వరాహ మహా పురాణము
అధ్యాయము - 75
ఇటుపై జంబూ ద్వీపమును, అందలి సముద్రములను, ద్వీపములను గూర్చి విస్తరముగా ఉన్న దున్నట్లుగా చెప్పెదను.
అందలి వర్షములు (దేశములు), నదులు, మహా భూతముల ప్రమాణము, సూర్య చంద్రుల గతి, ఏడు ద్వీపములలో నున్న వేల కొలదిగా నున్న ద్వీపముల భేదములు మొదలగు విధముగా విస్తరిల్లిన వానిని గురించి క్రమముగా చెప్పుటకు సాధ్యము కాదు. చంద్రుడు, ఆదిత్యుడు మొదలగు గ్రహములతో పాటు ఏడు ద్వీపములను గూర్చి వివరించి చెప్పెదను. ఈ ప్రమాణము లన్నింటిని మనుష్యులు తర్కముతో (ఊహతో) మాత్రమే చెప్ప గలరు.
ఊహ కందని భావములను తర్కముతో సాధింప జాలము. ప్రకృతుల కంటె అతీతమైన దానిని అచింత్యముగా భావింతురు.
తొమ్మిది వర్షములు గల జంబూ ద్వీపమును గూర్చి విస్తరమును, మండల స్వరూపము, యోజనముల కొలత మొదలగు వానితో ఉన్న దున్నట్లు చక్కగా చెప్పెదను.
ఒక వంద వేల యోజనముల కొలత కలది. పెక్కు జన పదములతో నిండినది, శిలల సముదాయముల నుండి పుట్టిన అన్ని విధములగు ధాతువులతో కూడిన పర్వతములతో ఇంపైనది. పర్వతముల నుండి జాలు వారిన నదులతో వ్యాప్తమైన ఇట్టి జంబూ ద్వీపము మిక్కిలి విశాలము, శోభ కలది, సంపద కలదియునై తొమ్మిది దేశములతో ఆవృతమై పెద్దగా నున్నది.
జంబూ ద్వీపమంత వైశాల్యము కల ఉప్పు సముద్రము దానిని అన్ని వైపుల చుట్టుకొని యున్నది.
దానికి తూర్పున వెడల్పు, పొడవు గల ఆరు వర్ష పర్వతములు గలవు. (హద్దులుగా ఉన్న పర్వతములు) రెండు వైపుల తూర్పు పడమర సముద్రములు చుట్టుకొని యున్నవి. మంచు అధికముగా గల హిమవంతము, బంగారము మిక్కుటముగా గల హేమకూటము, అంతట మిక్కిలి సుఖమును కూర్చు పెద్దదియగు నిషధము, నాలుగు రంగులు గలది, బంగారుతో నిండినది, ఱాలబిగువు గలది, గుండ్రని ఆకారము, చతురస్రమగు పై భాగము కల మేరు పర్వతము అందు కలవు.
మరియు ఆ పర్వతము ప్రక్క భాగముల యందు పెక్కు వర్ణములు కలదియై ప్రజాపతి గుణములతో కూడినదై, పరమేష్ఠి యగు బ్రహ్మ బొడ్డు భాగము నుండి పుట్టినదై యుండెను.
తూర్పు దిక్కున అది తెల్లని వర్ణము కలిగి యుండెను. దాని చేత దాని బ్రాహ్మణత్వము తెలియ వచ్చును. దక్షిణమున పసుపురంగు వలన వైశ్వత్వము వ్యక్తమగును. పడమటి భాగమున తుమ్మెద రెక్కల వంటి రంగు కలదు. దాని చేత పేరు, ప్రయోజనము, పని అను వానిని సూచించు ఆ మేరువునకు శూద్రతయు చెప్పబడినది. ఉత్తర పార్శ్వమున ఎరుపు రంగు కాన వచ్చును. దాని చేత క్షత్రియ భావము ఎరుగ నగును. ఇట్లు దాని రంగులను గూర్చి చెప్పు చుందురు.
ఇంక అయిదవది యగు నీలము స్వభావమును బట్టి గుండ్రని ఆకారము కలది. రంగును బట్టి నీలము, గొప్ప కొలత కలది, దాని నిండ వైడూర్యము లుండును. ఆరవ హిరణ్మయ పర్వతము తెలుపు ఎరుపుల కలనేత రంగులో నుండును. నెమలి పింఛము వంటి వన్నె కలిగి యుండును. బంగారు కొమ్ములతో నుండును.
ఈ గొప్ప కొండలు సిద్ధులు, చారణులు మొదలగు దేవ జాతులకు నివాసములు. వాని మధ్య భాగపు వైశాల్యము తొమ్మిది వేల యోజనములు.
మహా మేరువునకు నడిమి భాగమున ఇలా వృతమను దేశము కలదు. అది తొమ్మిది వేల యోజనములు వ్యాపించి యున్నది.
ఈ మహా మేరువు మధ్య భాగము పొగలేని నిప్పు వలె కన్పట్టును. మేరువునకు దక్షిణముగా సగము, ఉత్తరముగా సగము పీఠ భూమి కలదు.
ఇందు ఆరు దేశములు కలవు. వానికారు వర్ష పర్వతములు కలవు. అన్ని దేశములకు యోజనము మేర అవి వ్యాపించి యున్నవి.
రెండు రెండు దేశముల విస్తారము వేల కొలది యోజనములతో ఉన్నది. ఆ దేశముల విస్తీర్ణము, పొడవు జంబూ ద్వీపపు కొలత యగును.
నీలము, నిషధము అను రెండు కొండలు రెండు నూర్లవేల యోజనముల పొడవు కలవి. తక్కిన శ్వేతము, హేమకూటము, హిమవంతము, శృంగవంతము అనునవి వాని కంటె తక్కువ కొలత కలవి.
నిషధ పర్వతము జంబూ ద్వీప మంతటిదని ప్రసిద్ధి కెక్కినది. హేమ కూటము దాని కంటె పండ్రెండవ భాగము తక్కువది. హిమవంతము హేమకూటము కంటె ఇరువదవ భాగము తక్కువైనది.
తూర్పు పడమరలుగా హేమకూట మహా పర్వతము ఎనుబది ఎనిమిది యోజనముల పొడవు కలది. హిమవంతము ఎనుబది యోజనముల పొడవైనది.
ద్వీపము మండలా కారముగా ఉన్న కారణమున ఈ దేశములకు, ఆ పర్వతములకును హెచ్చు తగ్గులు కలుగు చుండునని చెప్పు కొందురు.
ఆ కొండల నడుమ పెక్కు జన పదములు గల దేశములు కలవు. జల పాతములతో విషమ స్వరూపములు గల కొండలును ఆవరించి యున్నవి.
పెక్కు తీరులు గల నదులు వ్యాపించి యుండగా ఆ దేశములు ఒకదాని కొకటి ప్రవేశించ నలవి కానివై యున్నవి. అందు అన్ని యెడల పెక్కు జాతుల జంతువులను నివసించును.
హైమవత వర్షమున భారత జాతి జనులును, హేమకూట వర్షమున కింపురుష జాతి జనులును కలరు.
హేమ కూటమున కావల నిషధము కలదు. దానినే హరి వర్ష మనియు నందురు. మేరువు ప్రక్కగా హరి వర్షమున కావల ఇలావృతము కలదు. దాని కావల నీలము. దానికి రమ్యక మనియు ప్రసిద్ధి. రమ్యకము దాటిన తరువాత శ్వేతము. దానిని హిరణ్మయ మనియు నందురు. హిరణ్మయమున కవతల నున్నది శృంగవంతము. దానిని కురు దేశమనియు నందురు.
దక్షిణముగా ఉత్తరముగా నున్న రెండు దేశములు వింటి వలె నుండును. అందు నాలుగు ద్వీపములు కలవు. ఇట్టి ఇలావృతము చతురస్రా కారముగా నుండును.
నిషధమునకు దక్షిణముగా నున్న పీఠభూమి సగము దక్షిణ భూమిగా, శృంగ వంతమునకు పరముగా నున్న సగము భూమి ఉత్తర భూమిగా గుర్తింతురు.
దక్షిణమున నున్న వేది యందు సగమున మూడు దేశములు, ఉత్తరమున మూడు దేశములు కలవు. వాని నడుమ నున్నదియే ఇలావృతమని తెలియ దగును.
నీలమునకు దక్షిణముగా, నిషధమునకు ఉత్తరముగా ఉత్తరము వైపు పొడవుగా నున్న మహా శైలము మాల్యవంతము. దాని వెడల్పు, ఎత్తులు రెండు వేల యోజనములు. పొడవు ముప్పది నాలుగు వేల యోజనములు.
దానికి పడమరగా గంధమాదన పర్వతము కలదు. ఎత్తు, వెడల్పు, పొడవులతో అది మాల్య వంతమునకు సాటియైనది.
ఆ రెండు కొండల నడుమ నాలుగు వర్ణములు కలదియు. స్వర్ణమయ మైనదియు నాలుగు కోణములు కలదియు, మిక్కిలి ఎత్తై నదియు నగు బంగారు కొండ మేరువు ఆవరించుకొని యున్నది.
వ్యక్తము కాని నీరు మొదలగు ధాతువు లన్నియు పుట్టినవి. అవ్యక్తము నుండి మేరువు దుద్దుగా గల భూమి యనెడు పద్మము నాలుగు రేకులతో పుట్టినది. అది అయిదు గుణములు గల మహత్తుగా ఏర్పడినది. దాని నుండి సకల విధములగు ప్రవృత్తులు ఏర్పడినవి. (చతుష్పత్రమ్ = నాలుగు రేకులు = 1. వాసుదేవ 2. సంకర్షణ 3. ప్రద్యుమ్న 4. అనిరుద్ధ తత్వములు) (అయిదు గుణములు = శబ్ధ స్పర్శ రూప రస గంధములు.)
పెక్కు కల్పములు జీవించి యుండు వారు, పుణ్యములు చేసిన వారు. కృతాత్ములు, మహాత్ములు అగు పురుషులు, మహాయోగి మహాదేవుడు, జగత్తునకు ధ్యేయుడు, సర్వ లోకములను వ్యాపించి యుండువాడు, అనంతుడు, వ్యాపకుడు, అవ్యయుడునగు పురుషోత్తముని పొందుదురు.
ఆ పురుషోత్తమునకు ప్రాకృతమైన మూర్తి, మాంసము మేదస్సు, ఎముకలు అను వానితో ఏర్పడునది లేదు. యోగి యగుట వలనను, ఈశ్వరు డగుట వలనను ఆ విభుడు సత్వ రూపమును తాల్చువాడు.
ఆతడు నిమిత్తముగా లోకమున సనాతనమగు పద్మము మిగిలిన కల్పపు శేషము నందును. మొదటి భాగము నందును పుట్టు చుండును. కాలపు గతి ఇట్టిది.
ఆ పద్మము నందు దేవ దేవుడు, నలు మోముల దేవర, ప్రజా పతులకు పతి, ఈశానుడు, జగత్తునకు ప్రభువు అగు బ్రహ్మ దేవుడు ఉదయించెను.
ఆ పద్మము విత్తనము సృష్టియే సమస్త ప్రజల సృష్టిగా విస్తరముగా వర్ణింప బడుచున్నది.
ఆ నీరు విష్ణు సంబంధమైన దేహము. రత్నములతో అలంకరింప బడినది. దాని నుండి పద్మపు ఆకారముతో, అడవులతో, చెట్లతో కూడిన భూమి పుట్టినది.
ఆ లోక పద్మపు విస్తారమును గూర్చి సిద్ధులు పలికి యున్నారు. విభాగములతో వారు చేసిన ఆ వర్ణనమును, బ్రాహ్మణులారా! క్రమముగా చెప్పెదను. వినుడు.
అందు మహా వర్షములు నాలుగు నెలకొని యున్నవి. అందు పర్వతముల కూర్పు మేరు వనునది గొప్ప బలము కలది.
ఆ మేరువు ప్రక్క భాగముల యందు పెక్కు వర్ణములు కలిగి యుండెను. తూర్పున తెలుపు, దక్షిణమున పసుపు, పడమర దిక్కున తుమ్మెదల రంగు, ఉత్తరమున ఎరుపు అనునవి వన్నెలు. కాని పర్వతముల రాజ వంశ మందు నెలకొన్న మేరువు తెల్లనిదై ప్రకాశించు చుండును.
బాల సూర్యుని వలె ప్రకాశించుచు పొగలేని అగ్నివలె అలరారు చుండును. ఎనుబది నాలుగు వేల యోజనముల ఎత్తు కలదు.
దాని పాదు పదునారు యోజనముల లోతున కలదు. వైశాల్యము పదునారు యోజనములు, మూకుడు వలె ఉండుట వలన దానిపై భాగము ముప్పది రెండు యోనముల విస్తృతితో నుండును.
దాని చుట్టు కొలత వెడల్పునకు మూడు రెట్లు. దాని వ్యాసము వృత్తా కారపు కొలతతో చూడ దగినది.
అన్ని వైపుల చుట్టు కొలత తొంబది వేల యోజనములు దాని వ్యాసము తొంబది ఆరు యోజనములు. చతురస్రపు కొలతతో దాని అన్ని వైపుల వైశాల్యము లెక్కకు వచ్చును.
ఆ పర్వతము మహా దివ్యమైనది, దివ్యమగు ఓషధులతో కూడినది. స్వర్గ మయములగు చక్కని భవనములతో నిండినది.
ఆ శైల రాజమున దేవతలయు, గంధర్వులయు, నాగులయు, రాక్షసులయు, అప్సరసలయు గణములు పరమానందము పొందు చుండును.
భూతము లన్నియు మెచ్చు కొనెడు భవనములతో ఆ మేరువు చుట్టబడి యున్నది. దాని పార్శ్వము లన్నియు నాలుగు దేశముల నెలకొని యున్నవి.
పడమటి దిక్కున భద్రాశ్వము, భారతము, కేతుమాలము అనునవియు, ఉత్తరమున పవిత్ర కార్యములకు నెలవులగు కురు భూములును కలవు.
ఆ పద్మపు దుద్దు మండలా కారముగా నున్నది. దాని కొలత వేల కొలది యోజనములుగా నున్నది.
దాని కేసర జాలములు మొత్తము పదునైదు (వేలు) గా నున్నవి. ఎనుబది నాలుగు యోజనముల పొడవైనవి. లోపలకు ముప్పది యోజనముల కొలత కలవి. అవి అన్ని వైపులకు చెదరి యున్నవి.
అవి చాల పెద్దవి. నూరు వేల యోజనముల పొడవు ఎనుబది వేల యోజనములు వెడల్పు కలిగి యున్నవి. అందు పదునాలుగు వేల యోజనములు గల ఆకులు నాలుగు కలవు.
నేను మీకు కర్ణికగా చెప్పితినే, దానిని గురించి సంగ్రహముగా వర్ణింతును. వినుడు. అది మణి మయములగు వందల కొలది వర్ణములతో పెక్కు రంగుల కాంతులతో చిత్రముగా ఒప్పారు చున్నది.
అది పెక్కు పత్రముల గుత్తులు కలిగి చక్కని వన్నెతో ఎర్రని కాంతితో, వేల కొలది కణుపులతో, వేల కొలది కందరములతో మనోజ్ఞమై, నూరువేల పత్రములతో గుండ్రని ఆకృతితో ఒక పెద్ద పర్వతము వలె అలరారును. దాని లోయలు, వేదికలు, ఇతర ప్రదేశములు, తోరణములు రత్నమయములై ఒప్పుచుండును.
అందు బ్రహ్మ సభ మిక్కిలి అందమైనది. అందు బ్రహ్మర్షులు ఎక్కువగా తిరుగు చుందురు. దాని పేరు మనోవతి. అన్ని లోకములో ప్రసిద్ధి కెక్కినది.
అందు బ్రహ్మ దేవుడు వేయి సూర్యుల కాంతితో వెలిగి పోవు చుండును. గొప్ప విమానమున కూర్చుండును. ఆతని మహిమ ఎల్లవేళల భాసిల్లు చుండును.
అందు దేవతల గుంపులు నాలుగు మొగముల దేవరను, తనకు తానే ప్రభువైన వానిని, పూజింప దగు వానిని మన్నన గల నమస్కారములతో ఆరాధించుచు నిలిచి యుందురు.
ఆ మహాత్ము లందరు దృఢమైన సంకల్పము కలవారై సుందరము లగు హృదయములతో, సదాచార మార్గము తప్పని వారై బ్రాహ్మ చర్యమును సాధించు చుందురు.
మరియు గృహస్థులు పూజలు, చక్కని భోజనములు కలవారై పితృ దేవతల అర్చనల యందు ప్రీతి కలవారై ఉందురు. వినయము కలవారు, అతిథుల యందు ప్రియులునై ఉందురు.
ఇంకను గృహస్థులు పవిత్ర కర్మముల యందు నిష్ఠ కలవారు. విరక్తులు, యమము, నియమము, దానము మొదలగు వానిచేత గట్టిగా కాలి పోయిన పాపములు కలవారు.
హరి నివాసము స్వచ్ఛమై, ఏ నిందయు లేని బ్రహ్మ లోకము పైకి పైకిగా ఉండు సర్వ గతులకును పరమ గతి. అది పదు నాలుగు వేల యోజనముల వైశాల్యము కలది.
పై భాగమున అందమైనది, నల్లనిది, అయినను బాల సూర్యుని వన్నెతో ప్రకాశించునది, రత్న ధాతువులతో విచిత్ర మైనది. రమ్య మైనది అగు పెద్ద పర్వతము కలదు. అది పెక్కు రత్నములకు నిలయము. మణి తోరణముల మందిరము లందు కలవు. మేరువునకు అన్ని వైపుల గుండ్రని ఆకారముతో చుట్టుకొని యున్నది. ముప్పది వేల యోజనముల విస్తారము గల ఆ పర్వతము చక్రపాటము. అట్టిదియే జారుధి అనునదియు ఒక పర్వతము. ఇవి ఉత్తర దిక్కున నున్న పర్వతములు.
ఉత్తరమున నున్న ఈ పర్వతముల తావులలో క్రమముగా ఉన్న నదులు, సరస్సులు అను వానిని గూర్చి తెలసి కొనుడు.
చక్రపాటము నుండి వెలువడి, పది యోజనముల విస్తీర్ణము కల ఊర్ఢ్వవాహిరి యగునది భూమిపై చక్కగా నెలకొని యున్నది.
అది అమరావతీ పురమున చంద్రుని కాంతి వంటి కాంతితో ప్రవహించు చుండును. సూర్యుని, చంద్రుని, నక్షత్రముల కాంతులను కూడ అది తిరస్కరించును.
ఉదయ సాయం కాల సంధ్యలను సేవించు బ్రాహ్మణ ప్రవరులు ఆ ఎనిమిది పర్వతములను కూడ స్తుతింతురు.
చుట్టు తిరుగు చుండు నక్షత్రముల కాంతులు గల ఆ నదిని రుద్రుడు ఇంద్రుడు కూడ సేవించు చుందురు.
