వరాహ మహా పురాణము

Table of Contents

అధ్యాయము – 1

 

 

శ్రీమన్నారాయణునకు, నరులలో శ్రేష్ఠుడగు నరునకు, సరస్వతీ దేవికి మ్రొక్కులిడి జయమును పఠింప వలయును.

 

 

విలాసముగా భూమి నుద్ధరించు చున్న వరాహ దేవుని కాలి గిట్టల నడుమ చిక్కుకున్న మేరు పర్వతము ఖణ ఖణ లాడినది. అట్టి శ్రీవరాహ దేవునకు నమస్కారము.

 

 

తొల్లి ఈ వరాహదేవుడు విశాలమైన అంతులేని పెను దేహముతో పర్వతములతో నదులతో సముద్రములతో కూడిన భూమి నంతటిని కోర అంచుతో మట్టి బెడ్డను వలె పైకెత్తెను. కంసుడు, మురుడు, నరకుడు, రావణుడు అను రక్కసుల అంతు చూచిన వాడు, నల్లని వన్నె గలవాడు, అంతట వ్యాపించిన వాడు, దేవతలకును ప్రభువు, అన్నింట నెలకొని యుండువాడు, తొలి దైవము నగు ఆ శ్రీవరాహ దేవుడు నా పగ వారిని పారద్రోలు గాక!

 

 

చావు, ముదిమి, రోగము అను మొసళ్ళతో, అలలతో భయంకరమైన సంసారమను సముద్రమున భక్తుల భయమును రూపు మాపు వాడును తాల్చిన వాడును, సర్వ లోకములకు ప్రభువును, భూదేవికి నాథుడును, శత్రువులను నుగ్గునూచగా గొట్టిన వాడును, బుద్ధి పండిన వారు, ముక్తి నందిన వారునగు పుణ్యాత్ములకు మాత్రమే లీలగా దొరకు వాడునగు విష్ణువు అందరకూ సుఖ స్వరూపుడగు గాక!

 

 

మునుపు విష్ణువు వరాహ దేహముతో తన్నుద్ధరించిన నాడు, భూదేవి భక్తితో పరమేశ్వరుని ఇట్లడిగెను.

 

 

ప్రభూ! కేశవా! ప్రతి కల్పము నందును నీవు నన్ను ఉద్దరించు చున్నావు. కాని నేను నీ మూర్తి యెట్టిదో, నీ తోలి సృష్టి యెట్టిదో యెరుగా కున్నాను.

 

 

మున్ను వేదములు నష్టము కాగా నీవు చేపవై రసాతలమున చొరబారి వానిని పైకి తెచ్చి బ్రహ్మ కొసగితివి.

 

 

పిదప ఓ మధుసూదనా! దేవతలు రాక్షసులు కూడి సముద్రమును చిలికి నపుడు నీవు తాబేటి రూపముతో మందరమును మోసితివి గదా!

 

 

తిరిగి, నేను రసాతలమునకు జారు చుండగా భగవంతుడవగు నీవు వరాహ రూపముతో మహా సముద్రము నుండి ఒక్క కోరతో నన్ను పైకి లాగితివి కదా!

 

 

మరియొక మారు హిరణ్య కశిపుడు వరములు పొంది కన్ను గానక భూమిని బాధించు చుండగా నీవు వానిని కూల ద్రోసితివి గదా! అట్లే వామన రూపమును దాల్చి నీవు బలిని బంధించితివి గదా!

 

 

పిదప నీవు జమదగ్ని కుమారుడవగు రాముడవై పలుమార్లు భూమిపై క్షత్రియులు లేకుండ చేసితివి.

 

 

మరియు క్షత్రియ తేజమును దాల్చి నీవు రావణుడను రాక్షసుని మట్టు పెట్టితివి. దేవా నీ లీల యే కొంచెమును ఎరుగ కున్నాను.

 

 

నన్నుద్ధరించిన పిదప ఈ విశ్వమంతయు నెట్లు సృజించెదవు? ఏల సృజించెదవు? దాని నెట్లు ఒక్క పెట్టున పట్టి యుంతువు? ఏ విధముగా దానిని పాలింతువు?

 

 

ప్రభూ! నిన్ను తేలికగా పట్టుకొను ఉపాయా మేది? ఈ సృష్టికి మొద లెట్టిది? ఇది యంత మగుట యెట్లు?

 

 

యుగముల లెక్క యెట్లేర్పదినది? నాలుగు యుగముల వరుస యెట్లు జరిగినది? అందలి విశేషము లేవి? మహా ప్రభూ! దీని యందలి స్థితి యెట్టిది?

 

 

యజ్ఞములు చేసిన రాజు లెవ్వరు? పరమ సిద్ధి పొందిన వారెవ్వరు? ఇది యంతయు నాకు సంగ్రహముగా చెప్పుము. నా యందు ప్రసన్నుడవు కమ్ము.

 

 

భూదేవి యిట్లు పలుకగా వరాహ రూపముతో నున్న పరమేశ్వరుడు నవ్వెను. అట్లు నవ్వు చున్న అతని కడుపులో రుద్రులను, దేవతలను, వసువులను, సిద్దుల సముదాయము లను మహర్షులను భూదేవి గాంచెను.

 

 

చంద్రులతో, సూర్యులతో, గ్రహములతో కూడిన సప్త లోకములను, తమతమ ధర్మములను నిర్వహించుచు ఆ కుక్షి లోపల ఉండగా, భూదేవి గాంచెను. ఇట్లు చూచు చున్న భూమి నిలువెల్లా వణకి పోయెను.

 

 

మరల ఆ మహాత్ముడు నోరు తెరువగా నిర్మలములగు సమస్త అవయములు గల ధరణి నాలుగు భుజములు గలిగి మహా సముద్రములో నిద్రించు చున్న ఆ విష్ణుని స్వరూపమునే గాంచెను.

 

 

శేష పర్యంకమున నిద్రించి యున్న జనార్ధన దేవుని, ఆతని బొడ్డు తామరలో నున్న నలు మోముల దేవర బ్రహ్మను గాంచి చేతులు మోడ్చి భూదేవి యిట్లు స్తుతి చేసెను.

 

 

తామర రేకుల వంటి కన్నులు గల స్వామీ! పీత వస్త్రము తాల్చిన వాడా! నీకు మ్రొక్కులు. దేవతల శత్రువులను రూపు మాపునట్టి పరమాత్మా! నీకు నమస్సు.

 

 

శేషుడను పాన్పుపై పవ్వళించి హృదయమున లక్ష్మీ దేవిని తాల్చిన స్వామీ! సర్వ దేవేశా! మోక్షమొసగు దేవా! నీకు నమస్సు.

 

 

శార్జ్గము, ఖడ్గము, చక్రము ధరించిన దేవా! నీకు కైమోడ్పు. జన్మము, మరణము లేని ప్రభూ! నమస్కారము. బొడ్డు తామర నుండి బ్రహ్మ దేవుని సృజించిన మహానుభావా! ప్రణతి.

 

 

పగడముల వంటి మోము, చిగుళ్ళ వంటి చేతులు గలిగి యలరారు చున్న దేవా! నీకు నమస్కారము. నిన్ను శరణు పొందితిని. పాప మెరుగని పడతిని నన్ను కాపాడుము.

 

 

జనార్ధనా! నిలువెల్ల నల్లని కాటుక వంటి ఆకారము గల నీ వరాహ రూపమును, నీ దేహమున గాన వచ్చిన జగమును గాంచి భీతి నొందితిని. నాథా! ఇపుడు నా యందు దయ చూపుము. నన్నీ మహా భయము నుండి కాపాడుము.

 

 

కేశవుడు నా పాదములను, నారాయణుడు నా పిక్కలను, మాధవుడు నా నడుమును, గోవిందుడు నా గుహ్యమును రక్షించు గాక!

 

 

విష్ణువు నా పొక్కిలిని, మధుసూదనుడు నా ఉదరమును, త్రివిక్రముడు నా తొడలను, వామనుడు నా హృదయమును కాపాడు గాక.

 

 

శ్రీధరుడు నా కంఠమును, హృషీకేశుడు ముఖమును, పద్మనాభుడు కన్నులను, దామోదరుడు శిరస్సును బ్రోచుగావుత.

 

 

ఇట్లు హరి నామములను తన అంగములపై పాదు కొలిపి జగతీ దేవి భగవానుడా! విష్ణూ! నీకు నమస్కార మని పలికి ఊర కుండెను.