వరాహ మహా పురాణము
అధ్యాయము - 104
రాజా! క్షీర ధేనువును తెలిపెదను. ఎరుగుము.
ఆవు పేడతో అలికిన నేలపై గోచర్మము కొలతతో దర్భలను అన్ని వైపుల పరచి దానిపై నల్ల జింక తోలు నుంచ వలయును.
దానిపై ఆవు పేడతో ఒక గుండ్రని అరుగును కావించి దానిపై పాల కుండను నిలపి నాలుగవ వంతు గల మరియొక కుండతో దూడను చేయ వలయును.
బంగారముతో ముఖము, కొమ్ములు చేసి వాని పై చందనాగురువు లలది మంచి ఆకులతో చెవులు చేసి నువ్వులపై ఉంచ వలయును.
నోటిని బెల్లముతో, నాలుకను చక్కెరతో, దంతములను మేలైన పూలతో, కన్నులను ముత్యములతో, కాళ్లను చెరకు గడలతో, రోమములను దర్భలతో, గంగడోలును తెల్లని పట్టు వస్త్రముతో, పిరుదు భాగమును రాగితో, పాలపాత్రను కంచుతో, తోకను పట్టు వస్త్రముతో, పొదుగును వెన్నతో, కొమ్ములను సువర్ణముతో, గిట్టలను వెండితో చేసి అయిదు రత్నములు కల క్షీర ధేనువును కల్పింప వలయును.
ఆ ఆవునకు నాలుగు దిక్కు లందును నాలుగు నూగుల పాత్రల నుంచ వలయును. అన్ని దిక్కుల యందును ఏడు విధముల ధాన్యములను ఉంచ వలయును.
ఇట్లు అన్ని లక్షణములతో కూడిన క్షీర ధేనువును చేసి రెండు వస్త్రములతో కప్పి గంధముతో పూలతో పూజింప వలయును.
ధూపము, దీపము మొదలగు నవి కావించి, ఉంగరముతో కర్ణా భరణములతో అలంకరించి బ్రామ్మణునకు నివేదింప వలయును.
పాదుకలను గొడుగును ఇచ్చి ఈ మంత్రము తోడనే క్షీర ధేనువును సమర్పింప వలయును.
“ఆశ్రయః సర్వభూతానామ్” ఇత్యాది మంత్రములు పలుకుచు దాన మొసగ వలయును. ‘ఆప్యాయస్వ’ మొదలగు మంత్రములతో క్షీర ధేనువును ప్రసన్న పరుప వలయును.
పుచ్చు కొనువాడు ‘గృహ్ణామి’ మొదలగు మంత్రములను చదువ వలయును. ఇట్లా ధేనువును దానమిచ్చు చుండగా చూచు వారును పరమగతి కరుగుదురు.
ఇట్లా గోవును తన శక్తి మేరకు వేయి బంగారు నాణముల దక్షిణతో, లేదా వందతో, కాదా అందు సగముతో, లేదా దానిలో సగముతో ఒసగ వలయును. ఈ దాన మిచ్చినచో ఫలమును వినుము.
అరువది వేల యేండ్ల కాలము ఇంద్ర లోకమున ప్రసిద్ధి కెక్కును. తండ్రులతో తాతలతో పాటుగ బ్రాహ్మ లోకమున కరుగును.
దివ్యమైన విమానము నెక్కి దివ్యములగు మాలలు, మైపూతలు కలవాడై బహు కాలము విహరించి విష్ణు లోకమున కేగును.
పండ్రెండు గురు సూర్యుల కాంతి వంటి కాంతి కలదియు, చక్కగా అలంకరింప బడినదియు నగు విమానమున గీత వాద్యముల ధ్వనులతో అప్సరసల సముదాయములు సేవించు చున్న ఆ విష్ణు లోకమున నివసించి తుదికి విష్ణు సాయుజ్యమును పొందును. (సాయుజ్యము = కలసి పోవుట).
దీనిని భక్తితో వినువాడును, చదువు వాడును సర్వ పాపములను రూపు మాపుకొని విష్ణు లోకమున కరుగును.
