వరాహ మహా పురాణము
అధ్యాయము - 76
ఆ మేరువునకు తూర్పున మిక్కిలి దీప్తి కలదియు, చక్రపాటమున వ్యాపించి యున్నదియు, పెక్కు ధాతువులతో విరాజిల్లు నదియు నగు దేశమున చక్రపాటము నుండి వెలువడిన దేవతల రాజధానీ పురము కలదు. అది మిక్కిలి బల గర్వితులైన దేవ దానవ రాక్షసులకును లోగొన రానిది. అందు బంగారు ప్రాకారము, తోరణము కలవు.
దానికి ఈశానీ దిక్కున గొప్ప కళా కాంతులతో అలరారు దేశమున అమరావతీపురి కలదు. అది దివ్య జనులతో నిండి యుండును. వందల కొలది విమానములు, గొప్ప బావులు, నిండారు సంతోషము గల జనులు, చిత్ర చిత్రములగు రంగులు గల పూవులు, పతాకముల, ధ్వజముల వరుసలు మొదలగు నవి సమృద్ధిగా గలవు, దేవతలతో, యక్షులతో, అప్సరసలతో, ఋషులతో శోభిల్లి యుండును. అట్టి పురందరుని పురి రమణీయము, సంపదలతో అలరారు నదియు నై యుండును.
ఆ అమరావతి మధ్య భాగమున వజ్ర వైడూర్యముల వేదికలు కలదియు, మూడు లోకము లందలి సుగుణములచే కీర్తి నందినదియు నగు సుధర్మ యను సభ కలదు.
అందు లక్ష్మీపతి సంపదల వంటి సంపదలు కలవాడు, వేయి కన్నుల వాడు, శచీపతి అగు దేవేంద్రుడు, అన్ని విధముల వారగు దేవ యోనులగు సిద్ధాదులతో పరివృతుడై ఉండును.
మరియు అందు మహాత్ముడగు భాస్కరుని నగరము సువంశమనునది కలదు. అందు సురల కధ్యక్షుడు, సర్వ దేవతల మ్రొక్కు లందుకొను వాడునగు సూర్య భగవానుడు ఉండును.
ఆ అమరావతికి దగ్గరనే అన్ని దిక్కులకు వ్యాపించి ఉన్నదియు, గొప్ప గుణములతో కూడినదియు నగు తేజో వతియను నగరి మహాత్ముడగు అగ్ని దేవునికి సంబంధించినది కలదు.
అట్లే (దానికి ప్రక్క) ఆయా మంచి గుణములతో విలసిల్లు యముని పురి కలదు. దాని పేరు సంయమని. మూడు లోకములలో ప్రసిద్ధి కెక్కినది.
అట్లే నాలుగవ దిక్కు అగు నైరృతి యందు బుద్ధి శాలియగు విరూపాక్షుడను నిరృతి దిగ్భాగాధిపతి నగరము మిక్కిలి శోభ కలది కలదు. దాని పేరు కృష్ణావతి.
నైరృతికి ఉత్తరముగా అయిదవది యగు పడమటి దిక్కునందు మహాత్ముడు జలాధిపతి యగు వరుణుని నగరము శుద్ధవతి యనునది కలదు.
అయిదవ దిక్కునకు ఉత్తరముగా వాయుదేవుని పురి సర్వ గుణముల చేత మేలైనది, గంధవతి యను ప్రసిద్ధి కెక్కినది కలదు.
దానికి ఉత్తరముగా గుహ్యకుల అధిపతి అగు కుబేరుని పురి, వైడూర్యముల అరుగులు కలది, మహోదయ అను పేరు కలది కలదు.
అట్లే ఎనిమిదవ దిక్కున మహాత్ముడగు ఈశానుని పురి మనోహర అనునది కలదు. అందు పెక్కు విధముల భూతములు, మనోహరములగు పూవులతో ఇంపైన తోటలు గల ఆశ్రమములు గలవు.
ఈ దేవ లోకమును అందరు పొందగోరు చుందురు. దానినే స్వర్గమనియు కీర్తింతురు.
