వరాహ మహా పురాణము
అధ్యాయము - 134
నా భక్తుడు నా మంత్రములను వదలి చెడు పలుకులు పలికినచో అట్టివాడు పండ్రెండు జన్మములు మూర్ఖుడగును.
నా భక్తుడు అట్టి పాపము నుండి ముక్తి పొందు ప్రాయశ్చిత్త విధిని చెప్పెదను.
పదునైదు దినములు బయలున పవ్వళించ వలయును. అప్పుడే దోషము నుండి ముక్తుడగును. సంశయము లేదు.
శ్రీవరాహ దేవుడు:
నల్లని వస్త్రముతో నన్ను సమీపించు వాడు అయిదు వందల యేండ్లు పురుగై యుండును.
ఓ విశాలాక్షీ! సుశ్రోణీ! ఈ దోషము నుండి శుద్ధి చేయునట్టి ప్రాయశ్చిత్తమును తెలిపెదను. దాని చేత నరుడు పాపము నుండి విడివడును.
శాస్త్రమున కానవచ్చు పద్ధతి ప్రకారము చాంద్రాయణ వ్రతము నాచరించి మానవుడు ఈ పాపము నుండి ముక్తుడగును. సంశయము లేదు.
కాని పద్ధతిలో నన్ను తాకి నా కడకు చేరువాడు మూర్ఖుడు, పాపకర్ముడు, నాకు అప్రియము కలిగించు వాడును అగును.
ఆతడొసగిన గంధములు, మాలలు మొదలగు వానిని నేను గ్రహింపను. వాడు తాకిన దానిని కూడ నేను అందు కొనను.
అంత నారాయణుని పలుకు విని శ్రేష్ఠమగు వ్రతములు గలదియు, ధర్మమున వాంఛ కలదియు నగు వసుంధర తీయగా నిట్లు పలికెను.
నాథా! ఆచారమున వైపరీత్యము కలిగి నపుడు జరుగు దానిని చెప్పితివి. ఇప్పుడు నీవు ముఖ శుద్ధిని గూర్చిన రహస్యమును చెప్పదగును.
ఈ భూమిపై భాగవతులు నీ పనులు యందు శ్రద్ధ కలవారు ఏ కర్మ విధానముతో శుద్ధి చేసికొని నీ కడ కరుదెంతురు?
దేవా! ఇది సంశయము. నాకు మిక్కిలి వేడుకగా నున్నది. నీ భక్తుల సుఖము కొరకు నీవు లోపము లేకుండ చెప్ప వలయును.
దేవీ! భీరూ! నీవు నన్ను బ్రతిమాలుచు అడుగుచున్న ఆ రహస్యమును నీకు చక్కగా తెలిపెదను.
సర్వ కర్మములను పరిత్యజించి నన్ను చేరుకొను వాడు శుద్ధి ఎట్లు చేసికొన వలయునో చెప్పెదను వినుము.
తూర్పునకు మొగము పెట్టి కాళ్ళు నీళ్ళతో కడుగుకొని, నీటిని తగు విధముగా గ్రహించి మూడు మట్టి ముద్దలను గ్రహించి చేతిని వానితో నీళ్ళతో కడుగుకొన వలయును. పిదప ఏడు పుడిసెళ్ళ నీటితో ముఖమును శుద్ధి చేసికొన వలయును.
అయిదయిదు పాత్రల నీటితో రెండు కాళ్ళను కడుగుకొన వలయును. పిదప ఆ పాత్రలను శుద్ధి చేయ వలయును. ఇది నా ప్రియమును కోరినచో చేయ దగుపని.
మూడు పాత్రల నీటిని శరీర శుద్ధి కొరకు పుచ్చుకొన వలయును. చేతులతో ముఖమును తుడుచుకొన వలయును. ఇంద్రియములపై అదుపు ఉంచుకొన వలయును.
సంసార మోచనము ఫలముగా విధి విధానము ననుసరించి నన్నే భావించుచు ప్రాణాయామము నాచరింప వలయును.
పర బ్రహ్మమును మనసున నిలిపి తలను ముమ్మారు తాక వలయును. పిదప చెవులను, ముక్కును మూడేసి పర్యాయములు స్పృశింప వలయును.
తాను కూర్చున్న చోటును మూడు మారులు నీళ్ళు చల్లి తాక వలయును.
నన్ను సమీపించు నపుడు భక్తుని కర్తవ్య మిట్టిది. కడపట తన దేహము పై నీళ్లు చల్లుకొన వలయును. నా ప్రియమును కోరు భక్తుని కర్తవ్య మిట్టిది.
నా అర్చన యందు నిలుకడ కలిగి యిట్లు చేయు వానికి ఏ దోషమును అంటదు. దేవీ! ఇందు సందియము లేదు.
అంత నారాయణుని పలుకు విని వసుంధరా దేవి భాగవతు లందరకు ప్రియమైన మాటను తీయగా నిట్లు పలికెను.
ఈ శుద్ధి విధానముతో శుభ కర్మముల నాచరించు వాడు ప్రమాద పడుట, ప్రాయశ్చిత్తము పొందుట ఎట్లో తాము చెప్ప వలయును.
నా శాసనమునకు వెలిగా ప్రవర్తించు వారే గతిని పొందుదురో ఆ గుట్టును నీ కెరగింతును. వినుము.
ఈ విధానమును అతిక్రమించి నన్ను సమీపించు వాడు పురుగై పదివేల పదివందల ఏండ్లు ఉండును. ఇందు సంశయము లేదు.
ఆ మూర్ఖునికి ప్రాయశ్చిత్త మెట్టిదో చెప్పెదను. దానితో ఆతడు మరల కృత కృత్యుడగును.
అతడు బ్రాహ్మణుడు కానీ, క్షత్రియుడు కానీ, వైశ్యుడు కానీ, నా బుద్ధి యందు నిలుచు వాడెవ్వడు గానీ, మహా సాంతపనము, తప్త కృచ్ఛ్రము అనువానిని నిర్దుష్టముగా చేసి ఈ పాపము నుండి విముక్తి పొందును. పరమ గతిని పొందును.
ఎవ్వడు గాని నా పనుల యందు శ్రద్ధకల వాడు, మనస్సును చపలము చేసికొని క్రోధముపై కొన్నవాడై నా దేహమును తాకునేని అది మహా దోషము.
నేను రాగము గల వానిని, తీవ్రమగు కోపము కల వానిని ఇష్టపడును. ఇంద్రియములపై అదుపు గల వానిని, మంచి వానిని, పరిశుభ్రత కల వానిని, భక్తుని ఎల్లప్పుడు ఇష్ట పడుదును.
అయిదు ఇంద్రియములను తన అధీనమున నిలుప గల వానిని, ద్వంద్వములను వదలిన వానిని, అహంకారమును పూర్తిగా దూరము చేసికొనిన వానిని, నా పనుల యందు మిక్కిలి ప్రీతి కలవానిని నేను ఇష్ట పడుదును. (ద్వంద్వములు = జంటలు = లాభము - నష్టము; గెలుపు - ఓటమి; సుఖము - దుఃఖము మొదలగునవి)
పరిశుద్ధుడైన భాగవతుడు క్రోధము కలవాడై నన్ను తాకినచో ఆతడేమి పొందునో ఆ విషయమును నీకు చెప్పెదను. వరాననా! వినుము.
అతడు నూరేండ్లు మిడుత యగును. నూరేండ్లు డేగ యగును. మూడు వందల యేండ్లు కప్ప యగును. పది యేండ్లు రాక్షసు డగును.
అరువది యేండ్లు నపుంసకుడగును. రేతస్సు తిను వాడగును. ఇరువది యొక్క యేండ్లు గ్రుడ్డి వాడగును.
ముప్పది రెండేండ్లు గ్రద్ద యగును. పిదప పదియేండ్లు నాచును తినుచు ఆకాశమున సంచరించు చక్రవాక మగును.
చిట్ట చివరకు కొన్నాళ్ళు కప్ప బ్రతుకు గడపి బ్రాహ్మణుడగును. తాను చేసిన దోషము వలన సంసార సాగరమున పడును.
అయ్యో! నీవు పలికిన దెంత ఘోరముగా నున్నది! నా చిత్తము వికలమై పోయినది. నిలువ కున్నది. నీ పలుకు నీ భక్తులకు ఎంతో భయంకర మైన పొందరాని ఆపద.
దాట నలవి కాని సంసార సముద్రమును గూర్చి విని వణకి పోవు చున్నాను. కుమిలి పోవు చున్నాను. కానీ దేవదేవా! జగత్పతీ! నీకేమియు చెప్పజాల కున్నాను.
దేవా! నా ప్రీతి కొరకును, సర్వ లోకముల సుఖము కొరకు, పూజల యందు తగులము గల నీ భక్తులు క్రోధము, లోభము కల వారైనచో వారు ఆ పాపము నెట్లు వదలించు కొందురో సెలవిమ్ము.
పాపము వీరు ఒక పాటి సత్తువ కలవారు. భయము పొందిన వారు. రాగ లోభములతో కూడుకొన్న వారు. ఇట్టి వీరు ఈ మహా కష్టమునెట్లు దాటుదురో ఆ ప్రాయశ్చిత్తమును నాకు చెప్పుము.
సనత్కుమారా! అప్పుడు తామర రేకుల వంటి కన్నులు కలవాడు, వరాహ ముఖముతో కూడినవాడు, అగు నారాయణుడు నా భక్తికి సంతృప్తి చెంది యిట్లు పలికెను.
అంత భూదేవి మాట విని బ్రహ్మ కుమారుడు, మునియు, యోగతత్వ మెరిగిన వాడు నగు సనత్కుమారుడు వసుంధరతో నిట్లనెను.
భూదేవీ! నీవు ధన్యవు. భాగ్యవతివి, ఏలయనగా వరాహ రూప భగవానుడు, సర్వ మాయలకు పెట్టె అయిన శ్రీహరిని ఇట్లు అడిగితివి.
దేవీ! యోగములు, యోగ అంగములు అన్నియు నిండుగా ఎరిగిన వాడు, సర్వ ధర్మము లెరిగిన వారిలో శ్రేష్ఠుడు అగు నారాయణ దేవుని ఇంకేమేమి అడిగితివి?
సనత్కుమారుని మాట విని ఆ భూదేవి యిట్లు బదులు పలికెను. బ్రాహ్మణోత్తమా! ఆ దేవుని నేనేమేమి అడిగితినో చెప్పెదను. వినుము.
నేను శ్రీమన్నారాయణ దేవుని పూజా కార్యములు, విధానములు, యోగము, అధ్యాత్మ విద్య, భౌతిక స్థితిగతులు అనువానిని గూర్చి అడిగితిని.
అంత మాయల పెట్టె ఆ విష్ణువు క్రుద్ధులగు భాగవతులు దేనితో పాపము నుండి పరిశుద్ధు లగుదురో దానిని నాకు తెలిపెను.
నా అర్చనల యందు శ్రద్ధ కలవాడు ఇట్టి వ్రతమును చేయ వలయును. ఇంటింట బిచ్చమెత్తి ఆరవ కాలము భుజింప వలెను. శుద్ధులైన భాగవతులైన వారి ఎనిమిది యిళ్ళలో బిచ్చ మెత్తవలెను. (ఆరవ కాలము అనగా సాయం కాలము. పగటి భాగమున ఆరు విభాగాలుగా భావింతురు. 1. ప్రాతః కాలము. 2. సంగవ కాలము 3. పూర్వాహ్ణము 4. మధ్యాహ్నము. 5. అపరాహ్ణము 6. సాయాహ్నమ.)
బ్రాహ్మణా! ఈ విధానముతో కర్మములను చేయువాడు పాపము నుండి విడివడునని జనార్దనుడు చెప్పెను.
బ్రాహ్మణోత్తమా! పరమ మైన సిద్ధిని, విష్ణు లోకమున నరుడు కోరునేని వెను వెంటనే విష్ణువు నీ విధముగనే ఆరాధింప వలయును. అట్లు చేసిన వారు తరింతురు.
అంత భూమి మాట విని బ్రహ్మ మానస పుత్రుడైన సనత్కుమారుడు ధర్మకామ యగు వసుంధరతో నిట్లనెను.
ఆహా! దేవీ! నీ పలుకు ఎంత గుహ్యము. ఎంత రహస్యము. ఆ విష్ణువు ముఖము నుండి వెలువడిన ధర్మములను నాకు చెప్పదగును. (గుహ్యము = గుట్టుగా ఉంచ దగినది. రహస్యము = ఏకాంతమున జరిగినది)
ఎఱ్ఱని కమలముల వంటి కనులు కలవాడు, శంఖము చక్రము గదలను చేపట్టిన వాడు, లోకనాథుడు, జనార్దనుడు అగు వరాహ రూప భగవానుడు మేఘము, దుందుభి నాదము వంటి కంఠధ్వని కలవాడై భక్తుల కర్మములకు సుఖమునకు గాను గుణ సంపదతో నిండిన మధురమగు వాక్యము నిట్లు పలికెను.
ఆచారముతో కూడిన వాడై ఈ విధానముతో నా అర్చన చేయువాడు నా లోకమున కరుగును.
పరమ గతిని కోరు వాడైనచో కోపముతో, లోభముతో తొందర తనముతో నా పూజనము చేయరాదు.
క్రోదమును విడనాడి యింద్రియములను గెలిచి నన్నర్చించు వారు దోషములు లేనివారై సంసారమున పడ కుందురు.
భూదేవీ! పూజకు పనికి రాని పూవుతో నన్నర్చించు వాని పాటు ఎట్టిదో చెప్పెదను. వినుము.
మూర్ఖులు, నాకు అప్రియమును కలిగించు వారు నగు భాగవతులు ఒసగిన అట్టి దానిని నేను గ్రహింపను. అట్టివారు నాకు ప్రియులు కారు.
వారి అజ్ఞాన దోషము చేత ఘోరమైన రౌరవ నరక మందు పడుదురు. దుఃఖములను భవింతురు.
పది యేండ్లు కోతిగా, పదుమూడేండ్లు పిల్లిగా అయిదేండ్లు ఎలుకగా, పండ్రెండేండ్లు ఎద్దుగా నగును.
ఎనిమిదేండ్లు మేక, ఒక నెల ఊర కోడి, మూడేండ్లు దున్న అగును. సంశయము లేదు.
మంచిదానా! విశాలాక్షీ! నా కిష్టము కాని పనికి రాని పూవు నాకొసగిన దాని ఫల మెట్టిదియో నీకు చెప్పితిని.
నిర్మలమగు మనస్సుతో నీవు నా యెడ ప్రసన్నుడ వగుదువేని నీ పూజా శక్తి గల ఆ భక్తులు ఎట్లు శుద్ధి పొందుదురో నాకు తెలుపుము.
శ్రీవరాహ దేవుడు:
శ్రీవరాహ దేవుడు:
దేవీ! నన్నడిగిన దానికి బదులు చెప్పెదను. మానవులు ఈ తప్పునకు ఏ ప్రాయశ్చిత్తము చేసికొని శుద్ధు లగుదురో దానిని వివరించెదను.
వసుంధరా! ఒక నెల కాలము ఒంటి పూట భోజనము చేయ వలయును. పదు నాలుగు దినములు వీరాసనము వేయుచు నుండ వలయును.
ఒక నెల రోజులు నాలుగవ వంతు భోజనము మాత్రము చేయుచు నేతి పాయసమును తిన వలయును. అటు పై మూడు రోజులు యవల అన్నమును, మూడు రోజులు గాలి భోజనము చేయ వలయును. (గాలి భోజనము = ఉపవాసము)
ఈ విధానముతో నా పూజలు చేయువాడు అన్ని పాపముల నుండి విడివడి నా లోకమున కరుగును.
