వరాహ మహా పురాణము
అధ్యాయము - 88
మిగిలిన మూడు ద్వీపములలో అయిదవ దియగు శాల్మల ద్వీపమును గూర్చి చెప్పెదను. వినుడు. శాల్మలము క్రౌంచ ద్వీపమునకు రెట్టింపు అయినది.
ఇది నేతి సముద్రముతో చుట్టబడి యున్నది. దాని వైశాల్యము ద్వీపమునకు రెట్టింపు. అందును ఏడు పర్వతములు ప్రధానములు. అంతే సంఖ్యలో దేశములు, నదులు కలవు.
మిక్కిలి పెద్దది, బంగారుతో ఏర్పడినది కనుక పచ్చని వన్నె కలది యగు సార్వ గుణము, సౌవర్ణము, రోహితము, సుమనసము, కుశలము, జాంబూ నదము, వైద్యుతము అనునవి కుల పర్వతములు. దేశములును ఈ పేర్లతోనే యున్నవి.
ఆరవది గోమేద ద్వీపము. శాల్మలము వలె సురోదముతో ఆవృత మైనది. (సురోదము = మద్యపు సముద్రము). అది దానికి రెట్టింపుగా ఉన్న గోమేదముతో చుట్టబడి యున్నది. అందు ప్రధాన పర్వతములు రెండే. మొదటిది తావసరము. రెండవది కుముదము. సముద్రము చెరకు రసము కలది. దానికి రెట్టింపు అయినది పుష్కరము.
ఆ పుష్కర ద్వీపమున మానసమను పర్వత మొక్కటి కలదు. దానితో ఆ దేశము రెండుగా చీలినది. తీయని నీరు చుట్టును కలదు. దానికి పైని కటాహము కలదు. ఇది భూమి ప్రమాణము. (కటాహము = కుండ మొదలగు వాని లోపలి అంచు).
బ్రహ్మాండము కటాహముల మొత్తము విస్తారపు కొలత కలిగి యున్నది. ఇట్టి అండములు లెక్క లేనన్ని కలవు. ప్రతి కల్పము నందును భగవంతుడగు నారాయణుడు వరాహ రూపమును తాల్చి రసాతలమున చొచ్చుకొని పోయిన వీని నన్నింటిని ఒక కోరతో పైకెత్తి మరల చక్కగా నిలుపును.
విప్రులారా! భూమి పొడవు వెడల్పుల మార్గమును మీకు తెలియ జెప్పితిని. మీకు స్వస్తియగు గాక! నేను నా నివాసమగు కైలాసమునకు పోయెదను.
ఇట్లు పలికి రుద్రుడు క్షణములో అదృశ్యమైన మూర్తి కలవాడై వెడలెను. ఆ దేవతలు ఋషులును అందరును తమతమ తావుల కరిగిరి.
