వరాహ మహా పురాణము

Table of Contents

అధ్యాయము - 100

 

రాజా! రసధేను విధానమును సంక్షేపముగా చెప్పెదను. అలికిన నేలపై నల్ల లేడి చర్మమును, దర్భా సనమును ఉంచి దానిపై చెరకు రసము నింపిన ఘటమును ఉంచ వలయును. దానిలో నాలుగవ భాగముతో దూడను ఏర్పరచి దాని ప్రక్క నిలుప వలయును.

 

రసధేనువు నిట్లు చేయ వలయును. చెరకు గడల కాళ్ళు, బంగారు నగల కొమ్ములు, వస్త్రము తోడి తోక, నేతితో పొదుగు. పూవులు కూర్చిన గంగడోలు, చక్కెరతో ముఖము, నాలుక, ఇవి కూర్ప వలయును.

 

ఫలములతో దంతములు, రాగితో వెనుక భాగము, పూవులతో వెంట్రుకలు, ముత్యములతో చూపులు కల్పించి ఏడు విధములగు ధాన్యములను కూర్ప వలయును. మంచి పరిమళము లను కూర్ప వలయును. నాలుగు వైపుల నాలుగు నూగుల పాత్ర లను ఉంచ వలయును.

 

వేద విద్వాంసుడు, శ్రోత్రియుడు, ఆహితాగ్ని, పురాణముల నెరిగిన వాడు, విశేషించి మంచి నడవడి గల బుద్ధిశాలి, కుటుంబము కలవాడు అగు బ్రాహ్మణునకు ఆ గోవును దాన మీయ వలయును. (శ్రోత్రియు డనగా వేదములను అధ్యయనము చేసిన వాడు, వేద విద్వాంసుడనగా = వేదార్థములను చక్కగా తెలిసిన వాడు; అహితాగ్ని = ఇంటిలో నిరంతరము అగ్నులను ఉంచుకొని పూజించు వాడు)

 

దాత పాపములు లేనివాడై స్వర్గమును పొందును. దాతయు, గ్రహించు వాడును ఒక దినము రసము మాత్రమే ఆహారముగా గొన వలయును.

 

 

సోమము పానము చేసిన ఫలము, అన్ని యాగములు చేసిన ఫలము అతనికి కలుగును. ఆ ఆవును దానమిచ్చు చుండగా చూచు వారును పరమ గతి కరుగుదురు.

 

ముందు గంధము, ధూపము, మాలలు మొదలగు వానితో ధేనువును పూజించి మునుపు చెప్పిన మంత్రములను శ్రద్ధతో స్మరింప వలయును.

 

ఇట్లు పలికి ద్విజ శ్రేష్ఠునకు ఇచ్చిన వాడు, తన వెనుక పది తరముల వారిని, తన ముందు పది తరముల వారిని, తనతో కలుపుకొని మొత్తము ఇరువది యొక్క తరముల వారిని పరమ గతిని పొందించును. స్వర్గము నుండి మరల తిరిగి రాడు.

 

రాజా! ఇట్లు నీకు మిక్కిలి ఉత్తమమైన రసధేనువును గూర్చి చెప్పితిని. దానిని దానమిమ్ము. పరమ స్థానమును ఆ విధముగా పొందుము.

 

దీనిని భక్తితో చదువు వాడును, విను వాడును సర్వ పాపములను పోగొట్టుకొని విష్ణు లోకము నందు ప్రతిష్ఠ నొందును.