వరాహ మహా పురాణము
అధ్యాయము - 131
మిథున కర్మమును కావించి స్నానము చేయక నా వస్తువులను తాకు దుష్ట బుద్ధి పదునాలుగు వేల యేండ్లు రేతస్సును త్రావును.
అంత నారాయణుని పలుకు విని శ్రేష్ఠమగు వ్రతముల గల భూదేవి దిగు లొందిన మనస్సు కలదియై మధుసూదనునితో ఇట్లు పలికెను.
దేవా! భయము గొలుపు ఘోరమగు ధర్మమును ఏల పలుకుదువు? ఆ పురుషుడు రేతస్సు త్రావు వాడెట్లు అగును? ఇది నా పెను దుఃఖము. దీనిని గూర్చి నీవు వివరముగా చెప్ప వలయును.
దేవీ! ఇది మిక్కిలి రహస్యము. మిక్కిలి గొప్పది. వ్యభిచారమును నిర్ణయించు గుర్తును చెప్పెదను. వినుము.
జాలి ఏ కొంచెము లేనివారై పురుషులు స్త్రీల యందు చేసెడు పాపపు పనుల ఫలమును తప్పక పొందుదురు.
వరారోహా! నీవడిగిన ఈ దోషమునకు పరిశుద్ధియు లేదు.
నా పూజల యందు శ్రద్ధ గల గృహస్థులగు పురుషులు స్త్రీల విషయమున పొందెడు రాగమనెడు దోషమునకు ప్రాయశ్చిత్త మెట్టిదో చెప్పెదను.
మూడు దినములు అలసందల పిండిని, మరి మూడు దినములు బియ్యపు పిండిని, ఒక దినము గాలిని తిను నియమము వలన ఈ పాపము నుండి విముక్తు డగును.
శాస్త్రము చూపిన విధానముతో, చేసిన దోషమును తెలిసికొని ఈ విధముగా ప్రాయశ్చిత్తము చేసికొను వానికి ఆ పాపము అంటదు.
ధర్మ విరుద్ధమగు స్త్రీ సంపర్కమును పొందిన వానికి ప్రాయశ్చిత్త మెట్టిదియో నీకు చెప్పితిని. అది నా లోక సుఖమును కూర్చునది యగును.
మరణించిన వాని దేహమును, తాకి, నా శాస్త్ర విధానములను పాటింపక వల్ల కాటికి చనువాని తండ్రులు, తాతలు, తనతో పాటు వల్లకాటిలో నక్కలై శవములను పీకుకొని తిను చుందురు.
అంత హరి మాట విని ధర్మమున వాంఛగల వసుంధర లోకు లందరకు సుఖమును కలిగించు తీయని పలుకు నిట్లు పలికెను.
నాథా! నీవే గతి యని నమ్మి కొలిచెడి వారికి ఈ విషయమున దారి యేది? ఆ పాపమును వదిలించు కొనుటకు ప్రాయశ్చిత్త మెట్టిది? నాకు చెప్పుము.
సుందరీ! నన్నడిగిన దానికి ఇదిగో పాపమును పోకార్చు శుభమును గూర్చి చెప్పెదను.
ఏడు దినములు ఒంటి పూట భోజనము, మూడు దినములు ఉపవాసము, అటుపై పంచ గవ్యము పుచ్చు కొనుట అనువానితో ఈ పాపము నుండి ముక్తి పొందును. (పంచ గవ్యములు = ఆవు పాలు, పెరుగు, నెయ్యి, పేడ, మూత్రము)
శవమును తాకగా కలుగు దోషమునకు సంబంధించి చేయదగు దానిని నీకు చెప్పితిని. భాగవతు లందరు అన్ని విధములుగా ఈ దోషమును వదలి వేయ వలయును.
ఈ విధముగా ప్రాయశ్చిత్తమును చేసికొను వాడు పాపము లన్నింటి నుండి విడివడును. వానికి దోషము ఉండదు.
దేవీ! ముట్టయిన స్త్రీని ముట్టుకొని భయము లేనివాడై నన్ను తాకువాడు, రాగ మోహములతో కూడిన వాడై కామమునకు వశమై పోయిన వాడు ఒక వేయి యేండ్ల కాలము రజస్సును త్రావు చుండును. గ్రుడ్డివాడు, దరిద్రుడు, జ్ఞాన హీనుడు, మూర్ఖుడు అగును.
ఈ అపరాధము చేసి నరకమున పడుచున్న వాడు తన్ను తాను గుర్తింప జాలడు. ఇందు సంశయము లేదు.
జనార్దనా! నిన్నే శరణు పొంది నీ పనుల యందు శ్రద్ధ కలిగిన వాడు పొరపాటున ఈ దోషముతో కూడిన వాడైనచో ఏ పని చేసి శుద్ధు డగును? దానిని నాకు చెప్పుము.
ముట్టయిన స్త్రీని ముట్టిన నా భక్తుడు మూడు రాత్రులు ఆకాశ శయనము చేయ వలయును. అంత నాతడు పరిశుద్ధు డగును. (ఆకాశ శయనము = ఆరు బయట పడు కొనుట)
ఆచారమునకు వెలియైన వాడు ఈ విధముగా ప్రాయశ్చిత్తము చేసికొని ఆ పాపము నుండి విడుదల పొందును.
ఓ కాంతా! ఇట్లు ముట్టయిన స్త్రీని తాకుట అను దోషమును, దాని ప్రాయశ్చిత్తమును నీకు చెప్పితిని. ఇది సంసార దోషములను పోగొట్టు నట్టిది.
చచ్చిన వానిని తాకి నా క్షేత్రములలో నిలుచు వాడు నూరు వేల యేండ్లు గర్భములలో పడి దొరలు చుండును.
పది వేల ఏండ్లు చండాలుడై పుట్టును. ఏడు వేల సంవత్సరముల గ్రుడ్డి వాడగును. నూరేండ్లు కప్పయై ఉండును.
మూడేండ్లు ఈగ యగును. పదునొకండు వత్సరములు లకుముకి పిట్ట యగును. పదునేడేండ్లు తొండయై పుట్టును.
వంద యేండ్లు ఏనుగు, ముప్పది రెండేండ్లు గాడిద, ఇరువది నాలుగేండ్లు ఎద్దు, పండ్రెండేండ్లు కుక్క, తొమ్మిది ఏండ్లు పిల్లి, పదునైదేండ్లు కోతి యగును.
నా పనుల యందు శ్రద్ధకల భక్తుడు ఇట్టి తన దోషము చేత పెను దుఃఖము పొందును. సంశయము లేదు.
అంత హరి మాట విని కుమిలి పోయిన భూదేవి అందరి సంసార దుఃఖమును పోగొట్టుటకై యిట్లు పలికెను.
ప్రభూ! మనుష్యులకు పొందనలవి కానిది, వెరపు గొలుపునది, నా ఆయువు పట్లను పగుల గొట్టునది అగు పలుకు పలికెద వేల?
నీ కర్మము లందు నిష్ఠ కలవారు ఆచారముల నుండి పరిభ్రష్టులై ఈ మహా ఘోర స్థితుల నెట్లు దాటుదురో ఆ ప్రాయశ్చిత్త విధానమును నాకు తెలుపుము.
భూదేవి పలికిన ఆ మాటవిని లోకనాథుడగు జనార్దనుడు ధర్మమును పరిరక్షించుట కొరకు ఇట్లు పలికెను.
నా భక్తుడు శవమును ముట్టి పదునైదు దినములు ఒంటి పూట భోజనము చేయుచు నుండ వలయును.
ఈ విధానము నాచరించి పిదప పంచగవ్య ప్రాశనము చేయ వలయును. మనసులో మలినము లేని వాడిట్లు పరిశుద్ధుడై పాప మంటని వాడగును.
చచ్చిన వానిని ముట్టిన దోషము నుండి మనుజు డెట్లు పరిశుద్ధు డగునని నీవడిగిన దానికి సమాధానము చెప్పితిని.
ఈ విధముగా ప్రాయశ్చిత్తము చేసికొను వాడు దోషము నుండి విముక్తుడై నా లోకమున కరుగును.
