వరాహ మహా పురాణము

Table of Contents

అధ్యాయము - 55

 

రాజా! వ్రతములలో మేలైన వ్రతమును చెప్పెదను వినుము. ఆ శుభమైన వ్రతముతో విష్ణువు దక్కును. సంశయము లేదు.

 

మార్గశిర మాసమున శుక్ల పక్షమున పాడ్యమి మొదలు కొని దశమి తిథి వరకు ఒంటి పూట భోజనము చేయుచు ఈ వ్రతము నారంభింప వలయును. దశమి మధ్యాహ్నమున స్నానము చేసి విష్ణువును పూజించి భక్తితో మునుపటి వలె ద్వాదశి వ్రతమునకు సంకల్పము చేయ వలయును.

 

ఆ తిథి యందును అట్లే ఉండి యవలను విప్రునకు దానమీయ వలయును. దానము నందును, హోమము నందును, అర్చనము నందున ‘ఓంనమః కృష్ణాయ’ అని హరిని కీర్తించు చుండ వలయును.

ఇట్లు నాలుగు మాసములు గడిపి, ఓ రాజసత్తమా! చైత్రము మొదలగు మాసముల యందు మరల నట్లే ఉపవాస ముండి పేల పిండి, బంగారు నాణములు గల పాత్రలను చక్కని వేద పండితుల కొసగ వలయును.

 

 

శ్రావణము మొదలగు నెలల యందు అట్లే బియ్యమును దానము చేయ వలయును. అట్లు మూడు మాసములు గడువగా కార్తిక మాసము మొదటి వచ్చు వరకు నిట్లు చేయ వలెను.

 

ఆ నెల కూడ అట్లే దశమి వరకు నిష్ఠతో శుచియై గడపి మునుపటి వలె భక్తితో ఇంద్రియముల నదుపున నుంచు కొని ఏకాదశి యందు శక్తి నను సరించి సంకల్పము గావించి మాసము పేరు చెప్పి హరిని ఆరాధింప వలయును. ద్వాదశి నాడు భూమిని చక్కగా తీర్చ వలయును.

 

బంగారు అవయవములు కలదియు, పాతాళముతో, కుల పర్వతములతో కూడినదియు అగు భూ దేవతను భూమిన్యాస విధానము చేత ఆ హరి దేవుని ముందు నిలుప వలయును.

 

తెల్లని రెండు వస్త్రములు కప్పినదియు, అన్ని విధములగు విత్తనములతో కూడి నదియునగు ఆ భూ దేవతను అయిదు రత్నములతో ‘ప్రియదత్తా’ అనుచు పూజింప వలయును.

 

రాజా! అచట జాగరము చేయ వలయును. మరునాటి ఉదయమున ఇరువది నలుగురు బ్రాహ్మణులను ఆహ్వానించి ఒక్కొక్కనికి ఒక్కొక్క గోవును, ఎద్దును, వస్త్రముల జంటను, ఉంగరమును, మురుగులను, బంగారు కుండల ములను, ఒక్కొక్క గ్రామమును దానము చేయ వలయును.

 

వారిలో ఒక దరిద్రునకు తన శక్తి ననుసరించి ఆభరణములను, రెండు వస్త్రములను, సర్వ శ్రేష్ఠముగా ఒసగ వలయును.

 

తన శక్తి మేరకు బంగారపు భూమి ప్రతిమను చేసి రెండు గోవులను, రెండు వస్త్రములను దాన మొసగ వలయును.

 

గోవుల జంటను, ఆభరణమును, బంగారు నాణములతో మొత్తముగా, శుక్ల కృష్ణ పక్ష ద్వాదశుల యందు దానము చేయ వలయును.

 

వెండి బొమ్మగా నైనను భూదేవిని శక్తి కలిగిన మేరకు చేసి బ్రాహ్మణులకు దానము చేయ వలయును. భోజనము పెట్ట వలయును. పాద రక్షలను, పాదుకలను, గొడుగును కూడ యథా శక్తిగా నొసగ వలయును.

 

ఇట్లు వీని నొసగి కృష్ణుడు, దామోదరుడు, విశ్వ రూపుడు, హరి దేవుడు ఎల్లప్పుడు నా యెడల ప్రీతుడగు గాక యని పలుక వలయును.

 

ఈ విధముగా దానము, భోజనము చేయించి నందున కలుగు ఫలమును చెప్పుటకు వేయి యేండ్ల కాలము నందు కూడ సాధ్యము కాదు.

 

అయినను సూచనగా ఆ ఫలమును గూర్చియు, మునుపు జరిగిన దానిని గూర్చియు, దాని శుభములను గూర్చియు చెప్పెదను. వినుము.

 

మునుపు ఆది యుగమున ఒక రాజు కలడు. అతడు వేదము చక్కగా అధ్యయనము చేసిన వాడు. చెదరని వ్రతములు కలవాడు. ఆతడు పుత్రులను కోరిన వాడై బ్రహ్మను ఉపాయ మడిగెను. బ్రహ్మ ఆతనికీ వ్రతము నుపదేశించెను. ఆతడు దానిని యథా విధిగ ఆచరించెను.

 

వ్రతము ముగిసిన పిదప విశ్వాత్ముడగు హరి తుష్టుడై స్వయముగా ప్రత్యక్షమయి, ఓ రాజా! మేలైన వరము కోరు కొమ్మని పలికెను.

 

దేవాదిదేవా! నాకొక పుత్రుని ప్రాసాదింపుము. ఆతడు వేద మంత్రముల యందు విశారదుడు, యజ్ఞములు చేయించు వాడు. యజ్ఞము లందు ఆసక్తి కలవాడు, కీర్తి మంతుడు, చిరాయువు, లెక్కిడ రాని గుణములు కలవాడు, బ్రహ్మ వంటి వాడు, ఏ దోషములు లేని వాడును కావలయును.

 

ఇట్లు పలికి ఆ రాజు మరియు నిట్లనెను. పరమేశ్వరా! నాకును మరణము పిదప శుభమైన స్థానమును మునులు కోరు నదియు, ఎచట దుఃఖము కలుగదో అట్టి పదమును అను గ్రహింపుము.

 

 

ఆ దేవుడు అట్లే అని పలికి అదృశ్యు డాయెను. ఆ రాజునకును ‘వత్సశ్రీ’ అను పేరు గల కుమారుడు జన్మించెను. ఆతడు వేద వేదాంగ ములను చక్కగా నేర్చిన వాడు. యజ్ఞములు చేసిన వాడు. గొప్ప విద్యలు నేర్చిన వాడు. ఆతని కీర్తి భూ తలము నందంతటను మిక్కిలిగా వ్యాపించెను.

 

ఆ రాజును విష్ణువు ప్రాసాదించిన ప్రతాప వంతుడగు ఆ కొడుకును పొంది సుఖ దుఃఖాదులగు ద్వంద్వము లన్నింటిని విడనాడి తపస్సు నందు మనసు నిలపి రమ్యమైన హిమవత్పర్వతమున కరిగి ఆహారము మాని వైచి ఇంద్రియముల నదుపు చేసికొని నిరంతరము స్తుతి చేయుచు హరి నారాధించెను.

 

 

బ్రాహ్మణా! ఆ రాజు చేసిన స్తుతి యెట్టిది? పురుషోత్తమ దేవుని స్తుతించిన ఆ రాజునకు తరువాత నే మాయెను?

 

ఆ రాజు హిమవంతమున కరిగి హరి యందే నిలిపిన మనస్సు కలవాడై విష్ణువు, ప్రభ విష్ణువు అయిన దేవుని గూర్చి స్తుతి కావించెను.

 

నేను జనార్దన ప్రభువును స్తుతింతును. ఆతడు క్షరుడు, అక్షరుడు, పాల సముద్రమున పవ్వళించు వాడు. భూమిని ధరించు వాడు. దేహము గొన్న వారికి పరమ పదము. ఇంద్రియముల కతీతుడు. విశ్వమును తాల్చు వారందరికి ముందుండు వాడు. ఆకార రహితుడు.

 

స్వామీ! నీవు ఆది దేవుడు. పరమార్థమే నీ రూపము. విభుడవు. పురాణుడవు. పురుషోత్తముడవు. ఇంద్రియముల కందని వాడవు. వేద మెరిగిన వారిలో ప్రధానుడవు. శంఖము, గద, ఖడ్గము, చక్రములు చేత దాల్చిన స్వామీ! నన్ను గట్టిగా కాపాడుము.

 

దేవా! నీవు దేవతలయు, దానవులయు సృష్టి కొరకు అనంతములగు రూపములను తాల్చని వాడవు. నిన్నట్లు కొనియాడుదురు. నిజమునకు కూట గతుడవగు నీకు ఏ చేష్టితమును లేదు.

 

అట్లే నీవు తాబేటి రూపము, వరాహాది మృగ రూపమును, పెక్కు రూపములు కలవాడా! పెక్కు మారులు సర్వము నెరిగిన తనముతో చేసితివి. అట్లని నిన్ను కీర్తించు చున్నారు. అయినను నీకది (రూపము) నిజమునకు లేదు.

 

 

నృసింహా! నీకు నమస్సు. వామనా! పరశురామా! రావణాంతకా! వాసుదేవా! బుద్ధా! కల్కీ! పక్షిరాజా! శంభో! రాక్షసాంతకా! నీకు ఎల్లప్పుడు నమస్కారము.

 

నారాయణా! పద్మనాభా! పురుషోత్తమా! సమస్త దేవతల పూజలందు కొనుదేవా! సర్వ మెరిగిన వారిలో మొదటి వాడా! నీకు నమస్కారము.

 

వెరపు గొలుపు ముఖము గల ఓ నృసింహ మూర్తీ! వెడద అయిన కొండ వంటి కూర్మరూపా! సముద్రమునకు సాటియగు మత్స్యరూపా! అనంతా! వరాహ రూపము గల స్వామీ! నీకు నమస్సులు.

 

 

ప్రభూ! ఈ నీ చేష్టిత మంతయు కేవలము సృష్టి కొరకు మాత్రమే. ముఖ్యమగు దృష్టితో నీకు ఆకారమే లేదు. నిన్నెరుగని వాడిట్టి ధ్యానమును ప్రకాశింప జేసెను. ఇట్టి వానితో కాని నీవు, ఓ సనాతనుడా! ఎఱుగ బడవు.

 

విష్ణూ! నీవు మొట్ట మొదటి యజ్ఞ స్వరూపమవు. యజ్ఞము లందలి అంగమైన వాడవు కూడ నీవే, హవిస్సు నీవే, యజ్ఞ పశువవు, ఋత్విజుడవు నీవే. యజ్ఞ ఫలమును నీవే. దేవతలు, మునులు నిన్ను ద్దేశించియే యజ్ఞములు చేయుదురు.

 

ఈ సృష్టి యందు నిలుకడగా నున్నదియు, కదలునదియు కదలనిదియు, దేవతలు, కాలము, అగ్ని మున్నగు వాని యందున్న ఉత్తమ మగు తేజమును, సర్వము నీవే. జానార్దనా! ఈశ్వరా! నిజమునకు నీవు విభాగములుగా లేవు (ఏక రూపుడవు). నా హృదయము కోరెడు సిద్ధిని ప్రసాదింపుము.

 

పద్మము రేకుల వంటి కన్నులు గల ఓ దేవా! ఆకారము కలదియు, లేనిదియు సర్వము నీవే. నిన్ను నేను శరణము పొందితిని. నన్ను సంసారము నుండి సముద్ధరింపుము.

 

మహాత్ముడగు ఆ రాజు పరపైన మామిడి చెట్టు క్రింద నుండి ఇట్లా దేవుని స్తుతింపగా పరమేశ్వరుడు సంతోషించెను.

 

అంత ఆ హరి స్వయముగా గుజ్జు రూపము తాల్చి అచటకు వచ్చెను. ఆతడు వచ్చి నంతనే ఆ విశాలమగు మామిడి చెట్టు కూడ కుంచించు కొని పోయెను.

 

ఆ గొప్ప ఆశ్చర్యమును గాంచి చక్కగా పాటించిన వ్రతము గల ఆ రాజు ఇంత విశాలమగు చెట్టు కుంచించు కొని పోయెనేమి? అని విచారము కల వాడాయెను.

 

అట్లు చింతించు చున్న ఆతనికి ఆ బ్రాహ్మణుని యందు బుద్ధి ప్రసరించెను. ఇతడు వచ్చుట తోడనే ఇది యిట్లాయెను. సంశయము లేదు. (అని తలచెను)

 

అతని వలననే ఇది ఇట్లైనది. ఈతడు భగవంతుడగు పురుషోత్తముడే అనుచు ఆతడా విప్రునకు నమస్కారము చేసెను.

 

భగవానుడా! నీవు నిక్కముగా పురుషోత్తముడవు. నన్న నుగ్రహించుటకై వచ్చితివి. హరీ! నీ స్వరూపమును నాకు చూపుము.

 

ఇట్లు పలుకగా దేవుడు శంఖము, చక్రము, గద అను వానిని ధరించి సౌమ్యుడై ఆతని ముందు ప్రకాశించి ఇట్లు పలికెను.

 

రాజేంద్రా! నీ మనసున నున్న కోరిక యేమో కోరుము. నేను ప్రసన్నుడ నయినచో ఈ మూడు లోకముల సముదాయము ఒక నువ్వు గింజంత అగును.

 

హరి యిట్లు పలుకగా రాజు పరమా నందముతో వికసించిన కనులు కలవాడై దేవదేవా!

నాకు మోక్షము నను గ్రహింపుము అని మిన్న కుండెను.

 

అంత నా దైవము మరియు నిట్లనెను. నేను రాగా ఈ విశాలమగు మామిడి చెట్టు పొట్టిదై పొయినది. అందు వలన ఈ తీర్థము ‘కుబ్జ కామ్రము’ అను పేరు కలది యగును.

 

పశువులు, పక్షులు మొదలు కొని బ్రాహ్మణులు తుదిగా గల వారందరు దీని కడ శరీరమును వదలుదు రేని వారి కొరకై అయిదు వందల విమానములు వచ్చును. యోగులకు సాక్షాత్తు ముక్తియే కలుగును.

 

ఇట్లు జనార్దనుడు ఆ రాజుతో పలికి శంఖము కొనతో ఆతనిని తాకెను. అట్లు తాకినంత మాత్రమున ఆతడు పరమ పదమగు నిర్వాణమును పొందెను.

 

కావున రాజేంద్రా! నీవును ఆ దేవుని శరణు పొందుము. దాని వలన నీవు మరల శోకింప దగిన స్థానమును ఎన్నటికిని పొందవు.

 

నిత్యము ఉదయమున నిద్రలేచి మానవుడు వారిరువురు ప్రవర్తించిన తీరును పఠించు నేని మోక్ష ధర్మమును, ఫలమును ఇచ్చు వాడగును.

 

పుణ్యమైన ఈ శుభ వ్రతమును ఆచరించు నరుడు సర్వ సంపదలను అనుభవించి తుదికి ఆ పరమాత్మునిలో లీనమగును.