వరాహ మహా పురాణము
అధ్యాయము - 4
ప్రభూ! ఈ నారాయణ దేవుడు సర్వ భావములతో పరమాత్ముడు, నిత్యుడు అగు దేవుడా? కాదా? నాకు తెలుపుము.
మత్స్యము (చేప), కూర్మము (తాబేలు), వరాహము (పంది), నరసింహుడు, వామనుడు (పొట్టి వాడు), రాముడు (పరశు రాముడు), రాముడు (దశరథ రాముడు), కృష్ణుడు, బుద్ధుడు, కల్కి అని వారు పదుగురు.
భూదేవీ! ఈ చెప్పిన పది మందియు ఆ నారాయణుని మూర్తులు. శ్రీమన్నారాయణుని దర్శనము పొందగోరు వారికివి మెట్ల వంటివి.
ఆ దేవ దేవుని పరమ రూపమును దేవతలును చూడ జాలరు. మావంటి రూపముల తోడనే తృప్తి పడు చుందురు.
బ్రహ్మయు భగవంతుని స్వరూపము తోడనే రజస్తమో గుణములతో నేర్పడెను. ఈ రూపముల తోడనే విశ్వ మంతయు నిలిచి యున్నది. మరియు చైతన్యమును పొందు చున్నది.
ఆ దేవుని మొట్ట మొదటి రూపము, ఓ భూదేవీ! నీవు. నీరు రెండవ మూర్తి. అగ్ని మూడవ మూర్తి.
నాలుగవ మూర్తి వాయువు. ఆకాశామను పేరు గలది అయిదవది. ఇవి యాతని మూర్తులు. ఈ క్షేత్రము నెరిగిన తనము నా బుద్ధి యందు గలదు. ఇవి గాక మూడు మూర్తులు ఆతనికి కలవు. అవి సూర్యుడు, చంద్రుడు, యజమానుడు అనునవి. ఇవి యాతని ఎనిమిది మూర్తులు.
ఈ జగత్తంతయు ఆ నారాయణుని ఈ ఎనిమిది రూపములతో నిండి యున్నది. దేవీ! ఇది నీకు చెప్పితిని. ఇంకేమి విన గోరుదువు?
పరమేశ్వరా! నారదుడట్లు పలుకగా ప్రియవ్రత మహారాజు ఏమి చేసెను? దయతో అది నాకు చెప్పుము.
నారదుని వలన అచ్చెరువు గొలుపు వార్త విని ఆ ప్రియ వ్రతుడు నిన్ను (తానేలు భూమిని) ఏడు భాగములు చేసి పుత్రుల కొసగి తప మొనరించెను.
నారాయణ స్వరూపుడగు పర బ్రహ్మమును జపించి యాతడు తుష్టి చెందిన మనస్సుతో ఆవలి యోడ్డగు నిర్వాణమును పొందెను.
ఓ సుందరీ! మరియొక కథ చెప్పెదను వినుము. ఇది ప్రాత కాలపు రాజునకు సంబంధించినది. అతడు బ్రహ్మ నారాధించుటకు పూను కొనెను.
మునుపు ధర్మ పాలనలో గొప్ప వాడగు అశ్వశిరుడను రాజుండెను. గొప్పవి, మంచివియు నగు దక్షిణలతో నతడు అశ్వమేధ యాగ మొనర్చి అవబృథ స్నానమును (యజ్ఞము ముగియు న్నప్పుడు చేయు పవిత్ర స్నానము) బ్రాహ్మణులతో కూడి చేసి యుండగా ఆతని కడకు యోగి వరుడగు ముని కపిలుడును, యోగిరాజగు జైగీషవ్యుడును వచ్చిరి.
అంత నా రాజు ఉప్పొంగు సంతోషముతో లేచి వారికి స్వాగతము నెరపెను.
అట్లు వారు పూజ లందుకొని ఆసనము లందు కూర్చున్న పిదప మహా బలుడగు ఆ రాజు తమంత వచ్చిన వారు నిశితమైన బుద్ధి గలవారు అగు ఆ యోగ వేత్తల నిట్లడిగెను.
విప్రులారా! పురుషోత్తములారా! మిమ్ముల నొక సంశయము నడిగేదను. పరమ దైవమగు శ్రీమన్నారాయణుని ఆరాధించి విధమేది?
రాజా! నీవు చెప్పెడు ఆ నారాయణ గురు వెవ్వరు? మేమిరువురము నారాయణులము. నీ ఎదుట నిలిచి యున్నాము.
మీ రిరువురు బ్రాహ్మణులు, సిద్ధ పురుషులు తపస్సుతో మీ పాపములు కాలి పోయినవి. మేమే నారాయణులమని యెట్లు పలికితిరి?
ఆ జనార్ధనుని చేతులలో శంఖము, చక్రము, గదయు నుండును. అతడు పచ్చని పట్టు బట్ట కట్టును. గరుడునిపై నుండును. అతడు మహాదేవుడు. అతనికి సాటివాడు భూమిలో మరి యెవ్వడు కలడు?
వ్రతములు పండిన ఆ విప్రులిరువురు ఆ రాజు మాట విని నవ్వుచు రాజా! విష్ణువును కనుగొను మని బల్కిరి.
ఇట్లు పలికి ఆ కపిలుడు స్వయముగా విష్ణు వాయెను. వెను వెంటనే జైగీషవ్యుడు గరుడు డాయెను.
ఆ క్షణమున గరుడునిపై నున్న సనాతనుడను నారాయణ దేవుని చూచి రాజకుల మంతయు హాహాకారములు చేసెను.
గొప్ప కీర్తి గల రాజంత చేతులు జోడించి యిట్లు పలికెను. విప్రులారా! శాంతింపుడు. విష్ణు వనగా నిట్టివాడు కాడు.
విష్ణువు బొడ్డు తామర మధ్య నుండి బ్రహ్మ పుట్టెను. అతని నుండి రుద్రుడు పుట్టెను. అట్టి పరమేశ్వరుడు విష్ణువు.
రాజిట్లు పలుకగా ఆ మునివరు లిరివిరు పరమ మాయ గావించిరి. విశేషించి యోగ మాయను ప్రదర్శించిరి.
కపిలుడు పద్మనాభు డాయెను. (బొడ్డు నందు పద్మము కలవాడు) జైగీషవ్యుడు కమలము నందుండి యొడిలో పసివాని నొకని నుంచుకొని బ్రహ్మగా ఏర్పడెను.
ఎరుపెక్కిన కనులతో ప్రళయాగ్ని వంటి తేజస్సుతో నున్న ఆ బాలుని రాజు కనుగొనెను. అతడిట్లు పలికెను. విశ్వేశ్వరు డిట్లుండడు. ఇది యోగుల మాయ. శ్రీహరి అంతట వ్యాపించి యుండు వాడు. లక్ష్మీ దేవితో కలసి యుండును.
రాజు మాట ముగియగనే, ఓ భూదేవీ! ఆ సభలో, రాజ భవనములో దోమలు, నల్లులు, పేలు, తుమ్మెదలు, పక్షులు, పాములు, గుఱ్ఱములు, గోవులు, ఏనుగులు, సింహములు, పులులు, నక్కలు, లేళ్ళు ఇతర పశువులు, పురుగులు అడవులలో తిరుగునవి, జన పదములలో తిరుగునవి కోట్ల కొలదిగా కాన వచ్చినవి.
ఆ ప్రాణి కోటుల సముదాయమును గాంచి రాజు మనసున ఆశ్చర్య పడెను. ఇదియేమా? అని ఆలోచింపగా అతనికి జైగీషవ్యుని, బుద్ధి శాలియగు కపిలుని మహిమ తెలియ వచ్చెను.
చేతులు జోడించి ఆ రాజు ఆశ్వశిరుడు భక్తితో ఆ ఋషులను విప్రవరులారా! ఇది ఏమి? యని పృచ్చ చేసెను.
మహారాజా! విష్ణువును అర్చించు టెట్లు? అతనిని పొందుట యెట్లు? అని నీవు మమ్ముల నడిగితివి. ఆ విషయమును మేము ప్రదర్శించితిమి.
రాజా! నీకు చూపిన ఇవియన్నియు సర్వజ్ఞుని గుణములు. ఆ నారాయణ దేవుడు సర్వము నెరిగిన వాడు. ఇచ్చ వచ్చిన రూపములు తాల్ప గలవాడు.
కొన్ని యెడల శ్రీమన్నారాయణుడు సౌమ్యుడుగా సుస్థిరుడుగా మనుజులకు అందు చున్నాడు. ఈతనిని ఆరాధించుట చేత వాక్కు అర్థవంతమగు చున్నది. (విష్ణువు నర్చించుట వలన వాక్కునకు గొప్ప శక్తి ఎర్పడు చున్నాదని భావము)
మరియు జగముల కేలికయగు ఆ పరమాత్మ అన్ని శరీరముల యందు నున్నాడు. భక్తితో ఎల్లవారును తమ దేహము నందే అతనిని చూడ వచ్చును. అతడు ఏదో ఒక చోటనే యున్నవాడు కాదు.
పరమాత్మ యగు దేవుని రూపమును నీకా కారణముగా చూపితిమి. దీని వలన నీకు విశ్వాసము కలుగ వలయునని మా భావన.
రాజా! ఇట్లు విష్ణువు నీ దేహమునను, నీ మంత్రుల దేహమునను, నీ సేవకుల దేహమునను, నీకు మేము చూపిన దేవతలు, పశువులు, పురుగులు మున్నగు వాని సముదాయము లందును, ఇంతయేల అన్నింటి యందును ఉన్నాడు. ఈ సర్వము విష్ణు మయమే.
కాని హరి అంతట నున్నాడను భావనను గట్టి పరచు కొన వలయును. అతనికి సాటియగు వస్తువు లేదను భావనతో సేవింప వలయును.
రాజా! మేము నిండైన బావముతో శ్రీనారాయణుని, హరిని మనసున నింపుకొని నీకు జ్ఞాన స్వరూపమును తెలియ జేసితిమి.
నిండు మనస్సుతో శ్రీనారాయణ గురువును ఎల్ల వేళల స్మరింపుము. పూవుల నర్పించుట, ధూపము సమర్పించుట, బ్రహ్మ వేత్తలను తృప్తి పరచుట, చెదరని ధ్యానము చేయుట అనువానితో పరమేశ్వరుడు త్వరగా పొంద దగిన వాడు.
