వరాహ మహా పురాణము
అధ్యాయము - 51
ధరణీ వ్రతమును గూర్చిన ఉత్తమ మగు వాక్యమును దుర్వాసుని వలన విని సత్య తపుడు హిమవత్పర్వతము ప్రక్క భాగమునకు వెంటనే అరిగెను.
పుష్పభద్ర యను నదియు, చిత్ర శిలయను శిలయు, భద్రపటమను మఱ్ఱిచెట్టును గల ఆ తావు నందు అతని ఆశ్రమము విరాజిల్లెను.
అందాతని ఉదాత్త చరిత్రము సంభవించును.
ఓయి సనాతనా! నేనీ వ్రతము నాచరించి పెక్కు వేల కల్పము లయినది. ఈ తపస్సును గూర్చి, ప్రభూ! నేను మరచితిని.
ఇప్పుడు నీ అనుగ్రహమున ఆ ప్రాత విషయము గుర్తునకు వచ్చినది. పూర్వ జన్మ స్మరణము కలిగినది. పరమేశ్వరా! నా దుఃఖము నశించినది.
ప్రభూ! నీ హృదయమున నా యందు ప్రీతి యున్నచో అగస్త్యుడు మరల భద్రాశ్వుని మందిర మునకు వచ్చి యేమి చేసెనో, ఆ రాజేమి యొనరించెనో నాకు తెలియ జెప్పుము.
తిరిగి వచ్చి శ్రేష్ఠమగు ఆసనమున కూర్చున్న ఆ అగస్త్య మహర్షిని చూచి విశేషముగా పూజ యొనర్చి మోక్ష ధర్మమను ప్రశ్నను అడిగెను.
మహానుభావా! ఏ కర్మముతో సంసార బంధము తెగి పోవును? ఆకారము కలవి లేనివి అనువాని విషయమున మానవు లేమి చేసి శోకింప కుండుదురు?
రాజా! దూరముగా నున్నది మరియు దగ్గరగా నుండునది, కన్పట్టు నట్టిది, కన్పడనిది అను విభాగముల కలదియు నగు ఒక దివ్య కథ కలదు. వినుము.
అది పగలు కాదు. రాత్రియు కాదు. దిక్కులు కావు. దిక్కులు కానివియు కావు. అది ఆకాశము కాదు. వారు దేవతలు కారు. అది దినము కాదు. సూర్యుడును కాదు. అట్టి కాలమున పశు పాలుడను రాజు పెక్కు పశువులను పాలించు చుండెను.
వానిని పాలించుచు అతడొక నాడు తూర్పు సముద్రమును చూడ గోరిన వాడై వడివడిగా నచటి కరిగెను. అంతు లేని ఒడ్డుగల ఆ మహా సముద్రము తీరమున ఒక వనము కలదు. అందు పాములు నివసించు చున్నవి.
ఎనిమిది వృక్షములు, కామవహ అను నదియు అడ్డముగా పైకిని, వ్యాపించుచు నచట ఉన్నవి. గొప్ప తేజస్సుతో వెలిగి పోవుచున్న ఒక స్త్రీని అయిదుగురు ప్రధాన పురుషులు పట్టుకొని యున్నారు.
ఆ యింతియు వేయి సూర్యులకు సమానమైన పెద్ద రత్నమున తన ఎదపై దరించి యున్నది. ఆమె క్రింది పెదవి మూడు వికారములు, మూడు వర్ణములు కలదియై యున్నది. అటు నిటు తిరుగు చున్న ఆ రాజును చూడు.
తక్కిన వారందరు మిన్నక చచ్చిన వారివలె ఉన్నారు. ఈ రాజు అట్టి వనమున ప్రవేశించెను. అతడు ప్రవేశింపగా ఒక్క క్షణమున అందరు భయము వలన ఒక్కరు గానై ఆ వనమును ప్రవేశించిరి.
మిక్కిలి చెడ్డవియగు ఆ పాములు, క్రూరులు చుట్టు ముట్టగా ఆ రాజు ఇట్లు చింతించు చుండెను. ఇవి ఇచట లేకుండుట యెట్లు? ఇవి యిట నుండి చెదరి పోవుట యెట్లు?
ఇట్లు ఆ రాజు చింతించు చుండగా మరియొక పురుషుడు మూడు వన్నెలు కలవాడు తెల్లని, ఎర్రని, నల్లని రంగులను దరించిన వాడు కానవచ్చి నా కంటె ఇతరు డెవ్వడవు నీవు? ఎక్కడకు పోవు చున్నావు? అని సంజ్ఞ చేసెను అట్లు పలుకు చున్న ఆతనికి ‘మహత్తు’ అను పేరు కలిగెను.
ఆ పురుషుడును ఈ రాజును చుట్టు కొనగా అతడు ‘మేల్కొనుము’ అని పలికెను. అంత ఆ స్త్రీ ఆ రాజును అడ్డ గించెను.
అంతనొక మహా పురుషుడు, వీరుడు సర్వేశ్వరేశ్వరుడు అతనిని చుట్టుకొని నిలిచి ఇది యంతయు మాయచే వ్యాపించినది. భయపడకు మని పలికెను.
అంత ఇతరులు అయిదుగురు పురుషులు ఆ నృప సత్తముని చుట్టు ముట్టి నిలిచిరి. రాజుతో వారు పగ పెట్టుకొని యుండిరి.
రాజునట్లు క్రమ్ముకొని యుండగా ఆ క్రూరులు అందరు ఒక్కటిగానై ఆతనిని మథించుటకై ఆయుధమును పట్టుకొని ఒకరిలో ఒకరు భయముతో కలిసి కొని పోయిరి.
ఇట్లు వారు ఒక్కటియై పారిపోగా ఆ రాజ భవనము మిక్కిలి సుందర మయ్యెను. ఇతర పాపుల కోట్లు కూడ రూపుమాసి పోయినవి.
ఆ యింట భూమి, నీరు, నిప్పు, సుఖము చల్లనిది అగు గాలి. శుభ్రమైన అవకాశములు, అనునవి అయిదు ఒక్కొక్క గుణము తక్కువ కలవియై ఏర్పడినవి.
అవి యన్నయు ఒక్క ఆకారముతో కూడి మాడి ఆతనిని చుట్టుకొని నిలిచినవి. ఇట్లా పశు పాలుడు దీని నంతటిని అప్పటి కప్పుడు ఏర్పరచెను.
యుద్ధము నందలి ఆతని ఆ చురుకు తనమును, రూపమును గాంచి మూడు రంగుల పురుషుడు ఆ రాజ శ్రేష్ఠునితో ఇట్లు పలికెను.
మహారాజా! నేను నీ కుమారుడను. నీ కేమి చేయుదును? బంధుత్వము కోరెడు మేమొక నిశ్చయము చేసితిమి.
మేమందరమును, దేవా! నీచేత పరాజితులము కావింప బడినచో ఇట్లే మేము శరీరము లందు కలిసి పోయి యుందుము.
నేనొక్కడను నీ పుత్రత్వమును పొందగా సర్వము నందును సృష్టి ఏర్పడును. అని అతడట్లు పలుకగా రాజు ఆ నరునితో ఇట్లు పలికెను.
నా పుత్రుడు ఇతరుల కందరికి సృష్టికర్త యగును. మీ సుఖములతో, నరులతో, భావములతో నేను మాత్రము ఎన్నటికిని తగుల మందను.
ఇట్లు పలికి ఆ రాజు ఆతనిని తన కుమారుని గావించెను. వారిని విడనాడి తాను స్వయముగా వారి నడుమ క్రీడించెను.
