వరాహ మహా పురాణము
అధ్యాయము - 77
ఆ పద్మపు దుద్దు మొదలు మేరువు నడిమి భాగ మనియు, దాని కొలత వేల యోజనము లనియు నను కొంటిమి.
దాని చుట్టు కొలత నలుబది యెనిమిది వేల యోజనములు. అది పర్వత రాజమగు మేరువునకు మూలముగా భావింప బడినది.
అచట నున్న వేల కొలది పర్వతముల ప్రమాణము మిక్కిలి గొప్పది. మరియు ఎనిమిది దిక్కులలో ఎనిమిది సరిహద్దు కొండలు కలవు.
వీనిలో తూర్పున జఠరము, దేవకూటము అని రెండు పర్వతములు కలవు. ఇవి తూర్పు పడమరలుగా వ్యాపించి సముద్రము లోనికి చొచ్చుకొని పోయి యున్నవి. ఈ మర్యాదా పర్వతము లెనిమిదిగా మేధావులు అభి వర్ణింతురు.
బ్రాహ్మణ వరేణ్యులారా! బంగారు కొండగా ప్రసిద్ధి కెక్కిన ఆ మేరు పర్వత విష్కంభములను గూర్చి చెప్పుదును. వినుడు.
ఆ మేరు పర్వతమునకు నాలుగు దిక్కు లందును నాలుగు మహా పాదములు కలవు. అవి తన్ని పట్టుకొని యుండగా ఏడు ద్వీపములు గల భూమి కదల కుండినది.
ఆ విష్కంభముల నడిమి ప్రదేశము అడ్డముగా, ఎత్తుగా పదివేల యోజనములని ఊహ. అవి హరితాళ వృక్షములు గల ఒడ్డులతో క్రమ్ముకొని యున్నవి.
వాని చరియలు మణి శిలలతో రంగు రంగుల మణులతో, పెక్కు సిద్ధ భవనములతో, క్రీడా స్థానములతో గొప్ప కాంతులు కలిగి యున్నవి.
దానికి తూర్పున మందరము, దక్షిణమున గంధ మాదనము, పడమటి దిక్కున విపులము, ఉత్తరమున సుపార్శ్వము అను కొండలు కలవు.
వాని శిఖరము లందు నాలుగు మహా వృక్షము లున్నవి. దేవతలు, దైత్యులు, అప్సరసలు ఆ చెట్ల గుణముల మొత్తముల చేత అచట విహరించు చుందురు.
మందర గిరి కొమ్మున బాగుగా వ్రేలాడు కొమ్మల చివరలు గల కదంబమను వృక్షము కలదు.
విప్పారిన కేసరములు గల దాని పూవులు పెద్ద కుండలంత ప్రమాణములో నుండును. సర్వ కాలములలో పూచును. గొప్ప పరిమళముతో మనోహరములై యుండును. సర్వ ప్రాణులకు ఉల్లాసమును కలిగించు భూ భాగములతో ఆ చెట్టు గంధములతో దిక్కులను నింపుచు విరాజిల్లును. అట్టి చెట్టు గల మండలములు వేయి కంటె అధికము.
వర్షగిరి యను గంధ మాదనము నందు భద్రాశ్వమను వృక్ష ముండును. అది ఆ కొండ శిఖరమున పుట్టినది. మిక్కిలి ప్రసిద్ధి కలది. అందమైనది. శోభతో నిండినది, మహా వృక్షముల కంటె మిన్న. అక్కడ సాక్షాత్తు హృషీకేశుడు సిద్ధుల సంఘములతో కొలువు తీరి యుండును.
గుఱ్ఱపు మోము గల విష్ణువు ఆ భద్ర కదంబ వృక్షము గల పర్వతపు చరియను మాటి మాటికి చేరు చుండును.
ఆ విధముగా భద్ర కదంబమును చూచెడు అశ్వ వదనుడు కలది కావున ఆ వర్షమును భద్రాశ్వ మను చుందురు. సంశయము లేదు.
దేవతలు సేవించెడు దక్షిణ గిరి శిఖర మందలి వృక్షము జంబువు. (నేరేడు) అప్పటి కప్పుడు పూవులు కాయలు ఒసగు చుండును. పెను కొమ్మలతో ఒప్పారు చుండును. దాని పండ్లు మిక్కిలి పెద్దవి, రుచి కలవి, మెత్తనివి, అమృతమున కెనయైనవి. కొండ కొమ్మున రాలు చుండును.
ఆ మేలైన పర్వతము నుండి ఆ పండ్ల రసముతో జాలువారెడు దివ్య నది జంబూ నది తేనెలను స్రవింప జేయుచు పారు చుండును.
మరియు దాని యందు జాంబూ నదమను బంగారము మంచివన్నె కలిగి అగ్ని జ్వాల వంటి కాంతితో నుండును. దేవతలకు అలంకార మైనది, పాపములను నశింప జేయునది యగు అది అచట పుట్టెను.
దేవతలు, దానవులు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, గుహ్యకులు అమృతము వంటిది, నేరేడు పండ్ల నుండి జాలు వారినది అగు ఆ తేనెను త్రావిరి.
దక్షిణ దేశమునకు పతాక వంటి ఆ జంబువు లోకము లందు ప్రసిద్ధి కెక్కినది. దాని పేరు తోడనే ఆ దేశమును మానవులు జంబూ ద్వీపమని పిలుచు చున్నారు.
గొప్పది యగు విపుల పర్వతమునకు దక్షిణమున మిక్కిలి పెద్దదియు ఒక కొండ కొమ్మా అన్నట్టిదియు నగు అశ్వత్థము (రావి) అను చెట్టు పుట్టినది.
పెద్ద పరపు, గొప్ప మొదలు, పెక్కు మహా గుణములు గల ఆ చెట్టు పండ్లు కుండ లంతంటివి. అన్ని ఋతువులలో కాయునవి. మేలైనవి.
ఆ వృక్షము కేతుమాల దేశములకు పతాక వంటిది. దేవతలు గంధర్వులు దానిని సేవింతురు. దానిని బట్టియే దానికి కేతుమాల మనుపేరు ప్రసిద్ధ మైనది. నామ కర్మములను బట్టి దాని నిర్వచనమును బ్రాహ్మణ ప్రవరులారా! తెలిసి కొనుడు.
పాల సముద్రమును మధించు నపుడు ఇంద్రుడు తన చైత్యము పతాకను మాలలుగా భుజముపై నిలుపు కొనెను. అందుచేత ఆ వర్షము (దేశము) ‘కేతుమాల’ మని ప్రసిద్ధి కెక్కెను.
సుపార్శ్యము ఉత్తర శృంగమున వటమను పెద్ద మఱ్ఱిచెట్టు కలదు. దాని మొదలు మిక్కిలి విశాల మైనది. దాని మండలము మూడు యోజనముల ప్రమాణము కలది.
పెక్కు విధములైన మాలలు సముదాయములతో, మిక్కిలిగా వ్రేలాడు కొమ్మలతో అది అలరారు చుండును. సిద్ధులు దానిని సేవించు చుందురు.
వ్రేలాడు కుంభముల వంటి, బంగారు వన్నెకల పండ్లతో ఆ న్యగ్రోధము ఉత్తర కురు భూములకు పతాకా వృక్షముగా ప్రకాశించు చుండును. (న్యగ్రోధము - మఱ్ఱిచెట్టు)
సనత్కుమారుని తమ్ములు, బ్రహ్మ మానస పుత్రులు ఏడుగురు మహానుభావులు కురువులను వారు అచట ప్రసిద్ధి కెక్కిరి.
అందు స్థిరమైన గతి గలవారు, జ్ఞానులు, ఏ పాపము నెరుగని వారు, మహాత్ములు ఉందురు. ప్రళయ కాలము వరకు చెడనిది, సనాతనము అగు లోకముగా వారి స్థావరము ప్రసిద్ధి కెక్కినది. స్వర్గము నందును, భూమి యందును ఉత్తర కురువులుగా ఎల్లవేళల కీర్తింప బడునది.
