వరాహ మహా పురాణము
అధ్యాయము - 126
పెక్కు మోక్ష ధర్మ సాధకములగు ధర్మములను విని భూదేవి లోకనాథుడగు జనార్దనునితో ఇట్లు పలికెను.
అహో! నీవు చెప్పు చున్న ధర్మ ప్రభావమెంత గొప్పది. నేనెంతో బరువు పైబడిన దాన నయ్యును అది విని తేలికగా అయి పోయితిని.
లోకమున ప్రశస్తి కెక్కిన ఈ ధర్మము లన్నింటిని నీ ముఖము నుండి వెలువడు చుండగా వినుచున్న నేను మోహము లేని దానను, పరిశుద్దు రాలను అయితిని.
ఎఱుక గల వారిలో శ్రేష్ఠుడ వగు నిన్ను మరియొక సంశయమును గూర్చి అడుగుదును. ఇట్టి ధర్మ విధానము చేత నరులు పొందెడు నిండైన దీక్షలను పొందుదురు.
ఇట్లే, నాకు మిక్కిలి వేడుకగా నున్నది. ధర్మమును పరిరక్షించు నిమిత్తము రహస్యమును గూర్చి నిన్న డుగుదును. నీవు దానిని చెప్ప వలయును.
మేఘము వంటి దుందుభి నాదము వంటి గంభీరమగు భూదేవి పలుకు విని వరాహ రూపుడగు భగవానుడు భూదేవి కిట్లు బదులు పలికెను.
దేవీ! నా సనాతనమగు ధర్మమును గూర్చి మూల ముట్టుగా వినుము, యోగ వ్రతమున నిష్ఠగా నుండు దేవతలు సైతము దీని నెరుగ జాలరు.
సుందరీ! నా దేహము నుండి వెలువడిన నా ధర్మమును నేనొక్కడనే చక్కగా ఎరుగుదును. నా భక్తులగు జనులు కూడ ఎరుగుదురు.
సంసారము నుండి విముక్తిని కలిగించు కర్మమునకు సంబంధించిన దీక్షను, కథను నీకు చెప్పెదను. దానిని ఆలకింపుము.
సంసారము నుండి విముక్తి కలిగించు దీక్షను ఒక్కడును పొంద జాలడు. సుఖమును చేకూర్చు దీక్షను, నేను చెప్పు దానిని ఎవ్వడును సులభముగా పొంద జాలడు.
ఓ కీర్తి శాలినీ! నాలుగు వర్ణముల వారికి సంబంధించిన దీక్షను తెలిపెదను. దీని వలన వారు జన్మ మనెడు సంసార సముద్రమును దాటుదురు.
సుందరీ! నరుడు మొదట ‘మహా సాంతపనము’ ‘తప్తకృచ్ఛ్రము’ అను వ్రతములను ఆచరించి ‘నేను తమ శిష్యుడను, నన్ను శాసింపు’డని పలుకుచు గురువు కడ కరుగ వలయును. పిదప అతడు గ్రహింపగా యోగ్యమైన పదార్థములను భుజించుచు గురువు చెప్పిన ద్రవ్యములను తీసికొని రావలయును.
పేలాలు, తేనె, దర్భలు, అమృతము వంటి నెయ్యి, ధూపము, గంధము, మాల్యములు, మోదుగ కర్ర, నల్ లలేడి చర్మము, కుండ, కమండలువు, వస్త్రములు, పాదుకలు, తెల్లని జన్నిదము, చిన్న కత్తి, పూజా పాత్రము, చరువు వండుటకు పాత్ర, గరిటె, నూవులు, బియ్యము, పెక్కు విధములగు పండ్లు, నీరు, వీనిని తెచ్చుకొన వలయును.
నా కర్మము నందు మిక్కిలి శ్రద్ధ గల దీక్షితులు తినుకు యోగ్యము లైన భక్ష్యములు, పానీయములు తెచ్చుకొన వలయును.
లభించిన విత్తనములు, పెక్కు విధములగు రత్నములు, బంగారము మున్నగు వానిన త్వరగా తీసికొన రావలయును.
పాయసము, బెల్లము మొదలగు అమృతము వంటి వస్తువులను కర్మము నందు మిక్కిలి శ్రద్ధ కలవాడై కొని రావలయును.
ఇంకను ఈ కర్మము నందు చక్కగా వినియోగించుటకు వీలైన పదార్థములను కూర్చుకొన వలయును.
బంగారు, వెండి, రాగి, మట్టి పాత్రలను కూర్చుకొని వాని నన్నింటిని గురువు పాదముల కడ నిలుప వలయును.
స్నానము చేసి, మంగళ వస్తువులతో కూడిన, దీక్షను కోరెడి బ్రాహ్మణుడు గురువు పాదములను చక్కగా పట్టుకొని నేను చేయ వలసిన దేమి? అని యడుగ వలయును.
పిదప గురువు అనుమతి పొంది ఒక్కొక్క వైపు పదునారు మూరలు గల చదరపు అరుగును దీక్షా కాముడైన బ్రాహ్మణుడు నిర్మించుకొన వలయును.
ఆ వేదిక యందు నా ప్రతిమను నిలుప వయును. శాస్త్రము చెప్పిన కర్మా చరణముతో నన్నర్చింప వలయును.
గురువు చెప్పిన ధర్మ నిర్ణయమును బట్టి నా అర్చన కావించి, తెచ్చుకొన్న వస్తువుల నన్నింటిని వేదికి నడుమ నుంచ వలయును.
ఆ వేదిక నాలుగు ప్రక్కలను నాలుగు కలశములను, నీటితో నింపిన వానిని మామిడి మండలతో ఒప్పారుచున్న వానిని శుద్ధము లైన వానిని నిలుప వలయును.
పుణ్యాత్ములారా! ఆ కలశములకు అన్ని వైపుల తెల్లని దారములను చుట్ట వలయును. అట్టి పూర్ణ పాత్రములను నాలుగు వైపుల నిలుప వలయును.
అటుపై మంత్రమును పఠించి దీక్షను సఫలము చేయు దక్షిణను సముచితముగా గురువు తుష్టి నందునంతగా ఒసగ వలయును.
అట్లు గురువు నుండి మంత్రమును చక్కగా గ్రహించి దీక్షను కైకొను కోరిక కలవాడు విష్ణువుపై ప్రమాణమును చేయ వలయును.
అంత గురువు తూర్పునకు మొగము పెట్టి నీటితో తగు విధముగా నోటిని శుభ్ర పరచుకొని దీక్షా నియమములను శిష్యు లందరకు వినిపింప వలయును.
భగవద్భక్తుని గాంచి, తాను భాగవతుడై శుచియై తన్నాతడు హింసించినను, అతని పైకి విరుచుకొని పడరాదు.
తండ్రి తన బిడ్డను ఒకనికి భార్యగా నిచ్చి మరల ఆమె నతని కడకు పంపినచో ఆతని యెనిమిది తరముల పితృ గణములు హింస నొందెదరు. ఇందు సంశయము లేదు.
తనకు మిక్కిలి ప్రియమైన సఖి, మంచి నడవడి కలదియు నగు భార్యను దయలేని వాడై హింసించు వానికి పుట్టగతు లుండవు. అది భూదేవిని హింసించు నట్టి నీచమగు కార్యము.
బ్రాహ్మణుని, మేలు చేసిన వానిని, ఆవును చంపిన వారును, ఇంకను అట్టి పాపములను చేయు వారును అగు శిష్యులను వదలి వేయ వలయును.
మద్దిచెట్ల ఆకు నందు భుజింప రాదు. దానిని నరికి వేయరాదు. రావి చెట్టును, మఱ్ఱి చెట్టును ఎన్నటికిని నరికి వేయరాదు.
మారేడు, మేడి చెట్టులను, ఎన్నటికిని కొట్టి వేయరాదు. అట్లే యజ్ఞ కర్మములకు పనికి వచ్చు వృక్షములను బుద్ధి మంతులు నరుక రాదు.
నాయనా! శిష్యా! నీవు పరమ సిద్ధిని, సనాతన మగు మోక్ష ధర్మమును కోరుదు వేని తినదగిన దేదో, తినరాని దేదియో చక్కగా తెలిసి కొన వలయును.
ముండ్ల చెట్లను కూల్చి వేయుట మంచిది. మేడి పండ్లను కూడ రాల్చి వేయ వలయును. ఏలయన వానిని అప్పటి కప్పుడు తినకున్నచో అవి చెడుకంపు కలవియై తినరాని పదార్థములగును.
పంది మాంసమును, చేపలను దీక్షితుడగు బ్రాహ్మణుడు ఎన్నటికిని తినరాదు.
ఇతరులను నిందింప రాదు. హింసింప రాదు. ఎంతటి కష్టము నందున్నను ఎన్నటికిని కొండెములు చెప్పరాదు.
నాయనా! ఎంతో దూరము నుండి వచ్చిన అతిథిని చూచి ఎంతో కొంత అతనికి అన్నము మొదలగు దానిని సమర్పింప వలయును.
గురు పత్నిని, రాజ పత్నిని, బ్రహ్మ జ్ఞాన సంపన్నుని పత్నిని ఎన్నటికిని మనస్సుతో కూడ పొంద రాదు. ఇట్లని విష్ణువు వక్కాణించెను.
బంగారు వస్తువులు, రత్నములు, వయసున నున్న స్త్రీ అనువాని యందు మనసు ఉంచరాదు. ఇట్లని విష్ణువు గట్టిగా చెప్పు చున్నాడు.
ఇతరుల సంపదలను, తన ఆపదలను తలచి శోకింప రాదు. ఇది సనాతన మగు ధర్మము.
వసుంధరా! గురువు దీక్షను కోరువారి కిట్లు ధర్మములను వినిపించి దైవమునకు గొడుగు, పాదుకలను మనః పూర్వకముగా సమర్పింప వలయును. రెండు రెండు మేడి ఆకులను వేది నడుమ నిలుప వలయును. చురకత్తిని, నీటితో నిండిన పాత్రను ఉంచ వలయును. విధి పూర్వకముగా నన్న చటికి ఆహ్వానింప వలయును. శాస్త్ర యుక్తముగా అర్పింప వలయును.
స్వామీ! ఏడు ద్వీపములు, ఏడు పర్వతములు, ఏడు సముద్రములు, పది వేల స్వర్గములు సమస్తమును నీ హృదయమున నున్నవి. నీకు నమస్కారము. నీవే వీని నన్నింటిని వెలువరింతువు. మరల లోనికి గ్రహింతువు.
ఓమ్, ఓ వాసుదేవ భగవానుడా! నేను పలికిన దానిని స్మరింపుము. నీవు వరాహ రూపుడవై భూమి నుద్ధరించి నపుడు పలికిన మంత్రములను కూడ స్మరింపుము. నీవు మా అజ్ఞానమును తలపోసి మా కడకు దయ చేయుము. దీక్షను కోరుచున్న విప్రుడు నీ ప్రసాదమును ప్రతీక్షించు చున్నాడు.
ఈ మంత్రమును పఠించి తలతో మోకాళ్ళతో నేలను స్పృశించి ఉండ వలయును. ‘‘స్వాగతము. నీవు విచ్చేసితివి’’ అని పలుక వలయును.
పిదప, ఓ వసుంధరా! ఈ మంత్రముతో విధి పూర్వకముగా అర్ఘ్యమును, పాద్యమును సమర్పింప వలయును.
చేసిన మేలు మరువని దేవతల విషయమున రక్కసులు కృతఘ్నులైరి. బ్రాహ్మణుడు రుద్రుని వలన పొందిన ఈ ధనము భగవంతుని కొరకు అగుగాక !
లోకనాథ! నేనొ సగిన దానిన దయతో గైకొనుము.
భూదేవీ! ఇట్లు అర్ఘ్యమును, పాద్యమును ఒసగి క్రమము ననుసరించి చుర కత్తిని కైకొని ఈ మంత్రమును పలుక వలయును.
శిష్యా! విష్ణువు అనుగ్రహించిన నీటితో తడుపు చున్న నీ శిరస్సును వరుణుడు రక్షించును గాక! ఈ దీక్ష సంసారమును పోకార్చు నది. ఇట్లు పలుకుచు కలశమును దీక్ష పొందు వానికి (స్నానము కొరకు) ఈయ వలయును.
పిదప శిరస్సును వెంట్రుకలు లేకుండ చేసి రక్తము లేనిదిగా నొనర్చి మరల వెంటనే స్నానము చేయింప వలయును. ఇట్లు దీక్షను పొంద గోరు వానికి ఆయా పను లన్నియు కావించి సంపూర్ణమగు నిశ్చయముతో సంసారమును విడుదల గావించు దీక్షను ఒసగ వలయును. మోకాళ్ళను భూమి కానిని ఈ మంత్రమును పలుక వలయును.
ఇంతకు ముందే మంచి దీక్ష పొందిన వారై గురువులై యున్న భాగవతు లందరకు మ్రొక్కుదును. విష్ణువు దయతో దీక్షను పొందిన వారందరు నాయందు ప్రసన్ను లగుదురు గాక! వారందరికి నమస్కరింతును.
ఇట్లు గురువు శిష్యుని చేత నమస్కారము చేయించి అగ్ని హోత్రుని ప్రజ్వలింప చేసి తేనె కలిపిన నేతితో, ఫలాలతో నల్లని నువ్వులతో ఏడు మార్లు గానీ యిరువది పర్యాయములు గాని హోమము చేయ వలయును. మరల మోకాళ్ళు నేల కానించి ఈ మంత్రమును పలుక వలయును.
అశ్వి దేవతలు, దిక్కులు, చంద్రుడు, సూర్యుడు ఈ మా కార్యమునకు సాక్షు లగుదరు గాక! ప్రసన్నులై నేను పలికెడు సత్యమగు వాక్యమును వినుడు.
సత్యమే ఈ భూమిని పట్టి నిలుపు చున్నది. సత్యము చేతనే భూమి నిలిచి యున్నది. సత్యము చేతనే సూర్యుడు కదులు చున్నాడు. సత్యము చేత భూమి వృద్ధి పొందు చున్నది.
ఇట్లు సత్యము మీద ఒట్టు వైచి దీక్ష గొనెడు బ్రాహ్మణుడు గురువును చూచి ప్రసన్నుని చేయ వలయును.
భగవ ద్భక్తుడగు గురువునకు మూడు మారులు ప్రదక్షిణము గావించి ఆతని చరణములను పట్టుకొని ఈ మంత్రమును పలుక వలయును.
గురు దేవుని దయ వలన నేను దీక్షను పొందితిని. ఓ గురు దేవా! నీకు నేనేదేని అపకారమును చేసి యున్నచో దానిని తమరు క్షమింప వలయును.
ఇట్లు గురువును ప్రసన్నుని చేసికొని శిష్యుడు మంత్రములను పలుకుచు తూర్పు ముఖముగా వేదిక మీద గురువును కూర్చుండ పెట్ట వలయును. అంత గురువు శిష్యునే చూచుచు కమండలువును, తెల్లని జన్నిదమును పట్టుకొని ఈ మంత్రమును పలుక వలయును.
విష్ణువు దయ వలన నీవు సిద్దిని పొందితివి. నీకు దీక్షయు, కమండలువును లభించినవి. దీనిని రెండు చేతులతో పట్టుకొని నీవు ఇటుపై దీక్షా కార్యమునకు యోగ్యుడ వయితివి.
ఇట్లు గురువు చేత దీక్ష పొంది ముఖమునకు గుడ్డ కట్టుకొని సర్వ ప్రదక్షిణము చేయుచు ఈ మంత్రమును పలుక వలయును.
నేను గ్రుడ్డినై యిచట తిరుగు చున్నాను. నాకు గురువును, దీక్షను లభించెను. గురుదేవా! ఇది యంతయు నీ దయ వలననే కలిగినది, అని యీ మంత్రమును చెప్పుచు ముఖమునకు గుడ్డ కట్టుకొన వలయును.
అప్పుడు గురువిట్లు పలుకును, ఒక కడవ నీటితో స్నానము చేయుము. దేవతలకు వస్త్రము నొసగుము. ఇట్లు దీక్షితుడు విష్ణువుని గ్రహించును. నాయానా! కమండలువును కైకొనుము.
ఈ కమండలువు లోకముల యందు ప్రసిద్ధ మైనది. అన్ని పనుల యందు కలిగించునది. సుఖమును కలిగించు సువాసన గల ఆకులను కూడ గ్రహింపుము. ఇది శుద్ధమైనది. నిలువెల్ల విష్ణువే అయినది. సమస్త మగు సంసార లంపటము నుండి విముక్తి కలిగించునది.
శరీర శుద్ది అయిన పిదప మధుపర్కమును పుచ్చ కొనుము. అని యిట్లు గురువు చెప్పగా శిష్యుడు గురువు రెండు పాదములను పట్టుకొని తలతో ప్రణమిల్లి మనసును కుదుట పరచుకొని అర్యమును చేత బట్టుకొని యీ మంత్రమును పలుక వలయును.
భాగవతు లందరు దయ చేసి వినుడు. గురువు నాకు కర్మ దీక్ష నాచరించెను. స్వామి! నేను తమకే శిష్యుడను, దాసుడను. నాకు దేవునకు సాటియగు గురువు లభించెను.
వర్ణము లన్నింటిలో మొదటి వారగు బ్రాహ్మణులకు సంబంధించిన దీక్ష యిట్టిది. భూదేవీ! తక్కిన మూడు వర్ణముల వారికి మరియొక విధమగు దీక్ష విధింప బడినది.
వసుంధరా! ఈ విధానముతో దీక్ష ఒసగినచో ఆచార్యుడును, శిష్యుడును ఇరువురును సిద్దిని పొందుదురు.
