వరాహ మహా పురాణము
అధ్యాయము - 48
అదే విధముగా భాద్రపద మాసము శుక్ల పక్షమున ద్వాదశి నాడును సంకల్పము చేసికొని విధి పూర్వకముగా పరమేశ్వరుని అర్చింప వలయును.
‘ఓనమః కల్కినే’ అని పాదములను, ‘నమో హృషీకేశాయ’ అని నడుమును, ‘నమో మ్లేచ్ఛ విధ్వంసనాయ జగన్మూర్తయే’ అని ఉదరమును, ‘నమః శితికంఠాయ’ అని కంఠమును, ‘నమః ఖడ్గపాణయే’ అని భుజములను, ‘నమ శ్చతుర్భుజాయ’ అని హస్తములను, ‘నమో విశ్వమూర్తయే’ అని శిరస్సును పూజింప వలయును.
మేధావి యగు నరుడు ఇట్లు కొలిచి మనుపటి వలెనే ఆ దేవుని ముందు ఘటమును నిలుప వలయును. అందు బంగారు కల్కి ప్రతిమను ఉంచ వలయును.
తెల్లని రెండు వస్త్రములతో దానిని కప్పి గంధములతో, పూవులతో అలరారు నట్లు చేయ వలయును. మరుసటి దినము సూర్యోదయ కాలమున చక్కగా శాస్త్రములు అధ్యయనము చేసిన విప్రునకు దాన మీయ వలయును. ఇట్లు చేసినచో నేమగునో చెప్పెదను వినుము.
పూర్వము కాశీ పురమున విశాలుడను రాజుండెను. జ్ఞాతు లతని రాజ్యము నపహరింపగా అతడు గంధమాదన పర్వతమును ప్రవేశించెను.
ఆ పర్వతము లోయలో బదరియను అందమైన ప్రదేశమున రాజ్యము, సంపద కోల్పోయిన ఆ రాజు నివసించెను.
పురాణులు, సర్వ దేవతల మ్రొక్కులు కొనువారు, ఋషి శ్రేష్ఠులు నగు నర నారాయణులు ఒకనాడు అక్కడకు విచ్చేసిరి.
అంతకు ముందే అచటకు వచ్చి, పరబ్రహ్మ స్వరూపము, పరంధామము అగు విష్ణు నామక తత్త్వమును ధ్యానించు చున్న రాజును వారు చూచిరి.
నశించిన పాపములు గల ఆ రాజును చూచి వారు ప్రీతులై రాజేంద్రా! మేము వరముల నిచ్చుటకై వచ్చితిమి. వరము కోరు కొనుమని పలికిరి.
మీరెవరో నేనెఱుగను. ఎవరి వరమును గ్రహింతును? నేను దేని నారాధించు చున్నానో దాని నుండి మంచి వరము కోరుదును.
అతడట్లు పలుకగా వారు రాజా! నీవెనిని నారాధించు చున్నావు. ఎవనిని వరము వేడు చున్నావు? తెలియ వేడుక యైనది. చెప్పుము అనిరి.
వారట్లనగా రాజు ‘నేను విష్ణువు నారాధించు చున్నాను’ అని పలికి ఊర కుండెను. వారు మరల నిట్లనిరి.
రాజా! మేమా దేవుని ప్రసాదము వలననే వరము నిచ్చు చున్నాము. నీ వరమును గూర్చి చెప్పుము. నీ మనసున నేమి కలదు?
నాకు యజ్ఞేశ్వరుడగు దేవుని పెక్కు విధములగు దక్షిణలు గల యజ్ఞములతో పూజించు సమర్థత కలుగు నట్లుగా వర మొసగుడు.
లోకులకు దారి చూపు దేవుడు నారాయణుడు స్వయముగా నాతో పాటు లోకముల మేలును కాంక్షించి బదరీ వనము నందు తపస్సు చేయు చుండును.
ఇతడు మొదట మత్స్య మాయెను. తరువాత తాబేటి రూపు తాల్చెను. పిదప వరాహ మాయెను. అటుపై నరసింహు డాయెను, వామనుడు, పరశురాముడు, రాముడు, కృష్ణుడు అను అవతారముల నెత్తెను.
ఈతడు బుద్ధుడై జనులను మోహ పెట్టెను. పగ వారగు మ్లేచ్ఛులను, దొంగలను మరల రూపు మాపి ఈ భూమిని స్వస్థురాలిని గావించెను. ఆ భగవాను డితడే హరి.
సమస్త జ్ఞానమును పొంద గోరువారు మత్స్య రూపుడగు హరిని పూజింప వలయును. తన వంశమును ఉద్ధరించు కొనుటకు కూర్మ రూపుడగు దేవు నర్చింప వలయును.
సంసార సముద్రమున మునిగిన వాడు వరాహ రూపుడగు హరి నర్చింప వలయును. పాప భయము కల నరులు నరసింహ రూపమును పూజింప వలయును.
మోహము నశించుటకు వామనుని, ధనము కొరకు పరశురాముని, క్రూరులగు శత్రువుల వినాశము కొరకు దశరథ రాముని కొలువ వలయును.
కొడుకులను కోరు ధీశాలి బలరామ కృష్ణుల నర్చింప వలయును. రూపమును కోరువాడు బుద్ధుని, శత్రువులను రూపుమాప గోరువాడు కల్కిని అర్చింప వలయును.
ఇట్లు పలికి ఆ నర మహర్షి ఆతనికి ఈ ద్వాదశీ వ్రతమును గూర్చియే తెలియ జేసెను. ఆతడును అది కావించి చక్రవర్తి యాయెను. ఆతని పేరు మీదుగనే బదరి ‘విశాల’ అను పేరు పొందెను.
ఆతడు ఇహ జన్మమున రాజై తుదికి అడవి కేగెను. అచట పెక్కు విధములగు యజ్ఞము లాచరించి తుదికి నిర్వాణమును పొందెను.
