వరాహ మహా పురాణము

Table of Contents

అధ్యాయము - 69

పూజ్యుడా! ద్విజ శ్రేష్ఠుడా! నీ శరీరమున జరిగిన వింతయేమి? నీవు చిరంజీవివి ఎట్లయితివి? దీనిని నాకు చెప్ప వలయును.

 

 

రాజా! ఈ నా శరీరము పెక్కు వింతలకు నిలయ మైనది. పెక్కు కల్పములు నిలుచునది. వేద విద్యలచేత శుద్ధి పొందినది.

 

ఈ భూమి నంతటిని తిరుగుచు నేను మేరువు ప్రక్కనున్న ఇలా వృతమను మహా వర్షమును చేరు కొంటిని.

 

అచట అందమైన సరస్సును చూచితిని. దాని ఒడ్డున పెద్ద గుడిసె ఒకటి కలదు. దాని యందు ఎముకలు చర్మము మాత్రము మిగిలిన వాడు, నార చీరలు ధరించన వాడును, ఉపవాసముల చేత బడలిన వాడు నగు ఒక తాపసుని కాంచితిని.

 

అతనిని చూచి ఇతడెవరో ఇతనిని తెలియుట కొరకు నేను నమ్మకము కలిగింప వలయు నను కొంటిని.

 

నే నిట్లను కొనుచుండగా ఆ మహాముని నాతో ఇట్లు పలికెను. బ్రాహ్మణా! నిలువుము. నిలువుము. నేను నీకు ఆతిథ్యమును చేయ వలయును.

 

ఇది విని నేనా కుటీరము లోని కరిగి చూడగా ఆతడు తేజస్సుతో వెలిగి పోవుచు న్నట్లుండెను.

 

నేలపై నిలబడిన నన్ను చూచి ఆద్విజుడు హుంకారము గావించెను. ఆ హుంకారము వలన పాతాళమును చీల్చుకొని అయిదుగురు కన్యలు పైకి వచ్చిరి. అందొకతే ఒక పీటను కొనివచ్చి నా కొసగెను. మరియొకతె చేతిలో నున్న నీటిని తెచ్చెను. మరియొకతె ఆ నీటిని కైకొని నా పాదములను కడుగ మొదలిడెను. తక్కిన ఇద్దరు నా ప్రక్కల వీవనలు కొని నిలువ బడిరి.

 

మరల ఆ మహా తపస్వి హుంకార మొనరించెను. ఆ శబ్దము వెను వెంటనే యోజనము వెడల్పు గల ఒక బంగారు దొన్నెను గొని ఒక మొసలి సరస్సు నుండి పైకి వచ్చెను.

 

దాని యందు బంగారు కుండలు తాల్చిన చక్కని కన్యలు వందల కొలదిగా వచ్చిరి. ఆ దొన్నెను చూచి ఆముని నాతో ఇట్లనెను.

 

బ్రాహ్మణా! ఇది యంతయు నీ స్నానము కొరకు ఏర్పాటు. నీవు ఈ దొన్నెలో ప్రవేశించి స్నానము చేయ దగును.

 

ఆతని మాటపై నేనా దొన్నెలో దిగినంతలో అది మునిగి పోయెను.

 

దొన్నెలోని నీట మునిగితి ననుకొన్న నేను పైకి లేచినంతనే ఒక అపూర్వమగు లోకమును కనుగొంటిని.

 

 

అది మంచి భవనములు, గదులు, శాలలు కలదియు, విశాల మైనదియు, విశాలములగు రాచ బాటలు కలదియు, పవిత్రులగు జనులతో నిండినదియు, గొప్ప నీతి మంతులు, ఆత్మ వేత్తలు, పురాణులు, ధర్మ మార్గమున నెలకొన్న వారునగు నరులతో కూడి నదియునై యుండెను.

 

 

మరియు కదలాడు చర్యలు గల పరిఘలతో భయంకర మైనదియు, మిక్కిలి లోతైన పాతాళ తలమున నున్నదియు, శ్రేష్ఠ మైనదియు, మేలైన పాశములు చేత దాల్చిన తెల్లని నరులతో, ఏనుగుల, గుఱ్ఱముల మందలతో కూడినదియునై యుండెను.

 

అందమైన పద్మములు, కలువలు కలవి, పెక్కు విధములైన పక్షులు కలవియు, పద్మ పత్రముల మీద నున్న తుమ్మెదల నాదములతో అనే కలయలతో పాడుచున్నవో అన్నట్లున్న సరస్సులు అందుండెను.

 

 

అందు కైలాసము కొమ్ములను పోలు నట్టివియు, పెక్కు రత్నముల కలువల గుంపులు కలవియు, వేద పండితులగు విప్రులు నివసించు నట్టివియు, పుణ్యాత్ములు నివసించు నట్టివియు నగు గృహములు ఆ సరస్సుల తీరము నందు కలవు.

 

తుమ్మెదలతో వంగిన పద్మములు అందు కదలాడు చున్నవి. వాని బరువులతో అవి ఎల్లప్పుడు ఊగులాడు చున్నవి. ఆ సరస్సుల జలము లందు చక్కని స్వరములు గల పక్షి జాతులు వేదము నందలి విచిత్ర మంత్రములను పలుకు చున్నవి.

 

 

తెల్లని పద్మముల మాలలతో గాత్రములు కలవియు, పక్షుల పంక్తులే ఉత్తరీయములుగా కలవియు, బ్రాహ్మణులు పురాతనములగు యజ్ఞ క్రియల మంత్రములను చదువు చున్న తీరు గలవియు నగు పెక్కు కొలనులు అందున్నవి.

 

నేనా సరస్సులలో తిరుగుచు దేవతల, విద్యాధరుల కాంతలను స్నానము కొరకు ఆ ప్రదేశమునకు వచ్చిన వారిని, గాంచితిని.

 

ఆ విధముగా తిరుగుచు ఒకప్పుడు మంచి నీరు గల చక్కని కొలనును గాంచితిని. దాని ఒడ్డున మొదట చూచిన కుటీరమును మునుపటి వలెనే చూచితిని.

 

ఆ కుటీరమును ప్రవేశించి ఒక వైపున కూర్చున్న ఆ తపస్విని చూచి దగ్గరకు చేరి పలుకునంతలో నవ్వుచు సాటి లేని ప్రభావము గల ఆ మహానుభావుడు ఇట్లు పలికెను.

 

 

విప్రా! మునుపు చూచిన నన్ను ఎరుగవా? మూఢుని వలె ఈ లోకమును చూచు చున్నావు.

 

దేవతలు కూడ చూడ జాలని నా భువనమును నీవు కనుగొంటివి. ద్విజోత్తమా! నీ ప్రియము కొరకు నీకీ లోకమును చూపితిని.

 

నా లోకపు సంపదను మహామునీ! కనుగొనుము. అందు పెరుగుతో పాలతో ప్రవహించు నదులు, నేతితో నిండిన పెద్ద చెరువులు కలవు.

 

హేమ రత్నమయ ములైన స్తంభములు గల గృహములు కలదియు రత్నములతో కూర్చి నదిము, పద్మ రాగముల కెనయగు కాంతి కలదియు, పారిజాత పుష్పములతో ప్రసిద్ధి కెక్కినదియు యక్ష కిన్నరులు సేవించు చున్నదియు నగు ఈ భూమిని చూడుము.

 

ఆ తాపసుడట్లు పలుకగా, రాజా! అచ్చెరువు నిండిన హృదయముతో అతనినే ఇట్లడిగితిని.

 

స్వామీ! నేను బ్రహ్మ, ఇంద్రుడు మున్నగు వారుండు లోకము లన్నింటిని చూచితిని. నీ లోకము ఆ అన్నింటి కంటె ఉత్తమముగా నున్నది.

 

తపోధనా! ఈ లోకము అపూర్వముగా నాకు కన్పట్టు చున్నది. సంపద, ఐశ్వర్యము, తేజస్సు, భవనములు, రత్న సముదాయములు, మంచి నీరు గల పుణ్యవంతములగు సరస్సులు అను వాని చేత మిక్కిలి అద్భుతముగా నున్న దీనిని కనుగొంటిని.

 

ఇటు వంటి లోక మెట్లేర్పడినది? ఇందు నెలకొన్న నీవె వరవు? దీనికి కారణమేమి? ముని పుంగవా! నాకెరుగ జెప్పుము.

 

మహామునీ! ఇలా వృత వర్షమున సరస్సు తీరమున నేను నిన్ను దర్శించు కొంటిని. ఆ సరస్సేమి? ఆ కుటీర మేమి? బంగారు గృహములు నిండిన ఈ లోకమున ఈ గుడిసెకు స్థానమేమి?

 

నే నిట్లనగా ఆ భగవానుడు నాకేది చెప్పెనో ఉన్నదున్నటు చెప్పెదను. రాజేంద్రా! వినుము.

 

నేను సనాతనుడు, జల రూపమున నున్నవాడు అగు నారాయణుడను. చరాచర రూపమైన మూడు లోకముల విశ్వ మంతటిని ఆవరించి యున్నాను.

 

పరమేష్ఠి యగు ఆ దేవుని ఏ ఆకారమును నీవు చూచితివో అదియు నేనే. వరుణు డందురు. స్వయముగా అతడును పరుడైన నారాయణుడే.

 

నీవు నన్ను ఏడు జన్మములు ఆరాధించితివి. అందు చేత మూడు లోకములు నశించినను నీవొక్కడవు గుర్తింప బడితివి.

 

ఆ నారాయణు డట్లు పలుకగా నేను నిద్రతో మూసికొన్న కన్నులు కలవాడనై పడితిని. వెనువెంటనే లేచితిని.

 

ఆ ఋషిని ఆ పురమును కనుగొను నంతలో మేరుగిరి శిఖరమున నన్ను నేను చూచుకొంటిని.

 

ఏడు సముద్రములను, ఏడు కుల పర్వతములను, ఏడు ద్వీపములు గల పుడమిని కాంచితిని.

 

నేటి దనుక ఆ లోక వరమునే ధ్యానించుచు నిలిచితిని. ఆ లోకము నెప్పుడు పొందుదునా? అన్న చింతయే నాకున్నది.

 

రాజా! నీ వేడుకను బట్టి నా దేహమున సంభవించిన పరమేష్ఠి వృత్తమును చెప్పితిని. ఇంకను నీవేది వినగోరు చున్నావు?