వరాహ మహా పురాణము

Table of Contents

అధ్యాయము - 35

 

 

బ్రహ్మ మానస పుత్రుడు అత్రి. ఆతడు గొప్ప తప స్సంపద గలవాడు. ఆతని పుత్రుడు చంద్రుడు దక్షున కల్లు డాయెను.

 

 

దాక్షాయణులని పేరొందిన ఇరువది యేడుగురు కన్యలు, చక్కని రూపము కలవారు సోమునకు పత్ను లయిరి. వారిలో అందరి కంటె మిన్న రోహిణి.

 

 

సోము డామెతోనే విహరింప జొచ్చెను. ఇతర భార్యలను ఆదరింప కుండెనని విందుము. ఆ ఇతర భార్యలు చంద్రుని యీ పక్ష పాతమును దక్షునకు చెప్పు కొనిరి.

 

 

దక్షుడును పలు మారులు చంద్రుని కడకు వచ్చి చెప్పి చూచెను. కాని ఆతడు అందరిని సమముగా చూడ డాయెను. అంత దక్షుడు నీవు కన బడకుండ పొమ్మని శపించెను.

 

 

దక్షుడిట్లు తిట్టగా సోముడు దక్షునితో నీవును అట్లే అగుదువు. సనాతనమగు బ్రహ్మ దేహమును విడచి పెక్కు మందికి పుట్టువాడ వగుదువు అని పలికెను.

 

 

ఇట్లు పలికి చంద్రుడు దక్షుని శాపము వలన క్షీణించి పోయెను.

 

 

సోముడట్లు రూపము లేని వాడు కాగా దేవతలు, మనుష్యులు, చెట్ల పొదలు, సమస్తములగు ఓషధులు క్షీణించి పోయినవి.

 

 

క్షీణించి పోవుచున్న ఓషదులతో పాటు దేవతా శ్రేష్ఠులు కూడ తరిగి పోవుచు బాధ నొందిన వారై పొదల మొదట చంద్రు డున్నాడని పలుక జొచ్చిరి. తీవ్రమైన వేదనతో వారందరు విష్ణువును శరణు జొచ్చిరి.

 

 

భగవంతుడు వారి నందరను నన్నేమి చేయు మందురని అడిగెను. దేవా! ఆ దక్షుని శాపము చేత సోముడు నాశమాయెను అని పలికిరి.

 

 

దేవతలారా! ఓషధు లన్నింటిని పడవైచి చెదరి పోకుండ చూచుకొని కలశము వంటి సముద్రమును చిలుకుడు అని విష్ణువు వారితో పలికెను.

 

 

దేవతలతో ఇట్లు పలికి హరి తానై రుద్రుని, బ్రహ్మను భావన చేసెను. అట్లే కవ్వపు ద్రాడుగా నుండుటకై వాసుకిని స్మరించెను.

 

 

వారందరు కలసి సముద్రమును చిలికిరి. అట్లు చిలుకగా చంద్రుడు మరల పుట్టెను.

 

 

మానవుల దేహమున క్షేత్రజ్ఞుడను పేరున ఉన్న పర పురుషుడే ఈ సోముడని భావింప దగును. దేహులలో ఈతనికి జీవుడని పేరు. పరతత్త్వము ఇచ్ఛకు లోబడి ఆతడు వేరుగా సోమ సంబంధమైన ఆకారమును పొందెను.

 

 

దేవతలు, మనుజులు, పదునారు విధములుగా నున్న దేవతలు ఆతనిపై ఆధారపడి బ్రదుకుదురు. అట్లే వృక్షములకు, ఓషధులకు ప్రభువుగా ఆతనినే భావింతురు.

 

 

రుద్రు డతనికే అప్పుడు ఒక కళ రూపముతో శిరస్సున ధరించెను. జలములు ఆతని స్వరూపములే. ఆతడు ‘విశ్వ మూర్తి’ గా భావనకు వచ్చు చున్నాడు. (విశ్వమూర్తి = విశ్వ మంతయు తన ఆకారమే అయిన వాడు)

 

 

ఆతని యెడ ప్రీతి నొందిన బ్రహ్మ ఆతనికి పూర్ణిమ తిథిని సమర్పించెను. ఆతిథి యందు ఉపవాస ముండి ఆతనిని పూజింప వలయును.

 

 

యవలతో వండిన అన్నము తిన వలయును. అట్టి వానికి చంద్రుడు జ్ఞానము నొసగును. కాంతిని, పుష్టిని, ధన ధాన్యములను ఎక్కువగా ప్రాసాదించును.