వరాహ మహా పురాణము

Table of Contents

అధ్యాయము - 82

 

ఇటు పై నదుల అవతారమును గూర్చి వినుడు. ఆకాశ సముద్రమని ప్రసిద్ధి కెక్కిన సామమను పేరు గల దాని నుండి ఆకాశమున ప్రవహించు నది యొకటి బయలు దేరెను. ఇంద్రుని యేనుగు దానిని కుదిలించి వేయు చుండును. అది ఎనుబది నాలుగు యోజనముల వెడల్పు కలది. అది మేరువును చక్కని దర్శనీయ స్థలము కావించునది. అదియు మేరు శిఖరపు ఒడ్డుల నుండి జారినదై నాలుగు పాయలుగా అయినది. అరువది యోజనముల మేర ఆధారము లేక పడుచు ప్రదక్షిణముగా తిరుగుచు నాలుగు పాయలై ప్రవహించినది. సీత, అలకనంద, చక్షువు, భద్ర అని ఆ పాయల పేర్లు.

 

ఆయా స్థలములలో ప్రవహించుచు కొన్ని వందల పర్వతములను చీల్చుకొని భూమికి చేరుట చేత దానికి గంగ అనుపేరు కలిగినది. (గాం = భూమిని, గతా = పొందినది = గంగా)

 

 

ఇక గంధమాదనము ప్రక్కగా నున్న అమరగండికను గూర్చి తెలిపెదను. అది ముప్పది యొక్క వేల యోజనముల పొడవు, నాలుగు వందల యోజనముల వెడల్పు కలిగి యుండెను. అచటి జనపదములు కేతుమాల అనుపేరు కలవి. నలుపు వన్నెయు మహాబలము కల పురుషులును, కలువల వంటి వన్నెగల చూడ ముచ్చటగా నున్న స్త్రీలును అందుందురు. అచట పనస చెట్లు పెద్దగా పెరిగి యుండును. అందలి నీరు త్రావుట వలన ముసలి తనము, రోగము లేని వారై వేయి యేండ్ల ఆయువు కలవారై జను లుందురు.

 

మాల్యవంతము తూర్పు తటమున పూర్వగండిక అను నది కలదు. ఒక కొండ కొమ్ము నుండి ప్రవహించు నది. వేల యోజనముల కొలత కలది. అందు భద్రాశ్వములను జనపదములు, భద్రసాల మను వనము ఉన్నవి. నల్లని మామిడి చెట్లు, తెల్లని పద్మము వంటి వన్నె గల పురుషులు, ఎర్ర తామరల వన్నెకల స్త్రీలు ఉందురు. వారి ఆయువు పదివేల వత్సరములు. అందు అయిదు కుల పర్వతములు శైలవర్ణము, మూలము, కోరజము, త్రిపర్ణము, నీలము, అను పేర్లు కలవి కలవు. వాని నుండి నదులు వెలువడినవి. వాని నీరు గల దేశములకు అవియే పేర్లు. ఆ దేశ వాసులు ఆ నదుల నీరు త్రావు చుందురు.

 

 

ఆ నదులు సీత, సువాహిని, హంసవతి, కాస, మమాచక్ర, చంద్రవతి, కావేరి, సురస, శాఖావతి, ఇంద్రవతి, అంగార వాహిని, హరితోయ, సోమావర్త, శతహ్రద, వనమాల, వసుమతి, హంస, సుపర్ణ, పంచగంగ, ధనుష్మతి, మణివప్ర, సుబ్రహ్మభాగ, విలాసిని, కృష్ణతోయ, పుణ్యోద, నాగవతి, శివ, శేవాలిని, మణితట, క్షీరోద, వరుణావతి, విష్ణుపది, మహానది, హిరణ్యస్కంధవాహ, సురావతి, కామోద, పతాక, అనునవి. ఇవి యన్నియు గంగకెన యైనవి. బ్రదుకున్నంత వరకు పాపములను పోకార్చునవి. చిన్న వాగులు మరియు కోట్ల కొలది కలవు. ఈ నదుల నీరు త్రావు వారు పది వేల సంవత్సరముల ఆయువు కలవారు. రుద్రుని యందు, ఉమాదేవి యందు భక్తి కలవారు.