వరాహ మహా పురాణము
అధ్యాయము - 74
సనాతనుడు, పురాణ పురుషుడు శాశ్వతుడు, స్థిరుడు, అవ్యయుడు, విశ్వరూపుడు, అజుడు, శంభువు, ముక్కంటి, శూలపాణి అయిన ఆ రుద్రుని ఋషు లందరు మరల ఇట్లు ప్రశ్నించిరి.
దేవదేవా! నీవు మాకును, సర్వ దేవతలకును అధికుడవు. కావున నిన్నొక ప్రశ్న నడుగు చున్నాము. దానిని గూర్చి చెప్ప వలయును. ఈ భూమి కొలతయు, పర్వతముల వైశాల్యము, అను వానిని మా యందు కృపతో నీవు చెప్పుము.
బ్రహ్మ, విష్ణు, శివ మొదలగు పేర్లు కలవియు, వాయు సంబంధ మైనదియు నగు అన్ని పురాణముల యందును భూలోకమును విస్తరముగా చెప్పి యున్నారు. ఉత్తములారా! ధర్మజ్ఞులారా! ఇప్పుడు సంగ్రహముగా భూమి కొలతను గూర్చి మీకు చక్కగా చెప్పెదను. చక్కగా తెలిసి కొనుడు.
సమస్త విద్యల చేత చక్కగా తెలియ బడు ఆ పరమాత్మ కల్మశములు లేనివాడు, అతి సూక్ష్మ స్వరూపుడు. ఊహింప నలవికాని ఆత్మ కలవాడు. నారాయణుడు. భౌతికము, పారమార్థికము అయిన రెండు లోకము లందును వ్యాపించి యున్నవాడు. పచ్చని వస్త్రము ధరించిన వాడు. విశాలమైన వక్షస్సు కలవాడు. భూమిని ధరించిన వాడు. గుణములను బట్టియు, ప్రధానముగను అంతయు తానే అయిన వాడు. అణు స్వరూపుడు, మహా స్వరూపుడు. పొడవైన వాడు, హ్రస్వరూపుడు. చేయబడని వాడు. ఎర్రదనము లేనివాడు, మొదలైన లక్షణములతో గుర్తింప దగిన వాడయ్యు కేవలము విజ్ఞాన స్వరూపుడు.
సత్వము, రజస్సు, తమస్సు అనువాని ఉద్రేకములు కలిగి మూడు విధములైన వాడై ఆ భగవానుడు మొదట జలమును సృజించెను.
దానిని సృజించి ఆ అనాది పురుషుడు, పరమేశ్వరుడు ఆ నారాయణుడు, సకల జగన్మయుడు, సర్వ మయుడు, దేవ మయుడు, యజ్ఞ మయుడు, జల మయుడు, జల స్వరూపుడు అగు ఆ దేవుడు యోగ నిద్రతో నిద్రించు చున్నవాడై తన బొడ్డు నందు ఒకచక్కని పద్మమును వెలువరించెను.
ఆ పద్మము నందు సమస్త వేదములకు నిధి, ఊహింప నలవి కాని వాడు, పరమేశ్వరుడు, నగు బ్రహ్మయను ప్రజాపతి ఉదయించెను.
ఆతడును సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, మొదలగు జ్ఞాన స్వరూపులగు వారిని తొలుత సృష్టించి పిదప స్వాయంభువ మనువును, మరీచి మొదలుకొని దక్షుడు తుదిగా గల ప్రజాపతులను సృష్టి చేసెను.
ఆ స్వాయంభువ మనువును భగవంతుడు సృజింపగా ఆతని వలన భువనమును మిక్కిలి విశాలమై రచిత మాయెను.
ఆ మనువున కిద్దరు కొడుకులు. ప్రియవ్రతుడు, ఉత్తాన పాదుడు అనువారు కలిగిరి.
ప్రియవ్రతునకు, ఆగ్నీధ్రుడు, అగ్నిబాహువు, మేథుడు, మేధాతిథి, ధ్రువుడు, జ్యోతిష్మంతుడు, ద్యుతి మంతుడు, హవ్యుడు, వపుష్మంతుడు, సవనుడు అను పదుగురు కొడుకులు కలిగిరి.
ఆ ప్రియవ్రతుడు ఏడు ద్వీపముల యందును ఏడుగురు కుమారులను నిలిపెను. అందు ఆగ్నీధ్రుని జంబూ ద్వీపమునకు అధిపతిగా చేసెను.
శాక ద్వీపమునకు, ఈశ్వరునిగా మేధా తిథిని, కుశ ద్వీపమున జ్యోతిష్మంతుని, క్రౌంచమున ద్యుతిమంతుని, శాల్మలమున వపుష్మంతుని, గోమేదమునకు హవ్యుని, పుష్కర ద్వీపమున కధిపతిగా నవనుని చేసెను.
పుష్కర ద్వీప ప్రభువగు సవమనకు మహావీతుడు ధాతకి అను ఇరువురు పుత్రులు కలరు.
వారి దేశములును వారి పేరులతో ఏర్పడినవి, ధాతకిది ధాతకీ ఖండము. కుముదునిది కౌముదము.
శాల్మలీ ద్వీపము అధిపతి వపుష్మంతునకు ముగ్గురు పుత్రులు సకుశుడు, వైద్యుతుడు, జీమూతుడు అను వారు. సకుశునకు సకుశమను పేరు గల దేశము, వైద్యుతునకు వైద్యుతము. జీమూతునకు జీమూతము అనునివి శాల్మలి యొక్క దేశములు.
అట్లే ద్యుతిమంతునకు ఏడుగురు కొడుకులు. కుశలుడు, మనువు, గోష్ఠుడు, ఉష్ణుడు, పీవరుడు, ఉద్యాంధకారకుడు, ముని దుందుభి అనువారు. వారి పేర్లతో క్రౌంచమున ఏడు మహా దేశముల పేర్లు కూడా ఇట్టివియే.
కుశద్వీపాధిపతి జ్యోతిష్మంతునకును ఏడుగురు పుత్రులు. ఉద్భిదుడు, వేణుమంతుడు, రథుడు, ఉపలంబనుడు, ధృతి, ప్రభాకరుడు, కపిలుడు అనువారు. వారి పేరుల తోడనే దేశములును చూడదగును.
శాకద్వీపము అధిపుడగు మేధాతిథికిని ఏడుగురు కొడుకులు. శాంతభయుడు, శిశిరుడు, సుఖోదయుడు, నందుడు, శివుడు, క్షేమకుడు, ధ్రువుడు అనువారు. ఇవియే వారేలెడు దేశములకును పేర్లు.
ఇంక జంబూ ద్వీపాధిపతి ఆగ్నీధ్రునకు తొమ్మండుగురు కొడుకులు. నాభి, కింపురుషుడు, హరివర్షుడు, ఇలావృతుడు, రమ్యకుడు, హిరణ్మయుడు, కురువు, భద్రాశ్వుడు, కేతుమాలుడు అనువారు వీరి పేర్లే దేశములకును ఏర్పడినవి. నాభికి మంచుగల హేమకూటము కింపురుషునిది కింపురుషము, నైషధునిది హరివర్షము, మేరువు నడిమి భాగము ఇలావృతునిది, నీలము రమ్యకునిది. శ్వేతము హిరణ్మయునిది, ఉత్తర పర్వతములు కురువునకు చెందినవి, మాల్యవంతము భద్రాశ్వునిది, గంధమాదనము కేతుమాలునిది. స్వాయంభువ మన్వంతరమున భువన ప్రతిష్ఠ ఇట్టిది. ప్రతి కల్పము నందును ఇట్లే ఏడుగు రేడుగురు భూమిని పాలింతురు. భూమి వ్యవస్థయు ఇట్టిదిగా నుండును.
ఎల్లప్పుడు కల్పము స్వభావము ఇదియే యగును.
ఇందు నాభి సృష్టిని చెప్పెదను. నాభి మేరుదేవి యందు ఋషభుడను పేరు గల కొడుకును కాంచెను. ఆతని పెద్ద కుమారుడు భరతుడు. ఆ భరతునకు తండ్రి ఋషభుడు హిమవత్ పర్వతమునకు దక్షిణమున గల భారతమను వర్షము నిచ్చెను. భరతునకు సుమతియను కొడుకు పుట్టెను. అతనికి రాజ్య మొసగి భరతుడు వనమున కరిగెను.
సుమతికి తేజుడు, అతనికి సత్సువు, అతనికి ఇంద్రద్యుమ్నుడు, అతనికి పరమేష్ఠి, అతనికి ప్రతిహర్త, అతనికి నిఖాతుడు, అతనికి ఉన్నేత, అతనికి అభావుడు, అతనికి ఉద్గాత, ఉద్గాతకు ప్రస్తోత, ప్రస్తోతకు విభువు, విభువునకు పృథువు, పృథువునకు అనంతుడు, అనంతునకు గయుడు, గయునకు నయుడు, అతనికి విరాటుడు, అతనికి మహావీర్యుడు, అతనికి సుధీమంతుడు, అతనికి మహత్తు, అతనికి భౌవనుడు, అతనికి శతజిత్తును పుత్రులు.
ఆ శతజిత్తునకు నూరుగురు కొడుకులు పుట్టిరి. వారిచేత ప్రజలు వృద్ధి పొందిరి. వారిచేత ఏడు ద్వీపములు గల భారత వర్షము గుర్తింప బడినది.
వారి వంశపు సంతానము ఈ భారత ప్రజలను కృత, త్రేత మొదలగు పేర్లు గల డెబ్బది యొక్క యుగముల కాలము పాలించినది.
భువన ప్రసంగము చేత శుభమగు స్వాయంభువమును గూర్చి చెప్పితిని. మనువు యొక్క ఇతర ద్వీపములను గూర్చి ఇటుపై తెలిసి కొనుము.
