వరాహ మహా పురాణము

Table of Contents

అధ్యాయము - 52

రాజా! ఆ మూడు వన్నెల పురుషుడు, పశు పాలుని తనయుడు స్వతంత్రత వలన ‘అహమ్‌’ అను మూడు రంగుల కుమారుని సృజించెను.

 

అతనికి జ్ఞాన స్వరూపిణి యగు కన్య ఉదయించెను. ఆమె చక్కని మనోహరుడగు విజ్ఞానదుడను పుత్రుని కనియెను.

 

ఆతనికిని అందమైన కొడుకులు అయిదుగురు అన్నింటిని అనుభవించు వారు కలిగిరి. సంఖ్యల వరుసతో వారి పేర్లు ‘అక్ష’ శబ్ధముతో అంత మగునవి. అనగా ఏకాక్షుడు, ద్వ్యక్షుడు, త్ర్యక్షుడు, చతురక్షుడు, పంచాక్షుడు అనివారి పేర్లు.

 

వీరు మునుపు దొంగలు, తరువాత రాజునకు వశమైరి. ఆకారము లేని వారందరు శుభమైన నెలవును చేసి కొనిరి.

 

ఆ పురము తొమ్మిది ద్వారములు కలది. ఒక స్తంభము కలది. నాలుగు బాటలు కలది. వేల నదులు, నీటి లోనికి మెట్లు కలది.

 

ఆ తొమ్మిది మంది ఒక్కటిగానై ఆ పురమును ప్రవేశించిరి. (1. ఆత్రివర్ణుడు 2. అహమ్‌ 3. అవబోధకన్య 4. విజ్ఞానదుడు 5. ఏకాక్షుడు 6. ద్వ్యక్షుడు 7. త్ర్యక్షుడు 8. చతురక్షుడు 9. పంచాక్షుడు ఈ తొమ్మిది మంది). వారందరు కలసి ఒక్క క్షణమున ఆకారమును పొంది పశు పాలుడను రాజాయెను.

 

అంత నాపుర మందున్న పశుపాలుడను మహారాజు తనకు వాచకములగు శబ్దములు గల వేదములను స్మరించెను.

 

తన స్వరూపములు కలవి, నిత్యములు అగు వేదములను స్మరించి అందు చెప్ప బడిన వ్రతములను, నియమములను యజ్ఞములను మొదలగు వాని నన్నింటిని ఆ రాజు నిర్మించెను.

 

ఆ రాజొకనాడు దుఃఖపడి కర్మ కాండము నిష్టపడుచు సర్వ మెరిగిన వాడు కనుక యోగ నిద్ర యందుండి ఒక పుత్రుని సృజించెను.

 

 

ఆ కొడుకునకు నాలుగు ముఖములు, నాలుగు బాహువులు, నాలుగు వేదములు, నాలుగు బాటలు కలవు.

 

అది మొదలు కొని పశువులు మొదలైన వన్నియు ఆ రాజునకు వశమైనవి. అతడు కర్మ కాండము నుండి వెలువడి సముద్రము నందు, వనము నందు, తృణాదుల యందు, ఏనుగు మొదలగు వాని యందు సముడాయెను.