వరాహ మహా పురాణము
అధ్యాయము - 106
రాజా! వెన్న ఆవును గూర్చి శ్రద్ధతో వినుము. దానిని విని మానవుడు సర్వ పాపముల నుండియు ముక్తుడగును. సంశయము లేదు.
గోమయముతో అలికిన భూమిపై గోచర్మపు కొలతలో నల్ల జింక చర్మమును పరచి వెన్న కుండను శ్రద్ధతో నుంచ వలయును. అందు నాల్గవ భాగముతో దూడను చేయ వలయును.
శాస్త్రము ననుసరించి బంగారు కొమ్ములు, ముఖమును కూర్ప వలయును. మణులతో ముత్యములతో కనులను, బెల్లముతో నోటిని, చెక్కెరతో నాలుకను, పండ్లతో దంతములను, పట్టు వస్త్రముతో గంగడోలును చేయ వలయును.
వెన్నతో పొదుగును, చెరకులతో కాళ్లను, రాగితో పిరుదు భాగమును, త్రాటితో తోకను, దర్భలతో రోమములను బంగారుతో కొమ్ములను, వెండి గిట్టలను అమర్చి దానిని అయిదు రత్నములతో కూర్ప వలయును. అన్ని దిక్కులలో నాలుగు తిల పాత్రలను ఉంచ వలయును.
జమిలి వస్త్రములతో కప్పి గంధ పుష్పములతో అలంకరించి అన్ని వైపుల దీపములను వెలిగించి బ్రాహ్మణునకు సమర్పింప వలయును.
ఆతడు వేద వేదాంగములను అధ్యయనము చేసిన వాడు. ఆహితాగ్ని, జితేంద్రియుడు కావలయును. తక్కిన ధేనువుల విషయములో చెప్పిన మంత్రములనే యిచటను చదువ వలయును.
మునుపు దేవ దానవులు సాగరమును చిలికి నపుడు దివ్యమగు అమృతముగా ఈ నవనీతము వెలు వడినది. శుభమైనది. సర్వ భూతములకు ప్రీతి కలిగించు నది. అట్టి ఓ నవనీతమా! నీకు నమస్కారము.
ఇట్లు పలికి కుటుంబము గల బ్రాహ్మణునకు మంచి లక్షణములు గల వస్తువులతో పాటుగ ఇచ్చి వాని యింటికి చేర్ప వలయును.
విప్రవర్యునకు హవిష్యమగు సరసమైన అన్నమును పెట్ట వలయును. ధేనువు నిచ్చు వాడు ఒక దినము పుచ్చు కొన్నవాడు మూడు దినములు ఆ భోజనమే చేసి యుండ వలయును.
అట్లు ఈబడు చున్న గోవును చూచిన వాడు సర్వ పాపములను పాపుకొని శివ సాయుజ్యమును పొందును.
వెనుక ముందు తరముల పితృ దేవతలతో పాటు ప్రళయ కాలము వరకు విష్ణు లోకమున నివసించుచు.
దీనిని వినువాడు వినిపించు వాడునగు మానవుడు సర్వ పాపముల నుండియు విశుద్ధుడై విష్ణు లోకమున ప్రతిష్ఠ గాంచును.
