వరాహ మహా పురాణము
అధ్యాయము - 29
రాజా! ఈ కథను శ్రద్ధతో వినుము. బ్రహ్మ చెవుల నుండి దిక్కులెట్లు పుట్టినవో చెప్పెదను.
మొదటి సృష్టి మొదలయి నపుడు సృష్టి చేయుచున్న బ్రహ్మకు ‘నేను సృజించు ఈ ప్రజలను ఎవరు ధరింతురా?’ అని పెద్ద చింత పట్టు కొనెను.
ప్రజల విషయమున ఇట్లు అవకాశము గూర్చి చింతించు చున్న ఆతని చెవుల నుండి పది మంది కన్యలు, గొప్ప కాంతి గలవారు పుట్టుకొని వచ్చిరి.
తూర్పు, దక్షిణము, పడమర, ఉత్తరము, పైదిక్కు క్రింది దిక్కు, అను నీ యార్వురు ఆ కన్యలలో ముఖ్యలు.
వారిలో మిగిలిన నలువురు కన్యలు చక్కని చుక్కలు, మంచి రూపములు కలవారు. గాంభీర్యముతో కూడిన వారు.
వారు ఏ దోషమును లేని ప్రజాపతిని చనవుతో ఇట్లడిగిరి. దేవదేవా! ప్రజాపతీ! మాకును చోటిమ్ము.
అవ్యక్తము నుండి పుట్టిన దేవా! మేమెందు భర్తలతో పాటు సుఖముగా నిలుతుమో ఆ చోటును, మాకు పతులను ప్రసాదింపుము.
ఓ సుశ్రోణులారా! ఈ బ్రహ్మాండము నూరు కోట్ల ప్రమాణములు వ్యాపించి యున్నది. దీని అంతము నందు మీ యిచ్చ ననుసరించి నివసింపుడు. ఆలస్యము చేయకుడు.
మీకు తగిన మగలను అంద చందములు గలవారిని సృజించి యిత్తును. ఇప్పుడు మీకు నచ్చిన దేశముల కరుగుడు.
బ్రహ్మ యిట్లు వారితో పలుకగా అంత వారు తమ యిష్టము వచ్చిన తావుల కరిగిరి. బ్రహ్మయు వెనువెంటనే మహా బలము గల లోక పాలురను సృజించెను.
అట్లు లోకపాలురను సృజించి బ్రహ్మ ఆ కన్యలను మరల పిలిచెను. లోకముల కెల్ల తాతయగు ఆ బ్రహ్మ వారికి పెండ్లిండ్లు చేసెను.
ఇంద్రునకు, అగ్నికి, యమునికి, నిరృతికి, మహాత్ముడగు వరుణునకు, వాయువునకు, కుబేరునకు, ఈశానునకు ఒక్కొక్క దిక్కునిచ్చి పై దిక్కును తనకు ఉంచుకొని క్రింద నున్న దిక్కును ఆదిశేషున కొసగెను.
బ్రహ్మ యిట్లు వారలకు దిక్కుల నొసగి ఆ దిక్కులకు దశమీ తిథిని ఏర్పరచెను. ఆ భర్తల పేర్లతో ఆ దిక్కులకు పేర్లు కూడ ఏర్పరచెను. పెరుగన్నము భోజనముగా కల్పించెను.
అది మొదలు ఆ దేవ కాంతలు ఐంద్రి మొదలగు పేర్లతో వ్యవహారమునకు వచ్చిరి. దశమీ తిథి వారికి మిక్కలి ప్రియము గూర్చున దాయెను.
ఆ తిథినాడు పెరుగన్నము తినుచు చక్కని వ్రతము ఆచరించు నరునకు వారు సకల పాపములను ప్రతి దినము పోగొట్టుదురు.
దిక్కులకు సంబంధించిన ఈ కథను చెదరని మనస్సుతో వినువాడు బ్రహ్మ లోకమున నిత్య నివాసమును పొందును. సంశయము లేదు.
