వరాహ మహా పురాణము

Table of Contents

అధ్యాయము - 5

 

 

పూజ్య పాదులారా! మీరు నాదగు ఒక సందేహమును తీర్ప వలయును. దానితో నాకు సంసార విముక్తి సంభవించును.

 

 

రాజిట్లు పలుకగా అప్పుడు యోగులలో గొప్ప వాడగు ధర్మాత్ముడు కపిలుడు యజ్ఞ కర్తలలో శ్రేష్ఠుడగు రాజుతో నిట్లు పలికెను.

 

 

పరమ ధర్మాత్ముడా! ఓ రాజా! నీ మనసున నున్న సందేహమేమి? దానిని విని నేను తీర్చి వైచెదను. నీ కోరిక యేమో చెప్పుము.

 

 

ఓ మునీ! మోక్షము కర్మము వలన సిద్ధించునా? లేక జ్ఞానము వలననా? నా యందు దయ గలదేని యీ నా సంశయమును పటాపంచలు చేయుము.

 

 

మహారాజా! మునుపు బ్రహ్మ పుత్రుడగు రైభ్యుడు ఈ ప్రశ్ననే బృహస్పతి నడిగెను. మరియు వసువను రాజు కూడా నడిగెను.

 

 

పూర్వము చాక్షుశుడను మనువు కాలమున బ్రహ్మ వంశమును పెంపొందించు వాడు, రాజ శ్రేష్ఠుడు, విద్వాంసుడు, దాతయు నగు వసువను రాజుండెడి వాడు.

 

 

ఆ వసువు ఒకనాడు బ్రహ్మ దేవుని చూడ గోరి యాతని భవనమున కరిగెను. దారిలో విద్యాధర వరుడగు చైత్ర రథుని గాంచి వసువు ప్రీతితో బ్రహ్మ దేవుడు తన వంటి వారిని చూచు సమయమేది? యని యడిగెను.

 

 

ఆ చైత్ర రథుడు ప్రస్తుతము బ్రహ్మ యింట దేవతల సభ జరుగు చున్నదని చెప్పెను. వసువది విని బ్రహ్మ భవనము వాకిట వేచి యుండెను.

 

 

అంతలో నచటికే రైభ్యుడను మహా తపస్వి వచ్చెను.

 

 

అంత వసురాజు నిండు మనసుతో ప్రీతి బుద్ధితో అంతనిని ముందుగా పూజించి ‘ఓ మునీ! ఎందు బోవు చున్నావు?’ అని యడిగెను.

 

 

 

మహారాజా! నేనొక విషయమును దేవ పురోహితుడగు బృహస్పతి నడుగుటకై యాతని కడకు వచ్చితిని.

 

 

రైభ్యుడిట్లు పలుక చుండగా దొడ్డది యగు ఆ బ్రహ్మ సభ ముగిసెను. దేవత లందఱు తమతమ గృహముల కరిగిరి.

 

 

ఇంతలో బృహస్పతి అచట రైభ్యునితో ప్రసంగము చేసి, వసుని పూజ లందుకొని తన నెలవున కరిగెను. (సంవిదం కృత్వా – కలియుటకు అనుమతిని గొని యనియు నర్థము)

 

 

రైభ్యుడు, బృహస్పతి, వసు రాజు కూర్చుండిరి. వారందఱు కూర్చున్న పిదప దేవ గురువు బృహస్పతి రైభ్యునితో ‘ఓయీ! వేద వేదాంగముల తుదిముట్ట అధ్యయనము చేసిన పుణ్య మూర్తీ! నా వలన నగు పనియేమి’ అని పలికెను.

 

 

ప్రభూ! బృహస్పతీ! ఒక సంశయమును నిన్నడుగు చున్నాను. మోక్షము కర్మము చేత సిద్ధించునా? లేక జ్ఞానము గలవాడే మోక్షము పొందునా? ఇది నాకు తెలియ జెప్పుము.

 

 

పురుషుడు, అది మంచిదో, చెడ్డదో, ఏ చిన్న పని చేసినను దానిని నారాయణుని యందు సమర్పించి చేయునేని వానికి తగులము లేనేలేదు.

 

 

విప్రునకు వేట గానికి జరిగిన సంవాద మొకటి, బ్రాహ్మణ ప్రవరా! వినవచ్చు చున్నది. అత్రి గోత్రము వాడగు బ్రాహ్మణు డొకడు, వేదములు వల్లించుటయే పనిగా గల ముని యుండెడి వాడు.

 

 

అతడు అలపెరుగక ప్రతి దినము ప్రాతః కాలముననే స్నానమాడు వాడు. మూడు సంధ్యల నర్చించుట అతనికి ప్రీతి దాయకము. అతని పేరు సంయమనుడు. ఒకనా డాతడు ధర్మారణ్యమున పుణ్యముల ప్రోవు, మంగళములకు నెలవు అగు గంగా నదిలో స్నాన మాడుట కరిగెను.

 

 

అచట పెద్ద లేళ్ళ గుంపొకటి యుండెను. అప్పుడ చటికి దానిని చంప గోరిన తెలివి గల వేటకా డొకడు నిష్ఠురకుడను వాడు విల్లు చేత బట్టి అమ్ము తొడిగి యముని వలె ఏతెంచెను.

 

 

అంత విప్రుడగు ఆ సంయమనుడది చూచి ఆ వేట గానిని “బాబూ! ప్రాణి హింస చేయకు” మని అడ్డు పడెను.

 

 

అది విని ఆ బోయ చిరునవ్వుతో ఇట్లనెను. “విప్రవరేణ్యా! నేను వేరుగా ప్రాణిని చంపుట లేదు”.

 

 

“భగవంతుడగు ఈ పరమాత్మయే తనకు తానై ప్రాణులతో ఆడుకొను చున్నాడు. మనుజులు మట్టితో ఎద్దులను చేసినట్లే యిదియును, సంశయము లేదు.”

 

 

ముక్తి పొందగోరు వారికి ‘నేను’ అను ఈ భావము అజ్ఞానము వలన నేర్పడును. ఈ జగత్తంతయు ఒక యాత్ర. అది ప్రాణములు నిలుపు కొనుట యందే ఆసక్తితో నుండును. ఇదియొక వికారపు చేష్ట. అందు ‘నేను’ అను శబ్దము మేలైనది కాదు.

 

 

ఆ మాట విని విప్రవర్యుడగు ఆ సంయమనుడు అచ్చెరువుతో ఆ నిష్ఠురకునితో నిట్లు పలికెను.

 

 

భద్రా! ఎట్ట ఎదురుగా ఇది ఏమి హేతు వాదము చేయు చున్నావు? అంత నా ధర్మ వేత్తయగు కిరాతుడు ముని వాక్యము విని యొక యినుప వల నేర్పరచి క్రింద నిప్పు పెట్టెను.

 

 

అట్లు నిప్పు పెట్టి విప్రునితో ఈ కట్టెలను మండ బెట్టుమని యడిగెను. అంత నా ముని నోటితో ఊది అగ్నిని మండించి యూర కుండెను.

 

 

అట్లు జ్వాలలు రాగా ఆ ఇనుప వల తన రంధ్రముల నుండి వేరు వేరుగా వేల కొలది జ్వాలలను వెలువరించెను. అగ్ని ఒక్క చోటున నున్నను వల నుండి మంటలు వేల కొలదిగా ఏర్పడెను.

 

 

పిదప ఆ వేటగాడు బ్రాహ్మణునితో ‘విప్రా! మహామునీ! ఒక్క జ్వాలను కైకొనుము. దానితో తక్కిన జ్వాలలను ఆర్పి వేసెదను’ అని పలికెను.

 

 

అని పలికి అతడు నీరు నిండిన కుండను ఒక్కుమ్మడిగా నిప్పుపై క్రుమ్మరించెను. వెను వెంటనే అగ్ని తొంటి వలె అణగి పోయెను.

 

 

పిదప ఆ లుబ్దకుడు తపో ధనుడగు ఆ బ్రాహ్మణునితో నిట్లు పలికెను. పూజ్యుడా! నీవు నిప్పు నుండి కైకొన్న ఆ జ్వాలను నా కొసగుము. నేను దానితో లేడి మాంసములను వండుకొని తిందును.

 

 

అత డిట్లు పలుకగా బాపడు ఇనుప వల చూచునంతలో అచట అగ్నియే లేకుండెను. క్రింద ఉంచిన అగ్ని చల్లారగా పైనున్న జ్వాలలు కూడ నశించెను గదా!

 

 

అంత పండిన వ్రతములు గల ఆ బ్రాహ్మణుడు చెదరిన హృదయముతో మిన్న కుండగా అంతలో ఆ వేటగాడిట్లు పలికెను.

 

 

ఈ వలలో వెలుగొందిన నిప్పు పెక్కు జ్వాలలుగా చెల రేగెను. క్రింద నున్న మూలము ఆరిపోగా జ్వాల లన్నియు నశించెను. ద్విజుడా! ఇదియు ఇట్టిదియే.

 

 

మూల కారణమగు ఆ ఆత్మయే ఎల్ల భూతములకు ఆశ్రయము. ఈ జగత్తంతయు దాని నుండియే యేర్పడినది. అందే ప్రాణులన్నియు నేర్పడెను.

 

 

అన్నమును గొను ధర్మముతో ఆయా ప్రాణికి భగవంతు డేర్పరచిన వ్రతమును, ఆయా ప్రాణి ఆత్మ యందు లగ్నము చేసి చేయు నెడల వినాశము పొందుదు.

 

 

వ్యాదు డిట్లు బాపనితో పలుకగా రాజవరా! ఆకాశము నుండి వానిపై పూలవాన కురిసెను.

 

 

మరియు దివ్యములు, ఇచ్చ ననుసరించి పోవునవి, దొడ్డవి, పెక్కు రత్నములు కలవి యగు విమానములను ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడు ఎట్ట ఎదుట గాంచెను.

 

 

ఆ బ్రాహ్మణుడు ఆ అన్నింటి యందును ఇచ్చ వచ్చిన రూపము తాల్చి యున్న ఉత్తముడగు ఆ నిష్ఠురకుడను వేటగానినే చూచెను.

 

 

యోగ శక్తి వలన అద్వైత వాసనతో సిద్ధించిన పెక్కు శరీరములు గల అతనిని గాంచి ఆ విప్రుడు ఆనందమంది తన యాశ్రమమున కరిగెను.

 

 

ఇట్లు జ్ఞానము కలవాడు తన జాతికి దైవ మేర్పరిచిన కర్మము చేయు చున్నను, రైభ్యా! వసురాజా! నిక్కముగా ముక్తి పొందును.

 

 

ఇట్లు ఆ రైభ్య వసువు లిరువురు సంశయము తీర్చుకొని బృహస్పతి భవనము నుండి తమ యాశ్రమమున కరిగిరి.

 

 

కావున ఓ రాజేంద్రా! నీవు కూడా ప్రభువైన నారాయణ దేవుడు మరియొకడు గాక నీ దేహమందె యున్న వాడని చూచుచు ఆ ప్రభువు నారాదింపుము.

 

 

కపిలుని ఉపదేశము విని ఆశ్వశిరో మహారాజు పుణ్యాత్ముడగు తన పెద్ద కొడుకును స్థూల శిరుడను వానిని పిలిచి తన రాజ్యమున అభిషేకము చేసి తాను వనమున కరిగెను.

 

 

నైమిషమను అడవి కరిగి ఆ రాజు అచట యజ్ఞమే దేహముగా గల గురువును శ్రీమన్నారాయణుని తపస్సుతో ఆరాధించెను. ఆ యజ్ఞ మూర్తిని స్తుతించెను.

 

 

ప్రభూ! ఆ రాజు యజ్ఞ దేహము గల నారాయణుని స్తోత్ర మెట్లు చేసెనో దానిని నా కెరిగింపుము.

 

 

దేవేంద్రుడు, శివుడు, సూర్యుడు, అగ్ని, రాజైన చంద్రుడు, వేర్వేరు దేవతలు అనువారి యజ్ఞ మయమైన రూపము గల శ్రీహరికి నమస్కారము చేసెదను.

 

 

భయము గొలుపు దంతములు గలవాడు, సూర్య చంద్రులే కన్నులైన వాడు, సంవత్సరమున రెండు ఆయనములు కడుపుగా గలవాడు, దేహము నందలి రోమముల రూపమున నున్న దర్భలు కలవాడు, సమిధలే శక్తిగా గలవాడు, సనాతనుడు అగు యజ్ఞ రూప నరునికి హరికి నమస్కరింతును.

 

 

భూమికి ఆకాశమునకు గల నడిమి భాగము నంతటిని, దిక్కులన్నింటిని తన దేహముతో వ్యాపించిన వాడు, స్తుతింప దగిన వాడు, జగత్తులన్నింటి పుట్టుకకు కారణ మైనవాడు, నిత్యుడు (నాశనము లేనివాడు) అగు జనార్ధనునకు ప్రణామము లర్పింతును.

 

 

దేవతల విజయమునకు, రాక్షసుల ఓటమికిని తొలిదైన తన దేహమును ప్రతి యుగము నందును సృష్టించు పరమేశ్వరుడు, ఇది మొదలని నిర్ణయింప రాని వాడు, యజ్ఞ మూర్తి అయిన ప్రభువునకు మ్రొక్కు లిడుదును.

 

 

భయము గొల్పు ఆ స్వామి జయమునకై నిర్మలము లగు కాంతులతో శుభ్రమైన ఆయా స్వరూపమగు చక్రమును ధరించెను. అట్లే గద, ఖడ్గము, శార్జ్ఞమను విల్లు అను వానిని చేపట్టెను. ఇట్లు నాలుగు భుజముల గల నిత్యుడగు యజ్ఞ మూర్తికి దోయిలింతును.

 

 

ఒకప్పుడు వేయి తలలు తాల్చును. ఒకప్పుడు పెద్ద కొండ వంటి దేహము కలవాడును. ఒకప్పుడు అతడే అతి సూక్ష్మమగు దుమ్ము కణమునకు పోలును. అట్టి యజ్ఞ రూప నరునకు ఎల్ల వేళల నమస్కరింతును.

 

 

ఆ యజ్ఞ మూర్తియే నాలుగు మోములు గల బ్రహ్మయై యీ లోకముల నన్నింటిని సృష్టి చేయు చున్నాడు. పాలనకై యాతడే చక్రము చేత దాల్చిన విష్ణువగు చున్నాడు. లోకములను ఉప సంహరించుటకై ప్రళయ కాలాగ్ని వంటి రూపము గల రుద్రుడగు చున్నాడు. అట్టి నిత్య మూర్తికి నమస్కరింతును.

 

 

ఈ సంసారమను చక్రము ప్రవర్తించుట యను కార్యమునకై అంతట వ్యాపించిన పురాణ పురుషుడు యజ్ఞ రూపమున అర్చింపబడు చున్నాడు. ఊహింప నలవి కాని మహిమ గల అతనిని యోగులు నిత్యమూ ధ్యానము చేయుదురు. అట్టి నిత్యుడగు యజ్ఞ మూర్తికి మ్రొక్కు లిడుదును.

 

 

ఓ ప్రభూ! నిన్ను నా మదిలో చక్కగా కుదురు కొల్పు కొంటిని. నా దేహమున నీ తత్త్వము నాకు సృష్టముగా కాన వచ్చు చున్నది. ఇంత కంటె వేరేమియు లేదని నాకు దృడమైన అభిప్రాయము కలిగినది. ఇట్టి శుద్ధ భావము నాకు దేని వలన కలిగినదో ఆ పరతత్త్వము నన్నెల్ల వేళల కాపాడు గాక!