వరాహ మహా పురాణము

Table of Contents

అధ్యాయము - 60

రాజా! ఇంక నీకు శాంతి వ్రతమును గూర్చి చెప్పెదను వినుము. అది చేసినచో గృహస్థులకు ఎల్ల వేళల శాంతి కలుగును.

 

కార్తిక మాసము శుక్ల పక్షపు పంచమి నాడు దీనిని మొదలిడ వలయును. ఒక సంవత్సరము పులుపు లేని భోజనము చేయ వలయును.

 

ఆనాటి రాత్రి శేషునిపై ఉన్న హరిని పూజింప వలయును. ‘ఓం నమో అనంతాయ’ అని పాదములను, నమో వాసుకయే అని నడుమును, ‘సమ స్తక్షకాయ’ అని ఉదరమును, ‘నమః కర్కోటకాయ’ అని రొమ్మును, ‘నమః పద్మాయ’ అని కంఠమును, ‘నమో మహా పద్మాయ’ అని భుజముల జంటను, ‘నమః శంఖ పాలాయ’ అని ముఖమును, ‘నమః కుటిలాయ’ అని శిరస్సును ఇట్లు విష్ణుగతము గాను, విడిగా నాగులను పూజింప వలయును.

 

ఆ సర్పములను, విష్ణువును ఉద్దేశించి పాలతో స్నానము చేయ వలయును. వారి ముందు పాలతో నువ్వులతో హోమము చేయ వలయును.

 

ఇట్లు ఒక సంవత్సరము ముగిసిన తరువాత బ్రాహ్మణ సంతర్పణము చేయ వలయును. బంగారు నాగ ప్రతిమను బ్రాహ్మణు నకు దాన మీయ వలయును.

 

ఈ విధముగా ఈ వ్రతమును భక్తితో చేయు వానికి శాంతి లభించును. పాముల భయము కలుగదు.