వరాహ మహా పురాణము

Table of Contents

అధ్యాయము - 42

అట్లే బుద్ధి మంతుడు పాల్గున మాసము శుక్ల పక్షము ద్వాదశి నాడు చెప్పిన పద్ధతి ప్రకారము ఉపవాస ముండి హరి నారాధింప వలయును.

 

“ఓం నరసింహాయ నమః” అని పాదములను, “గోవిందాయ నమః” అని తొడలను, “విశ్వభుజే నమః” అని రొమ్మును, “శితి కంఠాయ నమః” అని కంఠమును”, “పింగకేశాయ నమః” అని శిరస్సును, “అసుర ధ్వంసనాయ నమః” అని చక్రమును, “తోయాత్మనే నమః” అని శంఖమును పూజించి గంధమును పుష్పములను ఫలములను సమర్పింప వలయును.

 

స్వామి యందు తెల్లని వస్త్రములు రెండు చుట్టిన ఘటము నుంచి దానిపై రాగి పాత్రలో బంగారు నృసింహ ప్రతిమను శక్తిని బట్టి ఉంచ వలయును. లేనిచో కొయ్య బొమ్మ నైనను ఉంచ వచ్చును. రత్నములు లోపల గల ఘటము నందు స్వామి ప్రతిమ నుంచి చక్కగా పూజింప వలయును, ద్వాదశి నాడు వేద పండితుడగు బ్రాహ్మణునకు సమర్పింప వలయును.

 

మునుపు వత్సుడను రాజు ఈ వ్రతము చేసి పొందిన ఫలమును గూర్చి చక్కగా తెలిపెదను.

 

పూర్వము కింపురుష వర్షమున మిక్కిలి ధార్మికుడగు భారతుడను రాజుండెడి వాడు. అతనికి వత్సుడను కుమారుడు కలడు.

 

అతడు యుద్ధమున శత్రువులకు ఓడి ధన మంతయు కోల్పోయి పాద చారియై పత్నీ సహితముగా వనమున కరిగెను. వసిష్టుని ఆశ్రమమున నివసించెను.

 

 

కాలము గడుచు చుండగా వసిష్ఠ మహర్షి, ఈ మహా శ్రమమున వసించు చున్నావు. పనియేమి? అని అడిగెను.

 

రాజు:

పూజ్యుడా! నా కోశము పోయినది. నా రాజ్యము శత్రువల పాలైనది. పగవారు నా సంకల్పమును దెబ్బ కొట్టిరి. నిన్ను శరణు చొచ్చితిని. నాకు ఉపదేశము ననుగ్రహింపుము.

 

అతడిట్లు పలుకగా వసిష్ఠు డతనికి ఈ ద్వాదశీ వ్రతము నుపదేశించెను. అతడును దానిని సర్వమును విధి పూర్వకముగా ఆచరించెను.

 

ఆ వ్రతము ముగిసిన పిదప నరసింహ భగవానుడు సంతోష పడెను. శత్రువులను రూపు మాపెడి చక్రము నాతని కొసగెను.

 

ఆ రాజవరుడు ఆ అస్త్రముతో తనదైన రాజ్యమును గెలుచు కొనెను. రాజ్యమున నిలువ ద్రొక్కుకొని వేయి అశ్వమేధ యాగములను గావించెను. తుదికి ఆ శ్రేష్ఠుడు విష్ణు లోకమను ఉత్తమ పదము గాంచెను.

 

మునీ! ఇది చాల ధన్య. పాపములను హరించు నది. ఇట్టి ద్వాదశిని గురించి నీకు ప్రయత్న పడి చెప్పితిని. నీ కోరికను బట్టి ఆచరింపుము.