వరాహ మహా పురాణము
అధ్యాయము - 123
ఫాల్గున మాసపు శుక్లపక్ష ద్వాదశి నాడు మంచి పరిమళము గల అడవి మొల్లలను, తెలుపు మించిన పసిమి వన్నె గల వానిని గ్రహించి మిక్కిలి ప్రీతి నొందిన అంతరాత్మతో మంత్ర పూర్వకమైన విధానముతో భాగవతుడు శుచియై కర్మము లన్నింటిని చక్కగా ఎరిగి పూజింప వలయును.
శాస్త్ర విధానము నను సరించిన కర్మముతో పూజా కార్యములు చేయ వలయును. కార్యము మంత్రములతో పవిత్రము కావలయును. భక్తుడు శాంతము నిర్మలము అగు మనస్సు కలవాడు కావలయును “ఓంనమో నారాయణాయ” అని పలుకుచు ఈ మంత్రమును ఉచ్చరింప వలయును.
వాసుదేవా! ఈశ! శంఖ చక్రధరా! అచ్యుతా! లోకనాథ! మహా వీరుడవగు నీకు నమస్సు, నీకు నమస్సు.
వసంత కాలమున వనస్సతులు చక్కగా పూచినవి. చక్కని గంధ రసముతో కూడి యున్నవి. వసంత కాలము వచ్చినది. ఈ పూచిన గొప్ప చెట్లను చూడుము.
ఈ విధముగా ఫాల్గున మాసమున అర్చన చేయువాడు సంసారమును పొందడు. నా లోకమున కరుగును.
సుశ్రోణి! వైశాఖము శుక్ల పక్ష ద్వాదశి నాటి అర్చన ఫలమును గూర్చి నన్న డిగితివి. దానిని వినుము.
చక్కగా పూచిన మద్ది మొదలగు చెట్ల పూవులను గ్రహించి నాపూజకు సిద్ధము కావలయును.
కాలమునకు తగిన శుభ కర్మ లన్నింటి నాచరించి భగవద్భక్తుల నందరిని ముందుచు కొని వేదము చెప్పిన విధానముగా మంత్రములను చదువుచు గంధర్వుల అప్సరసల నాట్యములతో ఆటలతో పాటలతో వాద్యములతో పూజలు సలుప వలయును.
అప్పుడు దేవ లోకము వారు పురాణ పురుషోత్తముని స్తుతింతురు. సిద్ధులు, విద్యాధరులు, యక్షులు, పిశాచులు, నాగులు, రాక్షసులు సర్వ లోకాధిపతి యగు పురుషోత్తముని స్తోత్రములు చేయు చుందురు.
ఆదిత్యులు, వసువులు, రుద్రులు, అశ్వినీ దేవతలు, మరుత్తులు వీరందరు, దేవ దేవేశుడు, యుగముల నాశనము నందును చెడని వాడు అగు దేవుని స్తుతింతురు.
అంత వాయువు, విశ్వేదేవతలు, అశ్వులు అందరు గుమికూడి ఆది కాల మయుడు, ప్రభువునగు కేశవుని కీర్తింతురు.
బ్రహ్మ, చంద్రుడు, ఇంద్రుడు, అగ్నియు సర్వ భూతములకు నాథుడును, సర్వ లోకములకు ప్రభువును అగు విష్ణువును అగు విష్ణువును స్తుతింతురు.
నారదుడు, పర్వతుడు, అసితుడైన దేవలుడు, పులహుడు, పులస్త్యుడు, భృగువు, అంగిరసుడు, ఇంకను పెక్కండ్రు మహర్షులు, మిత్రావసు పరావసువులును భూతనాథుడు, యోగినాథుడు, ఉత్తమయోగ స్వరూపుడునగు నారాయణుని స్తుతింతురు.
మిక్కిలి శక్తి గల ఆ దేవతల నాదములను విని నారాయణ దేవుడు వసుంధరతో ఇట్లు పలికెను.
ఇదియేమి శబ్దము వినవచ్చు చున్నది? వేద ఘోషముతో మొదలైనది. దేవతల మహా శబ్దము ఇందు వినవచ్చు చున్నది.
అంత తామర రేకుల వంటి కన్నులు కలదియు, అన్ని రూపములతో, గుణములతో కూడినదియు నగు భూదేవి ఆ వరాహ రూప దేవునితో ఇట్లు పలికెను.
దేవా! నీవు వరాహ రూపమునే తాల్చి ఉండ వలయు ననియు, వారందరు నీ ఆజ్ఞకు లోబడి లోక భావనను చేయ వలయు ననియు దేవతలు కోరు చున్నారు.
అంత నారాయణ దేవుడు భూమితో ఇట్లనెను. దేవీ! వారు నన్ను వెదకుచు మార్గమున నున్నారని నేనెరుగుదును.
వసుంధరా! నేను నిన్ను దివ్యమైన వేయి వత్సరములు లీలగా నా ఒక కోరతో పట్టి నిలిపితిని.
నన్ను చూచుటకై దేవలోక వాసు లందరు అదిత్యుడు, వసువులు, రుద్రులు, కుమార స్వామి, ఇంద్రుడు, బ్రహ్మ మొదలగు వారు ఇచటకి వచ్చు చున్నారు.
ఇట్లా మాధవుని మాట విని భూదేవి దోసిలిని నుదుటపై జోడించి ఆతని పాదములపై పడెను.
భూదేవి వరాహ రూపుడగు దేవున కిట్లు విన్నవించు కొనెను. దేవా! రసాతల మునకు క్రుంగిన నన్ను నీవు పైకెత్తి నిలిపితివి. దిక్కు లేని దానను నాకు రక్షకుడ వైతివి. నీ భక్తునకు నీవే గతివి. ప్రభువవు.
నాకేది కర్తవ్యము? ఏ పనితో నిన్నర్చింతును. నా జన్మమునకు పరమ గతి యేమి? ఏ విధముగా పూజించినచో నీవు తుష్టి నందెదవు? స్వర్గ సుఖమునకు తావలమైన ఆ పనిని నేను ఆచరింతును.
నీ పూజా విధానము చేసెడు నాకు బాధ లేదు. అలసట లేదు. ముసలి తనము లేదు. పుట్టుటయు గిట్టు టయును లేవు.
దేవతలు, రాక్షసులు, సర్వజనులు, రుద్రుడు, ఇంద్రుడు, బ్రహ్మ అను కీర్తిధారు లందరు నీ కడుపున ఒక మూల నివసింతురు.
మాధవా! నిన్ను చూచుటకై వారే కృత్యములు చేయుదురు? ఏ ఆహారములు తిందురు? ఏ ఆచారములు పాటింతురు?
బ్రాహ్మణుని కర్మ మేది? క్షత్రియుని కేది యగును? వైశ్యుడేమి చేయును? శూద్రుని కర్మ మెట్టిది?
ఎవడు యోగమును పొందును? ఎవడు తపమును ఎన్నుకొని చేయును? నీ కర్మమున మిక్కిలి శ్రద్ధ కలవాడే ఫలమును పొందును?
ఏ భావము దుఃఖమునకు నెలవగును? భోజన మెట్టిది? త్రాగున దేమి? నీ భక్తులు చేయ వలసిన క్రియ ఎట్టిది?
దిక్కు లందు మూల లందు ఎట్టి నివేదనలు సలుప వలయును? గర్భ వాసమును, జంతు జన్మాదులను పొంద కుండుటెట్లు?
ఏ కర్మ మొనరించి నరుడు పశు జన్మము పొంద కుండును? కేశవా! నాకు మిక్కిలి సుఖము కలుగు నట్లు ఈ సకలము తెలియ జెప్పుము.
ఏ పనిచేత ముసలి తనమును పొందును? దేని చేత జన్మమును పొందును? గర్భ వాసమును పొంద కుండుటకేమి చేయ వలయును?
దేని ప్రభావము చేత నరుడు సంసారమున పడ కుండును? అని వసుంధర ఇట్లడుగగా భగవాను డిట్లు బదలు పలికెను.
మోక్ష మార్గమున స్థిరముగా నిలిచి యున్న భాగవతురాలా! నేను దేని వలన మిక్కిలి సంతోషమును ఎల్ల వేళల పొందుదునో ఆ మంత్రములను కీర్తింతును. వినుడు.
మాధవా! నీవు మాసము లన్నింటను ముఖ్యమైన వైశాఖ మాసమవు, మంచి పరిమళముతో, చక్కని రసములతో వసంత కాలమున నీవు దేవుని దర్శించుచు వచ్చితివి. ఎల్లప్పుడు యజ్ఞము లందు అర్చింప బడెడు ఈ నారాయణుడు ఏడు లోకము లందు వీరుడు.
ఇట్లే గ్రీష్మము నందు సర్వమును విధి పూర్వకముగా చేయ వలయును. భాగవతు లందరికి ప్రియమగు ఈ మంత్రమును పఠింప వలయును.
మాసము లన్నింటిలో ప్రధాన మగు గ్రీష్మమా! నీవు ప్రసన్నముగా వచ్చితివి. గంధ రసములతో కూడి నీవు ఏతెంచితివి. నిత్యము యజ్ఞము లందు పూజలు కొనెడు శ్రీనారాయణుడు సర్వ లోకము లందును వీరుడు.
ఇదే విధముగా గ్రీష్మము నందును ఆర్చనము చేయ వలయును. అట్టి వానికి జనన మరణము లుండవు. నా లోకమునకు గతి కలుగును.
ఈ విధముగా నన్నర్చించు వాడు భూమిలో చక్కని పరిమళము గల శాల వృక్షముల పూవు లన్నింటితో పూజించిన వాడగును.
ఇట్లు వైశాఖ మాసమున నా పూజ నాచరించు వానికి బుద్ధి నిర్మల యగును. ఆతడు మరల సంసారమున పుట్టడు.
నీకు మరియొక విషయము కూడ చెప్పెదను. అది సంసారము నుండి విడుదల కలిగించును. కడిమి, కొండ గోగు శల్లకము, అర్జునకము అను పూవులతో విధి ననుసరించి అర్చనము గావింప వయును.
పిదప నా మంత్రము లందు శ్రద్ధ కలవాడై నన్ను ప్రతిష్ఠాపనము చేయ వలయును. ‘ఓంనమో నారాయణాయ’ అనుచు ఈ మంత్రమును పలుక వలయును.
పవిత్ర హృదయములు గలవారు మేఘము వన్నెకల పూజ్యుడ వగు నిన్ను మహిమతో చూచు చున్నారు. లోకనాథా! వర్షా కాలము వచ్చినది. మేఘముల బృందములను చూడుము. నిద్రను పొందుము.
ఆషాడ మాస ద్వాదశి యందు సర్వ శాంతి కరమగు ఈ శుభ కర్మమును శాస్త్రము ననుసరించి చేయ వలయును. అట్లాచరించు వాడు ఎన్నటికిని ఏ యుగము నందును నశింపడు.
దేవీ! కర్మ శ్రద్ధ కల నరులు దేని చేత సంసారమును తరింతురో అట్టి ఋతువు లందు చేయ దగిన ఉత్తమ కర్మమును నీకు చెప్పితిని.
పుణ్యాత్మురాలా! ఈ పరమ రహస్యమును నీకు చెప్పితిని. వరాహ రూపమును, తాల్చిన నారాయణ దేవుడు కాక దేవతలును దీని నెరుగరు.
యజ్ఞ దీక్షలేని వానికి, మూర్ఖునకు, తంపుల మారి వానికి నీచ శిష్యునకు, శాస్త్ర విషయములను నిందించు వారికి దీని నొసగ రాదు.
కసాయి వారి నడుమను, మూర్ఖుల దగ్గరను దీనిని చదువ రాదు. అట్లు చదువుట వలన వారికి ధర్మము, ధనము వెంటనే నశించును.
దేవీ! నీ వడిగిన దానిని మొత్తముగా చెప్పితిని. ఇంక నీవు దేని నడుగుదువు?
