వరాహ మహా పురాణము
అధ్యాయము - 20
ప్రజాపాలుడు:
ఏవ మగ్నేః సముత్పత్తి ర్జాతా బ్రహ్మన్ మహాత్మనః,
ప్రాణాపానౌ కథం దేవా వశ్వినౌ సంబభూవతుః.
ప్రజాపాలుడు:
స్వామీ! మహాత్ముడగు బ్రహ్మ వలన అగ్ని ఇట్లు పుట్టెను. ఇక ప్రాణాపానముల స్వరూపముతో దేవతలగు అశ్వినులు ఎట్లు సంభవించిరి?
మహాతపుడు:
మరీచి ర్బ్రహ్మణః పుత్రః స్వయం బ్రహ్మా ద్విసప్తభిః,
రూపై ర్వ్యవస్థిత స్తేషాం మరీచిః శ్రేష్ఠతా మగాత్.
మహాతపుడు:
మరీచి బ్రహ్మ పుత్రుడు. స్వయముగా బ్రహ్మ తొమ్మిది రూపములు తాల్చెను. ఆ తొమ్మండ్రు బ్రహ్మలలో ఈతడు శ్రేష్ఠ త్వమును పొందెను.
తస్య పుత్రో మహాతేజాః కశ్యపో నామ వై మునిః,
స్వయం ప్రజాపతిః శ్రీమాన్ దేవతానాం పితాభవత్.
ఆ మరీచి తనయుడు కశ్యపుడను ముని తానును ప్రజాపతి యాయెను. శ్రీమంతుడగు నాతడు దేవతలకు తండ్రి యాయెను.
తస్య పుత్రా బభూపుర్హి ఆదిత్యా ద్వాదశ ప్రభో,
అదిత్యపత్యాని తే సర్వే ఆదిత్యా స్తేన కీర్తితాః.
ఆ కశ్యపుని పుత్రులు పండ్రెండుగురు ఆదిత్యులు. అదితి పుత్రులు కావున వారు ఆదిత్యులని పేరు గాంచిరి.
తేషాం మధ్యే మహాతేజా మార్తండో లోకవిశ్రుతః,
నారాయణాత్మకం తేజో ద్వాదశం సంప్రకీర్తితమ్.
నారాయణ స్వరూపమే అయిన తేజస్సు పండ్రెండు విధములుగా నయినది. అందులో మహా తేజశ్శాలి మార్తండుడు లోకమున ప్రశస్తి గాంచెను.
యేతే మాసాస్త ఆదిత్యాః స్వయం సంవత్సరో హరిః,
ఏవం తే ద్వాదశదిత్యా మర్తండ శ్చ ప్రతాపవాన్.
పండ్రెండు నెలలే ఆ ఆదిత్యులు. సంవత్సర స్వరూపుడే శ్రీహరి. ఇట్లు ఆ పండ్రెండుగురు ఆదిత్యులైరి. అందులో మార్తండుడు గొప్ప ప్రతాపము గలవాడు.
తస్య త్వష్టా దదౌ కన్యాం సంజ్ఞాం నామ మహాప్రభామ్,
తస్యాపత్యం ద్వయం జజ్ఞే యమశ్చ యమునా తథా.
ఆతనికి త్వష్ట అను ప్రజాపతి తన కన్యయగు సంజ్ఞయను మహాదీప్తి కల దానిని భార్యగా నొసగెను. ఆతని కామెయందు యముడు, యమున అను నిరువురు సంతానము కలిగిరి.
తస్య తేజోప్యసహతీ బభూ వాశ్వీ మనోజవా,
స్వాం ఛాయాం తత్ర సంస్థాప్య సా జగామోత్తరాన్ కురూన్.
ఆ సంజ్ఞ ఆ సూర్యుని తేజస్సు తాళ జాలక మనో వేగము గల ఆడు గుఱ్ఱమైన తన ఛాయను అందు నిలిపి ఉత్తర కురు భూముల కరిగెను.
తద్రూపాం తాం సవర్ణాం తు భేజే మార్తండ భాస్కరః,
తస్యామపి ద్యయం జజ్ఞే శనిం తపతి మేవచ.
భాస్కరుడు సంజ్ఞా రూపము తాల్చినదియు, ఆమె వంటి వన్నెయే కలదియు నగు ఛాయను కూడెను. ఆమె యందు శని, తపతి అను నిద్దఱు బిడ్డలను పొందెను.
యదా త్వసదృశం భేజే పుత్రాన్ ప్రతి నరోత్తమ,
సంజ్ఞాం ప్రోవాచ భగవాన్ క్రోధసంరక్త లోచనః.
సూర్యుడు పిల్లలను ఒక్క తీరున సాకని ఛాయను చూచి క్రోధముతో కన్ను లెఱుపెక్కగా సంజ్ఞ వలె నున్న ఆమెతో నిట్లు పలికెను.
అసమత్వం నకర్తవ్యం స్వేష్వపత్యేషు భామిని.
ఓ భామినీ! నీ బిడ్డల యందు హెచ్చు తగ్గుల తనము కూడదు, అని పలికెను.
ఏవ ముక్తా యదా సా తు అసమత్వం వ్యరోచత,
తదా యమః స్వపితరం ప్రోవాచ భృశదుఃఖితః.
ఇట్లు చెప్పినను ఆమె భేద బుద్దిని విడనాడకయే యుండెను, అంత నొక నాడు యముడు దుఃఖముతో కుమిలి పోవుచు తన తండ్రి కిట్లనెను.
నేయం మాతా భవేత్తాత అస్మాకం శత్రువత్సదా,
సపత్నీవ వృథాచారా స్వేష్వపత్యేషు వత్సలా.
నాయనా! ఏమే మా తల్లి కాదు. మా యెడ శత్రువు వలె ప్రవర్తించు చున్నది. సవతి వలె పై పై ప్రీతి వెలయించు చున్నది. తన బిడ్డల యందు ఎక్కువ ప్రేమతో మెలగు చున్నది.
ఏవం యమవచః శ్రుత్వా సా చ్ఛాయా క్రోధమూర్ఛితా,
శశాప ప్రేతరాజస్త్వం భవిష్య స్యచిరా దివ.
ఇట్లని యముడన్న మాట విని కోపముతో ఒడలు మరచిన ఛాయ నీవు అనతి కాలములో ప్రేతములకు రాజు వగుదువని శపించెను.
ఏవం శ్రుత్వాథ మార్తండ స్తదా పుత్ర హితేచ్ఛయా,
ఉవాచ మధ్యవర్తీ త్వం భవితా దర్మపాపయోః.
ఈ మాట విని మార్తాండుడు పుత్రుని మేలు కోరి యిట్లు పలికెను. నాయనా! నీవు ధర్మ పాపములకు మధ్యవర్తివి కమ్ము. లోక పాలుడవై స్వర్గమున విరాజిల్లుము.
శనిం శశాప మార్తండ శ్ఛాయాకోప ప్రధర్షితః,
త్వం క్రూరదృష్టి ర్భవితా మాతృదోషేణ పుత్రక.
అంత మార్తాండుడు ఛాయ కోపము తనను పెల్లు రేపగా, ఓరీ కొడుకా! నీ తల్లి తప్పు వలన నీవు క్రూరమైన దృష్టి కలవాడ వగుదువని శపించెను.
ఏవ ముక్త్వా సముత్థాయ యయౌ భాను ర్దిదృక్షయా,
తామపశ్చ త్త్వసౌ సోశ్వా ముత్తరేషు కురుష్వథ.
ఇట్లు పలికి లేచి యాతడు సంజ్ఞా దేవిని కనుగొన గోరి బయలు దేరెను. ఉత్తర కురు భూములలో గుఱ్ఱము రూపున నున ఆమెను గాంచెను.
తతోశ్వరూపం కృత్వా స గత్వా తత్రోత్తరాన్ కురూన్,
ప్రాజాపత్యేన మార్గేణ యుయో జాత్మాన మాత్మనా.
అంత నాతడు మగ గుఱ్ఱము గానై ఉత్తర కురు భూములకు చేరుకొని ప్రాజాపత్య మార్గముతో ఆడు గుఱ్ఱమై యున్న సంజ్ఞా దేవిని కూడెను. (ప్రాజాపత్య మార్గమనగా దాంపత్య ధర్మమని భావింప నగును)
తస్యాం త్వా ష్ట్ర్యా మశ్వరూప్యాం మార్తండ స్త్రీవ్ర తేజసా,
బీజం నిర్వాపయామాస తజ్జ్వలన్తం ద్విధాపతత్.
త్వష్ట కూతురు, ఆడు గుఱ్ఱము రూపమున నున్నది యునగు ఆ సంజ్ఞా దేవి యందు మార్తాండుడు తీవ్రమైన తేజస్సుతో వీర్యమును నిక్షేపించెను. అది మండుచు రెండుగా పడెను.
తత్ర ప్రాణ స్త్వపానశ్చ యోనౌ చాత్మజితౌ పురా,
వరదానేన చ పున ర్మూర్తిమంతౌ బభూవతుః.
ఇట్లు మునుపు ప్రాణము, ఆపానముగా ఏర్పడి రూపొంద కున్న ఆ రెండు వర దానము చేత ఆ యోని యందు రూపము తాల్చినవి.
తౌ త్వాష్ట్ర్యా మశ్వరూపాయాం జాతౌ యేన నరోత్తమౌ,
తత స్తా వశ్వినౌ దేవౌ కీర్త్యతే రవినందనౌ.
ఇట్లు అశ్వ రూపము తాల్చిన సంజ్ఞ యందు పుట్టిన సూర్యుని కొడుకు లిరువురు అశ్వి దేవులని పేరొందిరి.
ప్రజాపతిః స్వయం భాను స్త్వాష్ట్రీ శక్తిః పరాపరా,
తస్యాః ప్రాగ్వచ్ఛరీరస్థా వమూర్తౌ పూర్వమాశ్రితౌ.
భానుడు స్వయముగా ప్రజాపతి, త్వష్టపుత్రి సంజ్ఞ అత్యుత్కృష్ట మైన శక్తి స్వరూపిణి. కావున మునుపు దేహములు లేని ఆ ప్రాణాపానములు ఆమె దేహమందు నిలిచి దేహములు కలవి యాయెను.
తతస్తా వశ్వినౌ దేవౌ మార్తండ ముపతప్థతుః,
ఊచతుః స్వరుచిం తావ త్కింకర్తవ్య మథావయోః.
అంత నా అశ్వి దేవతలు సూర్యుని సమీపించి మేము ఏ కార్యమును నిర్వహింప వలయును? అని యడిగిరి.
మార్తండుడు:
పుత్రౌ ప్రజాపతిం దేవం భక్త్యారాధయతాం వరమ్,
నారాయణం స వో దాతా వరం నూనం భవిష్యతి.
మార్తండుడు:
నాయనలారా! ప్రజాపతియగు నారాయణ దేవుని కొలువుడు. ఆతడు మీరు కోరిన వరము తప్పక యొసగును.
ఏవం తా వశ్వినౌ ప్రోక్తౌ మార్తండేన మహాత్మనా,
తేపతు స్తీవ్రతపసౌ తపః పరమదుశ్చరమ్,
బ్రహ్మపారమయం స్తోత్రం జపంతౌ తు సమాహితౌ.
ఇట్లు మాహాత్ముడగు సూర్యుడు పదేశింపగా ఆ అశ్వి దేవతలు బ్రహ్మ పారమను స్తోత్రమును నిశ్చల బుద్దితో జపించుచు మిక్కిలి దుష్కరమైన తపస్సు గావించిరి.
తయోః కాలేన మహతా బ్రహ్మ నారాయణాత్మకః,
తుతోష పరమ ప్రీత్యా వరం చైనం దదౌ తయోః
అంత పెద్దకాలము గడచిన పిదప నారాయణ స్వరూపుడగు బ్రహ్మ వారి తపస్సునకు సంతోషించెను. పరమ ప్రీతితో వారికి వారము నొసగెను.
ప్రజాపాలుడు:
అశ్విభ్యా మీరితం స్తోత్రం బ్రహ్మణోవ్యక్త జన్మనః,
శ్రోతు మిచ్ఛా మ్యహం బ్రహ్మం స్త్వత్ప్రసాదాన్మ హామతే.
ప్రజాపాలుడు:
అవ్యక్త జన్మము గల బ్రహ్మను గూర్చి అశ్వి దేవతలు చేసిన స్తోత్రమును ఓ మహామతీ! బ్రాహ్మణోత్తమా! నీ దయతో విన గోరుదును.
మహాతపుడు:
శృణు రాజన్ యథా స్త్రోత్ర మశ్విభ్యాం బ్రహ్మణఃకృతమ్,
ఈదృశం చ ఫలం ప్రాప్తం తయోః స్తోత్రస్య చానఘ.
మహాతపుడు:
రాజా! అశ్వినీ దేవతలు బ్రహ్మను గూర్చి చేసిన చేసిన స్తోత్ర మెట్టిదియో, దాని వలన ఎట్టి ఫలము పొందిరో చెప్పుదును, వినుము.
ఓం నమస్తే నిష్క్రియ నిష్ప్రపంచ నిరాశ్రయ నిరపేక్ష నిరాలంబ,
నిర్గుణ నిరాలోక నిరాధార నిర్మమ నిరాకార.
క్రియలేని వాడా! ప్రపంచమును వెలువరింపని వాడా! ఆశ్రయము లేని వాడా! ఆపేక్షలు లేని వాడా! ఆలంబ రహితా! గుణములు లేని వాడా! దృష్టి రహితమైన తత్త్వమా! నిరాధారా! మమాకారము, ఆకారము లేని ప్రభూ! నీకు నమస్సు.
బ్రహ్మ మహాబ్రహ్మ బ్రాహ్మణప్రియ,
పురుష మహాపురుష పురుషోత్తము,
దేవ మహాదేవ దేవోత్తమ స్థాణో స్థితిస్థాపక.
బ్రహ్మా! మహా బ్రహ్మా! బ్రహ్మ జ్ఞాన సంపన్నులపై ప్రేమ గల స్వామీ! పురుషా! మహాపురుషా! పురుషోత్తమా! దేవా! మహా దేవా! దేవోత్తమా! చలనము లేని స్థితిని కూర్చు దైవమా! నీకు ప్రణమిల్లుదును.
భూత మహాభూత భూతాధిపతే యక్ష మహాయక్ష యక్షాధిపతే,
గుహ్య మహాగుహ్య గుహ్యాధిపతే సౌమ్య మహాసౌమ్య సౌమ్యాధిపతే.
భూతములు, మహా భూతములు, యక్షులు, మహా యక్షులు, గుహ్యులు, మహా గుహ్యులు, సౌమ్యులు, మహా సౌమ్యులు అందఱు నీ స్వరూపమే, భూతములకు, యక్షులకు, గుహ్యులకు, సౌమ్యులకు అధిపతివి నీవే.
పక్షి మహాపక్షిపతే దైత్య మహాదైత్యాధిపతే,
రుద్ర మహారుద్రాధిపతే విష్ణో మహావిష్ణుపతే,
పరమేశ్వర నారాయణ ప్రజాపతయే నమః.
పక్షులు, పక్షి రాజులు, దైత్యులు, దైత్య ప్రభువులు, రుద్రులు, మహా రుద్రులు, విష్ణువు, మహా విష్ణువు, పరమేశ్వరుడు, నారాయణుడు అన్నియు నీవు. ఓ ప్రజాపతీ! నీకు నమస్సు.
ఏవం స్తుత స్తదా తాభ్యా మశ్విభ్యాం స ప్రజాపతిః,
తుతోష పరమప్రీత్యా వాక్యం చేద మువాచ హ.
ఇట్లా ఆశ్వులు తనను స్తుతింపగా ఆ ప్రజాపతి ఎంతో సంతోషించి పరమ ప్రీతితో ఇట్లు పలికెను.
వరం వరయతాం శీఘ్రం దేవైః పరమ దుర్లభమ్,
యేన వో వరదానేన చరత స్త్రిదివం సుఖమ్.
వేగమ వరములను కోరు కొనుడు. దేవతలకును పొంద రాని ఆ వరముతో మీరు దేవ లోకమున సుఖముగా విహరింతురు.
అశ్వులు:
ఆవయో ర్దేవభాగం తు దేహి దేవ ప్రజాపతే,
సోమపత్వం చ దేవానాం సామాన్యత్వం చ శాశ్వతమ్.
అశ్వులు:
దేవా! మాకు దేవ బాగ మిమ్ము. ప్రజాపతీ! మాకు సోమరసము త్రావు అధికార మిమ్ము. శాశ్వతముగా మాకు దేవతలతో సమాన స్థితిని ప్రసాదింపుము.
బ్రహ్మ:
రూపం కాంతి రనౌపమ్యం భిషక్త్వం సర్వవస్తుషు,
సోమపత్వం చ లోకేషు సర్వ మేత ద్భవిష్యతి.
బ్రహ్మ:
చక్కని రూపము, మేలైన కాంతి, సాటిలేని తనము, వైధ్యులగుట, సోమపానము చేయుట, అను ఈ లక్షణము లన్నియు మీకు కలుగును.
మహాతపుడు:
ఏత త్సర్వం ద్వితీయాయా మశ్విభ్యాం బ్రహ్మణా పురా,
దత్తం యస్మా దతస్తేషాం తిథీనా ముత్తమా తిథిః
మహాతపుడు:
బ్రహ్మ అశ్వి దేవతల కిది యంతయు విదియ నాడు అనుగ్రహించెను. అందు వలన ఆ తిథి తిథులలో ఉత్తమ మయ్యెను.
ఏతస్యాం రూపకామస్తు పుష్పాహరో భవే న్నరః,
సంవత్సరం శుచి ర్నిత్యం సుస్వరూపీ భవేన్నరః.
మంచి రూపము కోరవాడు విదియ నాడు పుష్పములే ఆహారముగా గొనుచు నొక యేడు కాలము శుచియై యున్నచో నిత్యము చక్కని రూపము కలవాడగును.
అశ్విభ్యాం యే గుణాః ప్రోక్తా స్తే తస్యాపి భవంతి చ.
అశ్వి దేవతల గుణములుగా ప్రసిద్ది కెక్కిన గుణము లన్నియు ఆ వ్రతము చేసిన వానికి సిద్ధించును.
య ఇదం శృణుయా న్నిత్య మశ్వినో ర్జన్మ చోత్తమమ్,
సర్వపాప వినిర్ముక్తః పుత్రవాన్ జాయతే నరః.
ఈ ఆశ్వుల ఉత్తమ మగు జన్మ విధానమును విన్న నరుడు పాపములన్నింటిని పోకార్చి కొని ఉత్తమ పుత్రుల కలవాడై యోప్పారును.
