వరాహ మహా పురాణము
అధ్యాయము - 45
మానవుడు జ్యేష్ఠ మాసము నందు ఇట్లే సంకల్పించి పరమ దేవుని పెక్కు తీరులగు పూవులతో అర్చింప వలయును.
‘ఓం నమో రామాభిరామాయ’ అని పాదములను ముందుగా పూజింప వలయును. ‘త్రివిక్రమాయ నమః’ అని కటిని, ‘ధృతవిశ్వాయ నమః’ అని ఉదరమును, ‘సంవత్సరాయ నమః’ అని రొమ్మును, ‘సంవర్తకాయ నమః’ అని కంఠమును, ‘సర్వాస్త్రధారిణే నమః’ అని బాహువులను, వాని పేరులతో శంఖ చక్రములను, ‘సహస్రశిరసే నమః’ అని ఆ మహాత్ముని శిరస్సును పూజింప వలయును. పిదప మునుపటి వలెనే కుంభమును నిలుప వలయును.
ఏదేని కోరిక గల పురుషుడు మునుపటి వలెనే జమిలి వస్త్రముతో చుట్టిన బంగారపు రామ లక్ష్మణుల ప్రతిమలను విధానము ప్రకారము అర్చించి మరునాటి ప్రభాతమున బ్రాహ్మణునకు మనః పూర్వకముగా దాన మివలెను.
మునుపు పుత్రులు లేని దశరథ మహారాజు వసిష్ఠ మహర్షిని చక్కగా పూజించి సంతానము గూర్చి అడిగెను.
ఆ బ్రాహ్మణుడు పూర్వ కాలపు రహస్యము నెరిగి ఆ దశరథున కిదియే విధానము నుపదేశించెను.
ఆతనికి ఆ విష్ణువు స్వయముగా రాముడను పేరు, మహా బలము గల పుత్రుడై జన్మించెను. అవ్యయుడగు విష్ణువు మిక్కిలి సంతోషము చెంది ఆ మహా రాజునకు నాలుగు రూపములతో పుట్టెను. ఇది ఇహలోక విషయము నీకు చెప్పితిని. పరవలోక విషయమునకు ఇటుపై చెప్పెదను వినుము.
పదు నలుగురు ఇంద్రుల జీవిత కాలము స్వర్గమున నున్నవాడై భోగముల ననుభ వించును. ముగిసిన తరువాత మరల మనుజుడై నూరు యజ్ఞములు చేయు మహా రాజగును. అట్టి పురుషునికి సర్వ పాపములు నశించును. సంపూర్ణము, శాశ్వతము నగు నిర్వాణమును పొందును.
