగములను తుదిముట్ట చదివిన వాడు అగు బ్రాహ్మణునకు, లేదా అటు వంటి వానికి ఈ మధు దేనువును దానమీయ వలయును.

 

తోక దగ్గరగా కూర్చుండి గంధము ధూపము మొదలగు వానితో పూజించి జంట వస్త్రములతో కప్పి ఉంగరము, చెవి పోగులు అనువానితో పాటు శక్తి ననుసరించి ధన విషయమున వంచన చేయక దక్షిణ నొసగి ముందు నీరు వదలి తరువాత దానము చేయ వలయును.

 

తల్లీ! నీవు సర్వ దేవతలకు నాలుకవు. సర్వ భూతముల మేలు నందు ప్రీతికల దానవు. నీ వలన పితృ దేవత లందరు ప్రీతు లగుదురు గాక! ఓ మధుదేనూ! నీకు నమస్కారము అని పలికి ఆ గోవును బ్రాహ్మణునకు సమర్పింప వలయును.

 

తల్లీ! నేను ప్రత్యేకించి కుటుంబము కొరకు నిన్ను గ్రహించు చున్నాను. కామధేనూ! నా కామముల నన్నింటిని తీర్చుము. మధు ధేనూ! నీకు నమస్కారము (అని పుచ్చుకొను వాడు పలుక వలయును.)

 

దానము చేత పవిత్రుడై ‘మధువాతా’ ఇత్యాది మంత్రముతో, గొడుగు చెప్పులతో పాటుగా ధేనువును దానమీ వలయును.

 

ఇట్లు భక్తితో మధు ధేనువును దాన మిచ్చిన వాడు పాయసముతో, తేనెతో ఆ దినము గడుప వలయును.

 

దానము పుచ్చుకొన్న బ్రాహ్మణుడు కూడ మూడు రాత్రులు పాయసము, తేనె గల భోజనముతో గడుప వలయును.

 

ఇట్లు చేసినచో కలుగు పుణ్య మెట్టిదియో ఓ రాజా! తెలిసి కొనుము.

 

తేనెలు, పాయస కర్దమములు గల నదులు ప్రవహించు చోటికిని, ఋషులు, మునులు, సిద్ధులు ఉన్న చోటికిని ధేనుదాత లరుగుదురు.

 

అచట సుఖము లన్నియు అనుభవించి బ్రహ్మ లోకమున కరుగును. అందు బహు కాలము సుఖముగా నుండి మరల మనుష్య లోకమునకు వచ్చి విస్తారములగు భోగముల ననుభవించి విష్ణు లోకమున కరుగును

 

వెనుక పది తరముల వారిని, ముందు పది తరముల వారిని తన తరమును మొత్తము ఇరువది యొక్క తరముల వారిని మధు ధేను ప్రసాదము వలన విష్ణు సాయుజ్యమును పొందించును.

 

ఇది విను వాడును, భక్తితో వినిపించు వాడును సర్వ పాపముల నుండి ముక్తి పొంది విష్ణు లోకమున కరుగును.