వరాహ మహా పురాణము
అధ్యాయము - 6
దేవా! ఆ వసువును, ఉత్తముడగు రైభ్యుడును బృహస్పతి ఉపదేశమును విని సంశయము తీర్చుకొని అటుపై ఏమి గావించిరి?
ధర్మము లన్నింటి తత్త్వ మెరిగిన ఆ వసు మహారాజు తన రాజ్యమును చక్కగా పరిపాలించుచు, గొప్ప దక్షిణలు గల దొడ్డ యజ్ఞములు పెక్కింటిని చేసెను.
ఆ రాజేంద్రుడు దేవ దేవుడగు శ్రీమన్నారాయణుని భేదము లేని బుద్దితో భావించుచు కర్మ మార్గమున సంతోష పెట్టెను.
చాలా కాలము గడచిన పిమ్మట రాజ్య భోగములపై మనసు పెట్టని ఆ రాజునకు ద్వంద్వముల నుండి మరలిన బుద్ది నెల కొనెను. (ద్వంద్వములు - సుఖ దుఃఖములు, లాభ నష్టములు మొదలైనవి. సంగము లేని స్థితి ఏర్పడెనని భావము.)
నూరుగురు అన్నదమ్ములలో మిన్నయగు వివస్వంతుడను కుమారుని తన రాజ్యమున అభిషేకించి అతడు తపో వనము చేరు కొనెను.
తీర్దములలో వాసి కెక్కినదియు, శ్రద్దాసక్తులు గలవారి పూజలందు కొనుచు నారాయణుడు పుండరీకాక్షు డను పేరున నెలకొన్న దియు అగు పుష్కరమను తీర్ధమున కరిగి కాశ్మీర రాజగు ఆ వసువు మిక్కిలి తీవ్రమగు తపస్సుతో తన శరీరమును ఎండ గట్టెను.
పుండరీకాక్షుడే పర దైవమని ప్రతిపాదించు స్తోత్రమును భక్తితో జపించుచు ఎందును మచ్చ లేని శ్రీమన్నారాయణ దేవుని నిరంతరము కొలుచుచు స్తోత్రము ముగిసిన వెనుక రాజ వరేణ్యుడగు ఆ వసువు ఆ దేవునిలో కలసి పోయెను.
పరమేశ్వరా! పుండరీకాక్ష పారమను ఆ స్తోత్ర మెట్టిది? దానిని జపించుట యెట్లు? ఉన్నదున్నట్లు నాకు ఎరిగింపుము.
పద్మముల వంటి కన్నులు గల ఓ దేవా! మధుసూదనా! సర్వ లోకముల ప్రభూ! వాడియగు చక్రము గలవాడా! నీకు నమస్సులు.
సర్వము తానే అయిన వాడు, గొప్ప భుజములు కలవాడు, వరముల నొసగు వాడు, వెలుగు లన్నియు తానే అయిన వాడు, తామర కన్నుల వాడు, జ్ఞానము, అజ్ఞానము తానే అయిన ప్రభువు, అట్టి వానికి నమస్కారము (అజ్ఞానము తానే అగుట యనగా జ్ఞానము కంటె భిన్నముగా తోచు సంసారము కూడ తానే యని భావము).
తొట్ట తొలి దైవము, గొప్ప దైవము, వేదములయు వేదాంగములయు తుదిని గోచరించు దైవము, దేవతలు అందరిలో అంతు పట్టని దైవము అగు మధుసూదనునికి మ్రొక్కు లిడుదును. (మధు సూదనుడనగా మధువను రాక్షసుని రూపు మాపిన వాడు.)
విశ్వమంతయు తన రూపమే అయిన వాడు, దానిని మించిన పెను రూపము కలవాడు, విద్యయంతయు తన రూపమే అయిన వాడు, బ్రహ్మ విష్ణు మహేశ్వర నామములతో మూడు రూపములు కలవాడు, దేవతలు అందరకు కవచమైన వాడు, పద్మముల వంటి కనులు గలవాడు అగు దైవమునకు మ్రోక్కుదును. (కవచము దేహమునకు ఆయుదాదుల బాధ కలుగ కుండ కాపాడు తొడుగు).
వేల తలలు, వేల కన్నులు, దొడ్డ భుజములు గలిగి లోకముల నన్నింటిని చక్కగా వ్యాపించి యున్న పరమేశ్వరునకు నమస్సు.
లోకములు అన్నింటికి దిక్కు అయిన వాడు, రక్షకుడు, అంతట నిండిన వాడు, అన్నింటిని అందరను గెలువ గలవాడు, సనాతనుడు, నల్లని మబ్బు వంటి వన్నె కలవాడు, చక్రము చేత దాల్చిన వాడు అగు దేవునకు ప్రణామములు, (సనాతనుడు - సృష్టికి ముందు నుండియు ఉన్నవాడు).
శుద్దుడు, అంతట నిండిన వాడు, నాశము లేని వాడు, ఆకాశము వంటి రూపము కలవాడు, సనాతనుడు, భావములను,అభావములను ఊడ్చి వైచిన వాడు, ఎల్ల యెడల నుండు వాడు అగు హరిని నమస్కరింతును. (భావాభావ వినిర్ముక్తమ్ = లోకమున తక్కిన పదార్ధములకు వలె ఉండుట, లేకుండుట అను ధర్మములు లేని వాడని భావము).
అచ్యుతా! నీకంటే వేరయున దేమియు ఇనుమంతయు నాకు కాన రాకున్నది. ఈ చరాచర ప్రపంచ మంతయు నీతో నిండినది గనే నాకు కన్పట్టు చున్నది.
ఇట్లా రాజు స్తుతి చేయు చుండగా ఆతని ముందొక రూపము గొన్న పురుషుడు తన దేహము నుండి వెలువడి నిలిచెను. కారు మేఘము వలె తీవ్రుడై యుండెను. భయము గొలుపు చుండెను. కన్నులు ఎఱ్ఱగా నుండెను. దేహము పొట్టిగా నుండెను. కాలిన ఇనుప స్తంభము వలె నుండెను. అతడు చేతులు జోడించి రాజా! ఏమి యాజ్ఞ? అని పలికెను.
ఓయీ! కిరాతా! నీ వేవడవు? నీ కిట పనియేమి? ఎందుండి వచ్చితివి? ఇది తెలియ గోరుదును. నాకు తెలుపుము.
రాజా! మునుపటి కలి యుగమున నీవు దక్షిణా పథమున జన స్థానమున నిండు ధర్మములతో పుట్టిన, సిరులకు నెలవగు బుద్దిగల రాజవు. (దక్షిణా పథము = వింధ్యకు దక్షిణమున నున్న దేశము).
అట్టి నీవు ఒకనాడు గుఱ్ఱములు చుట్టిరాగా క్రూర మృగములను చంపుటకు అడవి కేతెంచితివి.
అచట నీవు ఒకనాడు మృగ వేషమున నున్న ఒక మునిని దూరము నుండి రెండు బాణములతో తెలియక నేల గూల్చితివి.
ఆ విప్రవరుడు వెను వెంటనే చచ్చెను. నీవు లేడిని కూల్చితినని సంతోషముతో చూచునంతలో ప్రస్రవనమను కొండపై మృగ దేహము గల విప్రుడు చచ్చి పడి యుండెను.
మహారాజా! అతనిని చూచిన నీకు ఇంద్రియములు, మనస్సును కుమిలి పోయెను. ఇంటికి పొయిన నీ వీ వృత్తాంతమును మరి యోకనికి చెప్పితివి.
అంత కొన్ని రోజులకు నీ వోకరాత్రి బ్రహ్మ హత్య వలన భయపడిన చిత్తముతో ఈ పాతకము నుండి ముక్తి నొందు శాంతి కార్యము నాచరింతునని తల పోసితివి.
అపుడు నీవు శ్రీమన్నారాయణు నొక్క మారు మనసున ధ్యానించి శుద్ధ ద్వాదశి నాడు ఉపవాస ముంటివి.
ఆ పుణ్య దినమున ‘నారాయణుడు నా యెడల సుప్రీతుడగు గాక!’ అని పలికి శాస్త్రము ననుసరించి గోవును దాన మిచ్చితివి. వెనువెంటనే కడుపు నొప్పితో మరణించితివి.
ద్వాదశి విధి యందు నీవు ఉపవాస ముండుటకు కూడా ఒక కారణము కలదు. అది చెప్పెదను. నీ ధర్మపత్ని పేరు పవిత్రమైన నారాయణి. నీవు ప్రాణములు కంఠము దాక వచ్చి పోవునపుడు ఆమెపేరు ఉచ్చరించితివి. ఆ కారణమున, మహారాజా! నీకొక కల్పకాలము విష్ణు పురమున నివాసము లభించినది.
నే నొక బ్రహ్మ రాక్షసుడను. మహా ఘోరుడను. నీ దేహమున నుండి అంతయు తెలిసితిని. నిన్ను పీడింప వలయునని నా భావన.
ఇంతలో నన్ను విష్ణు భటులు రోకల్లతో చావ గొట్టిరి. అంత నేను నీ రోమ కూపముల నుండి వెలు వడితిని.
నీవు స్వర్గము నందున్నపుడును నా తేజము వలన నీ యందే యుంటిని.
అంత పగటి కల్పము గడచిన వెనుక రాత్రి కల్పమున ఇప్పుడు సృష్టి యందు కృత యుగమున నీవు కాశ్మీర రాజగు సుమనో మహారాజు గృహమున పట్టితివి. నేనును నీ రోమ కూపములతో నీలోనే యుంటిని. (కల్పమనగా బ్రహ్మ దేవునికి ఒక పగలు, ఒక రాత్రి. అహః కల్పమనగా బ్రహ్మకు ఒక దినము నందలి పగలు , రాత్రి కల్పమనగా రాత్రి).
నీవు గొప్ప దక్షిణలతో పెక్కు జన్నములు చేసితివి. కాని యవి విష్ణు స్మరణ లేని కారణమున నన్ను రూపు మాప లేక పోయినవి.
రాజవరేణ్యా! ఇప్పుడు నీవు పుండరీకాక్షుడే పరదైవ మని ప్రతిపాదించు స్తోత్రము చదువగా నీ రోమములను వదలి ఏక రూపము తాల్చి బోయవాడనై పుట్టితిని.
నేనును భగవంతుని స్తోత్రము విని మునుపటి పాప రూపము నుండి విడుదల పొంది తిని. ప్రభూ! నాకు ఇప్పుడు ధర్మము నందు బుద్ది ఏర్పడినది.
ఆ రాజ శ్రేష్ఠుడు ఇది విని పరమాశ్చర్యము పొందెను. ఆ వ్యాధుని వరము కోరు కొమ్మనెను.
ఓయీ వ్యాధుడా! నీ వలన నా మరియొక జన్మము వృత్తాంతము గుర్తునకు తెచ్చు కొంటిని. కావున నా అనుగ్రహము వలన నీవు ధర్మ వ్యాధుడు వగుదువు.
పుండరీకాక్షుడు (విష్ణువే) పరదైవ మని ప్రతి పాదించు ఈ స్తోత్రమును విను వానికి పుష్కర తీర్ధమున పవిత్ర స్నాన మాచరించు ఫలము కలుగును.
ఓ భూతధాత్రీ! ఇట్లు పలికిన ఆ రాజు శ్రేష్ఠమగు విమానము నెక్కి గొప్ప తేజస్సులో లీన మాయెను.
