వరాహ మహా పురాణము

Table of Contents

అధ్యాయము - 34

 

 

రాజా! నేను చెప్పుచున్న పితృ దేవతల పుట్టుకను గూర్చి వినుము. మునుపు ప్రజాపతి యగు బ్రహ్మ వేరు వేరు ప్రజలను సృజింప గోరిన వాడై చెదరని మనసుతో ఆ ప్రజల మూల ద్రవ్యములను మనస్సున నిర్మించి ఆ సృష్టిని వెలుపలికి తెచ్చి దానిని విస్తృత పరచుటకై పర బ్రహ్మమును ధ్యానించెను.

 

 

అట్లు పరమాత్మతో యోగము పొందిన ఆ బ్రహ్మ దేవుని దేహము నుండి ఆ తన్మాత్రలు పొగ వంటి వన్నె గల కాంతులతో బయటకు వచ్చెను.

 

 

మేము సోమమును త్రావుదుమని దేవతలతో పలుకుచు ఊర్థ్వ లోకమునకు పోగోరిన వారై గగనమున నిలిచిన వారై తన్మాత్రల రూపము గల ఆ తపస్వులు ఉండిరి.

 

 

ఆకసమున అడ్డముగా పైకెత్తిన మోములతో నిలిచిన వారిని చూచి బ్రహ్మ వెంటనే ఇట్లు పలికెను. మీరు గృహస్థు లందరకు పితృదేవతల రగుడు.

 

 

అందు పైకెత్తిన తల గల వారు నాందీ ముఖులు అను పేరుగల వారైరి. వృద్ధి కొరకు చేయు శ్రద్ధా కార్యముల యందు వారిని వేద మార్గమున పూజింప వలయును.

 

 

అగ్నిని ముందుంచు కొని అర్చించు అగ్ని హోత్రులైన బ్రాహ్మణులు నిత్యములు, నైమిత్తికములు, కామ్యములు అగు కర్మము లందును, పర్వము లందును వారిని తృప్తి పరుప వలయును.

 

 

బహిః ప్రావరణులను పితృ దేవతలను (వెలుపలి దర్భలపై కూర్చుండు వారిని), క్షత్రియులు తృప్తి పరుప వలయును. నేయి త్రావు వారికి వైశ్యులు తర్పణములు చేయ వలయును.

 

 

శూద్రులు బ్రాహ్మణుల అనుమతి గొని తమ తమ తల్లి దండ్రుల నామములు పేర్కొని మంత్రము, విధానము అను వానితో పని లేకయే పై వారి నర్చింప దగును.

 

 

ఆహితాగ్నులు కాని బ్రహ్మ క్షత్రియ వైశ్యులు లౌకికాగ్ని ముందు ఆయా పితృ దేవతల తిథుల యందు అర్పింప వలయును.

 

 

ఓ పితృ దేవతలారా! ఇట్లు పూజలందు కొని మీరు వారికి ఇష్టములగు కోర్కెలను తీర్పుడు. ఆయువు, కీర్తి, ధనము, పుత్రులు, విద్య గొప్ప తనము, జ్ఞానము అను వానిని ప్రసాదింపుడు.

 

 

బ్రహ్మ యిట్లు పలికి వారికి దక్షిణా యనమను పేరు గల మార్గ మును ఏర్పాటు చేసెను.

 

 

ఇట్లు పలికి బ్రహ్మ మెల్లగా భూతములను సృజింప నారంభించెను. అంత పితృ దేవతలు బ్రహ్మతో భగవంతుడా! మాకు వృత్తి నొసగుము. దానితో మేము సుఖముగా నుందుము అని పలికిరి.

 

 

మీకు అమావాస్య తిథి యగుగాక! ఆనాడు దర్భలతో నువ్వులతో, జలములతో మనుష్యులు మీకు తర్పణములు చేయుదురు. దానితో మీరు మిక్కిలి తృప్తి పొందుడు. మరియొక విధమున కాదు.