వరాహ మహా పురాణము

Table of Contents

అధ్యాయము - 46

మనుజుడు ఆషాఢ మాసము నందును ఇట్లే సంకల్పించి విధి పూర్వకముగా ఆ పరమ దైవమును గంధ పుష్పములతో పెక్కు విధములుగా పూజింప వలయును.

 

‘ఓం నమో వాసుదేవాయ’ అని పాదములను, ‘సంకర్షణాయ నమః’ అని నడుమును, ‘ప్రద్యుమ్నాయ నమః’ అని కడుపును, ‘అనిరుద్ధాయ నమః’ అని రొమ్మును, ‘చక్రపాణయే నమః’ అని భుజములను, ‘భూపతయే నమః’ అని కంఠమును, వాని పేరులతో శంఖ చక్రములను (నమః పాంచజన్యాయ, నమః సుదర్శనాయ అని) ‘నమః పురుషాయ’ అని శిరస్సును పూజింప వలయును.

 

బుద్ధిశాలి యగు నరుడు ఇట్లర్చించి మునుపటి వలెనే వస్త్రములు చుట్టిన ఘటమును నిలుప వలయును. దానిపై నాలుగు వ్యూహములు గల సనాతనుడగు వాసుదేవుని బంగారు ప్రతిమను నిలుప వలయును.

 

విధి ననుసరించి గంధ పుష్పాదులతో క్రమముగా దేవుని అర్చించి, వేదము నధ్యయనము చేయువాడు, చక్కని నియముములు గలవాడును అగు బ్రాహ్మణునకు దానిని దాన మీవలెను. ఇట్లు నియమములతో కూడిన వాడు పొందు పుణ్య మెట్టిదో తెలిపెదను వినుము.

 

యదు వంశమును పెంపొందించెడు వసు దేవుడను రాజుండెడి వాడు. అతని భార్య దేవకి. ఆమెయు నతనితో సమానముగ వ్రతముల నాచరించు నట్టిది.

 

పతి ధర్మమున శ్రద్ధ కలదియు, పతివ్రతయు నగు ఆ దేవకి సంతానము లేని దాయెను. పెద్ద కాలము గడచిన పిదప ఆ వసుదేవు నింటికి నారదుడు వచ్చెను.

 

వసుదేవు డతనిని భక్తితో పూజింపగా నారదు డిట్లనెను. వసుదేవా! నాకొక దేవ కార్యము కలదు. వినుము. ఈ కథను విని నేను త్వరగా నీ కడకు వచ్చితిని.

 

యదువరా! దేవతల సభలో నేను భూ దేవిని చూచితిని. దేవతలారా! నేనీ భారమును మోయజాల కున్నాను అని పల్కు చున్నది.

 

దేవతోత్తములారా! సౌభుడు, కంసుడు, జరా సంధుడు, మరియు నరకుడు, కురువులు, పాంచాలురు, భోజులు, ఇంకను బలవంతు లయిన దానవులు అందరు కూడి నన్ను పీడించు చున్నారు. వారిని చంపుడు.

 

పృథివి యిట్లు పలుకగా ఆ దేవత లందరు మనసులో నారాయణుని భావించిరి. ఆ దేవ దేవుడు తత్‌ క్షణమున అచట ప్రత్యక్ష మాయెను.

 

దేవతల పెద్ద ఆ విష్ణువు ఇట్లు పలికెను, దేవతలారా! ఈ పనిని నేను మనుష్యుని వలె మర్త్య లోకమున కరిగి స్వయముగా సాధింతును.

 

మరియ, ఆషాఢ మాసమున శుక్ల పక్షమున భర్తతో పాటు ఉపవాసమున్న మానవ స్త్రీ కడుపున నేను జన్మింతును.

 

ఇట్లని దేవుడు వెడలి పోయెను. నేను స్వయముగా నిటు వచ్చితిని. పుత్రులు లేని నీకిది తెలియ జెప్పితిని. నీవు భార్యతో పాటు ఉపవాస ముండి పుత్రుని పొందెదవు. సంశయము లేదు.

 

వసు దేవుడు ఇట్లు ఈ ద్వాదశీ వ్రతమును చేసి కుమారుని పొందెను. గొప్ప సంపదను, పుత్రులతో, పౌత్రులతో కూడిన వాడై, పొందెను.

 

రాజ్య సంపద ననుభవించి తుది కతడు పరమగతి నందెను. మునీ! ఆషాఢ మాసము నందలి విధిని నీకు తెలిపితిని.