వరాహ మహా పురాణము
అధ్యాయము - 113
మునులు, వేద పండితులు మున్నగు వారు ఇట్లు చక్కగా స్తుతించు చుండగా నారాయణుడు, దేవుడు, కేశవుడు, పరముడు, విభువు తుష్టు డాయెను.
అంత కొంతవడి ధ్యానమును పొంది, దివ్యమగు యోగమును పొంది మాధవుడు తీయని స్వరముతో వసుంధరతో నిట్లనెను.
దేవీ! నీ ప్రియము కొరకును, నీ భక్తి చేతను, నీ హృదయమున ఏది కలదో అది అంతయు చేసెదను.
కొండలతో, అడవులతో, సముద్రములతో, నదులతో ఏడు ద్వీపములతో కూడిన నిన్ను నేను పట్టుకొని నిలిపెదను.
ఇట్లు వసుధకు ఊరట కలిగించి మాధవుడు పిక్కటిల్లిన దేహ బలము గల వరాహ రూపమును భావించెను.
ఆరు వేల యోజనముల ఎత్తు, మూడు వేల యోజనముల వెడల్పుగా మొత్తము తొమ్మిది వేల యోజనముల రూపమును కల్పించెను.
ఎడమ కోరతో పట్టుకొని కొండలు, అడవులు, ఏడు ద్వీపములు, పట్టణములు గల భూమి నంతటిని పైకి లాగెను.
పట్టు దొరకని కొన్ని పర్వతములు పడి పోయినవి. ఏదో తెలియ వచ్చునట్లు వ్రేలాడు చుండినవి. విచిత్రములగు అంగములు కల అట్టివి వర్ష కాలములో మేఘముల వలె శోభిల్లినవి.
చక్రము చేత దాల్చిన వరాహ స్వామి ముఖమున వ్రేలుచు ఆ కొండలు చంద్రుని వలె నిర్మల స్వరూపము కలవియై బురదలో తామర తూడుల వలె ప్రకాశించినవి.
ఈ విధముగా వజ్రముల వంటి కోరలు గల ఉత్తమ స్వభావము గల ఆ విష్ణువు సాగరములతో కూడిన భూమిని వేయి ఏండ్లు పట్టుకొని నిలిపెను.
అట్లు ఎన్నో యుగముల కాలము ఆ భూమి ఆ విధముగా నుండగా డెబ్బది యొకటవ కల్పమున కర్దముడు ప్రజాపతి అయి ఉండెను.
అపుడు భగవానుడు, అవ్యయుడు, దేవుడునగు విష్ణువును, భూమియు ఆ ఉత్తమ మగు వరాహ కల్పమున ఒకరి యందొకరు ప్రీతి కలవారై యుండిరి.
ఆ భూమి పురాణుడు, అవ్యయుడు, పరముడు నగు ఆ దేవుని స్తుతించెను. పరమ మగు యోగముతో ఆతనిని శరణు చొచ్చెను.
దేవా! నన్ను పట్టు కొనుటలో నీకు ఆధార మెట్టిది? ఉపయోగ మెట్టిది? ఆయా కాలము నందు, ఆయా దేశము నందు, ఆయా కర్మము నందు నీ వ్యవసాయ మెట్టిది?
పడమటి సంధ్య ఎట్టిది? ఆ పై విషయము లెట్టివి? నీ యెడల ఆయా పనులు చేయుచున్న దేవతలతో తక్కిన వారు సమానులా?
నిన్ను నెలకొల్పుట ఎట్లు? ఆవాహన యెట్లు? విసర్జన ఎట్లు? అగరు గంధ ధూపనము నీవెట్లు గ్రహింతువు?
నీకు పాద్య మొసగుట ఎట్లు? నిన్ను నిలుపుట ఎట్లు? నీకు గంధము పూయుట ఎట్లు? నీకు దీప మొసగుట ఎట్లు? నీకు దుంపలు పండ్లు నివేదించుట ఎట్లు?
నీకు ఆసనము, శయనము కూర్చుట ఎట్లు? నీ పూజ చేయుట ఎట్లు? ఎన్ని సందర్భములలో పూజ చేయ వలయును. తూర్పు, పడమరల సంధ్యలలో పూజించుట వలన కలుగు పుణ్య మెట్టిది?
శరత్తు, శిశిరము, వసంతము, గ్రీష్మము, వర్షము, వర్షము ముగిసిన కాలము అను నీ ఋతువులలో చేయదగు కర్మ మెట్టిది?
అందు ఉపయోగింప దగు పూలెట్టివి? పండ్లెట్టివి? కర్మము, అకర్మము అను వానిలో శాస్త్రము వెలి పెట్టిన పదార్థము లెట్టివి?
భోగవంతులు ఏ పని చేసి లక్ష్యమున కరుగుదురు? ఎట్టి వారు ఆయా పనుల తుది భాగము లందు అతిక్రమింప కుందురు?
పూజకు ప్రమాణ మేమి? స్థాపనము ఎట్టిది? పరిమాణ మెంతటిది? ఉపవాస మనగా నెట్టిది?
పసుపు, తెలుపు, ఎరుపు రంగుల అభరణములలో ఎట్టి వానిని నీవు శాశ్వతముగా గ్రహింతువు? ఏ రంగు వస్త్రములు నీకు ఇచ్చిన వారు మేలు పొందెదరు?
ఏ ద్రవ్యములు కలిపి మధు పర్కమును నీకీయ వలయును? అందు కర్మ మెట్టిది? గుణము లెట్టివి? మధు పర్కము పుచ్చు కొనుట వలన నరుడు ఏ లోకముల కరుగును?
నీ స్తోత్రము చేయు పరమ పుణ్య కాలమున నీ భక్తుడు మధు పర్కమును ఏ ప్రమాణములో ఈవలయును?
ఏ యే మాంసములు, ఏ కూరలు, ఏ పండ్లు నీ సంబంధములగు పనులలో నివేదనకు శాస్త్రమున నుసరించి యోగ్యములు?
మంత్రముతో నిన్నాహ్వా నింపగా భక్త వత్సలుడవు నీ వరుదెంతువు. అప్పుడు ఏ మంత్ర విధానముతో నీకు నైవేద్యము ఒసగ వలయును?
నిన్నాయా ఉపచారములతో యథావిధిగ అర్చించి భక్తుడు చేయ వలసిన పను లెట్టివి? భోజనమైన తరువాత చేయ దగిన కర్మము లెట్టివి?
నీ స్తుతి, నీ అర్పణములు ఏ దోసము లేకుండ ముగిసిన తరువాత సర్వ శుద్ధికరము, శుభము అగు నీ ప్రసాదమును భుజించు వారెవ్వరు?
ఒంటి పూట భోజనము చేసి నీ కడకు వచ్చు భక్తి పరాయణులు ఏ గతికి పోవుదురు?
షష్ఠాష్టమ కాలమున భక్తి పరాయణ భావముతో మాధవుని కడ కేతెంచు వారి గతి యేమి?
కృచ్ఛ్ర చాంద్రాయణములను కర్మము లందు ఆసక్తి కలిగి నిర్వహించు వారు మాధవుని కడ కేతెంచినచో వారు పొందెడు స్థితి యెట్టిది?
శాస్త్రము చెప్పిన విధముగా వ్రత మొనరించి నీ శాసనము నందు చక్కగా మెలగు వారు మాధవుని గూర్చి ప్రయాణింతురేని వారు పొందెడు గతి యెట్టిది?
నీ కర్మము లందు పరమ శ్రద్ధ కలవారై అతి కష్టమైన సాంతపనమను వ్రతమును చేయువారు మాధవుని కడ కరుగుచు ఏ గతి పొందుదురు?
కృష్ణా! వాయువే ఆహారముగా గ్రహించి నీ యందలి భక్తితో అచంచలముగా నుండు వారు కృష్ణుని పొందుచు పొందు గతి యేమి?
స్వామీ! నీ కర్మము ననుసరించు వారై ఉప్పు కారములు లేని భోజనము తినుచు అచ్యతుని వైపు ప్రయాణించు వారు ఏ గతిని పొందు దురు?
వ్రతముల నాచరించుచు తులా పురుషక వ్రతమును చేసి కేశవుని వైపు పోవు నరులు ఏ గతిని పొందెదరు?
అచ్యుతుని కడకరుగు వారై పాలను మాత్రమే పుచ్ఛుకొని వ్రతము చేయువారు ఏగతిని కరుగుదురు?
నీ యందు చెదరని భక్తి కలవారై ప్రతి దినము ఆవునకు మేత ఇడుచు మాధవార్చన చేయు వారు ఏగతి కరుగుదురు?
బిచ్చ మెత్తుకొని బ్రదుకుచు రాలిన గింజ లేరుకొని తిను వ్రతము నవలంబించి మాధవు నర్చించు వారే గతి పొందుదురు?
నీ కర్మము లందు మిక్కిలి శ్రద్ధ కలిగి గృహస్థ ధర్మమును పాటించుచు కేశవు నర్చించు వారు ఏ గతి పొందుదురు.
వైకుంఠా! నీ క్షేత్రము లందు ప్రాణములు విడుచు వారు. మరణము పొందిన వారు ఏ లోకముల కరుగుదురు?
పంచాగ్ని మధ్య తపస్సు నాచరించి మాధవుని శరణు చొచ్చిన వారు మరణించిన పిదప ఎట్టి పరమ గతి కరుగుదురు?
ముళ్ల పానుపు నెక్కి అచ్యుతు నారాధించుచు తపము చేయు వారు ఏ గతి కరుగుదురు?
నీ భక్తిపై మిక్కిలి అనురక్తి కలవారై కృష్ణా! ఆకాశ శయనము కావించి తపస్సు చేయు వారి గతి యెట్టిది?
నీ పై అచంచల మగు భక్తి కలవారై ఆవుల మందలో నిద్రించు వ్రత మాచరించు వారి గతి యెట్టిది?
నీ యందలి పరమ భక్తితో కూరలు మాత్రమే తినుచు అచ్యుతుని వైపు ప్రయాణించు వారు పొందెడు గతి యెట్టిది?
పంచ గవ్యములను త్రావి విష్ణుని ఆరాధించు భక్తుల గతి యెట్టిది? (పంచ గవ్యములు - ఆవు పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, మూత్రము.)
గోమయమునే ఆహారముగా గొని కేశవు నర్చించు వారి గతి, నారాయణా! ఎట్టిది?
నీ సేవలో శ్రద్ధ కలవారై పేల పిండిని మాత్రము తినుచు మాధవు నారాధించు వారు పొందు గతి యేమి?
తలపై దీప ముంచుకొని కేశవు నర్చించు వారికి దేవా! గతి యెట్టిది?
నిత్యము పాలు మాత్రము త్రావుచు నిన్నే విడువక ధ్యానించు చుండువారు ఏ గతి నందుదురు?
నీ భక్తి యందు పరమానురాగము కలవారై ఆమ బోజనము అను వ్రతముతో నిన్నర్చించు వారి గతి ఏమి ? (ఆమము = వడంని పదార్థము)
గరికము మాత్రమే తినుచు తమ కర్మములను గుణములను అనుసరించుచు నిన్ను చేరుకొను వారు పొందు గతి యెట్టిది?
నీ యందలి ప్రీతితో మోకాళ్లపై కూర్చుండి ధ్యానించు వారి గతి యెట్టిదో అడుగు చున్న నాకు తెలియ జెప్పుము.
వెల్లికిలగా పండుకొని పైన దీపము లుంచుకొని నిన్నర్చించు వారు పొందెడు గతి యెట్టిదో చెప్పుము.
నీ ధర్మమున శ్రద్ధ కలిగిన మోకాళ్ల మీద దీప ముంచుకొని కేశవు నర్చించు వారి గతి ఎట్టిది?
రెండు చేతులలో దీప ముంచుకొని కేశవు నర్చించు వారి శాశ్వత గతి యెట్టిదో చెప్పుము.
తల క్రిందుగా ఉంచుకొని పండు కొని వారు జనార్దునుని ఆశ్రయించి పొందెడు గతి ఏమి?
కొడుకులను, భార్యను, ఇంటిని వదలి నిన్నే గతిగా కైకొను సిద్ధు లెట్టిగతి నందుదురో తెలియ బలుకుము.
మాధవా! అన్ని లోకములకు సుఖ కారణమైన రాక పోకలను గూర్చి నీవు ప్రసన్నుడ వైన కారణముగా నేను పలుక గలిగితిని.
నీవే తల్లివి, నీవే తండ్రివి, నీవే సర్వ ధర్మములకు నిశ్చయ రూపుడవు. కావున యోగము, సాంఖ్యము అను వాని నిర్ణయమును గూర్చి చెప్ప వలయును.
నిన్ను భజించుచు జీవుడు మృతి చెందినచో మధు పర్కముతో పాటు భస్మము నందు కలిసి వాని దేహమును అగ్నిలో దహనము చేయు విధాన మెట్టిది ?
నీ భక్తుడు నీట మునిగి నప్పుడు, నీ క్షేత్రమున నిలిచి యున్నపుడు నిన్ను పొందినచో అతని గతి యెట్టిది?
నీ నామములను కీర్తించుచు “నమో నారాయణాయ”ని పలుకుచు దానినే స్మరించుచు వారి గతి యెట్టిది?
ఆయుధము నెత్తి పట్టుకొని శత్రువులు చంపు చున్నపుడు. నీ నామమును కీర్తించు వారు పొందు గతి యెట్టిది?
నేను నీకు శిష్యను, నీ దాసినీ, నీ భక్తి యందు స్థిరముగా నుండు దానను. ధర్మముతో కూడిన ఈ రహస్యమును మాధవా! నాకు చెప్పుము.
జగద్గురూ! ఇది పరమ రహస్యము. నా యందలి ప్రీతితో లోక ధర్మమును విచారించి నీవు నాకు చెప్ప వలయును.
