వరాహ మహా పురాణము
అధ్యాయము - 112
ఓం శ్రీవరాహ దేవునకు నమస్కారము. ఓం బ్రహ్మ కుమారుడగు సనత్కు మారునకు నమస్కారము.
లీలగా భూమిని ఉద్ధరించిన వరాహ స్వామికి నమస్కారము. అట్లెత్తు నప్పుడు ఆతని గిట్టల నడుమ చిక్కిన మేరు పర్వతము ఖణ ఖణ లాడినది.
ఆ దేవుడు భూమిని మంచి మాటలతో సాంత్వన పరచిన పిమ్మట సనత్కు మారుడు ఆ క్షేత్రమున భూదేవిని చూచి స్వస్తి పుణ్యాహ వాచనము గావించి వసుంధరతో ఇట్లు పలికెను.
భూదేవీ! ఎవనిని చూచి నీవు పొంగి పోవుదునో, నీవు ఎవనిని చేరు కొందువో, ఆ విష్ణువు నిన్ను కొనిపోవు నపుడు నీవు చూచిన అద్భుత మెయ్యది?
నీవు విష్ణు ముఖము నుండి వినిన దానివి తత్త్వముతో చెప్పుము. అనగా ఆ బ్రహ్మ కుమారుని మాట విని భూదేవి యిట్లు పలికెను.
నేను ఆ మహానుభావుని అడిగిన రహస్య మేదియో, అతడు నాతో చక్కగా పలికిన పలుకేదియో విప్రవరా! ఆ ధర్మపు గొప్ప మహిమను, గ్రహింప దగిన దానిని, చెప్పెదను. వినుము.
భగవంతుడు వక్కాణించిన ధర్మములలో మిక్కిలి రహస్యమైన దానిని చెప్పు చున్నాను. అది సంసారము నుండి విముక్తి కలిగించు నట్టిది.
ఆ ప్రభువు, విష్ణు భక్తున కేది కార్యమో, ఏది మిక్కిలి శ్రద్ధతో చేయ దగినదియో, ధర్మము లన్నింటిలో వ్యాపించి నిశ్చయ మైనదేదో, మిక్కిలి రహస్య మైనదేదో, సనాతన మగునదేదో అట్టి పరమ ధర్మమును వక్కాణింపగా నేను వింటిని.
అంత భూదేవి మాటలు విని మహాతాపసుడు, బ్రహ్మ పుత్రుడు అగు సనత్కు మారుడు కోకాదిశ ముఖ తీర్థము వైపు చూచి అచట నున్న తాపసులు, బ్రహ్మచారులు, ఇంకను ఆ సమయమున అచట నున్నవారు మొదలగు వారి నందరిని అచటకు రావించి యోగులలో పరమ ప్రభువు పూతాత్ముడు నగు అతడు భూదేవితో ఇట్లు పలికెను.
వరాననా! భావించుట కలవి కాని ధర్మమును నేను మున్నడిగి తిని. దానిని చెప్పుము.
అంత నతని మాట విని ఋషి పుంగవులకు ప్రణమిల్లి మిక్కిలి ప్రీతి నొందిన భూదేవి తీయని పలుకులతో ఇట్లు పలికెను.
“ఋషులారా! మీరందరు విష్ణు ముఖము వలన నేను విన్న దానిని వినుడు” అని పలుకగా వారు “అట్లే! నీకు స్వస్తి, చెప్పుము”, అని పలికిరి. ఆమె ఇట్లు చెప్పెను.
చంద్రుడు, వాయువు లోకమున కానరావు. సూర్యుడు నక్షత్రములు రూపుమాసి పోయినవి. దిక్కు లన్నియు మొద్దుబారి పోయినవి. ఏమియు తెలియ రాకున్నది.
అచట గాలి వీవదు. అగ్ని వెలుగదు. నక్షత్రములు ప్రకాశింపవు. అచట ఏమియు తెలియ రాదు. తారలు లేవు, రాశులు లేవు.
అంశువులు, నక్షత్రములు, గ్రహములు, కుజుడు, శుక్రుడు బృహస్పతి, ఎవ్వరు లేరు.
శని, బుధుడు, ఇంద్రుడు, యముడు, వరుణుడు, ఇంకను తక్కిన దేవతలు ఎవ్వరును లేరు. బ్రహ్మ విష్ణు మహేశ్వరు లనెడు ముగ్గురు దేవులు తప్ప మరి యెవ్వరు లేరు.
అప్పుడు భారముతో మిక్కిలి వగచిన భూదేవి బ్రహ్మను శరణు చొచ్చెను. మాధవుని ఇల్లాలగు ఆమె ఆ దేవుని కడ కరిగి దీనముగా ఇట్లు పలికెను.
దేవేంద్రా! పితామహా! భారము పీడింపగా నేను పర్వతములతో అడవులతో పాటుగా మునిగి పోయితిని. నన్ను తరింప జేయుము.
భూదేవి మాట విని లోకపితా మహుడగు బ్రహ్మ ముహూర్త కాలము ధ్యానములో నుండి భూమితో ఇట్లనెను.
వసుంధరా! ఈ విషమ దశలో ఉన్న నిన్ను నేను ఉద్ధరింప జాలను. లోకముల కెల్ల ప్రభువు, సర్వ దేవతలకు మిన్న, మొదటి కర్త, లోకేశుడు, విలుకాడు, మాయల పెట్టె అగు నల్లని దేవరను శరణు పొందుము.
మా యెల్లరకు ఏ పని పడినను, మమ్ము ద్ధరించుట కాతడే సమర్థుడు, నిన్ను ద్ధరించునని మరల చెప్పనేల?
అంత కమలముల రేకుల వంటి కనులు గలదియు, అనేకములగు ఆభరణములను తాల్చి నదియునగు ఆ భూదేవి అనంత శయనమున యోగ నిద్రలో ఉన్న మాధవుని, చేతులు జోడించి నదై ప్రార్థించెను.
ప్రభూ! నేను బరువుతో నున్నాను. బ్రహ్మను శరణు చొచ్చితిని. ఆయన కాదనెను. ఇట్లు పలికెను.
“అమ్మా! నిన్ను దాట వేయుటకు నాకు శక్తి చాలదు. మాధవుని కడ కరుగుము. సముద్రమున మునిగినను నిన్ను ద్ధరించుట కతడు సమర్థుడు”.
దేవదేవా! లోకనాథా! జగత్పతీ! నాపై దయ జూపుము. భక్తురాలను, శరణు కోరితిని. మాధవా! నన్న నుగ్రహింపుము.
నీవు సూర్యుడవు. చంద్రుడవు, యముడవు, కుబేరుడవు, ఇంద్రుడవు, వరుణుడవు, అగ్నిని, వాయువవు.
నీవు అక్షరుడవు. క్షరుడవు. దిక్కులు, విదిక్కులును నీవే. మత్స్యము, కూర్మము, వరాహము, నారసింహము, వామనుఁడు, రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, మహాత్ముడగు కల్కి అను అవతారము లన్నియు నీవే.
మహా కీర్తిశాలివగు నీవు ఇట్లనేక విధములుగా ప్రతి యుగము నను వేలవేలు రూపములను, ఉన్న వానిని, రానున్న వానిని యోగము తో ధరింతువని మేము విను చున్నాము.
భూమి, వాయువు, ఆకాశము, జలము, అగ్ని అనునవియు, శబ్దము, స్పర్శ, రూపము, గంధము అనునవియు అన్నియు మాకు నీవే.
గ్రహములు, నక్షత్రములు, కలలు, కాలము, ముహూర్తములు, జ్యోతిశ్చక్రము, ధ్రువుడు ఈ అన్నింటిని నీవే ప్రకాశింప జేయుదువు.
నెల, పక్షము, దినము, సంవత్సరము, ఋతువులు, అయనములు, ఆరు రసములు అన్నియు సమాహార రూపమున నీవే.
నదులు, సముద్రములు, పర్వతములు, మహా సర్పములు, మేరువు, మందరము, వింధ్యము, మలయము, దర్దురము ఇవి యన్నియు నీవే.
హిమవంతుము, నిషధము, శ్రేష్ఠమగు ఆయుధమగు చక్రము, ధనుస్సులు, పినాకము నీవే, మోగమును, ఉత్తమమగు సాంఖ్యమును నీవే.
నారాయణా! లోకముల పరంపరయు, పరాయణమును నీవే. సంక్షేప స్వరూపము, విస్తార స్వరూపము నీవే. రక్షకుడవు. భక్షకుడవును నీవే.
యజ్ఞములలో నీవు మహా యజ్ఞ స్వరూపుడవు. నీవు యూప స్తంభములలో నెలకొని యున్నావు. వేదములలో సామ వేద స్వరూపుడవు. యజుర్వేద స్వరూపడవు. (యూపము = యజ్ఞ పశువును కట్టు స్తంభము.)
అంగములతో, ఉపాంగములతో కూడిన ఋగ్వేదము, అధర్వ వేదము నీ స్వరూపములే. గర్జనము, వర్షణము నీవే. వేధ, ఋతము, అనృతము అనునవి నీవే.
విష్ణూ! ఈ లోకము లన్నింటిని పట్టి నిలుపు అమృతమును నీవు సృజించితివి. ప్రీతివి, పరమ ప్రీతివి నీవే. నీవే పురాణ పురుషుడవు.
ధ్యానింప దగినది, తగనిది యగు జగత్తు సర్వము నీవే. ఏడు లోకములకు నాథుడవు నీవే. ఆ లోకముల సముదాయమును నీవే.
నీవు కాల స్వరూపుడవు. మృత్యువవు. భూత స్వరూపుడవు. భూతములను పాలించు వాడవు. ఆది మధ్యాంత రూపుడవు. మేధవు, బుద్ధివి, స్మృతివి.
నీవు ఆదిత్యుడవు. యుగముల పరంపరవు. అయిదు విధములైన గొప్ప తపస్సుల స్వరూపమగు ప్రమాణముల కందని స్వరూపము కలవాడవు. ఋషులలో మహర్షివి.
నీవు భయంకరమగు దండ రూపుడవు. గొప్ప తేజస్సు కలవాడవు. సిగ్గు, లక్ష్మి, విజయము నీవే. నాగులలో అనంతుడు, సర్పములలో తక్షకుడు నీవే, ఉద్వహము, ప్రవహము అను తీవ్ర వాయు స్వరూపములు, వరుణుడు, వారుణము నీవే.
నీవు క్రీడలలోని చైతన్య స్వరూపడవు, ఇండ్లలో గృహ దేవతా మూర్తివి. సర్వాత్మకుడవు. సర్వ గతుడవు. వృద్ధి, మన్నన నీ స్వరూపములే.
మెరువులలో అంగములు, మెరపుల లోని మహా కాంతియు నీవే. యుగము మన్వంతరము నీవే. వృక్షములలో నీవు వనస్పతివి. (వనస్పతి = పూవులు లేకుండ కాచెడు చెట్టు.)
మాధవా! గ్రుడ్డు నుండి పుట్టునవి, పగుల గొట్టుకొని వచ్చునవి, చెమట వలన పుట్టునవి, గర్భము నుండి పుట్టునవి అను వానిలో నీవే యున్నావు. నీవు శ్రద్ధా రూపుడవు. దోషములను పరిమార్చు వాడవు.
నీవు గరుడుడవై మహాత్ముడగు మాధవుని మోయు చున్నావు. దుందుభి, రథము, చక్రముల పట్టాల ఘెషతో ఆకాశమున ప్రవర్తించు చుందువు.
జయ విజయులు, గృహ దేవతలు నీవే. సర్వాత్మకుడవు. సర్వగతుడవు. చేతన, మనస్సు నీవే.
నీవు భగము, వృషము, లింగము, పరుడవు, పరమాత్మకుడవు సర్వ భూతములకు నమస్కరింప దగిన వాడవు. దేవా! నమస్సు, నమస్సు, మునిగిన నన్ను కాపాడుటకు లోకనాథా! నీవే సమర్థుడవు.
ఈ స్తోత్రము ఆది కాలమునకు సంబంధించినది. అన్ని పాపములను హరించునది. మంగళ మైనది. దృఢమైన వ్రతము గలిగి ఈ కేశవ స్తోత్రమును పఠించు నరుడు సర్వ రోగముల నుండియు, సర్వ బంధముల నుండియు ముక్తు డగును.
పుత్రులు లేనివాడు పుత్రుని, దరిద్రుడు ధనమును, భార్య లేనివాడు భార్యను, పతిలేని పడతి పతిని పొందుదురు.
రెండు సంధ్యలలో ఈ మాధవ మహా స్తవమును పఠించు వాడు విష్ణు లోకమున కరుగను. విచారణ చేయ బని లేదు.
ఈ మహా స్తుతిని కేవలము అక్షరములు రూపములలో నైనను చదువు వాడు వేల వత్సరములు స్వర్గ లోకమున ప్రతిష్ఠ పొందును.
