వరాహ మహా పురాణము
అధ్యాయము - 95
భూదేవీ! నీలగిరికి తపస్సునకై చెదరని మనసుతో అరిగిన, తమో గుణము వలన ఏర్పడిన రౌద్రి యను శక్తి పట్టిన వ్రతమును గూర్చి చెప్పెదను. వినుము.
నేను చిరకాలము తప మోనరించి సమస్త మైన జగత్తును పాలింతును. అని సంకల్పించి ఆ కాంత అయిదగ్నులను ఏర్పరచు కొనెను. (పంచాగ్నులు = నాలుగు వైపుల నాలుగు అగ్నులు, పైన సూర్యాగ్ని).
అట్లు మహా తీవ్రమగు తపస్సు చేయు చున్న కాలములో బ్రహ్మ ఒసగిన వరములు కలవాడు, గొప్ప ముఖ కాంతి కలవాడు, రురువను వాడు సముద్రము నడుమ రత్నములతో నిండిన గొప్ప తోటలు గల పట్టణమున రాజై యుండెను. అతడు దేవత లందరికి భయంకరుడు. కొన్ని వందల కోట్ల రక్కసు లతనికి బంటులు. రెండవ నముచియో అన్నట్లు మహా సంపదతో విరాజిల్లు చుండెను.
పెద్ద కాలము గడువగా అతడు లోకపాలుర పురముల నన్నింటిని గెలువ గోరిన వాడై సేనలను సిద్ధము చేసికొని దేవతలకు భయము పుట్టించెను.
ఆ మహా రాక్షసుడు పైకి లేచు చుండగా సముద్రపు నీరు పెద్ద ఎత్తున పొంగి పోయెను. పెక్కు మొసళ్ళు, గ్రహములు, పెను చేపలు నిండిన ఆ జలము కొండచరియ భూములను ముంచి యెత్తెను.
సముద్రపు నీటిలో ఉన్న పెక్కు రక్కసి మూకలు, విచిత్రములగు డాళ్లు, ఆయుధములు కలవై, భయము గొలుపుచు పెద్ద యెత్తున సముద్రపు నీటి నుండి వెలువడి వచ్చెను.
గొప్ప రాక్షసులతో కూడి, తమ ఆకారమునకు తగిన గంటలతో, భయము గొలుపు పెద్ద పెద్ద దేహములతో కూడిన ఏనుగులు పైకి వచ్చినవి.
చక్కని బంగారు నగలు కలిగి ఆ నీటి లోని రోహితము లనెడు పెను చేపల వంటి గుఱ్ఱములు లక్షల కొలది. కోట్లకొలది పైకి లేచి వచ్చినవి.
సూర్యుని రథముతో సమానమగు వేగము కలవి చక్కని చక్రములు, దండములు, ఇరుసు, మూడు బొంగులు కలవి, గొప్ప ఆయుధ యంత్రములు కలవి, కదలాడు పతాకలు కలవి, ఎదురు లేని వేగము కలవి, నలుగ గొట్టిన ప్రాణుల అంగములు కలవి యగు రథములును వెలికి వచ్చినవి.
అట్లే ఒకరి నొకరు ఒరసి కొనుచున్న వారు. ఉత్సాహముతో ముందు వారిని దాటి పోవ గోరువారు, శ్రేష్ఠులు, ఊగులాడు చేతులు కలవారు, ప్రతి యుద్ధ మందును జయము గొనువారు, పోటు గాండ్రు అగు యోధులు ఈ రాక్షస రాజు వెంట పెద్దగా ప్రకాశించుచు వచ్చిరి.
దేవత లందరు చెల్లా చెదురు కాగా ఆ సేన చతురంగ బలముతో కూడినదై నీటి నుండి వెలువడి ఇంద్రుని పురముపైకి దండెత్తెను.
రాక్షస రాజ గురువు దేవతలతో తలపడి ముద్గరములతో, రోకండ్లతో, ఈటెలతో, అమ్ములతో, దుడ్డు కర్రలతో పోరొనర్చి వారిని చావ గొట్టెను. దేవతలును అట్లే రాక్షసులను కొట్టిరి.
ఇట్లు కొంత కాలము పోరొనర్చి దేవతలు ఇంద్రునితో పాటుగా రక్కసులకోడి ఒక్క పెట్టున పెడ మొగము పెట్టి పారిరి.
ఇట్లు దేవతలు విరిగి చెల్లాచెదురు కాగా గొప్ప బలశాలి యగు ఆ రక్కసుడు దేవతలను తరిమి కొట్టెను.
అంత దేవతల మూకలు భయముతో గుండె చెదరిన వారై ఆ దేవి నెలకొని యున్న నీల పర్వతమునకు పరు వెత్తుకొని పోయిరి.
ఆమె రుద్రశక్తి. తపస్సున ఆసక్తి కలది. తమో గుణము వలన ఏర్పడి నది. ఉత్తమ సంహార కారిణి. దేవి. కాళరాత్రి యని ఆమెను వారె రుగుదురు.
అట్లు భయముతో గుండె చెదరిన ఆ దేవత లందరను చూచి భయ పడకుడని ఆ దేవి పెద్దగా పలికెను.
దేవులారా! ఇది యేమి? మీ స్థితి మిక్కిలి బెదరి నట్లున్నది. వెంటనే చెప్పుడు. మీ భయమునకు కారణ మేమి?
అమ్మా! అడుగో వచ్చిపడు చున్నాడు రాక్షస రాజు రురుడు. భయంకర మగు పరాక్రమము కలవాడు. వీని వలన భయ మందిన దేవత లందరను, పరమేశ్వరీ! కాపాడుము.
దేవత లిట్లు పలుకగా భీమ పరాక్రమము గల ఆ దేవి మిక్కిలి ప్రీతితో దేవతల యెదుట పెద్దగా నవ్వెను.
అట్లు నవ్వుచున్న ఆమె మోము నుండి పెక్కు దేవీ రూపములు వెలువడినవి. వికృతా కారము గల వారిచేత విశ్వ మంతయు నిండి పోయినది.
అందరు పాశములను అంకుశ ములను తాల్చిన వారు. బలసిన పాలిండ్లు కలవారు. శూలములు చేపట్టిన వారు. విండ్లు ధరించిన వారు.
కోట్ల కొలదిగా ఉన్న ఆ దేవీ రూపకాంత లందరు ఆ దేవిని క్రమ్ముకొని నిలిచి అంబుల పొదులు తాల్చి మహాబలలై దానవులతో యుద్ధ మొనరించిరి. ఆ దేవీ బలముల చేత క్షణ కాలములో దానవ సేన యంతయు నశించినది.
దేవత లందరు సన్నద్ధులై దానవ బలముతో పోరిరి. ఆదిత్యులు, వసువులు, రుద్రులు, విశ్వేదేవులు, అశ్వినులు అందరు ఆయుధము లను గొని రక్కసుల మూకలతో పోరాడిరి.
కాళరాత్రి బలము, దేవతల బలము అంతయు కలిసి దానవ బలమును యమునింటి కంపెను.
మహా దైత్యుడు రురువొక్కడే యుద్ధ భూమిలో ఉండెను. వాడును మహా రౌద్రియగు రురు శక్తిని ఆ దేవి సేనపై వదలెను.
ఆ మాయ దేవత లందరిని మోహ పెట్టుచు భయంకరముగా వృద్ధి పొందెను. దానితో మోహితులగు దేవత లందరు వెను వెంటనే నిద్రను పొందిరి.
దేవి మూడు మొనల శూలముతో ఆ రాక్షసుని కొట్టెను. ఓ శుభ లోచనా! అట్లు దెబ్బతిన్న ఆ దైత్యుని చర్మము, మొండెము వేరు వేరుగా పడి పోయెను.
దానవ రాజగు రురుని చర్మ ముండములను దేవి క్షణములో అపహరించి వైచెను. అందు చేత ఆమె చాముండ ఆయెను.
ఆ పరమేశ్వరి, సర్వ భూతములకు మహారౌద్రి, సంహారిణి కాళరాత్రి అని కొనయాడ బడినది.
ఆమె వెంట నుండి ఆ లెక్కిడరాని కోట్ల దేవీ గణములు ఆమె చుట్టును నిలిచిరి.
వారందరు ఆకలికొన్న వారై ఒక్క పెట్టున, అమ్మా! ఆకలికొన్న వారము. మాకు భోజనము పెట్టుమని అడిగిరి.
వారట్లు పలుకగా ఆ దేవి వారి భోజనమును గూర్చి భావించెను. కాని తన కడ వారికి భోజనము కలుగ కుండగా అప్పుడామె మహా దేవుడు, పశుపతి, విభుడు అగు రుద్రుని ధ్యానించెను. పరమాత్మ యగు ముక్కంటి ఆ ధ్యానము వలన అచట సాక్షాత్కరించెను.
దేవీ, వరారోహో! నీ మనసున ఏమున్నదో, నేను చేయ వలసిన దేమో చెప్పుము, అని దేవితో పలికెను.
దేవి:
దేవి:
దేవదేవా! వీరు తినుటకు కొంచె మేదేని నీ వొసగ వలయును. ఆకలితో ఉన్న ఈ మహాబల లందరు నన్ను ఒత్తిడి చేయు చున్నారు. లేనిచో వీరు నన్నే తిని వేయ గలరు.
దేవేశి! మహాప్రభా! కాళరాత్రీ! వరారోహా! వీరి తిండిని ఒక దానిని నేను సిద్ధము చేసితిని. చెప్పుదును. వినుము.
గర్భము తాల్చిన ఏ స్త్రీ అయినను ఇతర వనితల వస్త్రమును కట్టు కొన్నను, ముఖ్యముగా పురుషుని వస్త్రమును తాకినను అది వీరిలో కొందరికి భాగ మగును. తక్కిన వారు దోషములున్న చోట పిల్లలను బలిగా గొని నూర్ల కొలది ఏండ్లు ప్రీతి కలవారై ఉండ వలయును.
మరి కొందరు పురిటి యింటిలో దోషమును మ్రొక్కులు గొనుచు కొను చుందురు గాక! ఇంకను కొందరు పుట్టిన బిడ్డలను హరించుచు నివసింతురు.
ఇంటిలో, పొలములో, చెరువుల కడ, తోటలలో అన్యులపై మనసు కలవారై ఏడ్చెడు స్త్రీల శరీరముల నావేశించి వీరిలో కొందరు తృప్తి నందెదరు.
ఇట్లు పలికి ప్రతాప వంతుడగు రుద్రుడు, అసురేంద్రుడగు రురువు, వాని బలము కూలి యుండగా చూచి తానై దేవిని ఇట్లు స్తుతించెను.
దేవీ! చాముండా! భూతముల రూపు మాపుదానా! అన్ని యెడల నుండెడు ఓ దేవీ! కాళరాత్రీ! నీకు నమస్కారము.
విశ్వ మంతయు నీరూపమే, నీవు శుభ స్వరూపిణివి, నిర్మలవు, విరూపాక్షివి. ముక్కంటివి. భీమ రూపవు. శివా! విద్యా స్వరూపిణీ! మహా మాయవు. మహోదయా! నీకు నమస్సు.
నీవు మనస్సున కున్నంత వేగము కలదానవు. జయము నీ స్వరూపము. నీవు ఆవులింతవు. భయము గొలుపు కన్నులు కల దానవు. క్షోభను నశింప జేయు దానవు. మహామారీ! విచిత్రాంగీ గేయము, నృత్యము అనువాని యందు ప్రీతికల దానా! శుభా! నీకు నమస్కారము.
మహాకాళీ! కాళికా! భీమ రూపిణీ! పాపములను పరమార్చు దానా! పాశము చేత దాల్చిన దానా! దండహస్తా! భయము గొలుపు దేవీ! నీకు మ్రొక్కులు.
చాముండా! మంటలు గ్రక్కుచున్న మొగము గలదానా! మిక్కిలి వాడియగు కోరలు గలదానా! మహాబలా! శవ వాహనమున నిలుచు దానా! దేవీ! ప్రేతాసనమున నుండు మంగళ స్వరూపా! నీకు నమస్సు.
భీమాక్షీ! భీషణా! దేవీ! సర్వభూత భయంకరీ! కరాళా! వికరాళా! మహాకాళీ! కరాళినీ! కాళీ! కరాళీ! పరాక్రమించు తల్లీ! నీకు నమస్కారము (కరాళి = వెరపు పుట్టించునది, పొడవైనది).
మిక్కిలి వెరపు గొలుపు ముఖము కల దేవీ! అగ్ని జ్వాలలను వెలిగ్రక్కు మోముకల తల్లీ! ప్రాణు లన్నింటికి మేలు చేయు సర్వేశ్వరీ! నీకు ప్రణతి.
పరమేష్ఠియగు రుద్రు డిట్లు స్తుతింపగా దేవి మిక్కిలిగా ఆనంద పడెను. ఇట్లు పలికెను. దేవదేవా! నీ మనసున నున్న వరమును కోరు కోనుము.
దేవీ! ఈ స్తోత్రముతో నిన్ను స్తుతించు వారికి అంతట నుండు తల్లివి నీవు వరముల నొసగుము.
దేవీ! భక్తితో కూడి దినమునకు మూడు మారులు దీనిని పఠించు వాడు పుత్రులు, మనుమలు, పశువులు సమృద్దిగా కలవాడై ఐశ్వర్యమును పొందును.
మూడు శక్తులు గల అమ్మవారి ఈ స్తోత్రమును భక్తితో వినువాడు పాపము లన్నింటిని పాసి ఏ రోగము లేని స్థానమున కరుగును.
ఇట్లు శివుడు పరమేశ్వరి యగు చాముండను స్తుతించి క్షణములో అంతర్ధానము చెందెను. దేవతలును స్వర్గమున కరిగిరి.
ఈ మూడు విధములైన దేవి పుట్టుకను చక్కగా ఎరిగిన వాడు ఓ భూదేవి! సర్వ పాపముల నుండి విడివడి పరమ నిర్వాణమును (మోక్షమును) పొందును.
రాజ్యము కోల్పోయిన రాజె వ్వడైనను శ్రద్ధతో శుచియై నవమి నాడును, అష్టమి నాడును, చతుర్దశి నాడును ఉపవాస ముండి (ఈ దేవిని కొలుచునేని) ఒక్క యేడు కాలములో ఏ బాధలు లేని రాజ్యము పొందును.
ఈ త్రిశక్తి నయ సిద్ధాంతమునకు చెందినది. ఇదిగో తెల్లని ఈ తల్లి బ్రహ్మ యందు సత్వ రూపమున నెలకొని పరా సృష్టి యగు చున్నది.
ఈమెయే ఎర్రని వన్నె కలదియై రజో గుణమున వైష్ణవి యనియు, ఈమెయే నల్లదియై తమో గుణము నందు రుద్ర శక్తి యనియు ప్రసిద్ధి కెక్కు చున్నది.
పరమాత్ముడగు దేవు డెట్లు ఒక్కడే మూడు విధములుగా నాయెనో అట్లే ప్రయోజనమును బట్టి ఒకే శక్తి మూడు విధములుగా ఆయెను.
పరమ మంగళమైన ఈ త్రిశక్తి సృష్టిని విన్నవాడు పాపము లన్నింటిని పరిమార్చి పరమ నిర్వాణమును పొందును.
నవమి యందు శ్రద్ధతో భక్తితో దీనిని విన్నవాడు సాటిలేని రాజ్యమును పొందును. మరియు భయము నుండి ముక్తి పొందును.
భూదేవీ! ఎవని యింట ఈ కథ లిఖింప బడునో వానికి అగ్ని భయము, సర్ప భయము దొంగ భయము కలుగదు.
పుస్తకము నందును దీనిని భక్తితో పూజించు పండితుడు చరా చరాత్మక మగు మూడు లోకములను పూజించిన వాడగును.
ఈ గ్రంథము ఎవని యింటిలో ఉండునో అతనికి పశువులు, పుత్రులు, ధనము, ధాన్యము, చక్కని కాంతలు, రత్నములు, గుఱ్ఱములు, ఏనుగులు, సేవకులు, వాహనములు శీఘ్రముగా కలుగును.
భూత ధారిణీ! రుద్రుని రహస్యమగు మహిమను గూర్చి మొత్తముగా నీకు తెలిపితిని.
చాముండా దేవి తొమ్మిది కోట్ల భేద స్వరూపములతో నిలిచి యున్నది. ఆమె రుద్రునికి చెందిన తామసి యగు శక్తి.
అట్లే వైష్ణవి భేదములు పదునెనిమిది కోట్లు. ఆమె రజ స్సంబంధ మగు శక్తి. లోకముల నేలునది.
ఇక ఆ సత్వ గుణము నందున్న బ్రహ్మ శక్తి భేదములు అనంతములు.
ఈ మువ్వురి భేదము లన్నింటి యందును, రుద్రుడు విడిగా ఒక్కొక్క రూపముతో అంతట నుండు ప్రభువై యుండును.
ఈ మహాశక్తి రూపము లెన్ని కలవో అన్నింటి యందు శంకరుడు పతి రూపమున నుండి వానిని పొందు చున్నాడు.
ఆ రూపములను ఆరాధించినచో రుద్రుడు తుష్టుడగును. ఆ దేవి మంత్రులు సర్వ కార్యములను సిద్ధింప జేయు చుందురు. సంశయము లేదు.
