వరాహ మహా పురాణము

Table of Contents

అధ్యాయము - 92

 

నారదు డట్లు పోగా దైత్యుడు అచ్చెరు వొందిన మనస్సుతో ఆ నారదుని ముఖము నుండి వినిన ఆ సుందరిని గూర్చియే చింతించు చుండెను.

 

ఆ దైత్యవరుడు ఆమెనే చింతించుచు సుఖము పొంద డాయెను. మహా మంత్రి, మహా బలుడు అగు అలంశర్మ తక్కిన మంత్రులను పిలిపించెను.

 

ఆతనికి గొప్పనీతి వేత్తలు, శూరులు, పెక్కు శాస్త్రములలో ఆరితేరిన వారు అగు మంత్రులు ఎనిమిది మంది కలరు. ప్రఘసుడు, విఘసుడు, శంఖకర్ణుడు, విభావసుడు, విద్యున్మాలి, సుమాలి, క్రూరుడగు వర్జన్యుడు అనువారు (అలంశర్మ ఒకడు)

 

వీరాతనికి ముఖ్యులైన మంత్రులుగా ప్రసిద్ధి కెక్కిన వారు. వారు కొలువున్న ఆ రాక్షస రాజును గాంచి పనియేమో సెలవిమ్మని పలికిరి.

 

వారి ఆ పలుకు విని మహా బలుడగు దానవేంద్రుడు నారదుని వలన పొందిన నిశ్చయము కలవాడు కావున కన్యా లాభము నాశించి యిట్లు పలికెను.

 

 

నారద మహర్షి నాకొక బాలను గూర్చి చెప్పెను. కానీ దేవతల ప్రభువును గెలువక ఆ వరాంగన లభింపదట.

 

మీరందరు విమర్శించి ఆ బాల నాకెట్లు వశమగునో దేవతల నెట్లు ఓడింతునో అది యంతయు త్వరగా నాకు తెలుపుడు.

 

రక్కసు డిట్లు పలుకగా వారందరు ఇట్లనిరి. ప్రభూ! మేమందరము విచారించి చెప్పుదుము.

 

వారట్లు పలుకగా ప్రఘసుడు దానవ రాజుతో నిట్లనెను. రాజా! నారదుడు నీకు చెప్పిన ఆ మహాసతి పరమ శక్తి వైష్ణవి. లోకముల నన్నింటిని పట్టి నిలుపునది.

 

గురుపత్ని, రాజపత్ని, మరియు సామంతుని ఇల్లాండ్రు, ఇట్టి వారిని పొందగోరు రాజు నశించును. అట్లే పొంద రాని స్త్రీలను పొందుట చేతను నాశన మగును.

 

ప్రఘసు డిట్లనగా విఘసు డిట్లు పలికెను. ప్రఘసుడు ఆ దేవిని గూర్చి లెస్సగా పలికెను.

 

నా బుద్ధికి ఒకటి తోచు చున్నది. అందరకు అది నచ్చినచో చేయ వచ్చును. జయింప గోరువారు ఎల్ల వేళల కన్యను వరింప వలయును. కాని ఎన్నటికిని కన్యను స్వతంత్రించి బలాత్కరింప రాదు.

 

మీకీ మాట రుచించినచో మంత్రి వరులారా! మంత్రు లందరు అచటి కరిగి ఆ దేవిని యాచింప నగును.

 

ఆమెకు దొడ్డబుద్ధి గల చుట్ట మొకడున్నచో మొదట సామ మార్గమున యాచింతము. తరువాత దానమును ప్రయోగింతము. అటుపై భేదము, అదియు కుదరనిచో దండము ప్రయోగింతము.

 

ఈ వరుస పద్ధతిలో ఆమె వశము కాని యెడల అప్పుడు సాధనములు సమ కూర్చుకొని ఆ సుందరిని బలముతో పట్టు కొందము.

 

విఘసు డిట్లనగా తక్కిన మంత్రు లందరు ఆమాటను కొనియాడుచు సంతోష వాక్కుతో నిట్లనిరి.

 

విఘసుడు ఆ కాంతను గూర్చి లెస్సగా పలికెను. అదియే త్వరగా చేయ దగినది. అచటి కొక దూతను పంప వలయును.

 

సర్వ శాస్త్రములను నీతిని చక్కగా ఎరిగిన వాడు, పవిత్రుడు, పరాక్రమ వంతుడు అగు దూతను పంపి ఆతని వలన ఆదేవి వర్ణము, రూపము, గుణములు, పరాక్రమము, పాటవము, ధైర్యము, బలము, చుట్ట పక్కములు, సాధన సంపత్తి, స్థానము మొదలగు వాని నన్నింటిని చక్కగా తెలిసి కొని అటుపై కార్యమునకు దిగ వలయును.

 

అట్లు పలికి వారందరు, ఆ విఘసుని పలుకును, మంత్రులలో ఉత్తముడగు ఆ విఘసుని మేలు మేలని పొగడిరి.

 

ప్రశంసించి వారందరు గొప్పవాడు, గొప్పమాయ లెరిగిన వాడు, ఉత్తముడు అగు విద్యుత్ర్పభుని దూతగా ఎన్నుకొనిరి.

 

అట్లా దూతను పంపిన పిదప విఘసు డిట్లు పలికెను. ప్రభూ! దానవ ప్రభువు లందరు చతురంగ బలముతో సంసిద్ధులై దేవ సైన్యముపై విజయము సాధింప వలయును.

అసురేంద్రా! దేవత లందరు విరిగి పోగా దేవేంద్రుడు నిన్ను చేరగా ఆ నీ పరాక్రమమునకు భీతిల్లి నదై ఆ కన్య నీకు వశ మగును.

 

లోకపాలు రందరును, మరుత్తుల గణములును, నాగులును, విద్యాధరులును, సిద్ధులును, గంధర్వులును, రుద్రులును, వసువు లును, ఆదిత్యులును అన్ని విధములుగా అందరు నీకు ఓడి పోవగా నీవే యింద్రుడవు అగుదువు.

 

ఇంద్రుడనగు నీకు దేవ గంధర్వ భామినులగు ఆ కన్య లందరు అన్ని విధములుగా వశ మగుదురు. ఆ కన్యయు నీకు లొంగి పోవును.

 

అతడట్లు పలుకగా మహిష దైత్యుడు కారుమొయిలు వంటి వన్నె కలవాడు, కాటుక కొండ వంటి కాంతి కలవాడును అగు విరూపాక్షుని,తన సేనాపతిని చూచి యిట్లు పలికెను.

 

ఏనుగులు, గుఱ్ఱములు, రథములు, పదాతులు గల సైన్యమును వెంటనే సమాయత్త పరచుము. దానితో దేవతలను, గంధర్వులను యుద్ధమున గెలువరాని వారిని గెలిచెదను.

 

అతడిట్లు పలుకగా విరూపాక్ష సేనాపతి వెను వెంటనే అంతు లేనిది, ఓటమి ఎరుగనిది యగు మహా సైన్యమును రప్పించెను.

 

ఒక్కొక్క రక్కసుడు యుద్ధమున వజ్రము చేపట్టిన ఇంద్రుని కెనయగు వాడు. ఒక్కొక్క దేవరాజును తన బలముతో గెలుచుటకు తొడలు గొట్టు చుండును.

 

ఆ ముఖ్యుల సేనలు అర్బుదము, తొమ్మిది కోట్లు. అందే ఒక్కని నెవ డెదిరించినను మొత్తము సేన అండగా నిలుచును. (అర్బుదము = పదికోట్లు)

 

దొడ్డ దేహ బలము గల రక్కసులు వేలవేలు పోటుగాండ్రై యుద్ధమునకు సిద్ధపడిరి. దేవ సైన్యమును నమిలి మ్రింగ వలయు నన్న కోరికతో పయనమైరి.

 

విచిత్రము లగు వాహనములు, పెక్కు తీరులగు ధ్వజ పతాకలు, విచిత్రము లగు ఆయుధములు గలవారై దేవతలను గెలుచుటకై ఆ రాక్షసులు పెక్కు భయంకర రూపములతో, ఎత్తి పట్టిన భయంకరములగు ఆయుధములు గల చేతులతో నృత్యమును చేసిరి.